Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చైనాలోని క్వింగ్ డావోకు బయల్దేరే ముందు ప్రధానమంత్రి ప్రకటన


 

చైనాలోని క్వింగ్ డావో సందర్శనకు బయల్దేరే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటన పాఠమిది:
‘‘షాంఘై సహకార సంస్థ (SCO) సభ్యదేశాల అధినేతల మండలి వార్షిక సమావేశంలో పాల్గొనడం కోసం నేను చైనాలోని క్వింగ్ డావో నగరానికి వెళ్తున్నాను. భారత దేశానికి పూర్తి సభ్యత్వంగల ఈ మండలి తొలి సమావేశంలో పాల్గొనబోయే భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడం నాకెంతో ఉద్వేగం కలిగిస్తోంది.
ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదాలపై పోరాటం నుంచి అనుసంధానం, వాణిజ్యం, కస్టమ్స్, చట్టం, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో సహకారానికి ప్రోత్సాహందాకా; పర్యావరణ పరిరక్షణ, విపత్తు ముప్పుల ఉపశమనం; ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించడం తదితర అంశాలపై షాంఘై సహకార సంస్థకు తనదైన అత్యుత్తమ చర్చనీయాంశాలున్నాయి. సంస్థలో పూర్తిస్థాయి సభ్యత్వం లభించాక గడచిన ఏడాది కాలంలో పైన పేర్కొన్న అన్ని అంశాలపైనా సంస్థతోపాటు అందులోని సభ్య దేశాలతో భారత సమాలోచనలు గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో క్వింగ్ డావో శిఖరాగ్ర సమావేశం సంస్థ చర్చనీయాంశాలను మరింత సుసంపన్నం చేయడంతోపాటు షాంఘై సహకార సంస్థతో భారత్ కార్యకలాపాల నవశకానికి నాంది పలుకుతుందని నేను విశ్వసిస్తున్నాను.
షాంఘై సహకార సంస్థలోని సభ్య దేశాలతో భారత దేశానికి లోతైన స్నేహ సంబంధాలతోపాటు బహుకోణీయ బంధాలున్నాయి. అందువల్ల శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యే సభ్యదేశాల అధినేతలుసహా ఇతర దేశాల నాయకులు పలువురితో సమావేశమై అభిప్రాయాలను పంచుకునే అవకాశం నాకు లభిస్తుంది.’’