ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం మూడు కారిడార్లతో కూడిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశకు సంబంధించి గృహనిర్మాణ , పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 128 స్టేషన్లతో మొత్తం 118.9 కిలోమీటర్ల మేర ఈ మార్గాలు అందుబాటులోకి రానున్నాయి.
రూ.63,246 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రెండో దశ మెట్రో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చెన్నై నగరం మొత్తం మెట్రో రైలు వ్యవస్థ 173 కిలోమీటర్ల మేర పరిధికి విస్తరిస్తుంది. రెండో దశ ప్రాజెక్టులో ఈ క్రింది మూడు కారిడార్లు ఉన్నాయి:
కారిడార్ (1): మాధవరం నుంచి సిప్ కాట్ వరకు 50 స్టేషన్లతో 45.8 కిలోమీటర్లు.
కారిడార్ (2): లైట్ హౌస్ నుండి పూనమల్లె బైపాస్ వరకు 30 స్టేషన్లతో 26.1 కిలోమీటర్లు.
కారిడార్ (3): మాధవరం నుంచి షోలింగనల్లూరు వరకు 48 స్టేషన్లతో 47 కిలోమీటర్లు.
రెండో దశ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే చెన్నై నగరానికి మొత్తం 173 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నెట్ వర్క్ అందుబాటులో ఉంటుంది.
ప్రయోజనాలు, వృద్ధికి ఊతం:
చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ రెండో దశ నగరంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిలో గణనీయమైన పురోగతిని సూచిస్తుంది. నగరంలో మెట్రో రైల్ నెట్ వర్క్ కు రెండో దశ ప్రధాన విస్తరణగా పనిచేస్తుంది.
మెరుగైన కనెక్టివిటీ: రెండోదశలో సుమారు 118.9 కిలోమీటర్ల కొత్త మెట్రో మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఈ దశలోని కారిడార్లు మాధవరం, పెరంబూర్, తిరుమయిలై, అడయార్, షోలింగనల్లూరు, సిప్కాట్, కోడంబాక్కం, వడపళని, పోరూర్, విల్లివాక్కం, అన్నా నగర్, సెయింట్ థామస్ మౌంట్ వంటి ప్రధాన ప్రభావిత ప్రాంతాల మీదుగా చెన్నై పశ్చిమానికి ఉత్తరం నుండి దక్షిణానికి , తూర్పుకు అనుసంధానిస్తాయి. ఇవి పెద్ద సంఖ్యలో పారిశ్రామిక, వాణిజ్య, నివాస ప్రాంతాలను, కార్యాలయాలను కలుపుతాయి. ఈ సముదాయాలలోని కార్మికులకు సమర్థమంతమైన ప్రజా రవాణాను కూడా అందిస్తాయి. నగరంలోని వివిధ ప్రాంతాలను కూడా కలుపుతాయి. దక్షిణ చెన్నై ఐటీ కారిడార్ కు కేంద్రంగా పనిచేస్తున్న షోలింగనల్లూరు వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు ఇది కనెక్టివిటీని విస్తరిస్తుంది. ఎల్కాట్ ద్వారా షోలింగనల్లూరును అనుసంధానం చేయడం ద్వారా పెరుగుతున్న ఐటీ ఉద్యోగుల రవాణా అవసరాలను మెట్రో కారిడార్ తీరుస్తుంది.
తగ్గనున్న ట్రాఫిక్ రద్దీ: సమర్థమంతమైన ప్రత్యామ్నాయ రోడ్డు రవాణాగా మెట్రో రైల్ నెట్ వర్క్ కు పొడిగింపుగా ఫేజ్ -2తో మెట్రో రైలు చెన్నై నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుందని, నగరంలో భారీ రద్దీ ఉండే మార్గాలపై ముఖ్యంగా ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. రోడ్లపై ట్రాఫిక్ తగ్గడం వల్ల వాహనాల రాకపోకలు సజావుగా సాగడం, ప్రయాణ సమయం తగ్గడం, మొత్తంగా రోడ్డు భద్రత మెరుగుపడడం వంటి ప్రయోజనాలు ఉంటాయి.
పర్యావరణ ప్రయోజనాలు: ఫేజ్-2 మెట్రో రైల్ నిర్మాణం, చెన్నై నగరంలో మొత్తం మెట్రో రైల్ నెట్ వర్క్ పెరుగుదలతో, సంప్రదాయ శిలాజ ఇంధన ఆధారిత రవాణాతో పోలిస్తే కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించవచ్చు.
ఆర్థికాభివృద్ధి: తక్కువ ప్రయాణ సమయాలు, నగరంలోని వివిధ ప్రాంతాలకు సునాయాసంగా ప్రయాణం, ఉద్యోగులు తమ కార్యాలయాలకు మరింత సులభంగా చేరుకునే వీలు ఉత్పాదకత పెంపునకు దోహద పడవచ్చు. ఫేజ్-2 నిర్మాణం, నిర్వహణ వల్ల నిర్మాణ కార్మికుల నుంచి ఉద్యోగులు, నిర్వహణా సిబ్బంది వరకు వివిధ రంగాల్లో అనేక ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే, మెరుగైన అనుసంధానం వల్ల ముఖ్యంగా కొత్త మెట్రో స్టేషన్ల సమీపంలోని ప్రాంతాలలో స్థానిక వ్యాపారాలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఇది గతంలో తక్కువ అవకాశాలు ఉన్న ప్రాంతాలలో పెట్టుబడులను, అభివృద్ధిని కూడా ఆకర్షించగలదు.
సామాజిక ప్రభావం: చెన్నైలో రెండోదశ మెట్రో రైల్ విస్తరణ ప్రజా రవాణాకు కూడా మరింత సమానమైన అవకాశాలను అందిస్తుంది, వివిధ సామాజిక–ఆర్థిక సమూహాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. రవాణా అసమానతలను తగ్గిస్తుంది. ఇది ప్రయాణ సమయాలను తగ్గించడం ద్వారా, అత్యవసర సేవల లభ్యతను మెరుగుపరచడం ద్వారా అధిక జీవన ప్రమాణాల మెరుగుదలకు దోహదం చేస్తుంది.
చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ నగరానికి ఒక ప్రభావవంతమైన అభివృద్ధిగా ఉండనుంది. ఇది మెరుగైన అనుసంధానం, ట్రాఫిక్ రద్దీ తగ్గింపు, పర్యావరణ లాభాలు, ఆర్థిక వృద్ధి, జీవన నాణ్యత మెరుగుదలను అందించే అవకాశముంది. నగరం లోని కీలకమైన సవాళ్లను పరిష్కరించడం ద్వారా భవిష్యత్తులో నగర విస్తరణకు ప్రాతిపదికను అందించడం లోనూ, సుస్థిరత్వాన్ని పెంపొందించడంలోనూ కూడా మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
***
Boosting ‘Ease of Living’ in a vibrant city!
— Narendra Modi (@narendramodi) October 3, 2024
I congratulate the people of Chennai and Tamil Nadu on the Cabinet’s approval of the Chennai Metro Rail Project Phase-II. This will help in easing traffic, improving sustainability and economic growth. https://t.co/NShzNC50AU