Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చెన్నై, అండమాన్, నికోబార్ దీవులను అనుసంధానిస్తూ జలాంతర్గత ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం


చెన్నై ప్రధాన భూభాగంతో అండమాన్ నికోబార్ దీవులను అనుసంధానిస్తూ జలాంతర్గత ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఒఎఫ్ సి) ని ఏర్పాటు చేసే ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దీనికి అనుమతిని మంజూరు చేసింది. దీనితో చెన్నై, పోర్ట్ బ్లెయిర్, మరో ఐదు దీవులు.. లిటిల్ అండమాన్, కార్ నికోబార్, హావ్ లాక్, కమొర్టా, గ్రేట్ నికోబార్ ..కు ప్రత్యేక జలాంతర్గత ఆప్టికల్ ఫైబర్ కేబుల్ సమాచార వ్యవస్థ ఏర్పాటుకు వీలుకలుగుతుంది.

ఐదు సంవత్సరాల నిర్వహణ వ్యయంతో కలిపి ఈ ప్రాజెక్టు కు రూ.1102.38 కోట్లు వ్యయం కాగలదని అంచనా. ఈ ప్రాజెక్టు 2018 డిసెంబర్ నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించడంతో అండమాన్, నికోబార్ దీవులకు ఇ- గవర్నెన్స్ విధానాన్ని అమలు చేయడానికి, వాణిజ్య సంస్థలు నెలకొల్పడానికి, ఇ- కామర్స్ సౌకర్యాలు కల్పించడానికి అవసరమైన బ్యాండ్ విడ్త్, టెలికమ్యూనికేషన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అంతే కాదు, విద్యాసంస్థలు వాటి విజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడానికి, ఉపాధి అవకాశాలను గురించి తెలుసుకోవడానికి, ఇంకా డిజిటల్ ఇండియా లక్ష్యాల సాధనకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

పూర్వ రంగం :

అండమాన్, నికోబార్ దీవులు భారతదేశానికి వ్యూహాత్మకంగా కీలక ప్రాధాన్యం కలిగినవి. బంగాళాఖాతంలోని అండమాన్, నికోబార్ దీవులు భౌగోళికంగా ఉన్న తీరు, ఈ ప్రాంతం భారత తూర్పు తీరానికి రక్షణగా నిలుస్తున్నాయి. అండమాన్, నికోబార్ దీవులకు భద్రమైన, నమ్మకమైన, పటిష్టమైన రీతిలో అందుబాటు ధరలలో టెలికమ్యూనికేషన్ సేవలను కల్పించడం దేశ వ్యూహాత్మక దృష్టి కోణంలో నుండే కాకుండా ఈ దీవుల సామాజిక , ఆర్థిక, రాజకీయ అభివృద్ధికి ఎంతగానో అవసరం.

ప్రస్తుతం అండమాన్, నికోబార్ దీవులకు, చెన్నై ప్రధాన భూభాగానికీ మధ్య టెలికం సేవలు అందిచడానికి ఉపగ్రహ వ్యవస్థ ఒక్కటే ఏకైక మార్గం. అయితే బ్యాండ్ విడ్త్ 1 జిబిపిఎస్ కు మాత్రమే పరిమితంగా ఉంది. ఉపగ్రహ బ్యాండ్ విడ్త్ ఖర్చుతో కూడుకున్నది. ఇది పరిమిత స్థాయిలో అందుబాటులో ఉంటుంది. భవిష్యత్ బ్యాండ్ విడ్త్ అవసరాలు కేవలం దీనితోనే తీర్చుకోలేము. అత్యవసర సమయాలలో వేరే ఏ ఇతర సమాచార వ్యవస్థ అందుబాటులో లేకుండా పోతుంది. బ్యాండ్ విడ్త్ తగినంతగా లేకపోవడంవల్ల అండమాన్, నికోబార్ దీవుల సామాజిక ఆర్థిక రాజకీయ అభివృద్ధి దెబ్బతింటోంది. అందువల్ల భవిష్యత్ బ్యాండ్ విడ్త్ అవసరాలు తీరేందుకు అండమాన్, నికోబార్ దీవులకు, భారత ప్రధాన భూభాగానికి మధ్య జలాంతర్గత ఒఎఫ్ సి అనుసంధానత ఒక్కటే సరైన ప్రత్యామ్నాయం అవుతుంది.