నమస్తే,
అభినందనలు
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు శ్రీమాన్ నీలేశ్ వికమసే, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు, నా మంత్రి వర్గ సహచరులు, దేశవ్యాప్తంగా సుమారు 200 ప్రాంతాల నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా కలుస్తున్న అకౌంటెంట్ రంగానికి చెందిన ప్రముఖులు, వివిధ రాష్ట్రాల నుంచి మనతో కలుస్తున్న గౌరవ ముఖ్యమంత్రులు, ఢిల్లీ వర్షాలను సైతం ఏమాత్రం లెక్కచేయకుండా ఇక్కడికి తరలివచ్చిన ఔత్సాహికులకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.
విజయ సాధకులను ఈ రోజు రాత్రి జరిగే కార్యక్రమంలో ఈ ఉత్సవాల సందర్భంగా సన్మానించనున్నారు. ఈ రోజు ఇక్కడకు వివిధ రంగాల నిష్ణాతులు , వ్యాపార, పారిశ్రామిక దిగ్గజాలు వివిధ ప్రాంతాలనుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఇక పెద్దసంఖ్యలో యువకులు, ప్రజలు టెలివిజన్ ముందు, రేడియో ముందు కూర్చుని ఉన్నారు. వారందరికీ, సోదర , సోదరీమణులందరికీ అభినందనలు.
ఈ రోజు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ శుభసందర్భంగా ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తున్నాను.
ఇది ఊహించని అపూర్వఘట్టం.. మీ సంస్థ వ్యవస్థాపక దినోత్సవం. భారత ఆర్థిక నూతన సరళి- జి.ఎస్.టి , వస్తు సేవల పన్ను ప్రారంభోత్సవం రెండూ ఒకే రోజుకావడం గమనార్హం. ఇలాంటి చారిత్రక దినోత్సవం నాడు నేను మీ అందరి మధ్య ఉండే ప్రత్యేకత, నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఎన్నో దశాబ్దాలుగా చార్టర్డ్ అకౌంటెంట్ రంగానికి తమ వంతు ప్రత్యేక కృషిని అందిస్తున్న ఎందరో నిపుణులు, యువకులారా, మీ అందరికీ ప్రభుత్వం ఈ హక్కును దాఖలుపరిచింది. ఖాతా పుస్తకాలలోని లెక్కలను ఆడిట్ చేసి , అవి సక్రమంగా ఉన్నాయో లేక మోసపూరిత లెక్కలా అన్నది ధృవీకరించడానికి మీ రంగానికి మాత్రమే హక్కు ఉంది. సమాజ ఆరోగ్యానికి వైద్యుల లాగే దేశ ఆర్థిక, ద్రవ్యపరమైన ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మీ పై ఉంది. అనారోగ్యకర అలవాట్లను ప్రోత్సహించి ప్రజలు అనారోగ్యం పాలయ్యేలా చేసి దాని నుంచి డబ్బు ఆర్జించాలని అనుకునే డాక్టర్లు ఉండరని నేను తప్పకుండా చెప్పగలను. ఎవరైనా అనారోగ్యం పాలైతే తన కు వచ్చే రాబడి పెరిగే అవకావం ఉందని వైద్యుడికి తెలుసు. అయినా వైద్యుడు ప్రజలకు మంచి ఆరోగ్య అలవాట్లనే సూచిస్తాడు.
మిత్రులారా, దేశ ఆర్థిక, ద్రవ్యవ్యవస్థ ఆరోగ్యకరంగా ఉండేలా, ఎలాంటి అనుచిత విధానాలతో రోగగ్రస్థం కాకుండా ఆరోగ్యవంతంగా ఉండేందుకు మీరు బాధ్యత వహిస్తున్నారు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు మీరు స్థంబాల వంటి వారు. ఇంత గొప్ప సముదాయం మధ్య ఉండే అవకాశం ఈరోజు నాకు లభించడం గౌరవంగా భావిస్తున్నాను. నా వరకు మీ నుంచి ఎంతో తెలుసుకోవడానికి, మీతో సమన్వయానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారి ఆర్ధిక నైపుణ్యాలు, వారి సామర్ధ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా అభినందిస్తున్నారు.
ఈ రోజు చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు కొత్త పాఠ్య ప్రణాళికను ప్రారంభించే అవకాశం నాకు దక్కింది. మీ డైనమిక్ కోర్సుకు, మీ పరీక్షల విశ్వసనీయతకు ఇది ప్రతిబింబం. ఈ కొత్త సిలబస్ ఈ రంగంలోకి వచ్చే వారి ఆర్ధిక నైపుణ్యాలను మరింత పటిష్టం చేయగలదని నేను భావిస్తున్నాను. ప్రపంచీకరణ నేపథ్యంలో మనం డైనమిక్ వ్యవస్థలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాల్సి ఉంది. అప్పుడు డైనమిక్‌గా ఉండే మానవ వనరులను మన సంస్థలు తయారు చేయగలుగుతాయి. పారిశ్రామిక రంగానికి తగ్గట్టుగా ఉండాలంటే, మనం మన కోర్సును అంతర్జాతీయ అవసరాలకు అనుగుణంగా వాటి ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించుకోవాలి. మన కోర్సులు అకౌంటెన్సీ రంగంలో సాంకేతిక అవసరాలను తప్పకుండా అందిపుచ్చుకునే విధంగా ఉండాలి. అకౌంటింగ్ రంగంలో పరిశోధనలను ప్రోత్సహించాలి. చార్టర్డ్ న్యూట్రల్ ఫర్మ్స్ టెక్నాలజీని కనుగొనేందుకు మనం మార్గాలను అన్వేషించాలి. అకౌంటెన్సీ రంగంలో అవసరమైన కొత్త సాఫ్ట్ వేర్ గల భారీ మార్కెట్లో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మిత్రులారా, మన పురాతన గ్రంథాలు మానవుడు సాధించాల్సిన నాలుగు పురుషార్థాలను సూచించాయి. అవి ధర్మ(ధర్మబద్ధంగా జీవించడం, నైతిక విలువలు పాటించడం), అర్థ( ఆర్థిక విలువలు), కామ( మానసిక విలువలు), మోక్ష (ఆథ్యాత్మిక విలువలు). చూడండి, మనం ఎప్పుడైనా ధర్మం గురించి, మోక్షం గురించి చర్చించినపుడు మన మనసులోకి వచ్చే వారు సాధుపుంగవులు, రుషులు. అలాగే ఎవరైనా అకౌంట్స్ గురించి, ఫైనాన్స్ గురించి ఆలోచించినపుడు ముందుగా మా మదిలోకి వచ్చేది మీరు తప్ప మరెవరూకాదు. అందుకే మిమ్మల్ని ఆర్ధిక ప్రపంచపు రుషులుగా పిలవడం సరిగ్గా సరిపోతుంది. సత్యసాధనకు మోక్షానికి దారి చూపే రుషులు, సాధువుల లాగా మీరు ఆర్థికవ్యవస్థకు మార్గనిర్దేశం చేసే బృహత్తర బాధ్యత మీపై ఉంది. ధర్మబద్ధమైన ప్రవర్తన , ఆచరణ దిశగా ప్రతిఒక్కరినీ నడిపే నైతిక బాధ్యత చార్టర్డ్ అకౌంటెంట్ రంగంలోని ప్రతి ఒక్కరి పై ఉంది.
నా ప్రియమైన మిత్రులారా, ఈ రోజు మీరు నాపై చూపిన ప్రేమ, మీరిచ్చిన ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. నా హృదయ స్పందనను మీ అందరి సమక్షంలో పంచుకోవాలని అనుకుంటున్నా.అందుకు మీరు అనుమతిస్తే నేను ఎంతో రుణపడి ఉంటాను. దేశభక్తికి సంబంధించి మనకు ఒకే రకమైన ఉత్సాహం ఉంది.ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం నేను గొప్ప లక్ష్యాలను చూస్తున్నాను.
అయితే కొన్ని కఠిన సత్యాలను కూడా చూద్దాం. ఇవి మిమ్మల్ని తరచూ ఆలోచింప చేయవచ్చు. నేను ప్రస్తుతం చెప్పబోయేది మీరు సమాజంలో అక్కడక్కడా చూసి ఉంటారు కూడా. ఎవరి ఇల్లు అయినా అగ్నికి ఆహుతి అయి వారు సర్వస్వాన్ని కోల్పోయినపుడే, ఆ కుటుంబం తిరిగి పట్టుదలతో, సరైన మార్గంలో తిరిగి కోలుకోవడానికి అవకాశం ఉందని అంటారు. వారు ఎంతో క్షోభను అనుభవిస్తారు కానీ వారు తిరిగి పట్టుదలతో అనతి కాలంలోనే మళ్లీ మామూలు స్థితికి చేరుకుంటారు. అందుకే మన పెద్దలు చెబుతుంటారు, ఇల్లు కాలిపోతే తిరిగి ఇంటిని పునర్నిర్మించవచ్చు కాని, ఇంట్లోని వారిలో ఒక్కరు దొంగతనాలకు , అపహరించడానికి అలవాటుపడితే అలాంటి కుటుంబాలు మళ్లీ విలువలతో కూడిన వ్యవస్థను ఎన్నటికీ నిర్మించలేరు. కుటుంబంలోని ఒక్కరు విలువల వ్యతిరేక వైఖరి అనుసరించినా ఆ కుటుంబం ఛిన్నాభిన్నం అవుతుంది.
ఖాతాలను సక్రమంగా ఉంచేపనిలో గల నా ప్రియమైన మిత్రులారా, మీరు ధర్మబద్ధంగా ఉంటే, దేశాన్ని అతి పెద్ద సంక్షోభం నుంచి గట్టెక్కించవచ్చు. వరదలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడినపుడు అధికార యంత్రాంగానికి సహకరించి దేశాన్ని ఆ కష్టాల నుంచి గట్టెక్కించడంలో ప్రజలకు అద్భుతమైన శక్తిసామర్ధ్యాలు ఉన్నాయి. అయితే కొందరు పౌరులు ఆదాయానికి గండి కొట్టడాన్ని అలవరచుకుంటే దానివల్ల దేశం, లేదా కుటుంబం కోలుకోలేనంతగా నష్టపోతుంది. అన్ని కలలు చెదరి, దేశ అభివృద్ధికి అడ్డంకులు ఏర్పడతాయి.
గడచిన మూడు సంవత్సరాలలో ఇలా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే వారిపై కఠినచర్యలు తీసుకుంది. ఒక వైపు కొత్త చట్టాలు రూపొందిస్తూ మరో వైపు పాత చట్టాలను మరింత కఠినతరం చేయడం జరిగింది. పలు దేశాలతో అవగాహనా ఒప్పందాలు, ఒప్పందాలు కుదుర్చుకున్నాం. అందుకు అనుగుణంగా చట్టాలు సవరించాం. నల్లధనం విషయంలో ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలకు ఉదాహరణ, స్విస్ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన తాజా గణాంకాలే సాక్ష్యం. స్వీస్ బ్యాంకు అధికారులు ప్రకటించిన దానిప్రకారమే, భారత జాతీయులనుంచి నల్లధనం డిపాజిట్లు గణనీయంగా తగ్గాయి. మూడు దశాబ్దాల క్రితం 1987లో ఇదే స్విస్ బ్యాంకు అధికారులు ఏదేశం వారు ఎంత మొత్తంలో తమ బ్యాంకులో డిపాజిట్ చేశారో వెల్లడించడం మొదలుపెట్టారు.తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం,గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి భారతీయుల డిపాజిట్లలో 45 శాతం తగ్గుదల కనిపించింది. 2014 లో మీరు విశ్వసించి అధికార పగ్గాలు మాకు అప్పగించినప్పటినుంచి నల్లధనం వేగానికి కళ్లెం వేసే ధోరణి ప్రారంభించాం. దానిని ఆ తర్వాత మరింత ముందుకు తీసుకువెళ్లాం. 2013లో నల్లధనం డిపాజిట్లు 42 శాతం పెరిగాయని స్విస్ బ్యాంకు అధికారులు ప్రకటించారు. ఇది విని మీకు ఆశ్చర్యం కలగవచ్చు.ఆ తర్వాత పట్టుమని రెండు సంవత్సరాలకు మేము స్విట్జర్లాండు నుంచి తాజా సమాచారం రాబట్టడం మెదలు పెట్టగానే నల్లధనం యజమానుల దురవస్థను చూడండి ఎలా తయారైందో. మీ దగ్గర అలాంటి డబ్బు ఉండదని నేను గట్టిగా నమ్ముతాను. అయితే దేశంపై మీకుగల ప్రేమ అలాంటి డబ్బు కల వారిపట్ల మెరుగైన నిర్ణయం తీసుకునేలా మిమ్మల్ని చేస్తుంది..
మిత్రులారా, ఒకవైపు నేను స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి చెబుతున్నాను. మరో వైపు దేశ ఆర్ధిక , ద్రవ్య వ్యవస్థలను పరిశుభ్రం చేసేందుకు చర్యలు ప్రారంభించాను.నవంబర్ 8 మీ మదిలో బాగా గుర్తుండి ఉంటుందని అనుకుంటాను. మన వ్యవస్థనుంచి నల్లధనాన్ని, అవినీతిని రూపుమాపడానికి తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం పెద్దనోట్ల రద్దు నిర్ణయం. ఆ తర్వాత నుంచి మీ రంగంలో ఉన్న వారంతా ఇంతకు ముందెన్నడూ లేనంత పనిలో నిమగ్నమయ్యారని నా దృష్టికి వచ్చింది. ఆ సమయంలో చార్టర్డ్ అకౌంటెంట్‌లు దీపావళి సెలవులలో ఉన్నారని, వారి కోసం హోటళ్లు కూడా బుక్ అయ్యాయని, అయితే కొందరు వాటిని రద్దు చేసి తిరిగి వారిని యధావిధిగా విధినిర్వహణకు రప్పించారని అలా రోజుకు 24 గంటలూ వారు పనిలో ఉన్నారని వినవచ్చింది. మీరు ధర్మబద్ధంగా పనిచేశారా లేక ఖజానాకు గండి కొట్టే వాటికి సహకరించారా తెలియదు. నిజానికి ఇది దేశప్రయోజనాల కోసమా లేక మీ క్లయింట్ ప్రయోజనాల కోసమా; మొత్తం మీద ఆరోజులలో మీరు రాత్రిళ్లు నిద్రలేకుండా కష్టపడవలసివచ్చింది.
మిత్రులారా, నల్లధనాన్ని రూపుమాపే విషయంలో నా ఆలోచనలను తొలిసారిగా మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే ఈ మహోన్నత కార్యక్రమం బలం మీకందరికీ తెలుసు కనుక. బ్యాంకులలో దాచిన నగదుకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం భారీ వ్యవస్థను ఏర్పాటు చేసింది.దాని ఆధారంగా నవంబర్ 8 వ తేదీకి ముందు , ఆ తర్వాత నగదు లావాదేవీలకు సంబంధించిన విస్తృత గణాంకాలను అధ్యయనం చేయడం జరిగింది. మేం ఎవ్వరినీ ఇంటరాగేట్ చేయలేదు. మేం కేవలం వివరాలను విశ్లేషించాం. మిత్రులారా మీకు నేను ఇంతకు ముందే చెప్పాను. మీ దేశభక్తి నా దేశ భక్తి కంటే ఏమాత్రం తక్కువ కాదని. తొలిసారిగా దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచే కొన్ని విషయాలు చెబుతాను. ఇప్పటివరకు విశ్లేషించిన సమాచారం ప్రకారం మూడు లక్షల కంపెనీల లావాదేవీలు – రిజిస్టర్డు కంపెనీలు అనుమానంపై పరిశీలనలో ఉన్నాయి. ఇంకా విశ్లేషించాల్సిన సమాచారం చాలా ఉంది. అందువల్ల వాస్తవ మొత్తం ఏమిటన్నది నాకు ఇంకా తెలియదు. ఈ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత చాలా తీవ్ర మైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేను ఈ విషయాలు ఎందుకు చెబుతున్నానంటే మీరు ప్రభుత్వ ఆలోచనలతో , రాజకీయనాయకుల బలంతో అనుసంధానమౌతారని భావిస్తున్నాను. ఒకవైపు ప్రభుత్వం, మీడియా, మొత్తం వ్యాపార ప్రపంచం 30 జూన్, అర్థరాత్రి పరిణామాలూ, జూలై 1వ తేదీ తర్వాత ఏం జరగబోతుందోనని ఆసక్తిగా గమనిస్తుంటే, మరోవైపు 48 గంటల ముందు లక్ష కంపెనీలు ఒక్క సంతకంతో రద్దయ్యాయి. అలాంటి కంపెనీల పేర్లను కంపెనీల రిజిస్ట్రార్ జాబితానుంచి తొలగించారు.ఇది సామాన్య నిర్ణయం కాదు. రాజకీయాల పట్టకంలోంచి మాత్రమే చూసి లెక్కలేసుకుంటూ నిర్ణయాలు తీసుకునే వారు ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేరు. జాతీయ ప్రయోజనాల కోసం జీవించే వారు మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలరు.ఒకే ఒక కలంపోటుతో లక్ష కంపెనీలను రద్దు చేసే నిర్ణయాత్మక శక్తి దేశభక్తి స్ఫూర్తి నుంచి మాత్రమే వస్తుంది. పేదలనుంచి లూటీ చేసిన వారు దానిని తిరిగి పేదలకు చెల్లించాలి.
వీటన్నింటికీ తోడు, నల్లధనాన్ని దాచడంలో, హవాలా లావాదేవీలలో పాలుపంచుకుంటున్న 37 వేల డొల్ల కంపెనీలను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. వాటిపై కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. భవిష్యత్తులో చట్టాలను ఉల్లంఘించే కంపెనీలపై కఠిన చర్యలు ఉండనున్నాయి. నకిలీ కంపెనీలు లేకుండా చూడడం, నల్లధనంపై చర్యలు తీసుకోవడం వంటివి రాజకీయంగా సరైనవి కావని, ఏ రాజకీయ పార్టీకైనా ముప్పుగా పరిణమిస్తాయనే విషయాలు నాకు పూర్తిగా తెలుసు. అయితే దేశం కోసం ఎవరో ఒకరు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.
నా చార్టర్డ్ అకౌంటెంట్ స్నేహితులారా, మీ సంస్థ ఫౌండేషన్ డే సందర్భంగా నేను ఇక్కడకు వచ్చాను. అధికారానికి మూలాధారమైన పుస్తకాన్ని సరిచేయమని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆ కంపెనీలకు కొంతమంది తప్పకుండా సహాయం చేసి వుంటారు. ఈ దొంగలు, దోపిడీదార్లు తప్పకుండా ఆర్దిక వైద్యుని దగ్గరకు వెళ్లి వుంటారు. నాకు బాగా తెలుసు ఆ కంపెనీలు ఈ పని కోసం మీలో ఏ ఒక్కరిదగ్గరకు వచ్చి వుండవు. గుర్తింపు కోసం చూస్తున్న వారి దగ్గర వారు తప్పకుండా సహాయం తీసుకొని వుంటారు. ఈ కంపెనీలకు సహాయం చేసిన, మీ మధ్యనే వున్న అలాంటి వ్యక్తులను గుర్తించాలని మీరు అనుకోవడం లేదా? స్నే హితులరా, మన దేశంలో రెండు లక్షలా 72 వేల మంది ఛార్టర్డ్ అకౌంటెంట్లు వున్నారని నాకు తెలిసింది. అంతే కాదు ఆర్టికల్ అసిస్టెంట్లు కూడా వున్నారు. వారి సంఖ్య రెండు లక్షలకు చేరుకుంది. ఛార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్టికల్ అసిస్టెంట్లు, మీ సిబ్బంది అందరినీ కలిపితే దాదాపుగా 8 లక్షలకు పైగానే వుంటారు. ఈ రంగంలో మీ కుటుంబ సభ్యుల సంఖ్య 8 లక్షల పైమాటే. మీ ముందు నేను మరిన్ని గణాంకాలు వుంచుతాను. ఎందుకుంటే మీరు సంఖ్యలను చాలా వేగంగా ఆకళింపు చేసుకుంటారు.
ఒక అంచనా ప్రకారం మన దేశంలో కోటికిపైగా ఇంజినీర్లు, మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్లు వున్నారు. వైద్యులు 8 లక్షలకు పైగా వున్నారు. ఈ ఉద్యోగాలన్నీ ఉన్నత ఉద్యోగాలు. లేదా అత్యంత గౌరవం పొందుతున్న వృత్తులు. మన దేశంలో అలాంటి వృత్తుల్లో కోట్లాది మంది పని చేస్తున్నారు. దేశ నగరాల్లో పెద్ద పెద్ద భవనాలు కోట్లాది వున్నాయి. గత ఏడాది రెండు కోట్ల 18 లక్షల మంది విదేశాలకు వెళ్లారు. ఈ సంఖ్యలు మీకు ఆశ్చర్యం కలిగిస్తాయి. అయినప్పటికీ మన దేశంలో 32 లక్షల మంది మాత్రమే తమ ఆదాయం పది లక్షలకంటే అధికంగా వుందని ట్యాక్స్ రిటర్న్ పత్రాలను దాఖలు చేశారు. మీలో ఎవరైనా దీన్ని నమ్మగలరా? అకౌంట్ పుస్తకాలను సరి చేసే మిమ్మల్ని నేను అడుగుతున్నాను. మన దేశంలో రూ.10 లక్షలకంటే ఎక్కువ సంపదించేవారు 32 లక్షల మంది మాత్రమే ఉన్నారా?
నా ప్రియమైన సహచరులారా, ఇది చేదుగా వున్న వాస్తవం. పది లక్షలకంటే ఎక్కువ ఆదాయం వస్తున్నవారి సంఖ్య 32 లక్షలుగా వున్నట్టు ఈ సంఖ్యలు చెబుతున్నాయి. దేశంలోని ప్రజల్లో చాలా మంది జీతాల తరగతికి చెందినవారున్నారు. అంటే వారికి నిర్ణీత ఆదాయం వుంటుంది. దాదాపుగా జీతమంతా ప్రభుత్వాన్నించే తీసుకుంటారు. ఇది కాక, దేశంలోని వాస్తవ పరిస్థితి ఏంటి? కాబట్టి సోదరులారా ఇక్కడ మరింత సమాచారాన్ని ఇవ్వాలని నేను అనుకోవడం లేదు. దీని ద్వారా మీకు అర్థం చేసుకోగలరు దేశంలో ప్రతి సంవత్సరం కోట్లాదిగా వాహనాల కొనుగోలు జరుగుతోందని. అయినప్పటికీ దేశంపట్ల బాధ్యతలను పట్టించుకోవడం లేదు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం.
ఇక మరింత సమాచారం గురించిమీ ముందు ప్రస్తావించడం కంటే నా ఆలోచనలేంటో మీ ముందుంచుతాను. సీఏ సోదరులారా ఒక వ్యక్తి లేదా ఒక క్లయింట్ తన చుట్టూగల వాతావరణం సరళంగా వుంటేనే పన్నులు చెల్లించగలడు. అలాంటి వాతావరణం… వారిని నిజాయితీగా పన్నులను చెల్లించడానికి ప్రేరణ ఇస్తుంది. తన క్లయింట్‌కు సలహా ఇచ్చేవాడే నిజాన్ని దాచమని చెబుతుంటే ఇక ఆ క్లయింట్ చాలా ధైర్యంగా అక్రమాల దారిలోకి వెళ్లిపోతాడు. కాబట్టి తప్పుడు సలహాలు ఇచ్చేవాళ్లను గుర్తించడం వారిపైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం మీరు కఠిణమైన చర్యలు చేపట్టాలి. సీఏ రంగంలోకి వస్తున్న మానవవనరులు మీ వల్లనే వస్తున్నాయి. పాఠ్యప్రణాళిక మీరే రూపొందిస్తారు. మీరు పరీక్షలు నిర్వహిస్తారు.నియమ నిబంధనలు మీరే తయారు చేస్తారు. మీ సంస్థ మాత్రమే నేరగాళ్లను శిక్షించాలి. ఇప్పుడు ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రజాస్వామ్యంలో ఉన్నతమైన స్థానంగల బారత పార్లమెంటు, 125 కోట్ల ప్రజల గొంతు మీకు చాలా అధికారాలను ఇచ్చింది. అయినప్పటికీ గత 11 ఏళ్లలో కేవలం 25 ఛార్టర్డ్ అకౌంటెంట్లను మాత్రమే ఎందుకు ప్రాసిక్యూట్ చేశారు ? కేవలం 25 మంది మాత్రమే అక్రమాలకు కారణమయ్యారా ? చాలా ఏళ్లుగా 1400 కేసులు పెండింగులో వున్నట్టు నాకు తెలిసింది. ఒక కేసు సెటిల్ కావాలంటే సంవత్సరాలపాటు కాలం గడుస్తోంది. నా స్నేహితులారా చెప్పండి…అత్యున్నతమైన అర్హతలుగల నిపుణులైన మీకు ఇది ఆందోళన కలిగించే విషయమా? కాదా?
సోదర సోదరీమణులారా, స్వాతంత్ర్య పోరాటంలో చాలా మంది మన దేశ యువతీ యవకులు ఎంతో ధైర్యంగా ఉరికంబాలను ఎంచుకున్నారు. దేశంలో ఎంతో మంది గొప్పవాళ్లు స్వాతంత్ర్యంకోసం జైళ్లలో ఏళ్లపాటు మగ్గారు. ఆ రోజుల్లో ఎంతో మంది నిపుణులు ముందుకొచ్చి స్వాతంత్ర్య సమరంలోకి దూకారు. ఈ నిపుణుల్లో ఎక్కువమంది న్యాయవాదులు. బారిస్టర్లు పెద్ద సంఖ్యలో స్వాతంత్ర్య పోరాటంలోకి ఉరికారు. వారికి చట్టం తెలుసు. చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఎలాంటి పరిణామాలు వస్తాయో వారికి తెలుసు. అయినప్పటికీ ఆ కాలానికి చెందిన న్యాయవాదులు తాము న్యాయవాద వృత్తిలో చక్కగా రాణిస్తున్నప్పటికీ దేశంకోసం వృత్తిని వదిలిపెట్టారు. మహాత్మా గాంధీ , సర్దార్ పటేల్, డాక్టర్ అంబేడ్కర్, జవహర్ లాల్ నెహ్రూ మాత్రమే కాదు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, పండిత్ మదన మోహన్ మాలవీయ, బాల గంగాధర్ తిలక్, మోతీలాల్ నెహ్రూ, సి. రాజగోపాలాచారి, దేశబంధు చిత్తరంజన్ దాస్, సైఫుద్దీన్ కిచ్లూ, భులాభాయ్ దేశాయ్, లాలా లాజ్ పత్ రాయ్, తేజ్ బహాదుర్ సప్రూ, అసఫ్ అలీ, గోవింద్ వల్లభ్ పంత్, కైలాష్ నాథ్ కట్జు మొదలైన న్యాయవాద నిపుణులు దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. దేశభక్తితో ప్రేరణ పొంది వారు తమ జీవితాలను దేశ స్వాతంత్ర్యకోసం అంకితం చేశారు. వారిలో చాలా మంది దేశ రాజ్యాంగాన్ని రూపొందించడంలో నిర్ణయాత్మక పాత్ర నిర్వహించారు. సోదర సోదరీమణులారా దేశ చరిత్రలో ఈ మహానుభావులు స్థిరస్థాయిగా నిలిచిపోయారు.
స్నేహితులారా, చరిత్రలో మన దేశం మరో కీలకమైన సందర్భాన్ని చేరుకున్నది. 1947లో రాజకీయ సంకలనం జరిగిన తర్వాత ఈ రోజున దేశం ఆర్ధిక సంకలన దిశగా పయనిస్తోంది. ఈ ఏడాది 2017లో దేశం నూతన శకాన్ని ప్రారంభించింది; ‘‘ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్’’ అనే భావన వాస్తవరూపం దాల్చింది. ఈ చారిత్రాత్మక సందర్భంలో ఛార్టర్డ్ అకౌంటెంట్లు కీలక పాత్ర పోషించాల్సి వుంది. స్నేహితులారా నా ఆలోచనల్ని అర్థం చేసుకోండి. దేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో దేశానికి స్వాతంత్ర్యం తేవడం కోసం న్యాయవాదులు తమ జీవితాలను త్యాగం చేశారు. నేను మీ జీవితాలను త్యాగం చేయమని అడగడం లేదు. మీరు జైళ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ దేశం మీది, ఈ దేశ భవిష్యత్ మీ చిన్నారులది. కాబట్టి ఈ నూతన యుగంలో నాయకత్వ పగ్గాలు మీ చేతుల్లో వుండాలి. ఎలాగైతే న్యాయవాదులు స్వాంతంత్ర్యపోరాట ఉద్యమాన్ని నడిపారో మీరు అలా చేయాలి. ఈ రోజున ఛార్టర్డ్ అకౌంటెంట్లు ఆర్ధికాభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలి. దేశం అత్యున్నతమైన ఆర్ధిక అభివృద్ధి పథంలో బలోపేతంగా నడిచేలా చేసే సామర్థ్యం మీకు మాత్రమే వుంది. నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను మీ క్లయింట్లను నిజాయితీ మార్గంలో పయనించేలా చేయండి. తద్వారా అవినీతిని అంతమొందించండి. అవినీతిని అంతమొందించడానికి మీరు అన్ని విధాలా సన్నద్దులు కావాలి.
స్నేహితులారా, ఏ దేశ ఆర్ధిక వ్యవస్థకైనా ఛార్టర్డ్ అకౌంటెంట్లు అంబాసిడర్ల లాంటి వారు. ప్రభుత్వానికి, పన్నులు చెల్లించే కంపెనీలకు, వ్యక్తులకు మధ్యన మీరు అనుసంధానకర్తలు. దేశ ప్రధాని సంతకం కంటే మీ సంతకం చాలా బలమైనది.
మీరు పెట్టే సంతకం సత్యంపైన వుంచిన నమ్మకానికి సాక్షీభూతం. కంపెనీలు చిన్నవికావచ్చు, పెద్దవి కావచ్చు. వాటి అకౌంట్ పుస్తకాలపైన మీరు సంతకాలు చేస్తే చాలు ప్రభుత్వం వాటిని నమ్ముతుంది. దేశ ప్రజలు కూడా వాటినే నమ్ముతారు.
ఒక కంపెనీ బ్యాలెన్స్ షీటుపైన మీరు ఒకసారి సంతకం చేస్తే దాన్ని ఎవరూ ప్రశ్నించరు. ఆ తర్వాత ఫైళ్ల జోలికి ఎవరూ వెళ్లరు. స్నేహితులారా ఆ తర్వాత ఒక నూతన అధ్యాయం మొదలవుతుంది.
ఈ రోజున మీకు నూతన జీవితాన్ని చూపడానికి ఇక్కడకు వచ్చాను. మీరు ఒక కంపెనీ అకౌంట్ పుస్తకాలను సర్టిఫై చేస్తే ప్రభుత్వ అధికారులు మీరు చేసిన మదింపునే నమ్ముతారు. కంపెనీ వృద్ధి చెందుతుంది. దాంతో మీరు కూడా వృద్ధి చెందుతారు. కంపెనీతోపాటు ఎదుగుతారు. స్నేహితులారా విషయం ఇక్కడితో అయిపోలేదు.
మీరు కంపెనీ బ్యాలెన్స్ షీటును ధృవీకరిస్తారు. దాంతో కంపెనీ వివరాలు ప్రజల ముందుకు వస్తాయి. దాన్ని చూసి వృద్ధులు మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడులు పెడతారు. ఒక బలహీనురాలైన వితంతువు తన పొదుపు డబ్బునంతా తీసుకెళ్లి షేర్ మార్కెట్లో పెడుతుంది. ఆ కంపెనీ అసలు పరిస్థితి బైటకు వచ్చి అది మునిగిపోతే, ఆ బలహీనురాలైన పేద వితంతురాలు జీవితం కూడా మునిగిపోతుంది. ఆ వృద్ధుల జీవితాలు తలకిందులవుతాయి. మీ సంతకం కారణంగా ఆ కంపెనీ ప్రజల ముందుకు వస్తే దాన్ని నమ్మి తమ జీవితకాలంలో సంపాదించిన డబ్బును వారు పెట్టుబడిగా పెడుతున్నారు.
కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 125 కోట్ల మంది దేశ ప్రలజకు మీ సంతకంపైన నమ్మకం వుంది కాబట్టి మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజల నమ్మకాన్ని ఏనాడూ వమ్ము చేయకండి. ఎవరికీ మీ సంతకంపైన సందేహం రావొద్దు.
ప్రజలు మా మీద వుంచిన నమ్మకానికి తూట్లు పడ్డాయని మీరు మీ మనసులో భావిస్తే మీరు ముందుకు రండి..ఆ నమ్మకాన్ని తిరిగి నిలపడానికి చర్యలు తీసుకోండి. జులై 1 మీ ఫౌండేషన్ డే. మీ మీద ప్రజలకున్న నమ్మకాన్ని తిరిగి నిలబెట్టే రోజు కావాలి. నిజాయితీ ఉత్సవాన్ని జరుపుకోవడానికి ఈ రోజున నేను ఇక్కడకు వచ్చి మీకు స్వాగతం పలుకుతున్నాను. మీ పని ప్రాధాన్యం వైపు చూడండి. ఆ తరువాత మీ మార్గాన్ని ఎంచుకోండి. సమాజం మీ పట్ల చూపుతున్న నమ్మకం, గౌరవం మీకై మీరు గ్రహిస్తారు.
స్నేహితులారా, ట్యాక్స్ రిటర్న్ అనే పదబంధానికి వివిద నిర్వచనాలున్నాయి. మొత్తంమీద నేను అనుకుంటున్నాను ప్రభుత్వం వసూలు చేసే పన్నులను దేశ అభివృద్ధికి ఖర్చు పెట్టినా పెట్టకపోయినా దానిని ట్యాక్స్ రిటర్న్ అంటారు.
దేశ ఆర్ధిక మాంద్యాన్ని నివారించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. జీవితాంతం వంట చెరకు వాడుతూ వంట చేస్తున్న ఓ మహిళకు గ్యాస్ కనెక్షన్ అందిస్తుంది. పిల్లలు వృద్ధులైన తమ తల్లిదండ్రులను పట్టించుకోకుండా తమ బాధ్యతలను పక్కనపెట్టినప్పుడు వృద్ధులకు పింఛను లభించడానికి ఈ ట్యాక్స్ రిటర్న్ ఉపయోగపడుతుంది.
రోజంతా కష్టపడి పని చేయగలిగే యవతకు స్వయంఉపాధిని ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఈ డబ్బును తమ చికిత్సకు అవసరమయ్యే సొమ్ము లేని పేద ప్రజలకు, అలాగే, తాము అనారోగ్యంగా ఉన్నప్పటికీ పనికి వెళ్లకపోతే తమ పిల్లలు భోజనం చేయలేరన్న కారణంగా పనికి వెళ్లకుండా ఉండలేని వారికి చౌక ధర మందులను అందించడానికి ఉపయోగిస్తున్నాం.
పన్నుల ద్వారా సేకరిస్తున్న డబ్బును మనను కాపాడుకోవడం కోసం సరిహద్దులలో ఉంటూ తమ ప్రాణాలను పణం పెడుతున్న సాహసులైన సైనికుల కోసం ఉపయోగిస్తున్నాం.
ఈ డబ్బును దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్భయ్ సంవత్సరాలు గడచిపోయిన తరువాత కూడా ఇంకా విద్యుత్తు సదుపాయం లేని కుటుంబాలకు విద్యుచ్ఛక్తిని అందజేయడం కోసం ఉపయోగిస్తున్నాం.
దేశంలోని పేదలకు వారికి దక్కవలసినవి అందించడంలో తోడ్పడడం కన్నా గొప్ప సేవ ఏముంటుంది. ఈ దేశంలోని బీద ప్రజలకు సహాయం చేయడానికి మీ సంతకం ఒక్కటి ఏ విధంగా తోడ్పడగలుగుతుందో మీరు ఎన్నటికీ ఊహించనైనా ఊహించజాలరు.
ఈ దేశంలోని సామాన్య మానవుడి కలలను నిజం చేయడంలో మీ మీద బృహత్తర బాధ్యత ఉంది. మీరు ఇందులో ముఖ్యమైనటువంటి పాత్రను పోషించగలరు. ఒకసారి మీరు నిర్ణయించుకొన్నారంటే గనక, ఐసిఎఐ చరిత్రలో 2017 జులై 1వ తేదీ తప్పక ఒక మేలు మలుపు కాగలదన్న నమ్మకం నాకుంది.
స్నేహితులారా, మీరు ఒకసారి ప్రతిజ్ఞను స్వీకరించారంటే, ఎవ్వరూ పన్నులను చెల్లించటాన్ని ఎగవేయడానికి యత్నించబోరని నేను నమ్మకంతో చెప్పగలను. ప్రజలు తమను రక్షించటానికి ఎవరో ఒకరు ఉన్నారనేది తెలుసుకొన్నప్పుడు చట్టాలను ఉల్లంఘిస్తారు.
స్నేహితులారా, దేశ నిర్మాణానికి మీరు తోడ్పాటును అందించటానికి ఒక సాధనంగా జిఎస్ టి అందిరానుంది. మీరు ప్రజల వద్దకు చేరుకోండి అని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ చోటుకు చేరుకొంటూవుండగా, మీరు జిఎస్ టిని వ్యాపారులు అర్థం చేసుకొనేందుకు సహాయాన్ని అందించగలరని నీలేశ్ గారు నాతో అన్నారు. ఆయనను నేను అభినందిస్తున్నాను, ఆయనకు నా కృతజ్ఞతలు తెలియజేసుకొంటున్నాను.
మీరు దయేసి ప్రజల వద్దకు వెళ్లండి, వారిని చైతన్యవంతులను చేయండి. వారు నిజాయతీతో నిండిన ప్రధాన స్రవంతిలో భాగస్వాములు అయ్యేటట్లు వారిని ప్రోత్సహించండి.
ఒక విధంగా చూస్తే, చార్టర్డ్ అకౌంటెన్సీ రంగంలో ఉన్న వారికి ఒక సరికొత్త అవకాశాన్ని ప్రసాదించింది. దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవటం కోసం మిమ్మల్ని మీరు సన్నద్ధులనుగా తయారు చేసుకోండి; నేను మరీ ముఖ్యంగా ఈ రంగంలోని యువ వృత్తి నిపుణులను ఈ విధంగా తయారుకమ్మని మరీ మరీ కోరుకుంటున్నాను.
దయచేసి అడుగు ముందుకువేయండి. ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన చట్టాలు.. ప్రధానంగా ఇన్ సాల్వెన్సీ మరియు బ్యాంక్ రప్టసి కోడ్.. సరైన రీతిలో విజయవంతంగా అమలు కావటంలో చార్టర్డ్ అకౌంటెంట్ లకు
అత్యంత ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది.
ఈ కోడ్ లో భాగంగా, ఏ కంపెనీ అయినా దివాలా తీసినట్లు ప్రకటింపబడిందంటే గనక, దాని నియంత్రణ ఓ ఇన్ సాల్వెన్సీ ప్రాక్టీషనర్ కు అప్పగించబడుతుంది. ఇన్ సాల్వెన్సీ ప్రాక్టీషనర్ లు కావడం ద్వారా చార్టర్డ్ అకౌంటెంట్ లు ఒక కొత్త జీవనోపాధి మార్గాన్ని మొదలుపెట్టగలుగుతారు. మీ కోసం ప్రభుత్వం తెరచిన ఒక కొత్త మార్గమిది. అయితే, మీరు ఏ మార్గాన్నయినా ఎంచుకొంటే గనక, ఆ మార్గంలో, సిఎ అన్న పదానికి అర్థం చార్టర్ అండ్ ఎక్యూరిసీ, కంప్లయెన్స్ అండ్ ఆథెంటిసిటి యే అయివుండాలి.
స్నేహితులారా, మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత 2022లో 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్నాయి. 2022 కోసం కొన్ని లక్ష్యాలను దేశం నిర్దేశించుకొన్నది. నవ భారతం మన అందరి దగ్గరి నుంచి కఠిన పరిశ్రమను ఆశిస్తోంది.
మన దేశం స్వాతంత్ర్యం అనంతరం 75 సంవత్సరాలను పూర్తి చేసుకొనేటప్పటికి మనం మన దేశం ఎలా ఉండాలని కోరుకొటాం; ఒక సంస్థగా, ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గా, ఒక వ్యక్తిగా, ఒక పౌరుడిగా కూడా మన దేశాన్ని అప్పటికి ఎలా చూడాలని కోరుకొంటాం. అందుకోసం మనం పోషించలసిన పాత్ర, ఆ విధంగా దేశం తయారు కావటానికి మనం అందించే తోడ్పాటు ఎలా ఉండాలి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2022లో 75 సంవత్సరాలు పూర్తి అవుతాయి. తదనంతరం 2 సంవత్సరాలకు ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆవిర్భవించి 75 సంవత్సరాలు పూర్తి అవుతాయి.
మీ సంస్థ ఆవిర్భవించి 75 సంవత్సరాలు అయ్యే సరికి, ఆ సందర్భాన్ని జరుపుకోవడానికి మీరంతా ఒక కార్యక్రమాన్ని సిద్ధంచేసుకోవాలి. ఆ చరిత్రాత్మక సందర్భానికిగాను ఒక మార్గసూచీని మీరు ఈ రోజే రూపొందించాలి. మీ సంస్థ, మీ సంస్థ యొక్క లక్షణం కొత్త శిఖరాలకు చేరుకోవాలి. మీరు దేశం కోసం, దేశంలోని లక్షలాది మహత్వాకాంక్ష కలిగిన యువత కోసం ఏం చేస్తారో మీరు నిర్ణయించుకోవాలి.
మీరు దేశానికి ఒక పారదర్శకమైనటువంటి, లంచగొండితనానికి తావు లేని వ్యవస్థను సమకూర్చడంలో సాయపడలేరా ? మీరేమంటారు ? మీరు పన్నులను చెల్లించడం నుంచి రక్షించిన వారి సంఖ్యకేసి చూస్తారా ? లేక మీ ప్రోత్సాహంపై పన్నులు చెల్లించడం ద్వారా నిజాయతీతో కూడిన జీవితాలను గడుపుతున్న వారి సంఖ్యకేసి చూస్తారా ? ఈ విషయం తేల్చుకోవలసింది మీరే.
పన్నులను నిజాయతీగా చెల్లిస్తూ ప్రధాన స్రవంతిలోకి ఎంత మందిని తీసుకురాగలరో అన్న విషయంలో మీ కోసం మీ అంతట మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. ఈ పనికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంలో స్వయంగా మీ కన్నా ఉత్తమమైన న్యాయనిర్ణేత ఎవరు కాగలరు చెప్పండి.
స్నేహితులారా, మీరు చేయగలుగుతారు కాబట్టి మీ నుండి నేను మరొకటి కూడా ఆశిస్తున్నాను. స్నేహితులారా, ప్రపంచంలో అత్యంత గౌరవం కలిగివున్న ఆడిట్ సంస్థలు నాలుగు ఉన్నాయి. అగ్రగామి కంపెనీలు, సంస్థలు తమ ఆడిట్ పనిని ఈ నాలుగు సంస్థలకే అప్పచెప్తున్నాయి. వీటిని ‘బిగ్ ఫోర్’ గా వ్యవహరిస్తున్నారు. మనం ఈ బిగ్ ఫోర్ లో ఎక్కడా లేము. మీరు దీనిని సాధించగలుగుతారు, అదీ కాక ప్రతిభకు లోటు ఏమీ లేదు కూడాను. నా స్నేహితులంతా కలసి, భారతదేశం 2022లో తాను స్వాతంత్ర్యం సాధించుకొని 75 సంవత్సరాలను పూర్తి చేసుకొన్న ఉత్సవాన్ని జరుపుకొనే సమయానికి, ప్రపంచం దృష్టిలో గౌరవాన్ని దక్కించుకోవాలంటే- మీ అంతట మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోలేరా. అప్పటికి ఈ బిగ్ ఫోర్ ను మనం బిగ్ ఎయిట్ గా మార్చగలుగుతాం.
ఆ ఎనిమిదింటిలోనూ, నాలుగు సంస్థలు ఇక్కడ నా ఎదుట కూర్చొన్న వారికి చెందినవి కాగలవు. స్నేహితులారా, ఇదీ మన స్వప్నం. మన సంస్థల కీర్తిని, వృత్తి నైపుణ్యాన్ని బట్టి చూస్తే ఇధి కష్టమేం కాదు.
నా స్నేహితులారా, చార్టర్డ్ అకౌంటెన్సీ రంగంలో మీరు ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడాలి. అతి ప్రాచీనమైన, అత్యంత గౌరవప్రదమైన చాణక్యుడు చెప్పిన ఒక సలహాను నేను మీకు చివరగా గుర్తుచేయాలని అనుకుంటున్నాను. ” కాలాతి క్రమత్ కాల్ ఏవం ఫలం పివతి ” – అంటే ఒక పనిసకాలంలో చేయకపోతే – ఆ పని విజయం యొక్క విలువను కాలమే బలహీన పరుస్తుంది – అని చాణక్యుడు పేర్కొన్నారు. అందువల్ల మీ సమయాన్ని వృథా చేయకండి.
అరుణ్ జైట్లీ గారు కొంచెం సేపటి క్రితం మీతో మాట్లాడుతూ – భారతదేశానికి ఇటువంటి అవకాశం ఇంతకు ముందు ఎప్పుడూ లభించలేదు – అని అన్నారు. ఇది మీకు కూడా ఒక అరుదైన అవకాశం. ఈ అవకాశాన్ని మీరు జారవిడుచుకోవద్దు.
భారతదేశ అభివృద్ధి ప్రధాన స్రవంతి లో మీరు కూడా భాగం పంచుకోవాలని మిమ్మల్ని ఆహ్వానించడం కోసమే నేను వచ్చాను. ఈ దేశ మొత్తం ఆర్ధిక వ్యవస్థను కాపాడి, నిలబెట్టే సామర్ధ్యం మీ వృత్తికి ఉన్నదన్న వాస్తవాన్ని మీరు దయచేసి విస్మరించకండి. ఈ సంస్థ మొత్తం బోధనా సిబ్బందికి, ఐ.సి.ఏ.ఐ. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఇక్కడ హాజరైన చార్టర్డ్ అకౌంటెంట్స్ అందరికి మరో సారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
వీడియో లింక్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలందరికీ, ఇతర దేశాలలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన దేశానికి చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ దేశానికి చెందిన సామాన్య ప్రజలను ఈ నిజాయతీ తో కూడిన ఉత్సవంలో భాగస్వామి ని చేస్తూ, మనం ఒక కొత్త ఉత్సాహంతో, ఒక కొత్త దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
***
The CA community looks after the economic health of society: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 1, 2017
A country where a select few loot, such a nation cannot scale new heights. These select few never want the nation to grow: PM @narendramodi
— PMO India (@PMOIndia) July 1, 2017
Our Government has