Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘‘చాంపియ‌న్స్ ఆఫ్ చేంజ్’’ పేరిట‌ నీతి ఆయోగ్ నిర్వ‌హించిన యువ పారిశ్రామిక‌వేత్త‌ల స‌మావేశంలో ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగం


ప్ర‌వాసీ భార‌తీయ కేంద్రంలో ‘‘చాంపియ‌న్స్ ఆఫ్ చేంజ్’’ పేరిట‌ నీతి ఆయోగ్ ఈ రోజు నిర్వ‌హించిన వినూత్న కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని యువ పారిశ్రామిక‌వేత్త‌లతో ముచ్చ‌టించారు. ఈ సంద‌ర్భంగా యువ పారిశ్రామిక‌వేత్త‌లతో కూడిన ఆరు బృందాలు ‘‘సాఫ్ట్‌ పవర్: ఇన్‌క్రెడిబుల్ ఇండియా 2.0; విద్య– నైపుణ్యాభివృద్ధి; ఆరోగ్యం– పోషకాహారం; సుస్థిర భ‌విష్య‌త్తుకు ఉత్తేజం; డిజిటల్‌ ఇండియా; 2022 కల్లా నవ భారతం’’ వంటి ఇతివృత్తాల‌పై త‌మ న‌వ్యాలోచ‌న‌ల‌ను ప్ర‌ద‌ర్శ‌న‌పూర్వ‌కంగా ప్రధాన మంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు.

అనంత‌రం ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగిస్తూ, యువ పారిశ్రామికులు ప్ర‌ద‌ర్శించిన నవ్యాలోచ‌న‌ల‌ను, ఆవిష్క‌ర‌ణ‌ల‌ను అభినందించారు. గ‌తంలో సామాజిక కార్యక్రమాలు, విశాల ప్ర‌జావ‌స‌రాల‌ను చాలావరకు తీర్చేవ‌ని, ఆ ఉద్యమాలకు స‌మాజం లోని ప్రముఖులు నాయ‌క‌త్వం వ‌హించే వార‌ని గుర్తు చేశారు.

దేశ ప్రయోజనం కోసం, సమాజ ప్రయోజనం కోసం విభిన్న బ‌లాల‌ను ఒకే వేదిక‌ మీదకు తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నమే ‘‘ఛాంపియ‌న్స్ ఆఫ్ ఛేంజ్’’ కార్య‌క్ర‌మం అని ప్ర‌ధాన‌ మంత్రి అభివర్ణించారు.

ఈ కార్య‌క్ర‌మాన్ని వ్య‌వ‌స్థీకృతం చేస్తూ వీలైనంత అత్యుత్త‌మ మార్గంలో మ‌రింత ముందుకు తీసుకువెళ్తామ‌ని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా కేంద్ర ప్ర‌భుత్వం లోని వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖ‌లతో నేటి ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్న బృందాలను స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డం ఒక మార్గ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

వివిధ ప్ర‌క్రియ‌ల‌లో మార్పుల ద్వారా స‌మాజంలో మ‌రుగున‌ప‌డిన ధీరోదాత్తుల‌కు గుర్తింపు ల‌భిస్తున్న‌ద‌ని, ‘ప‌ద్మ’ పుర‌స్కారాల ఎంపిక ప్ర‌క్రియ‌లో మార్పులే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ఆయ‌న ఉదాహ‌రించారు.

ప్ర‌జ‌ల స్థితిగ‌తుల మెరుగు దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం లోని సీనియ‌ర్ అధికారుల బృందం అనేక నూతన మార్గాల అన్వేష‌ణ‌లో నిరంత‌ర కృషి చేస్తోంద‌ని గుర్తు చేశారు. యువ పారిశ్రామిక‌వేత్త‌లు కూడా త‌మ కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌ను సాకారం చేసే ప్ర‌య‌త్నాలు కొన‌సాగించాల‌ని ఆయన పిలుపునిచ్చారు. అలా చేయ‌డం ద్వారా ప్ర‌భుత్వ పాల‌న‌ను వారు మ‌రింత ముందుకు తీసుకెళ్ల‌గ‌ల‌ర‌ని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన అనేక‌ స్వ‌ల్ప మార్పుల‌తోనే గ‌ణ‌నీయ ఫ‌లితాల‌ను రాబ‌ట్టింద‌ని ప్ర‌ధాన‌ మంత్రి చెప్పారు. స్వీయ ధ్రువీక‌ర‌ణ‌కు వీలు క‌ల్పించ‌డం ద్వారా సామాన్యుడిపై విశ్వాసాన్ని ప్ర‌క‌టించ‌డం ఆ వినూత్న చ‌ర్య‌ల‌లో ఒక‌టిగా గుర్తు చేశారు. అదేవిధంగా గ్రూపు-సి, డి ఉద్యోగాల‌కు ఇంట‌ర్వ్యూ ప‌ద్ధ‌తిని ర‌ద్దు చేయ‌డాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

నేడు ప్ర‌తి ఖాళీనీ పూరించేందుకు ఒక ‘‘యాప్‌’’ ఉంద‌ని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. త‌ద‌నుగుణంగా పరిపాల‌న‌లో ప‌రివ‌ర్త‌న కోసం సాంకేతిక‌త‌, ఆవిష్క‌ర‌ణ‌ల‌ను సంధానించాల్సి ఉంద‌న్నారు. గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రిపోష‌ణ‌కు వికేంద్రీకృత నిర్మాణం అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప‌రివ‌ర్త‌న‌ను ఉత్తేజితం చేయ‌డంలో అంకుర సంస్థ‌లు త‌మ‌ వంతు పాత్రను పోషించాల్సిన అవ‌స‌రాన్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తావించారు.

స‌మాజానికి ఉత్త‌మ బోధ‌కుల అవ‌స‌రం గురించి ప్ర‌ధాన‌ మంత్రి నొక్కిచెప్పారు. సాంకేతిక ప‌రిజ్ఞానంతో నాణ్య‌మైన విద్య‌కు కొత్త ఊపు వ‌స్తుంద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌భుత్వం చేప‌డుతున్న సామాజిక సంక్షేమ కార్య‌క్ర‌మాలపై చైత‌న్యం దిశ‌గా ఉద్యోగుల‌ను ప్రోత్స‌హించాలని పారిశ్రామిక‌వేత్త‌ల‌కు సూచించారు.

కోట్లాది సామాన్య పౌరుల కృషితో మాత్ర‌మే న్యూ ఇండియా నిర్మాణం సాధ్య‌మ‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టీక‌రించారు. ఇందులో పాలుపంచుకోవాల్సిందిగా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఆయ‌న ఆహ్వానం ప‌లికారు.

ప‌లువురు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉపాధ్య‌క్షుడు శ్రీ అర‌వింద్ పాన్ గ‌ఢియా తో పాటు కేంద్ర ప్ర‌భుత్వ సీనియ‌ర్ అధికారులు పాల్గొన్న ఈ కార్య‌క్ర‌మానికి నీతి ఆయోగ్ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి శ్రీ అమితాబ్ కాంత్ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు.