Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చత్తీస్ గఢ్ లోని రాయగఢ్ లో రూ.6,350 కోట్ల విలువ గల రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన పిఎం

చత్తీస్ గఢ్  లోని రాయగఢ్  లో రూ.6,350 కోట్ల విలువ గల రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన పిఎం


చత్తీస్  గఢ్ లోని రాయగఢ్ లో రూ.6350 కోట్ల విలువ గల పలు రైల్వే ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. చత్తీస్  గఢ్  లోని 9 జిల్లాల్లో 50 పడకల ‘‘క్రిటికల్  కేర్  బ్లాక్’’లను జాతికి అంకితం చేయడంతో పాటు 1 లక్ష సికిల్  సెల్  కౌన్సెలింగ్  కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు. రైల్వే  ప్రాజెక్టుల్లో చత్తీస్  గఢ్  ఈస్ట్  రైల్ ప్రాజెక్ట్ తొలి దశ, చంపా-జంగా మధ్య మూడో రైల్వే లైను, పెండ్రా రోడ్డు-అనుప్పూర్  మధ్య మూడో రైల్వే లైను, తలైపల్లి బొగ్గు గనిని ఎన్ టిపిసికి చెందిన లారా సూపర్  ధర్మల్ విద్యుత్కేంద్రంతో అనుసంధానం చేసే ఎంజిఆర్ (మెర్రీ-గో-అరౌండ్) వ్యవస్థ ఉన్నాయి.

రూ.6,400 కోట్లకు పైగా విలువ గల రైల్వే ప్రాజెక్టులు ప్రారంభం కావడంతో చత్తీస్  గఢ్  అభివృద్ధిలో విశేషమైన ముందడుగు వేసిందని ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధానమంత్రి అన్నారు. నేడు ప్రారంభిస్తున్న ఈ కొత్త ప్రాజెక్టులు రాష్ర్టంలో విద్యుత్  ఉత్పత్తి సామర్థ్యాలు పెంచడంతో పాటు ఆరోగ్య సంరక్షణ రంగాన్నిమెరుగుపరుస్తాయన్నారు. ఈ సందర్భంగా సికిల్  సెల్  కౌన్సెలింగ్  కార్డుల పంపిణీ గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

భారతదేశంలో చోటు చేసుకుంటున్న ఆధునిక అభివృద్ధిని ప్రపంచం యావత్తు వీక్షిస్తూ ఉండడంతో పాటు భారతదేశ సామాజిక సంక్షేమ నమూనాను ప్రశంసిస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. న్యూఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రపంచ నాయకులకు ఆతిథ్యం ఇచ్చిన విషయం గుర్తు చేస్తూ ఆ సందర్భంగా నాయకులందరూ భారతదేశ అభివృద్ధి, సాంఘిక సంక్షేమ నమూనాను చూసి ఎంతో మురిసిపోయారని తెలిపారు. భారతదేశ విజయాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని ప్రపంచ సంస్థలు అంటున్నాయన్నారు. దేశంలోని అన్ని రాష్ర్టాలను, అన్ని ప్రాంతాలను అభివృద్ధిలో భాగస్వాములను చేసేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడమే ఇందుకు కారణమని ప్రధానమంత్రి చెప్పారు.  ‘‘చత్తీస్ గఢ్, రాయగఢ్ ప్రాంతం కూడా దీనికి సాక్షులే’’ అని ప్రధానమంత్రి చెబుతూ కొత్త ప్రాజెక్టుల విషయంలో రాష్ర్ట ప్రజలను అభినందించారు.

‘‘చత్తీస్  గఢ్ దేశాభివృద్ధికే చోదకశక్తి’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానిస్తూ మొత్తం చోదకశక్తులన్నీ సంపూర్ణ శక్తితో పని చేసినప్పుడే ఏ దేశం అయినా పురోగమిస్తుందని చెప్పారు. గత 9 సంవత్సరాల కాలంలోచత్తీస్  గఢ్  బహుముఖీన అభివృద్ధి కోసం నిరంతరం కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని; ఆ విజన్, విధానాల ఫలితాలే నేడు కనిపిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు.  చత్తీస్  గఢ్  లో ప్రతీ ఒక్క రంగంలను కేంద్ర ప్రభుత్వం భారీ స్కీమ్ లు అమలుపరిచిందని, ఎన్నో కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిందని చెప్పారు. రాయపూర్-విశాఖపట్టణం, రాయపూర్-ధన్ బాద్  ఆర్థిక కారిడార్ల అభివృద్ధికి శంకుస్థాపన చేయడానికి జూలైలో తాను రాయపూర్ సందర్శించడాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు. రాష్ర్టంలో ఎన్నో కీలకమైన జాతీయ రహదారులున్నాయని ఆయన అన్నారు. ‘‘నేడు చత్తీస్  గఢ్  లో రైల్వే నెట్ వర్క్  అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభమయింది’’ అని ప్రధానమంత్రి అన్నారు. బిలాస్  పూర్-ముంబై రైలు మార్గంలో ఝార్సుగుడా-బిలాస్  పూర్  మధ్య రద్దీని తగ్గించడానికి రైల్వే వ్యవస్థ మెరుగుపరుస్తున్నట్టు ఆయన చెప్పారు. అలాగే వివిధ రైల్వే కారిడార్లలో చేపట్టిన ఇతర రైల్వే లైన్లు  చత్తీస్  గఢ్  పారిశ్రామికాభివృద్ధిని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తాయని తెలిపారు. ఇవి  పూర్తయినట్టయితే చత్తీస్  గఢ్  ప్రజలకు సౌకర్యవంతంగా ఉండడమే కాకుండా ఈ ప్రాంతంలో కొత్త ఉపాధి, ఆదాయ అవకాశాలు కల్పిస్తాయని ఆయన చెప్పారు.

బొగ్గు గనుల నుంచి విద్యుత్  ప్లాంట్లకు బొగ్గు సరఫరా వ్యయాలు,  కాలపరిమితి కూడా తగ్గుతాయని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.  తక్కువ వ్యయానికే గరిష్ఠంగా విద్యుత్ ఉత్పత్తి అవుతుందంటూ ప్రభుత్వం పిట్  హెడ్  థర్మల్ పవర్  ప్లాంట్లను కూడా నిర్మిస్తున్నదని ఆయన తెలిపారు. తలైపల్లి గని నుంచి చత్తీస్  గఢ్  కు 65 కిలోమీటర్ల మెర్రీ-గో-అరౌండ్ ప్రాజెక్టును ప్రారంభించిన విషయం కూడా ఆయన ప్రస్తావించారు. ఇలాంటి ప్రాజెక్టులన్నీ రాబోయే కాలంలో దేశంతో పాటు చత్తీస్  గఢ్  వంటి రాష్ర్టాలకు ఎంతో ప్రయోజనం కలిగిస్తాయన్నారు.

రాబోయే 25 సంవత్సరాల అమృత కాలంలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న సంకల్పం గురించి  ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ అభివృద్ధిలో ప్రతీ ఒక్క పౌరుని భాగస్వామ్యం ప్రధానమని నొక్కి చెప్పారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే దేశ ఇంధన అవసరాలు తీర్చడం గురించి మాట్లాడుతూ సూరజ్ పూర్  జిల్లాలో మూతపడిన బొగ్గు గనిని ఎకో-టూరిజం ప్రదేశంగా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. కోర్వాలో కూడా అదే తరహా ఎకో-టూరిజం ప్రాజెక్టు అభివృద్ధి పని అమలులో ఉన్నదన్నారు. ఈ ప్రాంతంలోని గిరిజన  ప్రదేశాలకు చేకూరే ప్రయోజనాల గురించి మాట్లాడుతూ అక్కడ నివశిస్తున్న వేలాది మంది ప్రజలకు బొగ్గు గనుల నుంచి విడుదల చేసే నీటితో మంచినీటి వసతి కల్పిస్తున్నట్టు తెలిపారు.

అడవులు, భూములను కాపాడడం ద్వారా అటవీ సంపదతో కొత్త సంపద మార్గాలు తెరవాలన్నది ప్రభుత్వ సంకల్పమని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. వందన్  వికాస్  యోజన గురించి ప్రస్తావిస్తూ దీని ద్వారా లక్షలాది మంది గిరిజన యువత ప్రయోజనం పొందుతారని శ్రీ మోదీ తెలిపారు. ప్రపంచం ఈ ఏడాది చిరుధాన్యాల సంవత్సరంగా పాటిస్తున్న నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో శ్రీ అన్నకు లేదా చిరుధాన్యాలకు భారీ మార్కెట్  సామర్థ్యం ఏర్పడుతుందని చెప్పారు. ఒకపక్క దేశానికి చెందిన గిరిజన సాంప్రదాయాలు కాపాడుకుంటూ దేశం కొత్త గుర్తింపు సాధించడంతో పాటు కొత్త అభివృద్ధి మార్గాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయని ఆయన తెలిపారు.

గిరిజన జనాభాలో సికిల్  సెల్ ద్వారా ఏర్పడే రక్తహీనత గురించి మాట్లాడుతూ వారికి సికిల్  సెల్  కౌన్సెలింగ్  కార్డులు పంపిణీ చేయడం ఆ వ్యాధి వ్యాప్తిని అదుపు చేసే దిశగా పెద్ద అడుగు అన్నారు.‘‘సబ్  కా సాత్, సబ్  కా వికాస్’’ సంకల్పాన్ని మరింత ముందుకు నడపాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ రాబోయే కాలంలో చత్తీస్  గఢ్  అభివృద్ధిలో కొత్త శిఖరాలను చేరుతుందన్న విశ్వాసం ప్రకటిస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు.

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీమతి రేణుకా సింగ్  సరుతా, చత్తీస్  గడ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ టి.ఎస్.సింగ్  దేవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పూర్వాపరాలు

రాయగఢ్  లో జరిగిన భారీ కార్యక్రమంలో రూ.6350 కోట్లతో చేపట్టిన ప్రధానమైన రైల్వే ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయడంతో దేశంలో కనెక్టివిటీ మెరుగుపరిచేందుకు ప్రధానమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతకు ఉత్తేజం కలుగుతుంది. ఈ ప్రాజెక్టుల్లో చత్తీస్  గఢ్  ఈస్ట్  రైల్  ప్రాజెక్టు తొలి దశ, గంగా నుంచి జంగా మధ్యన 3వ రైల్వే లైను, పెండ్రా రోడ్డు నుంచి అనుప్పూర్  మధ్యన 3వ రైల్వే లైను, తలైపల్లి బొగ్గు గని నుంచి ఎన్ టిపిసి లారా సూపర్  థర్మల్ విద్యుత్కేంద్రానికి (ఎస్  టిపిఎస్) అనుసంధానం కల్పించే ఎంజిఆర్ (మెర్రీ-గో-అరౌండ్) వ్యవస్థ ఉన్నాయి. ప్రయాణికులు, సరకు రవాణా కదలికలు పెరగడంతో  పాటు సామాజిక, ఆర్థికాభివృద్ధికి కూడా ఉత్తేజం కలుగుతుంది.

బహుళ నమూనా కనెక్టివిటీ కోసం ప్రారంభించిన పిఎం గతిశక్తి మాస్టర్  ప్లాన్  కింద చత్తీస్  గఢ్  ఈస్ట్  రైలు ప్రాజెక్టు తొలి దశ అభివృద్ధి పనులు చేపట్టారు. ఖర్సియా నుంచి ధరమ్  జయ్ గఢ్ ను కనెక్ట్  చేసే 124.8 కిలోమీటర్ల నిడివి గల ఈ రైలులైన్  లో గరే-పెల్మాకు స్పర్ లైన్;  చాల్, బరౌద్, దుర్గాపూర్, ఇతర బొగ్గు గనులను కలిపే 3 ఫీడర్  లైన్లు భాగంగా ఉన్నాయి. రూ.3055 కోట్లతో నిర్మించిన ఈ రైల్వే లైన్  లో ఎలక్ర్టిఫైడ్  బ్రాడ్ గేజ్ లెవెల్ క్రాసింగ్  లు, ప్రయాణికుల సౌకర్యాల కోసం ఫ్రీ పార్ట్  డబుల్  లైన్ ఉన్నాయి. చత్తీస్  గఢ్ లోని రాయగఢ్ లో ఉన్న మండ్-రాయగడ్ బొగ్గుగని నుంచి బొగ్గు రవాణాకు రైలు అనుసంధానతను ఇది కల్పిస్తుంది.

పెండ్రా రోడ్డు నుంచి అనుప్పూర్  మధ్యన గల 50 కిలోమీటర్ల నిడివి గల మూడో రైల్వే లైను రూ.516 కోట్ల  వ్యయంతో నిర్మించారు.  అలాగే చంపా, జంగా మధ్యన 98 కిలోమీటర్ల నిడివి గల మూడో రైల్వే లైనును రూ.796 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ కొత్త లైన్లు ఈ ప్రాంతంలో కనెక్టివిటీని  మెరుగుపరచడంతో పాటు టూరిజం,  ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి.

65 కిలోమీటర్ల నిడివి గల ఎంజిఆర్ (మెర్రీ-గో-అరౌండ్) విద్యుదీకరణ వ్యవస్థ ఎన్ టిపిసికి చెందిన తలైపల్లి బొగ్గు గని నుంచి చత్తీస్  గఢ్  లోని 1600 మెగావాట్ల సామర్థ్యం గల ఎన్ టిపిసి లారా సూపర్ థర్మల్  పవర్ స్టేషన్  కు తక్కువ వ్యయంతో అత్యున్నత నాణ్యత గల బొగ్గు సరఫరాకు ఉపయోగపడుతుంది. ఎన్  టిపిసి లారా  నుంచి తక్కువ వ్యయంతో విశ్వసనీయమైన విద్యుత్  ఉత్పత్తిని ఉత్తేజితం చేస్తుంది. రూ.2070 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ ఎంజిఆర్  వ్యవస్థ బొగ్గు గనుల నుంచి విద్యుత్కేంద్రాలకు బొగ్గు సరఫరాను పెంచే టెక్నాలజీ అద్భుతం.

చత్తీస్  గఢ్  లోని 9 జిల్లాల్లో 50 పడకలు గల ‘‘క్రిటికల్  కేర్  బ్లాక్’’ల నిర్మాణానికి కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి-ఆయుష్మాన్  భారత్ ఆరోగ్య మౌలిక వసతుల మిష్ (పిఎం-అభీమ్) కింద  రూ.210 కోట్లకు పైబడిన మొత్తం వ్యయంతో దుర్గ్, కొండగాం, రాజ్  నందన్ గాం, గరియాబండ్, జష్  పూర్, సూరజ్  పూర్, సర్గుజా, బస్తర్, రాయగఢ్  జిల్లాల్లో ఈ క్రిటికల్  కేర్  బ్లాక్  లు నిర్మిస్తారు.

ప్రజల్లోను ప్రత్యేకించి గిరిజన జనాభాలోను సికిల్  సెల్ వ్యాధి కారణంగా ఏర్పడుతున్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో స్ర్కీనింగ్ అయిన జనాభాకు ఒక లక్ష సికిల్  సెల్  కౌన్సెలింగ్  కార్డులు ప్రధానమంత్రి పంపిణీ చేశారు. మధ్యప్రదేశ్ లోని షాదోల్  లో 2023 జూలైలో ప్రధానమంత్రి ప్రారంభించిన నేషనల్  సికిల్  సెల్  ఎనీమియా నిర్మూలన మిషన్ (ఎన్ఎస్ఏఇఎం) కింద ఈ సికిల్  సెల్  కౌన్సెలింగ్  కార్డులు పంపిణీ చేశారు.