Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో బృందాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో బృందాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గ్రీస్ నుంచి తిరుగు ప్రయాణంలో నేరుగా బెంగుళూరు చేరుకుని, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ‘టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్’ (ఇస్ట్రాక్‌) కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం చంద్రయాన్-3 ప్రయోగం విజయం నేపథ్యంలో ‘ఇస్రో’ బృందాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇందులో భాగస్వాములైన శాస్త్రవేత్తలతో ప్రధాని సంభాషించారు. చంద్రయాన్-3 ప్రయోగం ద్వారా కనుగొన్న అంశాలు సహా కార్యక్రమం పురోగతి గురించి శాస్త్రవేత్తలు ఈ సందర్భంగా ఆయనకు వివరించారు.

   శాస్త్రవేత్తలను ‘ఇస్ట్రాక్‌’ కేంద్రంలో కలుసుకోవడం తనకెంతో సంతోషం కలిగించిందని ప్రధాన మంత్రి హర్షం ప్రకటించారు. మనోశరీరాలు ఇంత ఆనందంతో పులకించిన సందర్భాలు తన జీవితంలో చాలా అరుదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో హృదయాన్ని  ఉత్సుకత ఊపివేసే కొన్ని ప్రత్యేక క్షణాల గురించి ప్రధాని ప్రస్తావించారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటనల నేపథ్యంలో తాను ఇదేతరహా భావోద్వేగాలను అనుభవించానని చెప్పారు. ఆ సమయంలో తన హృదయం చంద్రయాన్-3 ప్రయోగంపైనే లగ్నమైందని ఆయన పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు సాధించిన విజయంతో ‘ఇస్ట్రాక్’ను సందర్శన కోసం తాను తహతహలాడానని, తన ఆకస్మిక రాకతో వారికి కలిగిన అసౌకర్యాన్ని గమనించిన ప్రధాని ఉద్వేగానికి లోనయ్యారు. శ్రద్ధ, అంకితభావం, ధైర్యం, నిబద్ధత అభినివేశం మూర్తీభవించిన శాస్త్రవేత్తలను కలుసుకుని, వారికి వందనం చేయడానికి తానెంతో తపన పడ్డానని ఆయన వివరించారు.

   ది అసాధారణ విజయమని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ ఘనత అనంత విశ్వంలో భారత  వైజ్ఞానిక శక్తిసామర్థ్యాలను చాటుతుందన్నారు. “భారతదేశం చంద్ర మండలాన్ని జయించింది! మన జాతీయ ప్రతిష్ట సగర్వంగా చంద్రునిపై రెపరెపలాడింది” అని ఉప్పొంగిన హృదయంతో ప్రధాని హర్షం వెలిబుచ్చారు. ఈ అపూర్వ విజయాన్ని కొనియాడుతూ- “ఇదీ నేటి భారతం… జంకూగొంకూ లేని నిరంతర కృషికి పుట్టినిల్లు. సరికొత్త ఆలోచనలతో.. వినూత్న రీతిలో.. చీకటిని చీల్చుకుంటూ ప్రపంచానికి వెలుగులు వెదజల్లే భరతభూమి ఇది. ఈ 21వ శతాబ్దంలో ప్రపంచం ముందున్న పెను సవాళ్లకు పరిష్కారాలు చూపగల నవ భారతమిది” అని వేనోళ్ల ప్రశంసించారు. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రునిపై దిగిన క్షణం ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. “చంద్రుని ఉపరితలాన్ని ముద్దాడిన ఆ క్షణం ప్రస్తుత శతాబ్దపు అత్యంత స్ఫూర్తిదాయక ఘట్టాల్లో ఒకటి. ప్రతి భారతీయుడూ దీన్ని తమ విజయంగా  భావించారు” అని ఆయన చెప్పారు. ఇంతటి ఘన విజయం సాధించిన శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి కొనియాడారు.

   చంద్రుని ఉపరితలంపై ‘విక్రమ్‌’ బలమైన పాదముద్ర ఫొటోలను చూస్తూ- “మన మూన్ ల్యాండర్ చంద్రునిపై ‘అంగదుడి’లా బలంగా పాదం మోపింది. ఈ విజయానికి ఒకవైపు విక్రమ్ పరాక్రమం, మరోవైపు ప్రజ్ఞాన్ సాహసం కనిపిస్తాయి” అని వర్ణించారు. ఈ చిత్రాలు చంద్రునిపై మానవ నేత్రానికి గోచరించని భాగాలను మన ముందుంచాయని, భారతదేశం మాత్రమే ఈ ఘనతను సాధించిందని హర్షం వ్యక్తం చేశారు. “యావత్ ప్రపంచం నేడు భారత శాస్త్రీయ స్ఫూర్తిని, మన సాంకేతికతను, మన శాస్త్రీయ పరిశోధనల శక్తి సామర్థ్యాలను గుర్తించి అంగీకరిస్తోంది” అని శ్రీ మోదీ అన్నారు.

   అయితే, “చంద్రయాన్‌-3 విజయం భారతదేశానిది మాత్రమే కాదు.. ఈ ఘనత యావత్‌ మానవాళికీ చెందినది” అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ ప్రయోగం ద్వారా వెల్లడయ్యే ఫలితాలు చంద్రునిపై ప్రతి దేశం నిర్వహించే ప్రయోగాలకు కొత్త అవకాశాలు కల్పిస్తాయన్నారు. ఈ ప్రయోగం చంద్రుని రహస్యాల గుట్టు విప్పడమే కాకుండా భూమిపై సవాళ్ల పరిష్కారానికీ దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. చంద్రయాన్-3 ప్రయోగంతో ముడిపడిన ప్రతి శాస్త్రవేత్త, సాంకేతిక నిపుణుడు, ఇంజనీర్, ఇతర సిబ్బంది మొత్తానికీ ప్రధాని మరోసారి అభినందనలు తెలిపారు.

   సందర్భంగా… “చంద్రయాన్-3 ‘మూన్ ల్యాండర్’ విక్రమ్ దిగిన ప్రదేశం ఇకపై ‘శివశక్తి’గా పిలువబడుతుంది” అని ప్రధానమంత్రి ప్రకటించారు. “శివం’లో మానవాళి సంక్షేమంపై సంకల్పముంది. ‘శక్తి’ ఆ సంకల్పాలను నెరవేర్చుకునే బలాన్నిస్తుంది. చంద్రునిపై ఈ ‘శివశక్తి’ హిమాలయాలతో కన్యాకుమారికిగల అనుబంధాన్ని కూడా వివరిస్తుంది” అని ఆయన చెప్పారు. శాస్త్రవిజ్ఞాన అభ్యాసానికి కేంద్రకం సంక్షేమమేని నొక్కిచెబుతూ- ఈ పవిత్ర సంకల్పాలకు శక్తి.. అంటే నారీశక్తి ఆశీస్సులు అవసరమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.  చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంలో మన మహిళా శాస్త్రవేత్తలు, దేశంలోని నారీశక్తి కీలక పాత్ర పోషించినట్లు శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. “భారతదేశపు ఈ శాస్త్రీయ- తాత్త్విక దృక్పథానికి చంద్రునిపై శివశక్తి ప్రదేశం సాక్ష్యంగా నిలుస్తుంది” అని ఆయన చెప్పారు.

   చంద్రయాన్-2 పాదముద్రలున్న ప్రదేశాన్ని ఇకపై ‘తిరంగా’ అని పిలుస్తామని ప్రధాని పేర్కొన్నారు. భారతదేశం చేసే ప్రతి ప్రయత్నానికీ ఈ ప్రదేశం స్ఫూర్తిగా నిలుస్తూ.. ఒక వైఫల్యం పరాజయం కాదనే వాస్తవాన్ని గుర్తు చేస్తూంటుందని ప్రధాని అన్నారు. “బలమైన సంకల్పశక్తి ఉంటే విజయం తథ్యం” అని ఆయన అన్నారు.

   చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా దిగిన 4వ దేశంగా భారత్‌ అవతరించిందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. భారత అంతరిక్ష కార్యక్రమం ఎంత సాదాసీదాగా మొదలైందో తలచుకుంటే ఇప్పడు సాధించిన విజయం అసాధారణమైనదని అన్నారు. భారత్‌ ఒకనాడు మూడో ప్రపంచ దేశంగా పరిగణించబడటాన్ని ఆయన గుర్తుచేశారు. అంతేగాక అప్పట్లో అవసరమైన మేర సాంకేతికతగానీ, చేయూతగానీ లేవన్నారు. అలాంటి స్థితినుంచి నేడు ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించిందని చెప్పారు. ఇప్పుడది వృక్ష లేదా సాంకేతికత సహిత మొదటి ప్రపంచ దేశాలలో ఒకటిగా నిలిచిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అంటే- “మూడో శ్రేణి నుంచి ప్రథమ శ్రేణి దాకా సాగిన ఈ ప్రయాణంలో ‘ఇస్రో’  వంటి సంస్థలు ప్రధాన పాత్ర పోషించాయి” అని ప్రధానమంత్రి వివరించారు. ఈ మేరకు ఇస్రో సహకారాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఇవాళ మేక్ ఇన్ ఇండియాను చంద్రునిపైకి తీసుకెళ్లిందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

   సందర్భంగా ఇస్రో కృషి గురించి ప్రధానమంత్రి దేశప్రజలకు వివరించారు. ఈ మేరకు

“దక్షిణ భారతదేశం నుంచి చంద్రుని దక్షిణ ధ్రువందాకా సాగిన ఈ పయనం అంత సులువైదేమీ కాదు” అని ఆయన నొక్కిచెప్పారు. ఇందులో భాగంగా ఇస్రో తన పరిశోధన కేంద్రంలో కృత్రిమ చంద్రుడిని కూడా సృష్టించిందని వెల్లడించారు. భారత యువతలో ఆవిష్కరణలు, శాస్త్ర విజ్ఞానంపైగల ఉత్సాహం ఇటువంటి అంతరిక్ష యాత్రల విజయాలకు దోహదం చేసిందని ప్రధాని ప్రశంసించారు. “మంగళయాన్, చంద్రయాన్ విజయాలతోపాటు గగన్‌యాన్ సన్నాహాలు దేశ యువతరంలో సరికొత్త దృక్పథాన్ని ఆవిష్కరించాయి. మీ అసామాన్య విజయం ఒక తరం భారతీయులలో చైతన్యం తెచ్చి, వారిలో శక్తినింపింది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. నేడు చంద్రయాన్ పేరు మన బాలల నోళ్లలో ప్రతిధ్వనిస్తోందని ప్రతి బిడ్డ శాస్త్రవేత్తలలో తన భవిష్యత్తును చూసుకుంటున్నాడని అన్నారు.

   చంద్రయాన్‌-3 ల్యాండర్‌ నింపాదిగా చంద్రునిపై పాదం మోపిన ఆగస్టు 23ను ఇకపై ఏటా ‘జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా నిర్వహించుకుంటామని ప్రధానమంత్రి ప్రకటించారు. తద్వారా శాస్త్ర-సాంకేతిక ఆవిష్కరణ రంగాలకు నిరంతర స్ఫూర్తి లభిస్తుందని చెప్పారు. అంతరిక్ష రంగ సామర్థ్యం ఉపగ్రహ ప్రయోగానికి, అంతరిక్ష పరిశోధనలకు మాత్రమే పరిమితం కాదని ఆయన పేర్కొన్నారు. దీని బలం ఎలాంటిదో జీవన సౌలభ్యం, పాలనా సౌలభ్యాల్లో చూడవచ్చునని అన్నారు. ప్రధానిగా తాను బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో కేంద్ర ప్రభుత్వంలోని సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారుల కోసం ఇస్రోతో సంయుక్తంగా కార్యశాల నిర్వహించడాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. పాలన వ్యవహారాలతో అంతరిక్ష అనువర్తనాలను సంధానించడంలో సాధించిన అద్భుత పురోగతిని ఆయన ప్రస్తావించారు.

   లాగే స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంతోపాటు మారుమూల ప్రాంతాలకు విద్య, కమ్యూనికేషన్, ఆరోగ్య సేవలు, దూర-వైద్యం, దూర-విద్య తదితరాలను అందించడంలోనూ అంతరిక్ష సాంకేతికత పాత్రను ఆయన ప్రస్తావించారు. అలాగే ప్రకృతి వైపరీత్యాల సమయంలో ‘నావిక్‌’ వ్యవస్థ పాత్ర, తోడ్పాటు గురించి కూడా వివరించారు. “మన ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ బృహత్‌ ప్రణాళికకు అంతరిక్ష సాంకేతికత కూడా ఆధారం. ఇది ప్రాజెక్టుల ప్రణాళిక, అమలు, పర్యవేక్షణలో ఎంతగానో సహాయపడుతుంది. కాలానుగుణంగా అంతరిక్ష అనువర్తనాల పరిధి విస్తరణ మన యువతకూ అపార అవకాశాలు సృష్టిస్తోంది” అని ప్రధాని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని వివిధ మంత్రిత్వ శాఖల సహకారంతో ‘పాలనలో అంతరిక్ష సాంకేతికత’ ఇతివృత్తంగా జాతీయ హ్యాకథాన్‌ నిర్వహించాలని ఇస్రోను ప్రధాని అభ్యర్థించారు. “ఈ జాతీయ హ్యాకథాన్ మన పాలన వ్యవహారాలను మరింత సమర్థంగా మార్చగలదని,  దేశప్రజల సమస్యలకు ఆధునిక పరిష్కారాలు చూపగలదని నేను విశ్వసిస్తున్నాను” అని చెప్పారు.

   దేశంలోని యువత ప్రధాని ఓ కార్యభారం అప్పగించారు. ఈ మేరకు “భారతీయ గ్రంథాల్లోని ఖగోళ సూత్రాల శాస్త్రీయ నిరూపణతోపాటు వాటిపై సరికొత్త అధ్యయనం కోసం నవతరం ముందుకు రావాలి. మన వారసత్వంతోపాటు శాస్త్ర విజ్ఞానానికీ ఇదెంతో ముఖ్యం. ఒకరకంగా దేశంలోని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులకు ఈ విషయంలో రెట్టింపు బాధ్యత ఉంది. భారత శాస్త్ర విజ్ఞాన నిధి బానిసత్వ కాలంలో చాలావరకూ మరుగునపడింది. కాబట్టి, ప్రస్తుత స్వాత్యంత్ర అమృత కాలంలో ఈ నిధిని కూడా మనం అన్వేషించాలి. తదనుగుణంగా విస్తృత పరిశోధన చేపట్టి, దాని ఔన్నత్యాన్ని ప్రపంచానికి ఎరుకపరచాలి” అని ఉద్బోధించారు.

   రాబోయే కొన్నేళ్లలో భారత అంతరిక్ష పరిశ్రమ 8 బిలియన్ డాలర్ల నుంచి 16 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదన్న నిపుణుల అంచనాలను ప్రధాని ప్రస్తావించారు. అంతరిక్ష రంగ సంస్కరణల కోసం ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న నేపథ్యంలో మన యువతరం చొరవతో గత నాలుగేళ్లలో అంతరిక్ష సంబంధిత అంకుర సంస్థల సంఖ్య 4 నుంచి దాదాపు 150కి పెరిగిందని చెప్పారు. చంద్రయాన్‌ మిషన్‌పై సెప్టెంబర్ 1 నుంచి ‘మైగవ్‌’ (MyGov) ద్వారా నిర్వహించే భారీ క్విజ్ పోటీలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా యువత సిద్ధం కావాలని ప్రధాని పిలుపునిచ్చారు.

   ప్రస్తుత 21వ శతాబ్దంలో శాస్త్ర-సాంకేతికతలలో అగ్రగామిగా నిలవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. భారతదేశం నేడు ప్రపంచ స్థాయిలో యువ ప్రతిభావంతుల తయారీ కేంద్రంగా రూపొందిందని పేర్కొన్నారు. ఈ మేరకు “సముద్రపు లోతుల నుంచి ఆకాశం అంచులదాకా… విశ్వాంతరాళం వరకూ యువతరంపై బృహత్తర బాధ్యత ఉంది” అని ప్రధాని చెప్పారు. ఆ మేరకు ‘భూమి లోతుల నుంచి సముద్రపు లోతులదాకా’… భవిష్యత్తరం కంప్యూటర్ల నుంచి జన్యు ఇంజనీరింగ్‌ వరకూగల అపార అవకాశాలను ఆయన నొక్కిచెప్పారు. ఈ మేరకు “భారతదేశంలో మీ కోసం కొత్త అవకాశాలకు నిరంతరం బాటలు పడుతుంటాయి” అని వివరించారు.

   విష్యత్తరాలకు మార్గనిర్దేశం చేయడం ఒక ఆవశ్యకత అని, నేటి కీలక ప్రయోగాలను మరింత ముందుకు తీసుకువెళ్లేది ఆ తరమేనని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ విషయంలో శాస్తవ్రేత్తలే తమకు ఆదర్శమని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ఏకాగ్రతతతో శ్రమిస్తే ఏదైనా సాధించవచ్చని తమ పరిశోధనలతో వారు నిరూపించారని చెప్పారు. దేశ ప్ర‌జ‌ల‌కు శాస్త్ర‌వేత్త‌ల‌పై ఎనలేని విశ్వాసం ఉంద‌ని, వారి ఆశీస్సులు కూడా లభిస్తే దేశంపై వారు చూపుతున్న అంకిత‌భావంతో శాస్త్ర-సాంకేతిక రంగాల్లో భార‌త‌దేశం ప్ర‌పంచంలోనే అగ్రగామిగా ఎదుగుతుంద‌ని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. చివరగా “మన ఆవిష్కరణల స్ఫూర్తి 2047నాటి వికసిత భారతదేశం స్వప్నాన్ని సాకారం చేస్తుంది” అంటూ శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.