గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెసెస్ (జిఐపి లు)/యూనిట్లు పదిహేడింటిని 5 జిఐపిలుగా సక్రమ వ్యవస్థీకరణ/విలీనం మరియు ఆధునికీకరణ చేసేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం తన ఆమోదాన్ని తెలియజేసింది. ఈ 5 జిఐపి లను న్యూ ఢిల్లీ లోని మాయాపురి, మింటో రోడ్డు మరియు రాష్ట్రపతి భవన్; మహారాష్ట్ర లోని నాసిక్; పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతా లో ఉన్న టెంపుల్ స్ట్రీట్ లో ఏర్పాటు చేస్తారు.
ఈ 5 ప్రెస్ ల మిగులు భూములను లాభసాటిగా వినియోగించుకోవడంతో పాటు పునరభివృద్ధి చేయడమే కాకుండా ఆధునికీకరిస్తారు కూడాను. విలీనం చేసే ఇతర ప్రెస్‌లకు చెందిన 468.08 ఎకరాల విస్తీర్ణం కలిగిన భూములను పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ లోని భూమి మరియు అభివృద్ధి కార్యాలయానికి (ఎల్ & డి ఒ కు) అప్పగిస్తారు. చండీగఢ్, భువనేశ్వర్ మరియు మైసూరు లలోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెక్స్‌ట్ బుక్స్ ప్రెసెస్ (జిఐటిబిపి లు)కు చెందిన 56.67 ఎకరాల మేర భూములను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు తిరిగి ఇచ్చేస్తారు.
ప్రెస్ లను ఆధునికీకరణతో, ఆ ప్రెస్ లు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల తాలూకు ముఖ్యమైన గోపనీయ, అత్యావశ్యక మరియు బహుళ వర్ణమయ ముద్రణ పనులను నిర్వహించగలుగుతాయి.
ఖజానా నుండి ఎటువంటి వ్యయం చేయనక్కర లేకుండానే, ఏ ఉద్యోగినీ పదవిలో నుండి తొలగించనవసరం లేకుండానే ఈ పనిని పూర్తి చేస్తారు.
***