హరిత ఉదజనిపై జరిగిన అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు.
హరిత ఉదజనిపై 2వ అంతర్జాతీయ సదస్సుకు హాజరైన ప్రముఖులకు సాదర స్వాగతం పలికి ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రపంచం చాలా కీలకమైన మార్పు దిశగా వెళుతోందని ఆయన పేర్కొన్నారు. వాతావరణ మార్పు అనేది కేవలం భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాదని, దాని ప్రభావం ఇప్పుడే కనిపిస్తోందన్న అవగాహన పెరుగుతోందని ఆయన చెప్పారు. “కార్యచరణ చేపట్టాల్సిన సమయం ఇక ఆసన్నమైంది” అని శ్రీ మోదీ చెప్పారు. ప్రపంచ విధాన చర్చల్లో ఇంధన పరివర్తన, సుస్థిరత అనేది కేంద్రబిందువుగా మారిందని ఆయన పేర్కొన్నారు.
భూగ్రహాన్ని స్వచ్ఛంగా, హరితంగా మార్చేందుకు భారతదేశ నిబద్ధతను ప్రధానమంత్రి పేర్కొంటూ.. హరిత ఇంధనంపై పారిస్ వాగ్ధానాలను మొదట నిలబెట్టుకున్న జీ20 దేశాల్లో భారత్ ఒకటని చెప్పారు. 2030 నాటికి అందుకోవాలని పెట్టుకున్న లక్ష్యాలను తొమ్మిదేళ్లు ముందుగానే సాధించినట్లు తెలిపారు. గత పదేళ్లలో సాధించిన పురోగతిపై ప్రధానమంత్రి మాట్లాడుతూ.. దేశ వ్యవస్థాపక శిలాజేతర ఇంధన సామర్థ్యం 300 శాతం పెరిగిందని, సౌర విద్యుత్తు సామర్థ్యం దాదాపు 3,000 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఈ విజయాలతో తాము ఆగిపోవడం లేదని, వీటిని మరింత బలోపేతం చేసే దిశగా దేశం దృష్టి కొనసాగుతుందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. నూతన, వినూత్న రంగాలపైనా దృష్టి సారించామని, ఫలితంగానే గ్రీన్ హైడ్రోజన్ అనేది తెరపైకి వచ్చిందని అన్నారు.
“ప్రపంచ ఇంధన యవనికపై ఆశావహ జోడింపుగా గ్రీన్ హైడ్రోజన్ ఉద్భవిస్తోంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. విద్యుదీకరణ చేయడం కష్టమైన పరిశ్రమలను కాలుష్యం నుంచి దూరం చేయడానికి ఇది దోహదపడుతుందని అన్నారు. రీఫైనరీలు, ఎరువులు, ఉక్కు, భారీ రవాణా వంటి వివిధ రంగాలు దీని ద్వారా లబ్ధి పొందుతాయని ఆయన ఉదహరించారు. పునరుత్పాదక ఇంధనాన్ని నిల్వ చేసేందుకు కూడా గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగపడొచ్చని ప్రధాని మోదీ సూచించారు. 2023లో ప్రారంభించిన నేషనల్ గ్రీన్ హైడ్రోజెన్ మిషన్ గురించి ఆయన మాట్లాడుతూ… గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగం, ఎగుమతికి ప్రపంచ కేంద్రంగా కావాలనేది భారత్ లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. “ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, పరిశ్రమ, పెట్టుబడికి నేషనల్ గ్రీన్ హైడ్రోజెన్ మిషన్ ప్రేరణను ఇస్తోంది” అని మోదీ అన్నారు. అధునాతన పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడులతో పాటు పరిశ్రమ, విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యం, ఈ రంగంలోని అంకుర సంస్థలతో పాటు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం వంటి అంశాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. హరిత ఉద్యోగాల విస్తారిత వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఆపారమైన అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో దేశ యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన పేర్కొన్నారు.
వాతావరణ మార్పులు, ఇంధన పరివర్తన అనే అంతర్జాతీయ సమస్యలకు పరిష్కారాలు సైతం అంతర్జాతీయంగానే ఉండాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించడంలో గ్రీన్ హైడ్రోజన్ ప్రభావాన్ని ప్రోత్సహించేందుకు అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు. ఉత్పత్తిని పెంచడం, ఖర్చులను తగ్గించడం, మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా భాగస్వామ్యం వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. సాంకేతికతను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పరిశోధన, ఆవిష్కరణల్లో ఉమ్మడిగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. భారత్లో 2023 సెప్టెంబర్లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశాన్ని గుర్తు చేస్తూ, గ్రీన్ హైడ్రోజన్ పై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. న్యూఢిల్లీ జీ20 నాయకుల ప్రకటనలో సైతం గ్రీన్ హైడ్రోజన్ పై అయిదు ఉన్నత స్థాయి స్వచ్ఛంద సూత్రాలను తయారు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇవి ఏకీకృత ప్రణాళికను రూపొందించుకునేందుకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు. “ఇప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు మన తర్వాతి తరాల జీవితాలను నిర్ణయిస్తాయి అనేది అందరం గుర్తు పెట్టుకోవాలి” అని ఆయన పేర్కొన్నారు.
గ్రీన్ హైడ్రోజన్ అభ్యున్నతికి అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరమని, ఈ రంగంలోని నిపుణులు, శాస్త్రవేత్తలు ఇందుకు దారి చూపాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు. “ఇంతటి కీలకమైన రంగంలో నిపుణులు కలిసి పని చేయడం, ముందుకు నడిపించడం చాలా ముఖ్యం” అని ఆయన పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలో సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉమ్మడిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ రంగానికి మరింత చేయూతను అందించేందుకు అవసరమైన విధాన మార్పులను శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు సూచించాలని ప్రధానమంత్రి కోరారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తల ముందు శ్రీ మోదీ కీలక ప్రశ్నలను ఉంచారు. “హరిత ఉదజని ఉత్పత్తిలో ఎలెక్ట్రోలైజర్స్, ఇతర భాగాల సామర్థ్యాన్ని పెంచగలమా? ఉత్పత్తికి సముద్ర జలాలు, మున్సిపల్ వ్యర్థ జలాలను వినియోగించే అవకాశాలను అన్వేషించగలమా?” అని ఆయన ప్రశ్నించారు. ఈ సవాళ్లను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రజా రవణా, నౌకాయానం, దేశీయ జలమార్గాల్లో గ్రీన్ హైడ్రోజన్ ను వినియోగించే అవకాశాలను పరిశీలించాలని కోరారు. “ఇలాంటి అంశాలను ఉమ్మడిగా అన్వేషించడం ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హైడ్రోజన్ దిశగా మార్పు కోసం చాలా ఉపయోగపడుతుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ పై 2వ అంతర్జాతీయ సదస్సులాంటి వేదికలు ఈ అంశాలపై అర్థవంతమైన చర్చలకు అవకాశం కల్పిస్తాయని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
సవాళ్లను అధిగమించడంలో మానవాళి చరిత్రను ప్రధానమంత్రి పేర్కొంటూ.. “ఉమ్మడి, ఆవిష్కరణల ద్వారా వచ్చిన పరిష్కారాలతోనే ప్రతిసారి మనం ప్రతికూలతల నుంచి బయటకు వచ్చాం” అని అన్నారు. ఉమ్మడి కార్యచరణ, ఆవిష్కరణలతో కూడిన ఇదే స్ఫూర్తి ప్రపంచాన్ని సుస్థిరమైన భవిష్యత్తు దిశగా నడిపిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. “కలిసి ఉన్నప్పుడు ఏదైనా సాధించగలం” అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. హరిత ఉదజని అభివృద్ధి, విస్తరణను వేగవంతం చేయడానికి అంతర్జాతీయ కృషి అవసరం అని ఆయన అన్నారు. తన ప్రసంగాన్ని ముగిస్తూ.. గ్రీన్ హైడ్రోజన్ పై 2వ అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నవారికి ఆయన అభినందనలు తెలియజేశారు. మరింత సుస్థిరతమైన, హరిత ప్రపంచ నిర్మాణంలో ఉమ్మడి కృషి అవసరాన్ని తెలియజేస్తూ “గ్రీన్ హైడ్రోజన్ అభివృద్ధి, విస్తరణ కోసం మనం కలిసికట్టుగా పని చేద్దాం” అని ఆయన పేర్కొన్నారు.