భారతదేశం, మారిషస్ ల మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ ఒ యు) పై సంతకాలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ మావేశానికి అధ్యక్షత వహించారు.
ఈ ఎమ్ ఒ యు మారిషస్ గణతంత్రపు ప్రధాన మంత్రి కార్యాలయం లోని జాతీయ అభివృద్ధి యూనిట్ కు, భారతదేశ ప్రభుత్వం లోని గ్రామీణ అభివృద్ధి శాఖకు మధ్య గ్రామీణాభివృద్ధి రంగంలో సహకారం కోసం ఒక ఫ్రేమ్ వర్క్ ను ఏర్పాటు చేయడానికి తోడ్పడగలదు. ఈ ఎమ్ ఒ యు ఉభయ దేశాల మధ్య సమానత్వం, పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికన గ్రామీణాభివృద్ధి, సామర్ధ్య నిర్మాణ రంగాలలో సహకారాన్ని ప్రోత్సహించగలదు.
ఈ అవగాహనపూర్వక ఒప్పందంలో భాగంగా గ్రామీణాభివృద్ధి రంగంలో సహకారం కోసం ఒక సంయుక్త సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సంఘం ఇరు పక్షాలకు అనువైన తేదీలలో రెండు దేశాలలోను ఏదైనా ఒక దేశంలో సమావేశం అవుతూ ఉంటుంది. ఈ అవగాహన పూర్వక ఒప్పందంపై సంతకాలు జరిగిన రోజు నుండి ఇది అమలులోకి రాగలదు.
తగిన సాంకేతిక సహకారానికి వీలు కల్పించడం, సమన్వయ పరచుకోవడం కోసం ఇరు దేశాలూ అంగీకరించాయి. వీటిలో భాగంగా ఈ అవగాహనపూర్వక ఒప్పందం లక్ష్యాలను నెరవేర్చడంలో భారతీయ నైపుణ్య సంస్థలు సహాయం చేయడానికి ముందుకు వస్తాయి. గ్రామీణాభివృద్ధి రంగంలో సంబంధిత సమాచారాన్ని, పత్రాలను ఇచ్చి పుచ్చుకొంటారు. గ్రామీణాభివృద్ధికి అవసరమైన చర్యలకు మద్దతునిస్తారు. విధానాలతో పాటు శాస్త్ర, సాంకేతిక సమాచారాన్ని ఆదాన ప్రదానం చేసుకొంటారు. పరస్పర ప్రయోజనకరమైన విషయాల్లో సంబంధిత సమాచారాన్ని ఒకదానికి మరొకటి మార్పిడి చేసుకొంటాయి. అనుభవాలను పంచుకోవడానికి వీలుగా ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొనేటందుకు ఒక దేశానికి చెందిన వారు మరొక దేశంలో పర్యటిస్తారు. నిర్దిష్ట రంగాల ద్వారా మానవ వనరుల సామర్థ్యాన్ని పటిష్ఠపరచుకోవడానికి వీలుగా మారిషస్ లో శిక్షణకు – భారతదేశంలో పేరొందిన సంస్థల ద్వారా అనుకూలమైన పథకాలు, ఆధునిక సాంకేతిక విజ్ఞానం, అత్యాధునిక పరికరాలు, వస్తువులు, ఉత్తమ విధానాల మార్పిడికీ సహకారం అందించడం జరుగుతుంది.
పూర్వ రంగం:
గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన రంగాలలో భారతదేశం, మారిషస్ ల మధ్య ద్వైపాక్షిక సహకారం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలన్నఅంశం గత కొంతకాలంగా పరిశీలనలో ఉంది. రెండు దేశాల్లో ఎక్కువ శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తూ – వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడి జీవిస్తున్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి – గ్రామీణాభివృద్ధి శాఖ కీలకమైన పాత్రను పోషిస్తున్నది.