Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గౌహ‌తిలో ప‌న్నెండో ద‌క్షిణాసియా క్రీడ‌ల ఆరంభోత్స‌వంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

గౌహ‌తిలో ప‌న్నెండో ద‌క్షిణాసియా క్రీడ‌ల ఆరంభోత్స‌వంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

గౌహ‌తిలో ప‌న్నెండో ద‌క్షిణాసియా క్రీడ‌ల ఆరంభోత్స‌వంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

గౌహ‌తిలో ప‌న్నెండో ద‌క్షిణాసియా క్రీడ‌ల ఆరంభోత్స‌వంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


మ‌న ఇరుగు పొరుగు క్రీడాకారుల‌తో పాటు సార్క్ దేశాల నుంచి వ‌చ్చిన సోద‌ర‌ సోద‌రీమ‌ణులను క‌ల‌సుకోవ‌టాన్ని గౌర‌వంగా భావిస్తున్నాను. అతిథి దేవో భ‌వః అనే సంస్కృతికి మారు పేరైన భార‌తావ‌ని లోకి, ఆతిథ్యానికి, క్రీడా ప్రియ‌త్వానికి పేరొందిన అంద‌మైన గౌహ‌తి న‌గ‌రంలోకి మీకంద‌రికీ స్వాగ‌తం ప‌లుకుతున్నాను.

అద్వితీయ‌మైన బ్ర‌హ్మ‌పుత్ర న‌ది ఒడ్డున జ‌రుగుతున్న ఈ క్రీడా సంరంభంలో పాలు పంచుకోవ‌టానికి వ‌చ్చిన మీ అంద‌రిలోని ఉత్సాహం, ఉత్తేజం న‌న్ను క‌దిలించి వేస్తున్నాయి. పురాత‌న భార‌తంలో ప్రాగ్‌జ్యోతిష పురంగా ప్ర‌భ‌విల్లిన నాటికీ, ఇప్ప‌టికీ గౌహ‌తి ఎంతో మారిపోయింది. ప్ర‌స్తుతం ఆధునిక‌త‌ను, వైవిధ్యాన్ని సంతరించుకొని ఈశాన్య భార‌త ప్రాంతంలో అన్నిర‌కాల ఆర్థిక కార్య‌క‌లాపాల‌కు ఇది కేంద్రంగా భాసిల్లుతోంది.

ఈశాన్యంలోని యువ‌త‌రం, ముఖ్యంగా అస్సాం లోని వారు మంచి ఫుట్‌బాల్ మ్యాచ్‌ను చూసే అవ‌కాశాన్ని అసలు వ‌దులుకోరు. వీళ్ళ‌ లోని ఈ ఉత్సాహం ప్ర‌పంచ‌ వ్యాప్తంగా పేరొందింది. అందుకే భార‌త్ తొలి సారిగా 2017లో ఆతిథ్య‌మివ్వ‌బోతున్న ఫిఫా అండ‌ర్‌- 19 ప్ర‌పంచ‌ క‌ప్ నిర్వ‌హ‌ణ‌లో గౌహ‌తిని ప్‌‌ధాన వేదిక‌గా ఎంచుకున్నారు.

ఈ క్రీడాసంబ‌రం మూడు ప్ర‌ధాన టి-ల అద్భుత క‌ల‌యిక‌గా నాకు క‌నిపిస్తోంది. టాలెంట్ (ప్ర‌తిభ‌), టీం వ‌ర్క్ (సంఘ‌టిత‌ శ్ర‌మ‌), టుగెద‌ర్‌నెస్ (క‌ల‌సిక‌ట్టుత‌నం). ద‌క్షిణాసియాలోని ప్ర‌తిభావంతులైన యువ‌త‌రం ఇక్క‌డుందిప్పుడు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌ త‌మ జ‌ట్లు గ‌ర్వించ‌దగ్గ ఆట‌గాళ్ళే. అదే స‌మ‌యంలో అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, భార‌త‌దేశం, మాల్దీవులు, నేపాల్‌, పాకిస్థాన్‌, శ్రీలంక‌ ల‌తో కూడిన ద‌క్షిణాసియా దేశాల క‌లివిడిత‌నానికి ఈ క్రీడాసంరంభం ప్ర‌త్య‌క్ష‌ సాక్షిగా నిలుస్తోంది. మ‌నం ఏ దేశం నుంచి వ‌చ్చిన‌ వార‌మైనా ద‌క్షిణాసియాను మ‌న స్వ‌గృహంగా భావిస్తాం.

క్రీడ‌ల‌నేవి ప్ర‌తి ఒక్క‌రి వ్య‌క్తిగ‌త జీవితంలో త‌ప్ప‌నిస‌రి భాగం కావాలి. ఆట‌నేది ఆరోగ్య‌క‌ర‌మే కాదు.. ఉత్తేజితం చేస్తుంది కూడా! క్రీడ‌లు లేకుండా సంపూర్ణ‌ వ్య‌క్తిత్వ సాధ‌న అసాధ్యం. అన్నింటిని మించి ఆట‌ల‌తో క్రీడాస్ఫూర్తి అబ్బుతుంది. క్రీడ‌లు లేకుండా క్రీడాస్ఫూర్తి లేదు. ఒక్క‌ మైదానంలోనే కాకుండా బ‌య‌ట వ్య‌క్తిగ‌త జీవితంలో కూడా ఈ క్రీడాస్ఫూర్తి మీకు దోహ‌ద‌ప‌డుతుంది. క్రీడ‌ల్లో భాగంగా మైదానంలో నేర్చుకున్న‌వ‌న్నీ జీవితాంతం ఉప‌యోగ‌ప‌డుతుంటాయి. అందుకే నేను ఎప్పుడూ చెబుతుంటాను- జో ఖేలే, వో ఖిలే (ఎవ‌రైతే ఆడ‌తారో వారు విక‌సిస్తారు) అని.

ఈ క్రీడ‌ల మ‌స్క‌ట్ ‘టిఖోర్‌’. బుల్లి రైనోను ప్ర‌తిబింబించే ఈ టిఖోర్ చురుకుద‌నానికి, మేధ‌స్సుకు ప్ర‌తీక‌. అలాగే “ఈ పృథ్వి ఏఖ‌న్ క్రీరాంగ‌ణ్‌.. క్రీరా హోల్ శాంతిర్ ప్రాంగ‌ణ్‌” అంటూ సాగే ఈ క్రీడ‌ల గీతాన్ని కీర్తిశేషులు డాక్ట‌ర్ భూపేన్ హ‌జారికా ఆల‌పించారు. త‌న మధుర‌మైన గొంతుతో అంద‌రినీ మంత్ర‌ముగ్ధుల‌ను చేసిన ఆ మ‌హాగాయ‌కుడు ఆల‌పించిన ఈ గీతం ద‌క్షిణాసియా క్రీడ‌ల‌, శాంతి, స్నేహ సౌభ్రాతృత్వాల‌కు అద్దం ప‌డుతోంది.

పాల్గొంటున్న అన్ని సార్క్ దేశాల నుంచి నీటిని తీసుకొచ్చి క‌లుపుతున్నామ‌ని శ్రీ శ‌ర్వానంద సోనోవాల్ జీ చెప్పారు. సార్క్ దేశాల ఆకాంక్ష‌లు, స‌హ‌కారాన్ని ప్ర‌తిబింబించే చ‌ర్య ఇది. “మ‌న‌మంతా ఒకే ప‌డ‌వ‌లో ఉన్నాం” అంటూ భూపేన్ హ‌జారికా పాడిన పాట‌ను మీరు కొద్ది సేప‌టిలో విన‌బోతున్నారు. ఇది మ‌న సార్క్ దేశాల గురించిన పాటే. మ‌న‌మంతా కుటుంబంలా క‌ల‌సి మెల‌సి సాగాలి. ద‌క్షిణాసియా క్రీడ‌ల ద్వారా స్నేహ‌ భావ‌న‌ను కొన‌సాగిద్దాం.

భార‌త‌దేశం గురించి నేనేదైతే క‌ల‌లు కంటున్నానో ద‌క్షిణాసియా గురించి కూడా అలాగే క‌ల‌లు కంటున్నాను. స‌బ్‌ కా సాత్‌… స‌బ్‌ కా వికాస్‌! అంతా క‌ల‌సి… అభివృద్ధి దిశ‌గా అనేదే నా నినాదం. అభివృద్ధి దిశ‌గా ప‌య‌నంలో ద‌క్షిణాసియా దేశాల‌న్నీ భాగ‌స్వాములే. సార్క్ దేశాల్లోని మ‌న‌మంతా క‌ల‌సి ప్ర‌పంచ జ‌నాభాలో 21 శాతం ఉన్నాం. ప్ర‌పంచ ఆర్థిక‌ రంగంలో మ‌న‌ వాటా 9 శాతం. ఈ క్రీడ‌లు కొన‌సాగే కొద్దీ ఈ స్నేహ‌భావం, న‌మ్మ‌కం, అవ‌గాహ‌న క్రీడావ‌కాశాల‌నే కాకుండా.. వాణిజ్య‌, ప‌ర్య‌ట‌క‌ అవ‌కాశాలుగా కూడా రూపాంత‌రం చెందుతాయ‌ని ఆశిస్తున్నాను.

ఈ క్రీడ‌లు వాణిజ్యం, ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం, క్రీడా కార్య‌క్ర‌మాల రూపంలో మ‌న ప్రాంతంలో శాంతికి, శ్రేయ‌స్సుకు మార్గం వేస్తాయ‌ని ఆశిస్తున్నాను. ఈ క్రీడ‌లు మ‌న సార్క్ ప్ర‌జ‌లు త‌మ స‌త్తాను గుర్తించుకోవ‌టానికి వేదిక కావాల‌ని ఆశిస్తున్నాను. క్రీడాంగ‌ణంలో క‌న్పించే క్రీడాస్ఫూర్తిలో అనేకానేక స‌ద్గుణాలు మిళిత‌మై ఉన్నాయి. ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించాల‌న్న స‌వాలు, ప్ర‌య‌త్నం చేస్తుంటే ఉండే ఉత్సాహం, విజ‌యం అందించే ఉల్లాసం, స్నేహ‌ భావం.. ఇవ‌న్నీ మ‌న సంస్కృతి, విద్య, విలువ‌లు, గౌర‌వం, స‌మాజం ఒక‌దానిలో ఒక‌టి ఎలా మిళిత‌మై ఉన్నాయో చూపిస్తాయి. మ‌న‌ల్ని బ‌య‌ట విడ‌గొట్టే అంశాల గురించి క్రీడాంగ‌ణంలో మ‌ర‌చిపోతాం. సాహ‌సం, క్రీడాస్ఫూర్తితో ఒక‌రితో మ‌రొక‌రం అనుబంధం పెంచుకుంటాం. మైదానంలో నియ‌మాల‌కు క‌ట్ట‌బ‌డుతూనే నిజాయ‌తీని పంచుకుంటాం. వైవిధ్యాన్ని ఆస్వాదిస్తాం.

అందుకే శాంతి కోసం ఆడ‌దాం. శ్రేయ‌స్సు కోసం ఆడ‌దాం. ప‌ట్టుద‌ల, ఉత్సాహంతో ఆడ‌దాం… ఎలా అంటే ఈ సంబరం ముగిశాక కూడా మ‌న మ‌ది వీటి గురించి ప‌దే పదే త‌ల‌చుకునేలా! ఈ ప‌న్నెండు రోజుల మీ స్నేహం, ఈ జ్ఞాప‌కాలు మీకు జీవితాంతం గుర్తుండిపోతాయి. ఈ బంధాలను మీరు ఆస్వాదిస్తార‌ని, మ‌న దేశాల మ‌ధ్య శాంతి సౌభ్రాతృత్వ వార‌ధులుగా నిలుస్తార‌ని నేను న‌మ్ముతున్నాను. ప‌త‌కాల కోసం ప‌ట్టుద‌ల‌తో ఆడ‌ట‌మే కాకుండా.. ఆట‌గాళ్ళు, చూడ‌టానికి వ‌చ్చిన‌ వారు ఇక్క‌డికి ద‌గ్గ‌ర్లోని ప‌ర్య‌ట‌క స్థ‌లాలు,, అభ‌యార‌ణ్యాల‌ను కూడా త‌ప్ప‌కుండా సంద‌ర్శించండి.

సార్క్ దేశాల నుంచి వ‌చ్చిన మిత్రులకు మ‌రోమారు స్వాగ‌తం ప‌లుకుతున్నాను. గౌహ‌తిలో ‘గురుకుల్’ స్ఫూర్తి ఈ రెండు వారాలు ప‌రిఢ‌విల్లాల‌ని, క్రీడాకారులు మ‌ధుర‌మైన జ్ఞాప‌కాల‌తో తిరిగి వెళ్ళాల‌ని కోరుకుంటున్నాను.

క్రీడాస్ఫూర్తితో ఈ పోటీలు కొన‌సాగాలి. అత్యుత్త‌ములు విజ‌యం సాధించాలి.

ప‌న్నెండో ద‌క్షిణాసియా క్రీడ‌ల్ని ఆరంభమైన‌ట్లుగా ప్ర‌క‌టిస్తున్నాను.

ధ‌న్య‌వాదాలు.