Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గువాహాటీ లో వ‌రుస‌గా నిర్వ‌హించిన ఉన్న‌త స్థాయి స‌మావేశాల‌లో, ఈశాన్య రాష్ట్రాలలో వ‌ర‌ద ప‌రిస్థితిని స‌మీక్షించి, రూ. 2,000 కోట్ల‌కు పైగా స‌హాయాన్ని ప్ర‌క‌టించిన ప్ర‌ధాన మంత్రి


వ‌ర‌ద‌ల బారిన ప‌డిన ఈశాన్య రాష్ట్రాలలో స‌హాయం, పున‌రావాసం, పున‌ర్ నిర్మాణం మ‌రియు వ‌ర‌ద‌ల అనంత‌ర ప్ర‌భావాన్ని త‌గ్గించే చ‌ర్య‌ల‌ను చేప‌ట్ట‌డం కోసం రూ. 2,000 కోట్ల‌కు పైగా ఉపశమనకారక ప్యాకేజీని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ప్ర‌క‌టించారు. ఆయా రాష్ట్రాల‌లో వ‌ర‌ద‌ల ప‌రిస్థితి మ‌రియు స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను సమీక్షించడం కోసం ప్ర‌ధాన మంత్రి వ‌రుస‌గా నిర్వ‌హించిన ఉన్న‌త స్థాయి స‌మావేశాల ముగింపు సంద‌ర్భంలో ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న వెలువ‌డింది.

ప్ర‌ధాన మంత్రి అస్సాం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, మ‌ణిపుర్ మ‌రియు నాగాలాండ్ ల‌లో త‌లెత్తిన ప‌రిస్థితి పై వేరు వేరుగా స‌మ‌గ్ర స‌మీక్ష స‌మావేశాల‌ను నిర్వ‌హించారు. ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మ‌రియు సీనియ‌ర్ అధికారులు ఈ స‌మావేశాల‌లో పాల్గొన్నారు. స‌మావేశానికి స్వ‌యంగా హాజ‌ర‌వ‌డం కుద‌ర‌ని మిజోర‌మ్ ముఖ్య‌మంత్రి, ఒక విజ్ఞాప‌న ప‌త్రాన్ని పంపించారు.

ఒక్క అవ‌స్థాప‌న రంగానికే కేంద్ర ప్ర‌భుత్వం రూ. 1,200 కోట్ల‌కు పైగా నిధులను ఇవ్వ‌నుంది. ఈ నిధుల‌ను ర‌హ‌దారులు, హైవేలు, వంతెన‌లు ఇంకా ఇత‌ర‌త్రా దెబ్బ‌తిన్న అవ‌స్థాప‌న సంబంధిత నిర్మాణాల మ‌ర‌మ్మ‌తుకు, నిర్వ‌హ‌ణ‌కు మ‌రియు ప‌టిష్ఠీక‌ర‌ణ‌కు వినియోగించ‌నున్నారు.

బ్ర‌హ్మ‌పుత్ర న‌దిలో నీటిని నిల్వ ఉంచే సామ‌ర్థ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డానికి రూ. 400 కోట్లు అందిస్తారు. త‌ద్వారా వ‌ర‌ద‌ల నియంత్ర‌ణకు తోడ్పాటు అంద‌గలదు.

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో, ఎస్‌డిఆర్ఎఫ్‌కు కేంద్ర వాటాగా రూ. 600 కోట్ల‌ను ఇచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో రూ. 345 కోట్ల‌ను ఇప్ప‌టికే విడుద‌ల చేశారు. మిగిలిన మొత్తాన్ని ఆ రాష్ట్రాల‌లో స‌హాయ‌క మ‌రియు పున‌రావాస కార్యకలాపాల‌కు ఉప‌యోగ‌ప‌డ‌డానికి వెను వెంట‌నే విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ ప్రాంతంలో వ‌ర‌ద‌లు మ‌ళ్ళీ మ‌ళ్ళీ సంభ‌వించ‌డాన్ని నివారించే దీర్ఘ‌కాలిక ప‌రిష్కారాల‌ను నిర్ణీత కాలం లోప‌ల అన్వేషించేందుకు గాను క‌ల‌సిక‌ట్టుగా చేప‌ట్ట‌వ‌ల‌సిన చర్యలపై అధ్య‌య‌నం చేసేందుకు కూడా రూ. 100 కోట్ల నిధుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం స‌మ‌కూర్చ‌నుంది.

భార‌తదేశ భూభాగంలో 8 శాతం ఈశాన్య ప్రాంతానిదే. అలాగే, దేశంలోని జ‌ల వ‌న‌రుల‌లో మూడింట ఒక వంతు జ‌ల వ‌న‌రులు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందిన విస్తార‌మైన జ‌ల వ‌న‌రుల‌ను స‌రైన రీతిలో నిర్వ‌హించ‌డం కోసం ఒక ఉన్న‌త స్థాయి సంఘాన్ని కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మిస్తుంది. ఈ సంఘంలో భార‌త ప్ర‌భుత్వ మ‌రియు రాష్ట్రాల మంత్రిత్వ శాఖ‌లకు ప్రాతినిధ్యం ఉంటుంది.

వ‌ర‌ద‌ల‌లో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్ర‌ధాన మంత్రి జాతీయ స‌హాయ నిధి (పిఎమ్ఎన్ఆర్ఎఫ్‌) నుండి రూ. 2 ల‌క్ష‌ల వంతున అనుగ్ర‌హ పూర్వ‌క చెల్లింపును మంజూరు చేయ‌డ‌మైంది; ఈ సొమ్మును మృతుల ర‌క్త సంబంధికుల‌కు చెల్లిస్తారు. అలాగే, వ‌ర‌ద‌ల బారిన ప‌డి తీవ్రంగా గాయాలైన వారికి ఒక్కొక్క‌రికి రూ. 50 వేలు వంతున అనుగ్ర‌హ పూర్వ‌క చెల్లింపు జ‌రుపుతారు.

****