ప్రియమైన యువ మిత్రులారా,
మీరంతా ఐఐటియన్స్. అయితే నేను నా పేరు చివర్లో రెండు ఐ అక్షరాలు జతపడని వ్యక్తిని. మీరు అందరూ ఐఐటియన్స్. అయితే నేను మాత్రం చిన్నప్పటి నుండి టి యన్ని . టియన్ అంటే టీ అమ్మే వ్యక్తినన్న మాట. కళాశాలల్లో చదివే విద్యార్థులు ఎంతో చురుకైన వారు, దేనిని గ్రహించడానికైనా వారికి పెద్దగా సమయం పట్టదు అని భావించే వాడిని. సరిగ్గా అదే జరిగింది. ఈరోజు అక్టోబర్ 7వతేదీ. 2001 జనవరి 26వతేదీన భారీ భూకంపం సంభవించింది. ఆ తరువాత అకస్మాత్తుగా నేను 2001 అక్టోబర్ 7 వ తేదీన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఇదే గాంధీ నగర్లో ప్రమాణస్వీకారంచేసి, కొత్త బాధ్యతలు చేపట్టవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజానికి నా జీవన పథం ఇది కాదు. అప్పటికి నాకు పాలన వ్యవస్థను గురించి తెలియదు. శాసనసభలో అడుగుపెట్టలేదు. అయినా కొత్త బాధ్యతలు నాకు అప్పగించారు. నేను కష్టపడి పనిచేసే తత్వం నుండి వెన్ను చూపకూడదని మానసికంగా సంకల్పం చెప్పుకొన్నాను. అలా దేశం నాకు ఎప్పుడూ కొత్త బాధ్యతలు అప్పగిస్తూ వస్తోంది. ఈ కొత్త బాధ్యతలలో భాగంగానే నేను మీ మధ్య ఉన్నాను.
ఇవాళ, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యువతీ యువకులు ఇక్కడ ఉన్నారు. కొందరు వయోధికులు కూడా ఇక్కడ ఉన్నారు. వారికి నేను ముందుగా సర్టిఫికెట్లు కూడా ఇచ్చాను. నేను వారిని ఎన్నో ప్రశ్నలు వేసి వివరాలు అడుగుతూ వచ్చాను. గ్రామాలలో వారు ఏం చేస్తూ వస్తున్నారో, ప్రజలకు వారు ఏ రకంగా సహాయపడుతున్నారో వాటిపై వారికి పూర్తి అవగాహన ఉంది. వారు ఎలాంటి శిక్షణ పొందారో, వారు తమ శిక్షణను ఎలా క్షేత్ర స్థాయిలో ఉపయోగించుకోవాలో వారికి తెలుసు. నా ప్రశ్నలన్నింటికీ వారు సమాధానం చెప్పగల స్థితిలో ఉన్నారు. ఇది విప్లవాత్మకమని నేను భావిస్తాను. గత 300సంవత్సరాల పూర్వం ప్రపంచం- ఈ దేశం చూడనంత స్థాయిలో- సాంకేతిక విప్లవాన్ని గడచిన 50 సంవత్సరాలలో ప్రపంచం చూసింది. సాంకేతిక పరిజ్ఞానం ప్రజల జీవితాలలో భాగంగా మారింది. సాంకేతిక పరిజ్ఞానమే ఒక చోదక శక్తిగా మారింది. ఇలాంటి సాంకేతిక శకంలో ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలంటే, దేశంలోని ప్రతి స్థాయిలో ప్రజలు ఉదాహరణకు వారు పట్టణ లేదా గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ లేదా విద్యాధికులు లేదా నిరక్షరాస్యులు కానీ, యువకులు లేదా వయోధికులు కానీ ఉజ్జ్వల భవిష్యత్తు కావాలంటే సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం కాక తప్పదు.
స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో మహాత్మ గాంధీ అక్షరాస్యత ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో అక్షరాస్యతకు అపారమైన శక్తి ఉంటే, ఇవాళ సుపరిపాలన ఉద్యమ కాలంలో డిజిటల్ అక్షరాస్యత మరింత ప్రాధాన్యం కలిగిందిగా చెప్పుకోవాలి. అందుకే దేశంలో అన్ని గ్రామాలకు, ఆయా గ్రామాలలో అన్ని వయస్సుల వారికి డిజిటల్ అక్షరాస్యతను కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఇక ఇవాళ కార్యక్రమం గురించి ప్రస్తావించుకొంటే, దేశంలో సుమారు ఆరు కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఈ ఆరు కోట్ల కుటుంబాలలో కనీసం ఒక్కొ కుటుంబం నుండి ఒక్కరికి డిజిటల్ అక్షరాస్యత కల్పించే లక్ష్యాన్ని మేం చేపట్టాం. వీరికి 20 గంటల పాటు బోధించే మాడ్యూల్‌ను ఒక దానిని రూపొందించాం. ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. వీడియో కెమెరా ముందు కూర్చుని ఈ పరీక్షకు హాజరుకావలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని సర్టిఫై చేయడం జరుగుతుంది. డిజిటల్ అక్షరాస్యతకు వ్యక్తుల వయస్సు, విద్యార్హతలు వంటి వాటితో ఏమాత్రం సంబంధం లేదు. వీటికి పెద్ద ప్రాధాన్యం లేదు.
కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ప్రపంచానికి మార్గనిర్దేశం చేసేదిగా ఉన్న కాలం అంటూ ఉండేది. కల వారు, పేద వారు అనే కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని ప్రజలు ప్రస్తావిస్తూ ఉండే వారు. ఈ విభజన ఆధారంగా ఆయన ఒక రాజకీయ సిద్ధాంతాన్ని రూపొందించారు. ఇది విజయవంతమైందా, లేక విఫలమైందా అన్న దానిని మేధావులు చర్చిస్తారు. ఇవాళ ప్రపంచంలో ఆ సిద్ధాంతం క్రమంగా కుంచించుకుపోతూ చివరకు ఎక్కడా కనిపించకుండా పోయింది. అక్కడక్కడా కొన్ని సైన్‌బోర్డులు మాత్రం మిగిలాయి. అయితే డిజిటల్ విభజనకు అవకాశం లేకుండా సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి మనం జాగ్రత్తగా కృషి చేయవలసి ఉంది. డిజిటల్ రంగంలో రానున్న మార్పులను దృష్టిలో ఉంచుకొని చూసినపుడు, కొంతమంది ప్రజలు డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంలో అత్యంత నైపుణ్యం కలిగి ఉండి, మరికొందరు పూర్తిగా వెనుకబడి ఉంటే అలాంటి డిజిటల్ విభజన సామాజిక వ్యవస్థకు పెనుముప్పుగా పరిణమించనుంది. అందుకే సామాజిక సమరసతను పెంపొందించేందుకు, అభివృద్ధికి సంబంధించిన మౌలిక భావనలను అందులో చేరుస్తూ, గ్రామీణ ప్రాంతాలలో డిజిటల్ విభజనను తొలగించే దిశగా డిజిటల్ అక్షరాస్యత కోసం మేం పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించాం. రిమోట్‌తో పని చేసే కొత్త టెలివిజన్ ను ఇంటికి తెచ్చినపుడు మొదట్లో మనం ఎలా భావిస్తామో మనకు తెలుసు. రెండు మూడేళ్ల పిల్లలు తాము కోరుకున్న ఛానల్ ను చూసేందుకు ఛానల్ ను అటూ ఇటూ మారుస్తుండడాన్ని గమనించినపుడు ఈ విషయాలు నేర్చుకోవాల్సిన అవసరాన్ని కుటుంబంలోని పాత తరం కూడా గుర్తిస్తుంది. ఆ తరువాత వారు కూడా టివి ని ఆన్ చేయడం, ఆఫ్ చేయడం ఎలాగో నేర్చుకుంటారు. వాట్సప్‌లో సందేశాన్ని ఎలా ఫార్వర్డ్ చేయాలో బోధించే తరగతి గది ని చూశారా ? వాట్సప్‌లో సందేశాన్నిఫార్వర్డ్ చేయడం నేర్పించే సంస్థ ఏదైనా ఈ దేశంలో ఉందా ? కానీ ఈ దేశంలో ప్రజలు వాట్సప్ సందేశాలు ఎలా ఫార్వర్డ్ చేయాలో ఇప్పటికే నేర్చుకున్నారని మీకందరికీ తెలుసు. అంటే మనం వాడకానికి అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే మనం డిజిటల్ అక్షరాస్యత దిశగా దేశాన్ని సులభంగా ముందుకు తీసుకుపోవచ్చు. సుపరిపాలన, పారదర్శకతకు పూచీ ఇచ్చేవి డిజిటల్ అక్షరాస్యత, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ ఇండియా.
జెఎఎమ్ అనే మూడింటి ద్వారా, అంటే జె- జన్ ధన్ ఖాతా, ఎ- ఆధార్, ఎమ్- మొబైల్ఫో న్ అనే వాటి ద్వారా, అభివృద్ధి పంథాను భారత ప్రభుత్వం సంకల్పించింది. సామాన్యుడి దగ్గర ఉండే మొబైల్ ఫోన్‌ద్వారా ఈ మూడింటిని అతను కోరినట్టు అనుసంధానం చేసి దాని ద్వారా అభివృద్ధిని సాధించే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది. దేశంలో ఆప్టికల్ పైబర్ నెట్‌వర్క్‌ను నిర్మించేందుకు పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించడమైంది. త్వరితగతిన దేశంలోని లక్షలాది గ్రామాలలో అప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం జరుగుతోంది. దీనివల్ల మన భవిష్యత్ తరాలకు మంచి విద్యను అందించడానికి, డిజిటల్ మీడియం ను ఉపయోగించుకొని దూర విద్యను అందించడానికి , సుదూర ప్రాంతాలలోని మన పేద పిల్లలకు మంచి విద్యను అందించడానికి
అవకాశం కలుగుతోంది. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ క్రమంగా ప్రతి గ్రామాన్నిచేరుకుంటే, అది ఆ గ్రామ విద్యా వ్యవస్థను మార్చివేయగలదు. అలాగే ఆరోగ్య సేవలు, ప్రభుత్వం కల్పించే ఇతర ప్రజాసేవలలో గణనీయమైన మార్పు గమనించగలం. ఇవాళ మనం అదే పంథాను అనుసరిస్తున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఇక్కడకు వచ్చిన మీరంతా కమ్యూనిటీ సేవా కోర్సును చేసిన వారు, రాబోయే రోజులలో కొత్తగా ఈ కోర్సును చేయడానికి తమ పేర్లు నమోదు చేసుకున్న వారు ఎందరో ఉన్నారు. దేశం లోని ఆరు కోట్ల గ్రామీణ కుటుంబాల లోని కనీసం ఒక్కొక్కరికి ఈ శిక్షణను భవిష్యత్తులో అందించనున్నాం. ఇది వారికి జీవనోపాధి మార్గం కానుంది. ప్రజాసేవలను వీరి ద్వారా కల్పించడం జరుగుతుంది. ఈ దిశగా మనం ప్రయత్నం కొనసాగించాలి. మన జీవితంలో చాలా మందిని చూస్తుంటాం. పత్రికలలో ప్రకటనల ద్వారానో, టివి ఛానళ్ల లోనో ,మ్యాగజైన్ల ద్వారానో, లేదంటే గూగల్ ప్రకటనల ద్వారానో ఎవరైనా కొత్త మొబైల్ ఫోన్ గురించి తెలుసుకుని వెంటనే వాటిని కొనుగోలు చేస్తుండడం చూస్తుంటాం. అయితే అందులో 80 శాతం మంది ప్రజలకు అందులో ఉన్న ఎన్నో ప్రత్యేక ఫీచర్ల గురించి తెలియదు. వాటిని వాడే అలవాటు కూడా వారికి ఉండదు. ఇక్కడ ఐఐటి లోని కొందరు కూడా మొబైల్ ఫోన్ పూర్తి స్థాయిలో దాని సామర్ధ్యాన్ని వాడని వారు
కూడా ఉంటారు. అందువల్ల మనం డిజిటల్ పరంగా అక్షరాస్యులమైతేనే మనం ఖర్చు చేసిన మొత్తానికి తగిన పూర్తి స్థాయి ప్రయోజనాన్ని పొందగలుగుతాం. ఆ రకంగా మనం విలువను జోడించగలుగుతాం. అందుకే మనం డిజిటల్ అక్షరాస్యతకు సంబంధించిన ప్రచారాన్ని ప్రారంభించాం. ఈ డిజిటల్ అక్షరాస్యత సమాజాన్ని తక్కువ నగదు చెలామణి చేసే సమాజంగా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
భారత ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భీమ్ యాప్ ప్రపంచం లోని ఇతర దేశాలకు ఒక అద్భుతం. అలాగే డిజిటల్ బయోమెట్రిక్‌ను ఉపయోగించుకొని ఆధార్ ఊతంగా తయారుచేసిన డేటా బ్యాంకు కూడా ప్రపంచం అంతటికీ ఒక అద్భుతం. అభివృద్ధిని, సాధికారితను ఆధార్ తో అనుసంధానం చేసే దిశగా మనం ముందడుగు వేస్తున్నాం. అది ఎంతో ఉపయోగపడుతుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఈ రోజు ఈ ఐఐటి కొత్త క్యాంపస్‌ను జాతికి అంకితం చేసే అదృష్టం నాకు కలిగింది. ఇది ఎన్నికల సమయం అయి ఉండి గాంధీనగర్ లో, అదీ సబర్మతి నది ఒడ్డున, 400 ఎకరాల ఎంతో ఖరీదైన భూమిని నేను కేటాయించి ఉంటే.. ఎన్నికల సమయంలో అలాంటి నిర్ణయం నేను తీసుకొని ఉంటే ఇప్పుడు బులెట్ ట్రయిన్ మీద విమర్శల వర్షం కురిపిస్తున్న తరహా లోనే ఆ నిర్ణయానికి కూడా వ్యతిరేకంగా మాట్లాడి ఉండే వారు. గుజరాత్లో ప్రాథమిక విద్యా ప్రమాణాలు సంతృప్తికరంగా లేని వాతావరణంలో మీరు ఐఐటి లపై ధనం ఖర్చు పెడుతున్నారంటూ నా మీద విరుచుకుపడే వారు. ఐఐటికి భూమిని కేటాయించాలన్న నేను నిర్ణయించిన కాలం ఎన్నికల కాలం కాకపోవడం మంచిదే అయింది. ఈ నిర్ణయం ఎంత ముందుచూపుతో తీసుకున్నదో మీరు ఇప్పుడు అర్ధం చేసుకోగలుగుతారు. ఐఐటి ఒక బ్రాండ్ అని, భారతీయ బ్రాండ్ లలో ఒకటిగా మారిందని, ఐఐటి క్యాంపస్ లలో అత్యంత శక్తివంతంగా నిలుస్తుందని ఆ రోజున నేను చెప్పిన మాటలు సుధీర్ గారు, ఇతరులకు గుర్తుండే ఉంటుంది. ఈ కేంపస్ ఎంత గొప్పదో రానున్న రోజుల్లో చర్చించుకొంటారు. అందుకే అత్యుత్తమ ఐఐటిగా అగ్ర స్థానంలో నిలిచే ఒక కేంపస్ గుజరాత్లో కావాలని నేను ఆ రోజు చెప్పాను. కేంపస్‌కు స్వతహాగానే శక్తి ఉంది, ఫేకల్టీ దాని రెండో శక్తి. ఈ ఐఐటిలో పని చేస్తున్న ఫ్యాకల్టీలో 75 శాతం మంది విదేశాల్లో శిక్షణ పొంది అనుభవం గడించిన వారే. వారు ఈ ఐఐటి విద్యార్థుల కోసం తమ కాలాన్ని, శక్తిని కూడా వినియోగించాలని నిర్ణయించుకొన్నారు. వారి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. అయినప్పటికీ దేశం లోని విద్యాసంస్థలన్నింటికీ భారతదేశ ప్రభుత్వం ఒక సవాలు విసురుతోంది. ఆ సవాలును స్వీకరించడానికి ముందుకు రావాలని నేను గాంధీనగర్ ఐఐటిని కోరుతున్నాను.. మీరు దాన్ని స్వీకరించగలరా ? ఐఐటియన్ లు అందరికీ ఏమయింది ? భారతదేశ విద్యా వ్యవస్థలో ఈ తరహా సంస్కరణ రావడం తొలి సారి. చాలా కాలం క్రితమే ఇది రావలసివున్నా, ఏ ఒక్కరూ దానిని చేపట్టే సాహసం చేయలేకపోయారు.
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 70 సంవత్సరాలు గడిచిపోయినా మనం ప్రపంచంలోని అగ్రగామి 500 విశ్వవిద్యాలయాలలో స్థానం సంపాదించుకోలేకపోయాం. ఈ అప్రతిష్ఠను చెరిపేయాలా, వద్దా ? 2022 సంవత్సరంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహించుకొనే సమయానికైనా మన విశ్వవిద్యాలయాలను ఆ స్థాయికి తీసుకు వెళ్తే మేం కూడా ఎంతో కొంత చేశాం అని చెప్పుకోగలుగుతాం. ఇది మనం సాధించగలమా, లేదా ? ప్రభుత్వం ఈ సారి ప్రప్రథమంగా 10 ప్రభుత్వ, 10 ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ఆ సవాలు తీసుకొనేందుకు ఎంపిక చేయాలని నిర్ణయించింది. అందుకోసం సుమారు 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం. ఈ విశ్వవిద్యాలయాలు ఈ సవాలులో విజయం సాధించి ప్రపంచ స్థాయి ప్రమాణాలు సాధించగలిగితే కేంద్ర, రాష్ర్టప్రభుత్వాల నియంత్రణల నుండి వాటికి విముక్తిని కలిగించి వారి బలాన్ని నిరూపించుకోగల స్వేచ్ఛ కల్పిస్తాం. వారి సిలబస్‌లో గాని, ఫేకల్టీలో గాని, కేంపస్‌లో గాని, ఏ ఇతర వ్యవహారంలో గాని ప్రభుత్వం జోక్యం చేసుకోదు. ఈ 20 విశ్వవిద్యాలయాలకు 1,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 400 ఎకరాల్లో విస్తరించిన, 1,700 కోట్ల రూపాయల వ్యయంలో సకల సదుపాయాలు అందుబాటులో ఉంచిన అతి పెద్ద కేంపస్ గాంధీనగర్ ఐఐటి. సుధీర్ జైన్ గారు, ఆయన జట్టు, ఈ యువత అందరూ ముందుకు వచ్చి ఈ సవాలును స్వీకరిస్తారన్న నమ్మకం నాకుంది. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే కాలానుగుణంగా మనం సంస్థలను తయారుచేయాలి. ఈ విషయంలో గుజరాత్ గర్వపడాలి. గత పదేళ్ల కాలంలో గుజరాత్ ఎన్నోప్రపంచ శ్రేణి సంస్థలను దేశానికి అందించగలిగింది. ఈ రోజు ప్రపంచం మొత్తంలో ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం ఒకటే ఉంది. సొంతంగా ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం కలిగిన ఏకైక రాష్ర్టం గుజరాత్. ఇదే ప్రపంచం మొత్తానికి ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం. అలాగే అత్యుత్తమ నాణ్యత గల ఉపాధ్యాయులను తయారుచేయగల ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ -ఐఐటిఇ- దేశంలో మరెక్కడా లేదు. ఆ సంస్థను దేశంలో ఏర్పాటు చేసిన మొదటి రాష్ర్టం గుజరాత్. ఇక్కడ విద్యార్థులు గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి అత్యుత్తమ ఉపాధ్యాయులుగా ప్రపంచంలోకి అడుగు పెడతారు. బాలల విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన తొలి రాష్ర్టం కూడా గుజరాత్ ఒక్కటే. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విశ్వవిద్యాలయం లేదు. ఈ రోజు ప్రపంచం యావత్తు సూక్ష్మ కుటుంబాల దిశగా అడుగేస్తోంది. తల్లితండ్రులు ఎవరికి వారే బిజీగా ఉంటారు. కుటుంబంలో పిల్లల బాధ్యతను పనివారి మీద వదలివేస్తున్నారు. అందుకే బాలల అభివృద్ధిని పర్యవేక్షించే, వారిని సరిగ్గా సంరక్షించే, భావి పౌరులుగా వారు తయారయ్యేందుకు అవసరమైన పునాదులు వేసే ఒక సంస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. బాలల విశ్వవిద్యాలయం ఈ అంశంపై పరిశోధన నిర్వహించాలి. పిల్లలకు ఎలాంటి ఆటవస్తువులుండాలి, వారి గదుల్లో ఏ రంగులు వేయాలి, ఆవరికి ఎలాంటి పాటలు వినిపించాలి, వారికి ఎలాంటి పౌష్టికాహారాన్ని అందించాలి, వారు తేలికగా అవగాహన చేసుకోగల విధంగా బోధనాంశాలలో ఆధునిక సాంకేతికతను ఎలా ఉపయోగించాలి వంటి అంశాలన్నింటి మీద పరిశోధన జరగాలి.
గతంలో ఉమ్మడి కుటుంబాలుండేవి. ఆ కుటుంబమే ఒక విశ్వవిద్యాలయంగా ఉండేది. పిల్లలు తాత నుండి ఒకటి, అవ్వ నుండి మరొకటి, బాబాయిల నుండి ఇంకొకటి నేర్చుకొంటూ ఉండే వారు. కానీ ఈ ఆధునిక కాలంలో సూక్ష్మ కుటుంబ వ్యవస్థ కారణంగా వారికి ఇలా నేర్చుకోగల మార్గాలన్నీ మూసుకుపోయాయి. అందుకే బాల బాలికల భవిష్యత్తు, సంరక్షణ ల గురించి ఆలోచించే బాలల విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన పుట్టింది గుజరాత్ లోనే.
నేర విచారణ రంగంలో మూడు ప్రధాన భాగాలు ఉన్నాయి. ఒకటి చట్టం, రెండోది పోలీసు వ్యవస్థ, మూడోది నేరం ఎలా జరిగిందో నిర్ధారించే ఫోరెన్సిక్ విభాగం. ఈ మూడింటి గురించీ గుజరాత్ ఆలోచించింది. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. న్యాయ విద్యను అందించడం ద్వారా అత్యుత్తమ న్యాయవాదులు, న్యాయమూర్తులను తయారుచేసే బాధ్యత స్వీకరించింది. అలాగే పోలీసు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. దేశంలో పోలీసింగ్‌ను ఒక విద్యా విభాగంగా అందిస్తున్న విశ్వవిద్యాలయాలు కొన్నే ఉన్నాయి. వాటిలో గుజరాత్ ఒకటి. పోలీసు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన రెండో రాష్ర్టం గుజరాత్. ఉమ్మడి దళాల్లో చేరేందుకు అసక్తి గల వారి కోసం డిఫెన్స్ ఫోర్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటయింది. 10, 12 తరగతి పూర్తి చేసిన వారెవరైనా వీటిలో చేరి కమ్యూనికేషన్ల నిర్వహణ, జనాన్ని అదుపు చేయడం, జనం మానసిక స్థితిని దారిలోకి తీసుకురావడం వంటి అంశాలపై అధ్యయనం చేయవచ్చు. వారు దేశంలో అమలులో ఉన్న భారతీయ శిక్షా స్మృతి ని గురించి తెలుసుకుని విద్యాభ్యాసం పూర్తి చేసిన అనంతరం పోలీసు విభాగంలో చేరవచ్చు. అలాగే రక్షణ రంగంలో గుణాత్మకమైన మార్పు తెచ్చేందుకు గుజరాత్ చొరవ తీసుకొంది. టెక్నాలజీ సహాయంలో అన్ని రకాల నేరగాళ్లను పట్టుకోగలుగుతున్న విషయం, అన్ని రకాల నేరాలను అదుపు చేయడం గురించి మీకు తెలుసు. ఫోరెన్సిక్ శాస్త్రాల విశ్వవిద్యాలయం ఇందులో కీలక పాత్రధారిగా ఉంది. సైబర్ క్రైమ్ కావచ్చు లేదా ఏ ఇతర విభాగానికి సంబంధించిన నేరం కావచ్చు, ఏదైనా నేరం తీరును పరిశోధించడం, నేరగాళ్లను పట్టుకోవడంలో ఫోరెన్సిక్ శాస్త్రం కీలకంగా నిలుస్తుంది. ఈ మూడు విభాగాలకు చెందిన ఫేకల్టీలు ఏర్పాటు చేయడం ద్వారా గుజరాత్ దేశానికి ఎంతో సేవ అందిస్తోంది. ఈ రోజున దేశంలో ఎవరు ఏ కొత్త ప్రయోగం చేపట్టినా వారు ఈ మూడు విశ్వవిద్యాలయాలలో ఏదో ఒక దానితో అనుబంధం కలిగి ఉంటారు. ఐఐటియన్ లు అధిక సమయం లాబ్ లోనే గడుపుతారని నాకు బాగా తెలుసును. మీరు ఎన్నో కొత్తవి, నవ్యత కలిగిన ప్రాజెక్టులు చేపట్టి ఉండవచ్చు; కానీ అవి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న పనులే. నా దేశ యువత అలాంటి చట్రంలో ఇరుక్కుపోకూడదని నేను భావిస్తున్నాను. నవ్యతపై అందరూ దృష్టి సారించాలనే డిమాండు నానాటికీ పెరుగుతోంది.
నీతి ఆయోగ్ నిర్వహణ లోని అటల్ ఇనవేశన్ మిషన్ లేదా ఎఐఎమ్ పేరుతో భారత ప్రభుత్వం ఎన్నో సంస్థలను అభివృద్ధి చేస్తోంది. సరికొత్త పంథాలో పయనించాలని ఆశ పడే విద్యాసంస్థలను ఎంపిక చేసి టింకరింగ్ లాబ్స్ ఏర్పాటు చేసేందుకు ఎఐఎమ్ కింద వాటికి నిధులు అందిస్తున్నాం. నవ్యత బాటలో పయనించాలని 5వ,7వ,8వ,10వ తరగతుల విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. దేశపు భాగ్యాన్ని మార్చాలంటే నవకల్పనలే ఆధారం. సమాచార సాంకేతిక విజ్ఞానంలో మనం ఆధిపత్యం సాధించాం, కాని గూగల్ ఏదో వేరే దేశం నుండి తయారు అవుతోంది. ఐటి లో చేయి తిరిగిన యువత మనకు ఉన్నారు, కానీ ఫేస్బుక్ వేరే దేశం నుండి వచ్చింది. యుట్యూబ్ మరో చోట తయారయింది. ఈ ధోరణి మారాలని నేను ఆశిస్తున్నాను. దేశ యువతకు సవాలు విసురుతున్నాను. అందరూ ముందుకు రండి, దేశం భాగ్యాన్ని మార్చడమే కాకుండా ప్రపంచం మొత్తానికి లాభదాయకమైన నవకల్పనలను ఆవిష్కరించండి. మేధస్సు అనేది ఒకరి సొంత ఆస్తి కాదు. ఒకసారి ఇటువంటి అంశాలపైన మీరు దృష్టిని సారించగలిగితే సరికొత్త విషయాలు ఎన్నింటినో మీరు కనుగొనగలుగుతారు. నవ్యతకు మరో భిన్నమైన మార్గాన్ని కూడా మీకు చూపాలనుకుంటున్నాను. నా సలహా గురించి మీరంతా ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు స్ర్టక్చరల్ ఇంజినీయరింగ్ వంటి అంశాలపై ఆర్జించిన విద్యాజ్ఞానం ఆధారంగా కూడా నవ్యతను ఆకళింపు చేసుకోవచ్చు. మీ చుట్టూ ఉన్న సమస్యలను భిన్నంగా అవలోకించండి. వాటిని మీరు పరిష్కరించగలరా అని ఆలోచించండి. పేదలు జీవితం కష్టంగా గడుపుతున్నారు, నేను ఐఐటియన్ని కాబట్టి వారి జీవనాన్ని మరింత మెరుగుపరచేందుకు ఏదైనా చేస్తాను అనుకొంటే అదే ఒక కొత్త ధోరణి. కొన్ని సందర్భాలలో ఒక పెద్ద వ్యాపార నమూనాగా నిలచే పనులు పెద్ద ఎత్తున చేపట్టవచ్చు. మన దేశానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు స్వచ్ఛత ఉద్యమం ప్రస్తుతం నడుస్తోంది. వ్యర్థాల నుండి సంపదను సృష్టించగల నవకల్పనలపై యువత ఎందుకు దృష్టి సారించకూడదు ? నవ్యత ఆధారంగా వారు కొత్త కొత్త ప్రాజెక్టులను ఎందుకు చేపట్టకూడదు ?
ఈ రోజు సౌర శక్తి రంగంలో ఎన్నో కార్యకలాపాలు చోటు చేసుకొంటున్నాయి. మనం సౌర శక్తి, పవన శక్తి, నవీకరణయోగ్య శక్తి ల వంటివి ఉపయోగిస్తున్నాం. వాతావరణ మార్పులు సహా ఈ రంగాలన్నింటి లోనూ దేశ అవసరాలు తీర్చగల నవకల్పనలపై మనం ఎందుకు దృష్టి పెట్టకూడదు. అప్పుడు మనం ప్రతి ఇంటికి కనీసం ఒక నవకల్పనను అందించగలుగుతాం. మన దేశంలో సౌర శక్తి ఎంతో అందుబాటులో ఉంది. మరి మనం ప్రతి ఒక్క భారతీయ కుటుంబానికి వంట వండుకొనే ఇంధన వ్యయాలను తగ్గించగలుగుతామా ? సౌర శక్తిని ఉపయోగించి వంట చేయగల పరికరాలను మనం ఎందుకు తయారుచేయకూడదు ? అవి అందుబాటులోకి వస్తే ప్రజలు వాటిని వినియోగించుకొని వంట ఇంధనాలు ఆదా చేసుకోగలుగుతారు. రోజూ కట్టెల పొయ్యిని వెలిగించాల్సిన అవసరం ఉండదు. ప్రజలు సొంత సోలార్ ఫలకాలను కలిగివుండాలి, ఇంటి మొత్తానికి కావలసిన వంట చేయడానికి వీలుగా ప్రతి ఇంటి పై కప్పు మీద కనీసం రెండు సోలార్ ప్యానెల్స్ ఉండాలి. అవి పేద కుటుంబాల వంట వ్యయాలను తగ్గించగలుగుతాయా, లేదా ? మనం ఇటువంటి సూక్ష్మ, చిన్న అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. అలాంటి వాటిని నవకల్పనలకు అంశంగా తీసుకొని పరిష్కారాలు సాధించడంపై దృష్టి పెట్టాలి. అలాంటి సంస్కృతిని ఐఐటి గాంధీనగర్ ఏర్పాటు చేస్తుందని నేను భావిస్తున్నాను. ప్రజల అవసరాల ఆధారిత నవకల్పనల సంస్కృతిని అభివృద్ధి చేయాలి. అది స్థిరమైనదిగా ఉండాలి. దాన్ని భారీ పరిమాణంలో ఉత్పత్తి చేసి వాణిజ్యపరంగా విపణి లోకి తీసుకు వచ్చే అవకాశం కూడా ఉండాలి. అప్పుడు పెద్ద కంపెనీలు కూడా వాటిని కొంటాయి. ఈ దిశగా ఐఐటియన్ లు దృష్టి సారించాలని నేను కోరుతున్నాను.
ఐఐటి యువతతో మరో విషయం పంచుకోవాలనుకుంటున్నాను. ఐ- క్రియేట్ పేరిట దేశంలో ఒక సంస్థను ఏర్పాటు చేసిన మొదటి రాష్ర్టం దేశం మొత్తంలో గుజరాత్ ఒక్కటే అయి ఉండవచ్చు. అయితే చాలా తక్కువ మంది దానిని గురించి విని ఉంటారు. నాకు అందిన సమాచారం ప్రకారం అది మూడు, నాలుగేళ్లుగా పని చేస్తోంది. కానీ దాని భవనం ఇంకా ప్రజలకు అంకితం కావలసి ఉంది. దానిని అంకితం చేసేందుకు నేను సమయం కేటాయించలేకపోతున్నాను. అది తప్పకుండా చేస్తాను. ఈ ఐ-క్రియేట్ నవ్యతపై ఆసక్తి గల రాష్ట్రాలకు, దేశానికి చెందిన ప్రజలకు ఇంక్యుబేషన్ సదుపాయం అందిస్తోంది. దానిలో ఒక లాబ్ ఉంది, వసతి సౌకర్యం ఉంది. దాని ద్వారా మీలోని కొత్త ఆలోచనలకు రూపం కల్పించే అవకాశం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దేశం ఎలాంటి సంక్లిష్టతలు లేకుండా అభివృద్ధి చెందడానికి వీలుగా జీవితాల్లో మార్పులు తీసుకురాగల వ్యవస్థల ఆవిష్కారానికి మీరు కృషి చేయాలి. ఐ- క్రియేట్ దేశంలో ఆ తరహా లోని ప్రత్యేక సంస్థల్లో ఒకటి, ప్రపంచంలో నవకల్పనలకు పెట్టింది పేరైన సంస్థలతో సహకార ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. వార్తాపత్రికల్లో పతాక శీర్షికలకెక్కని ఈ సమాచారం మీకు తెలియచేస్తున్నాను. దేశ భవిష్యత్తును తీర్చి దిద్దగల యువతకు ఈ సమాచారం అత్యంత కీలకం. 2022లో 75 వ స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించుకొనేందుకు ఇంకా ఐదేళ్ల సమయం ఉంది.
1942లో మహాత్మ గాంధీ క్విట్ ఇండియా పిలుపు ఇచ్చారు. ఆ తరువాత ఐదు సంవత్సరాల కాలంలో బ్రిటిష్ పాలకులు దేశం వదలి వెళ్లిపోయేలా ప్రజలు ఉద్యమించారు. ప్రియమైన నా దేశ వాసులారా, మనం వచ్చే ఐదు సంవత్సరాలలో పేదరికం, కులతత్వం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం వంటివి రూపుమాపుతామని దీక్ష పూనితే అన్నీ సాధించగలుగుతాం. మిత్రులారా, దయచేసి ముందుకు రండి, నాతో భుజం భుజం కలిపి నడవండి. వీటిని సాధిస్తామన్న ప్రతినతో మనం ముందుకు సాగుదాం.
ఐఐటి యువతకు మరో అంశం కూడా చెప్పాలనుకుంటున్నాను. స్నాతకోత్సవం సమయంలో మీకు ఎన్నో విషయాలు చెప్పి ఉంటారు, ఎన్నో సలహాలు ఇచ్చి ఉంటారు. ఇంత పెద్ద సంస్థలో మీరు విద్య నేర్చుకోగలుగుతున్నారంటే మీ తల్లితండ్రులు సంపన్నులు కావడం, వారి ఆర్థిక స్థితి బాగుండడం కారణమా లేదా మీ లోపలి సునిశిత ఆలోచనా దృక్పథం కారణమా ? ఈ అంశాలు ఒకపక్కన పెడితే, ఇంత ఉత్తమ సంస్థలో విద్యను అభ్యసించే అదృష్టం మీకు కలిగిందంటే అందులో ఎందరో పేదల వాటా కూడా ఉంది. పేద ప్రజల హక్కుల నుండి మీరు వాటా పొందగలుగుతున్నారు. ఇదే 400 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం ధనానికి విక్రయించి ప్రాథమిక విద్య కోసం భవనాలు నిర్మించి ఉంటే ఎన్ని భవనాలు సమకూరేవి ? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు వినియోగిస్తే ఎన్ని పిఎస్ఇ సెంటర్లు ఏర్పాటై ఉండేవి ? కానీ ఈ 400 ఎకరాలు నా దేశ ఉజ్జ్వల భవిష్యత్తు కోసం కేటాయించాను. కొందరు పేదలు తమ హక్కులు కోల్పోవడం వల్లనే ఇవన్నీ మనకు సాధ్యం అయ్యాయి. ఒక ఐఐటియన్‌గా నాకు ఈ భావాలు కలిగినప్పటికీ సమాజం పట్ల నాకు ఉన్నటువంటి బాధ్యత ఎప్పటికీ తగ్గదు. సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న కట్టుబాటు బలహీనపడదు. నేను జీవిస్తే సగటు ప్రజల కోసమే జీవిస్తాను, నేను ఏం సాధించినా అది సగటు జీవి కోసమే చేస్తాను. ఈ కొత్త భవనాన్ని ప్రజలకు అంకితం చేసే సమయంలో మీరందరూ కూడా ఈ ప్రతిజ్ఞ చేయండి. ఈ ఒకే ఒక్క ఆకాంక్షతో, నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు.
You are IIT-ians, I was a Tea-ian when I was young (I sold tea). On this day, a few years ago, I took oath as CM for the first time. Till then, I had never even been an MLA. I had decided that whatever I will do, I will do to the best of my abilities: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 7, 2017
Work is underway to spread digital literacy to every part of India, among all age groups and sections of society: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 7, 2017
In this day and age, we cannot afford to have a digital divide: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 7, 2017
A Digital India guarantees transparency, effective service delivery and good governance: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 7, 2017
Our academics should not be exam driven. The focus should be innovation: PM @narendramodi
— PMO India (@PMOIndia) October 7, 2017