Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్ లోని కేవ‌డియా లో “ఐక్యతా విగ్రహాన్ని” జాతికి అంకితం చేసిన సందర్భంగాప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం


నేను సర్దార్ పటేల్ అంటాను, మీరంతా “అమర్ రహే అమర్ రహే” అనండి…

“సర్దార్ పటేల్. అమర్ రహే అమర్ రహే”

“సర్దార్ పటేల్. అమర్ రహే అమర్ రహే”

“సర్దార్ పటేల్. అమర్ రహే అమర్ రహే”

ఈ నేలలో చెప్పి దేశవ్యాప్తంగా అనుక్షణం ప్రతిధ్వనించేలా నేను మరో నినాదం చేస్తాను. నేను “దేశ్ కీ ఏక్తా (దేశ ఐక్యత)” అంటాను, మీరంతా “జిందాబాద్, జిందాబాద్” అనండి.

“దేశ్ కీ ఏక్తా. జిందాబాద్, జిందాబాద్”

“దేశ్ కీ ఏక్తా. జిందాబాద్, జిందాబాద్”

“దేశ్ కీ ఏక్తా. జిందాబాద్, జిందాబాద్”

వేదికపై ఆశీనులైన గుజరాత్ గవర్నర్ శ్రీ ఓంప్రకాశ్ కోహ్లిజీ, ప్రజాభిమానం చూరగొన్న ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణీ జీ, కర్ణాటక గవర్నర్ శ్రీ వజూభాయ్ పటేల్ జీ, మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, నా సహచరుడు, రాజ్యసభ సభ్యుడు శ్రీ అమిత్ భాయ్ షా, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి శ్రీ నితిన్ భాయి, అసెంబ్లీ స్పీకర్ శ్రీ రాజేంద్రజీ, ప్రపంచ దేశాలు, దేశంలోని భిన్న ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిన ప్రముఖులు, సోదరసోదరీమణులారా,

పవిత్ర నర్మదా నది తీరాన, వింధ్య, సాత్పురా పర్వత శ్రేణులకు అత్యంత సన్నిహితంగా ఈ చారిత్రక సందర్భాన దేశవాసులు, ప్రపంచవ్యాప్తంగా నివశిస్తున్న భారతీయులు, భారతదేశ ప్రేమికులందరికీ అభివాదం చేస్తున్నాను.

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ను స్మరించుకుంటూ ఈ రోజున దేశం యావత్తు జాతీయ ఐక్యతా దినోత్సవం నిర్వహించుకుంటోంది. ఈ శుభ సందర్భంలో దేశంలోని ప్రతీ ఒక్క ప్రాంతంలోనూ మన యువత దేశ ఐక్యత, సమగ్రతల కోసం మారథాన్ పరుగులో పాల్గొంటున్నారు. “ఐక్యతా పరుగు”లో పాల్గొంటున్న వారందరినీ నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. వేలాది సంవత్సరాలుగా మీరందరూ చూపుతున్న అంకిత భావం వల్లనే మన సంస్కృతి ఈ రోజుకీ మహోజ్వలంగా వెలుగుతోంది. మిత్రులారా, ప్రతీ ఒక్క దేశ చరిత్ర లోనూ దేశ ప్రజలందరూ తమ ఆకాంక్షలు పూర్తయినట్టుగా భావించే సమయాలు కొన్ని ఉంటాయి. అలాంటి రోజు దేశ చరిత్ర లో శాశ్వతంగా లిఖించిపోయి ఉంటుంది, దాన్ని చెరపడం కూడా సాధ్యం కాదు. అదే రకంగా ఈ రోజు కూడా దేశ చరిత్ర లో కలకాలం గుర్తుండిపోయేదిగా నిలచిపోతుంది. దేశ చరిత్ర లో ఒక అద్భుతమైన ఘట్టంగా ఉండిపోతుంది. దేశానికి స్వాతంత్రం సిద్ధించి ఇన్ని దశాబ్దాలైనా దేశానికే గర్వకారణమైన, దేశానికి ప్రత్యేక గుర్తింపు సాధించి, ప్రపంచ వ్యాప్తంగా గౌరవం ఆపాదించి పెట్టిన ఒక మహోన్నతునికి అందాల్సిన గౌరవం అందించలేకపోయాం.

ఈ రోజున భారతదేశం ప్రస్తుత స్థితిలో ఒక మహోన్నత వ్యక్తిత్వం గల మనీషిని తిరిగి గుర్తు చేసుకుంటున్నాం. భూదిగంతరాలు కలిసేలా ఈ నేలపై నిర్మించిన సర్దార్ సాహెబ్ ప్రతిరూపంగా నిలిచే విగ్రహం దేశంలో కొత్త చరిత్రను రచించడమే కాదు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఈ రోజున ఈ భారీ విగ్రహాన్ని దేశానికి అంకింత చేసే భాగ్యం కలగడం నా అదృష్టం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టిన సమయంలో ప్రధాన మంత్రి హోదాలో ఈ విగ్రహం ఆవిష్కరించే అదృష్టం నాకు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. అలాంటి భాగ్యం కలిగేలా ఆశీర్వదించిన మీ అందరికీ నా ధన్యవాదాలు. నన్ను అభినందిస్తూ లేఖ రాసిన గుజరాత్ ప్రజలందరికీ నేను ఎంతో కృతజ్ఞుడిని. నా వరకు అది నాకు గౌరవ పూర్వకంగా అందించిన లేఖ కన్నా ఎంతో గొప్పది. తల్లి తన బిడ్డపై చేయి వేసినప్పుడు ఉద్భవించే శక్తి ఎన్నో రెట్లు గొప్పది. అదే విధంగా ఈ లేఖ తల్లి ఆశీస్సులు లభించినంత అనుభూతిని నాలో కలిగించింది. లోహ అభియాన్ సందర్భంగా సేకరించిన ఒక ఇనప ముక్క కూడా నేను అందుకున్నాను. అహమ్మదాబాద్ లో లోహ అభియాన్ సందర్భంగా ఎగురవేసిన పతాకాన్ని కూడా నేను అందుకున్నాను. మీ అందరికీ ప్రత్యేకించి గుజరాత్ ప్రజలందరికీ నేనెంతో కృతజ్ఞుడిని. నేను ఈ వస్తువులన్నింటినీ ఇక్కడే వదిలి వెడుతున్నాను. వాటిని మీరంతా ఒక మ్యూజియం లో భద్రపరిస్తే వాటి ప్రాధాన్యం ఏమిటో దేశం యావత్తుకు తెలుస్తుంది.

నాకు పాత రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి, నేను పరిపూర్ణమైన హృదయంతో మాట్లాడుతున్న అనుభూతి కలుగుతోంది. దేశంలోని రైతులందరి నుంచి వారి నేలలోని మట్టి, పాత వ్యవసాయ పనిముట్లు, పరికరాలు సేకరించిన రోజులు గుర్తుకొస్తున్నాయి. లక్షలాది వ్యవసాయ కుటుంబాలు దీన్ని ఒక మహోద్యమంగా చేపట్టి ఈ విగ్రహ నిర్మాణానికి తమ వాటా అందించేందుకు ముందుకు వచ్చారు. వారందరూ అందించిన కోట్లాది టన్నుల బరువు గల పరికరాలన్నింటితోనూ విగ్రహానికి అవసరం అయిన భారీ బేస్ నిర్మాణం జరిగింది.

మిత్రులారా,

ఈ ఆలోచన చేసినప్పుడు ఎన్నో అనుమానాలు, ఆలోచనలు నా మదిలో మెదిలాయి. వాటిలో కొన్నింటిని మీకు తెలియ చేయాలనుకుంటున్నాను. ఈ ఆలోచన నా మనసులో వచ్చినప్పుడు సర్దార్ సాహెబ్ విగ్రహం ఉన్న ప్రదేశం లో ఒక భారీ కొండ శిలను తీసుకువచ్చి దానిపై విగ్రహం నిర్మించాలని భావించాను. కాని అంత భారీ శిల లభించడం కష్టమే కాకుండా ఒకవేళ లభించి దాన్ని తీసుకు రాగలిగినా దాని నుంచి చెక్కే ఇంత భారీ విగ్రహం దానికి ఉండాల్సిన బలం కలిగి ఉండే ఆస్కారం లేదని తర్వాత గ్రహించాను. అప్పుడు నా మనసు మార్చుకున్నాను. దాని నుంచి ఉద్భవించినదే ఈ నాటి ఈ భారీ విగ్రహం. దాని గురించే నేనెప్పుడూ ఆలోచిస్తూ ఉండే వాడిని. ఎందరి నుంచో సలహాలు, సూచనలు తీసుకున్నాను. ఈ రోజున ఈ కీలకమైన ప్రాజెక్టు సాకారం కావడానికి దోహదపడిన వారందరూ ఈ దేశం మీద విశ్వాసాన్ని, ఈ దేశం సామర్థ్యాన్ని నిలబెట్టారని చెప్పడానికి నేను ఎంతో ఆనందిస్తున్నాను.

సోదరసోదరీమణురాలా,

ప్రపంచంలోనే అతి పొడవైన విగ్రహం ఇది. మాతృ దేశాన్ని ముక్కలు చేసేందుకు పన్నిన కుట్రలన్నింటినీ భగ్నం చేసిన ఈ మహోన్నతుడి సాహసం, సామర్థ్యాలు, సంకల్పబలం గురించి, తాను నమ్మిన సంకల్పానికే జీవితం యావత్తు కట్టుబడిన దీక్షాదక్షుని గురించి భవిష్యత్ తరాలన్నింటికీ గుర్తు చేయాలన్నదే నా ఆలోచన. ప్రపంచం యావత్తు భారతదేశం నుంచి ఆశిస్తున్నది ఇదే. అటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభ భాయ్ పటేల్కి నేను అభివాదం చేస్తున్నాను.

మిత్రులారా,

భారతదేశం యావత్తు 550కి పైగా చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయి ఉన్న సమయంలో సర్దార్ సాహెబ్ తన సామర్థ్యాలను వినియోగంలోకి తెచ్చారు. ఆ నాడు భారతదేశ భవిష్యత్తుపై ప్రపంచం యవత్తు నిరాశావహంగా ఉంది. ఆ రోజుల్లో కూడా నిరాశావాదులు మనుగడ సాగించారు. భిన్నత్వం కారణంగా భారతదేశం ముక్కలైపోతుందని ఆ నిరాశావాదులు భావించారు. అంత నిరాశావహమైన వాతావరణంలో కూడా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ రూపంలో ఒక ఆశాకిరణాన్ని దర్శించిన వారున్నారు. కౌటిల్యుని దౌత్యం, శివాజీ మహరాజ్ సాహసం కలబోసిన మూర్తిమత్వం సర్దార్ పటేల్. 1947 జూలై ఐదో తేదీన ఈ చిన్న చిన్న రాజ్యాల రాజుల సమావేశంలో మాట్లాడుతూ సర్దార్ జీ ఈ విధంగా ఎలుగెత్తి చాటారు. “మన అంతర్గత కలహాలు, వైరాలు విదేశీ దాడుల్లో మన వైఫల్యాలకు ప్రధాన కారణం. ఈ రోజున అదే పొరపాటు మరోసారి చేసి ఎవరికో బానిసలుగా ఉండే పరిస్థితి మనం కల్పించుకోకూడదు” అన్నారు.

సర్దార్ సాహెబ్ ఆ రోజున చెప్పిన ఆ మాటలకు నేటికి కూడా ఎంతో విలువ ఉందని నేను భావిస్తున్నాను.

ఆ రోజున సర్దార్ సాహెబ్ చెప్పిన మాటలు విని, ఐక్యతా శక్తిని గుర్తించిన చిన్న చిన్న రాజ్యాల అధినేతలందరూ వారి రాజ్యాలను విలీనం చేశారు. దాని ఫలితంగానే భారతదేశం అస్తిత్వంలోకి వచ్చింది. సర్దార్ సాహెబ్ పిలుపుతో ఆ నాటి రాజ్యాధినేతలందరూ త్యాగాలు చేశారు. వారు చేసిన త్యాగాలు కూడా మనం మరిచిపోకూడదు. భారతదేశం ఒక జాతిగా ఆవిర్భవించడానికి వారందరూ చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలన్నది నా కల. ఈ రోజున ప్రజాస్వామికంగా ఎన్నికైన నాయకుని లేదా ఒక చిన్న తహసీలుదారునైనా వారి పదవీ కాలం పూర్తి కావడానికి ఏడాది ముందు పదవి నుంచి వైదొలగాలని కోరితే పెద్ద కల్లోలమే చెలరేగుతుంది. కాని ఆ రాజులందరూ తమ తాతముత్తాతలు తరతరాల నుంచి సృష్టించి ఇచ్చిన సామ్రాజ్యాలను తృణప్రాయంగా త్యజించి భారత ఐక్యతకు అందచేశారు. దీనిని మనం ఏ నాటికీ మరిచిపోకుండా శాశ్వతంగా గుర్తుంచుకోవాలి.

మిత్రులారా,

ఏదైతే ప్రపంచం యావత్తు భారతదేశం బలహీనతగా భావించిందో అదే బలహీనతను శక్తిగా మార్చి సర్దార్ పటేల్ జాతి భవిష్యత్తుకి బాటలు వేశారు. అదే బాటలో పయనిస్తూ భారతదేశం ఒకప్పుడు దేశ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తం చేసిన వారికే తన నియమనిబంధనలు, షరతులు ఏమిటో నిర్దేశించ గలుగుతోంది. ప్రపంచం లోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగాను, వ్యూహాత్మక శక్తిగాను భారత్ ఎదుగుతోంది. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ఒక అసాధారణమైన వ్యక్తిత్వం గల వాడుగా ఎదిగిన సర్దార్ పటేల్ అసాధారణ సేవల వల్లనే ఇది సాధ్యమయింది. భారత అభివృద్ధిలో సర్దార్ పటేల్ పాత్ర కీలకమైనది. ఎన్నో ఒత్తిడులు, అభిప్రాయ భేదాలు ఎదురైనప్పటికీ సర్దార్ సాహెబ్ పాలనా యంత్రాంగం ఏ విధమైన పాలన అందించాలో చాటి చెప్పారు. ఈ రోజున మనందరి కచ్ నుంచి కోహిమా వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడికైనా స్వేచ్ఛగా ప్రయాణం చేగలుగుతున్నామంటే అది సర్దార్ సాహెబ్ తీర్మానం, సంకల్పం వల్లనే సాధ్యపడింది. సర్దార్ సాహెబ్ ఆ రోజున ఆ సంకల్పం చేసుకుని ఉండకపోతే పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఊహించుకుందాం. ప్రజలు గిర్ లో ని సింహాన్ని చూడాలన్నా, హైదరాబాద్ లోని చార్మినార్ సందర్శించాలన్నా, సోమనాథునికి పూజలు చేసుకోవాలన్నా వీసాలు పొందాల్సి ఉండేది. సర్దార్ సంకల్ప బలమే తోడుగా లేకపోతే ఈ రోజున కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి నేరుగా ఒక రైలు ఉండేదే కాదు, ఉన్నా ఎన్నో పాలనాపరమైన అవరోధాలు ఎదుర్కొనాల్సి వచ్చేది.

సోదరసోదరీమణులారా,

1947 ఏప్రిల్ 21వ తేదీని అఖిల భారత అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల ప్రొబేషనర్లను ఉద్దేశించి మాట్లాడుతూ సర్దార్ వల్లభ భాయ్ పటేల్ ఎంతో విలువైన విషయం చెప్పారు. ఈ నాటి ఐఎఎస్ లు, ఐపిఎస్ లు, ఐఎఫ్ఎస్ లు కూడా దాన్ని గుర్తు పెట్టుకోవాలి. అప్ప‌టివ‌ర‌కు ఇండియన్ సివిల్ సర్వీసుకు “ఇండియన్”, “సివిల్”, “సర్వీస్” అనే పదాలు చలామణి లో లేవు. ఆ పరిస్థితిని మార్చాలని నాటి యువతకు సర్దార్ సాహెబ్ పిలుపు ఇచ్చారు. పారదర్శకత, నిజాయతీల తో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు గౌరవాన్ని పెంచాలని యువతను కోరారు. భారత పునర్నిర్మాణం కోసం దాన్ని ప్రతిష్ఠించాలని సూచించారు. సర్దార్ సాహెబ్ అందించిన స్ఫూర్తి తోనే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులు ఒక ఉక్కు కవచంలా తయారయింది.

సోదరసోదరీమణులారా,

దేశం అత్యంత సంక్లిష్టమైన స్థితిలో ఉన్నప్పుడు సర్దార్ పటేల్ కి హోం మంత్రి పదవి ఇచ్చారు. దేశ వ్యవస్థలన్నింటినీ పునర్నిర్మించే బాధ్యతతో పాటు దేశంలో శాంతి భద్రతల వ్యవస్థ నిర్వహణ బాధ్యతలు కూడా ఆయనకి అప్పగించారు. ఆ క్లిష్టమైన స్థితి నుంచి ఆయన దేశాన్ని వెలుపలికి తీసుకువచ్చి ఆధునిక పోలీసు వ్యవస్థకు ఒక పునాది వేశారు.

మిత్రులారా,

సర్దార్ సాహెబ్ దేశం లోని మారుమూల ప్రాంతాల ప్రజలను ప్రజాస్వామ్యంతో అనుసంధానం చేసేందుకు ప్రతీ ఒక్క క్షణం శ్రమించారు. భారత రాజకీయాలకు మహిళలు తమ వంతు వాటా అందించేలా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చర్యలు తీసుకున్నారు. గ్రామ పంచాయతీలు, నగరపాలక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా మహిళలకు ఆర్హత కల్పించని పరిస్థితికి వ్యతిరేకంగా ఆయన గొంతెత్తి నినదించారు. ఆయన చొరవతోనే స్వాతంత్ర్యం సిద్ధించడానికి కొన్ని దశాబ్దాల ముందే ఈ వివక్ష తొలగిపోయింది. సర్దార్ సాహెబ్ కృషి వల్లనే పౌరులకు ప్రాథమిక హక్కులు ప్రజాస్వామ్యంలో భాగం అయ్యాయి.

మిత్రులారా,

సర్దార్ పటేల్ ప్రేమ, ప్రతిభ, ముందుచూపు, ఆధ్యాత్మికతల కు పవిత్రమైన చిహ్నం ఈ విగ్రహం. ఈ విగ్రహం ఆయన బలం, అంకిత భావానికి నివాళి మాత్రమే కాదు, నవభారతం లో నెలకొన్న ఆత్మవిశ్వాసానికి ప్రతీక. భారత అస్తిత్వం మీద ఎన్నో అనుమానాలు ప్రకటించిన వారందరికీ భారతదేశం శాశ్వతమైనది, అంతం లేనిది, హద్దులు లేనిది అని నిరూపిస్తుంది.

విగ్రహం నిర్మాణం కోసం తమ పొలాల్లోని మట్టి, పాతబడిన తమ ఇనుప పనిముట్లు అందించిన వ్యవసాయదారులందరి ఆత్మవిశ్వాసానికి, ఎన్ని అవరోధాలు ఎదురైనా దీటుగా ఎదుర్కొని జాతికి ఆహార ధాన్యాలందిస్తామన్న వారి కట్టుబాటుకు చిహ్నం. స్వాతంత్రోద్యమ కాలం నుంచి అభివృద్ధి పథం లో నడిచే వరకు తమ వంతు సేవలందించిన గిరిజన సోదర సోదరీమణులందరి గౌరవ చిహ్నం. అంతే కాదు ఈ సమున్నత శిఖరాలన్నీ భారత యువతకు వారు కనే ఉన్నతమైన కలలు, ఆశలు సాకారం అవుతాయని నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటుంది. వారి ఆశలు, ఆశయాలు సాకారం కావడానికి ఒకటే మంత్రం “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్”, “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్”, “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్”.

మిత్రులారా,

మన ఇంజనీరింగ్, సాంకేతిక పోటీ సామర్థ్యానికి కూడా ఈ విగ్రహం ఒక ప్రతీక. గత మూడున్నర సంవత్సరాలుగా సగటున 2500 మంది కార్మికులు ఉద్యమ స్ఫూర్తితో ఈ విగ్రహం నిర్మాణం కోసం శ్రమించారు. త్వరలోనే వారిలో కొందరిని సత్కరించడం కూడా జరుగుతుంది. ఈ అద్భుతమైన విగ్రహానికి రూపకర్తగా వ్యవహరించిన ప్రధాన శిల్పి 90 సంవత్సరాల వయసు పై బడిన శ్రీరామ్ సుతార్. వారందరి ఉద్యమ స్ఫూర్తి, జాతీయ ఐక్యతకు వారి కట్టుబాటు, శ్రమ కారణంగానే ఇంత స్వల్ప సమయంలో ఇంత భారీ విగ్రహ నిర్మాణం పూర్తయింది. సర్దార్ సరోవర్ డామ్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన ఎన్నో సంవత్సరాల తర్వాత గాని దాన్ని ప్రారంభించుకోలేకపోయాం. కాని ఈ ప్రాజెక్టు మీ అందరి కళ్ల ముందే రూపు దిద్దుకుని సాకారం అయింది. ఈ విగ్రహ నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతీ ఒక్కరినీ, ప్రతీ కార్మికుని, ప్రతీ ఆర్కిటెక్ట్ ను, ప్రతీ కళాకారుని, ప్రతీ ఇంజనీర్ ను ఈ సందర్భంగా నేను పేరుపేరునా అభినందిస్తున్నాను. సర్దార్ విగ్రహ నిర్మాణం లో భాగస్వాములైన వారందరి పేర్లు చరిత్ర లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

మిత్రులారా,

ఈ రోజున ఈ ప్రయాణం ఒక కొత్త మైలురాయిని చేరింది. సరిగ్గా ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే రోజున ఈ ప్రయాణం ప్రారంభం అయింది. 2010 అక్టోబరు 31వ తేదీన అహమదాబాద్ వాసుల ముందు ఈ ఆలోచనను నేను ఆవిష్కరించాను. కోట్లాది మంది భారతీయుల వలెనే ఆ రోజున నా మదిలో ఉన్న ఒకే ఒక్క ఆలోచన భారతదేశాన్ని ఐక్యంగా నిలిపేందుకు అవిరళమైన కృషి చేసిన మహోన్నతునికి అందించాల్సిన గౌరవం అందించాలన్నదే. అంతే కాదు, సర్దార్ పటేల్ జీవిత పర్యంతం ఎవరి సంక్షేమం కోసం పాటు పడ్డారో అలాంటి రైతులు, కార్మికుల స్వేదబిందువులే దీని నిర్మాణంలో ఉండాలని కూడా నేను ఆకాంక్షించాను.

మిత్రులారా,

ఖేదా నుంచి బార్డోలి వరకు సర్దార్ పటేల్ సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహించడం లేదా రైతాంగం దోపిడీకి వ్యతిరేకంగా నినదించడమే కాదు, వారి సమస్యలకు చక్కని పరిష్కారాలు కూడా చూపించారు. సర్దార్ సాహెబ్ ముందు చూపు వల్లనే సహకారోద్యమం ముందుకు సాగి ప్రతీ ఒక్క గ్రామంలోనూ వేళ్లూనుకుని ఈ రోజున ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది అందించింది.

మిత్రులారా,

ఈ విగ్రహం సర్దార్ పటేల్ పట్ల కోట్లాది మంది భారతీయులకు గౌరవ ప్రదర్శన చిహ్నమే కాదు, దేశ ఆర్థిక రంగంలోను, ఉపాధికల్పనలోను కూడా కీలక పాత్ర కలిగి ఉంటుంది. ప్రతీ ఏడాది వేలాది మంది గిరిజన సోదరసోదరీమణులకు ఉపాధి కల్పిస్తుంది. వింధ్య, సాత్పురా పర్వత శ్రేణులు బహుమతిగా అందించిన ఈ ప్రకృతి ఆధునిక మార్గంలో కూడా మీకు లాభం చేకూరుస్తుంది. ఇంతవరకు పద్యాల్లోనే ప్రపంచం విన్న గిరిజన అటవీ, సాంస్కృతిక వైభవాన్ని కనుల ముందు కట్టి చూపిస్తుంది. సర్దార్ పటేల్ విగ్రహ సందర్శనకు వచ్చే పర్యాటకులందరూ ఇప్పుడు సర్దార్ సరోవర్ డామ్ ను, వింధ్య, సాత్పురా పర్వత శ్రేణులను కూడా వీక్షించగలుగుతారు. ఈ విగ్రహం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటినీ పర్యాటకులకు ఆకర్షణీయమైన కేంద్రాలుగా తీర్చి దిద్దినందుకు గుజరాత్ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను. ఇక్కడ అభివృద్ధి చేసిన పూల లోయ ఈ విగ్రహం అందాన్ని ఇనుమడింపచేస్తుంది. అలాగే ఇక్కడ ఒక ఏక్ తా నర్సరీ కూడా త్వరలో రానుంది. ఈ ప్రాంతం సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులందరూ అక్కడ నుంచి ఒక మొక్కను తీసుకువెళ్లి ఐక్యతా చిహ్నంగా తమ ఇళ్లలో వేసుకోవచ్చు. తద్వారా ఐక్యతా వృక్షం బీజాలు మొలిపించి దేశ ఐక్యత ప్రాధాన్యతను ప్రతీ ఒక్క క్షణం గుర్తు చేసుకోగలుగుతారు. పర్యాటకం కూడా ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో మార్పును తెస్తుంది.

మిత్రులారా,

ఈ ప్రాంతానికి చెందిన సాంప్రదాయికమైన విజ్ఞానం ఎంతో సుసంపన్నమైనది. ఈ ఐక్యతా విగ్రహం వల్ల పర్యాటకం అభివృద్ధి చెందితే ఆ సాంప్రదాయిక విజ్ఞానం కూడా దశదిశలా వ్యాపించి ఈ ప్రదేశానికి చిరస్థాయిగా నిలిచే గుర్తింపును తెస్తుంది. ఈ ప్రాంతంతో నాకు సుదీర్ఘ సాన్నిహిత్యం ఉన్నందు వల్ల నాకు ఎన్నో విషయాలు తెలుసు. ఉనా మండా, తెహ్లా మండా, తోకలా మండా వంటి రకరకాల బియ్యం తో వండిన వంటకాల రుచిని కూడా పర్యాటకులు ఆస్వాదించగలుగుతారు. బహుశ ఈ సభలో కూర్చున్న వారు కూడా ఆ వంటకాలు రుచి చూడాలనుకుంటూ ఉండవచ్చు. అంతే కాదు ఇక్కడ ఖతీ భింది పేరు గల ఒక ఆయుర్వేద మూలిక విస్తృతంగా లభిస్తుందని ఆయుర్వేద విజ్ఞానంతో అనుబంధం ఉన్న వారందరికీ తెలుసు. దీనికి ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఈ ప్రాంత సందర్శకులు దాని గురించిన అవగాహన కూడా పొందగలుగుతారు. అంతే కాదు ఇక్కడ వ్యవసాయం మెరుగు పరిచేందుకు, గిరిజనుల జీవితాలు మెరుగు పరిచేందుకు గల అవకాశాలపై అధ్యయనానికి ఇది ఒక కేంద్రంగా మారుతుందన్న నమ్మకం నాకుంది.

మిత్రులారా,

జాతికి ఎన్నో సేవలందించిన మహోన్నత నాయకులను గుర్తు చేస్తూ గత నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం భారీ ప్రచారోద్యమం నిర్వహించింది. గుజరాత్ ముఖ్యమంత్రి గా పని చేసిన సమయంలో కూడా నాకు అలాంటి విషయాలపై ఎంతో ఆసక్తి ఉండేది. మన ప్రాచీన సంస్కృతి, విలువలను మనతో పాటుగా ముందుకు నడిపించాలి. ఆకాశాన్నంటే సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ భారీ విగ్రహం ఒక్కటే కాదు ఒక ఆధునిక మ్యూజియం కూడా ఆయన స్మారకార్థం ఢిల్లీ లో ఏర్పాటు చేశాం. గాంధీనగర్ లో మహాత్మా మందిర్, దండి కుటీర్, భాబాసాహెబ్ భీమ్ రావు అంబేద్కర్ పంచతీర్థ, హర్యానా లో వ్యవసాయ నాయకుడు సర్ ఛోటూ రామ్ పొడవైన విగ్రహం, మండవి లో స్వతంత్ర యోధుల స్మారక చిహ్నం, గుజరాత్ పుత్రుడైన శివంజీ కృష్ణ వర్మ, గిరిజన నాయకుడు వీర్ నాయక్ గోవింద్ గురు స్మారకాలు కూడా ఏర్పాటు చేశాం.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియం, ఛత్రపతి శివాజీ మహరాజ్ భారీ విగ్రహం, స్వాతంత్రోద్యమం లో పాల్గొన్న గిరిజన నాయకుల స్మారకార్ధం ఒక చిహ్నం, బాబా సాహెబ్ రాజ్యాంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం నిర్వహణ, నేతాజీ పేరిట జాతీయ అవార్డు నెలకొల్పడం వంటి ఆలోచనలు కూడా ఎన్నో ఉన్నాయి. కాని కొందరు వీటన్నింటినీ రాజకీయ దుర్భిణి లో నుండి చూడడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

సర్దార్ పటేల్ సహా జాతీయ నాయకులను కొనియాడుతున్నందుకు మాపై ఎందుకు విమర్శలు వస్తున్నాయో నాకు తెలియదు. మేం ఏదో చేయరాని నేరం చేస్తున్నామనే భావన కలిగేలా వారు ప్రచారం సాగిస్తున్నారు. మిమ్మల్నందర్నీ ఒకటే అడుగుతున్నాను, జాతికి మహోన్నత సేవలందించిన మహానాయకులను గుర్తు చేసుకోవడం నేరమా?

మిత్రులారా, దేశం లోని ప్రతీ ఒక్క పౌరుడు సర్దార్ పటేల్ కఠోర శ్రమ, సామర్థ్యాలు, ముందుచూపును ముందుకు నడిపేలా చూడాలన్నదే మా ప్రయత్నం.

సోదరసోదరీమణులారా,

స్వాతంత్రం సిద్ధించడానికి మూడు, నాలుగు నెలల ముందు విఠల్ భాయ్ పటేల్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న సందర్భంగా స్వతంత్ర భారతం లో గ్రామాలు ఎలా ఉండాలన్న అంశంపై తన కలలను సర్దార్ పటేల్ అందరితో పంచుకున్నారు. కళాశాల నిర్మాణ సమయం లో ఆయన ఇలా చెప్పారు. గ్రామాల్లో ఇళ్లని మనం ఒక ప్రణాళిక అంటూ లేకుండా నిర్మిస్తున్నాం. రోడ్లు కూడా ఎలాంటి ఆలోచన చేయకుండానే నిర్మిస్తున్నాం. ఫలితంగా ఇళ్ల ముందు చెత్త పేరుకుపోతోంది అన్నారు. ఆ రోజుల్లోనే ఆయన బహిరంగ మలమూత్ర విసర్జన, చెత్తాచెదారం లేని గ్రామాలు రావాలని ఆకాంక్షించారు. సర్దార్ సాహెబ్ కలను సాకారం చేసే దిశగా దేశం ఈ రోజున పురోగమిస్తోందని చెప్పేందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ రోజున గ్రామాల పారిశుధ్యం 95 శాతానికి చేరింది.

సోదరసోదరీమణులారా,

దేశాన్ని సాధికారం, అప్రమత్తం, సమ్మిళితం చేయాలని సర్దార్ పటేల్ ఎప్పుడూ ఆకాంక్షించే వారు. ఆ కలలను సాకారం చేసే దిశగానే మా ప్రయత్నాలన్నీ సాగుతున్నాయి. దేశంలో ఇళ్లు లేని వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చే దిశగా మేం భగీరథ పథకం చేపట్టాం. స్వాతంత్రం సిద్ధించిన దశాబ్దాల తర్వాత కూడా వెలుగులకు నోచుకోని 18 వేల గ్రామాలకు విద్యుత్ అందచేశాం. సౌభాగ్య యోజన కార్యక్రమం కింద ప్రతీ ఇంటికి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేందుకు ఆహర్నిశలు కృషి చేస్తున్నాం. దేశంలోని ప్రతీ ఒక్క గ్రామానికి రోడ్లు, ఆప్టిక్ ఫైబర్ నెట్ వర్క్, డిజిటల్ అనుసంధానం కల్పించే కృషి త్వరిత గతిన సాగుతోంది. ఈ కార్యక్రమాలకు సమాంతరంగానే ప్రతీ ఒక్క కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం, మరుగుదొడ్ల నిర్మాణం కూడా ముందుకు సాగుతున్నాయి.

ప్రపంచం లోనే అతి భారీ ఆరోగ్య పథకాన్ని మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాని గురించి నేను ప్రజలకి చెప్పినప్పుడు యావత్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ‘ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన’ లేదా ‘ఆయుష్మాన్ భారత్ యోజన’ పేరిట ప్రారంభించిన ఆ కార్యక్రమం అమెరికా, మెక్సికో, కెనడా ల ఉమ్మడి జనాభా కన్నా అధిక జనాభా ఆరోగ్య అవసరాలను తీర్చుతుంది. కొందరు దాన్న మోదీ కేర్ గా వ్యవహరించారు. ఆరోగ్యవంతమైన భారత్ నిర్మాణానికి ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సమ్మిళిత, సాధికార భారత్ ఆవిష్కారం దిశగా “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” మా మంత్రం.

సోదరసోదరీమణులారా,

చిన్నచిన్న రాజ్యాలన్నింటినీ ఏకం చేసి దేశంలో రాజకీయ ఐక్యతకు సర్దార్ సాహెబ్ కృషి చేశారు. ఆ విధంగానే మా ప్రభుత్వం జిఎస్ టి ని ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక ఏకీకరణ తెచ్చేందుకు ప్రయత్నం చేసింది. ఒక జాతి ఒకే పన్ను కలను అది సాకారం చేసింది. సర్దార్ సాహెబ్ దీక్షను ముందుకు నడిపేందుకు మేం అవిరళం శ్రమిస్తూనే ఉన్నాం. వ్యవసాయ మండీలన్నింటినీ అనుసంధానం చేసే ఇ-నామ్, ఒక జాతి-ఒక గ్రిడ్, భారత్ మాల, సేతు భారతం, భారత్ నెట్ పథకాలన్నీ ఆ దిశగా ప్రారంభించినవే. ఈ ప్రాజెక్టులన్నింటితోనూ “ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్” అనే సర్దార్ సాహెబ్ కల సాకారం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం.

మిత్రులారా,

దేశ భవిష్యత్తు గురించి ఎంతో ఆసక్తి గల యువత బలం ఈ రోజున మనకుంది. అభివృద్ధికి మార్గం ఇదొక్కటే, దేశవాసులందరూ ఈ మార్గంలోనే ముందుకుసాగాలి. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం కాపాడవలసిన బాధ్యత మనందరిపై వదిలారు. దేశాన్ని విభజించే ప్రయత్నాలన్నింటినీ బలంగా తిప్పి కొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మనందరం సదా అప్రమత్తులపై సమాజ ఐక్యతను కాపాడాలి. సర్దార్ సాహెబ్ బోధించిన విలువల నుంచి భవిష్యత్ తరాలను దూరం చేసే ప్రయత్నాలేవైనా తిప్పి కొట్టడంలో ఎలాంటి అవకాశాన్ని వదులుకునేది లేదని మనందరం ప్రతిజ్ఞ చేయాలి.

మిత్రులారా,

ప్రతీ ఒక్క భారతీయుడు కులం, వర్గం వంటివన్నీ మరిచిపోయి భారతీయులం అనేది ఒక్కటే గుర్తుంచుకోవాలి, దేశం మీద హక్కులతో పాటు వారిపై ఎన్నో విధులు కూడా ఉన్నాయి అని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చెబుతూ ఉండేవారు. ఈ భారీ విగ్రహం వలెనే సర్దార్ సాహెబ్ అద్భుతమైన ఆలోచనలన్నీ కూడా మనలో స్ఫూర్తిని నింపుతూ ఉండాలి. ఈ ఐక్యతా విగ్రహం ప్రపంచం యావత్తుకు ఒక అద్భుతంగా నిలిచింది. అందుకే అందరి దృష్టి ఇప్పుడు ఈ పవిత్ర నర్మదా మాత తీరం పైనే కేంద్రీకృతమై ఉంది. ఈ కల సాకారం చేయడం కోసం నిరంతరం శ్రమించిన, ఈ ప్రాజెక్టు తో అనుబంధం కలిగి ఉన్న ప్రతీ ఒక్కరినీ నేను అభినందిస్తున్నాను. నర్మద, తపతి చరియల్లో నివశిస్తున్న ప్రతీ ఒక్క సోదరి, సోదరుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని నేను అభినందనలు తెలియ చేస్తున్నాను.

ఈ కార్యక్రమం తో జాతి మొత్తం అనుబంధం కలిగి ఉంది. ప్రపంచ ప్రజలందరూ కూడా దీనితో అనుబంధం కలిగి ఉన్నారు. ఐక్యతా మంత్రాన్ని మరింత ముందుకు నడపాలన్న ఉద్వేగం, ఆకాంక్షల తోనే ఈ ఐక్యతా యాత్రను నేను ప్రారంభించాను. స్ఫూర్తికి కేంద్ర స్థానమైన ఈ ప్రదేశం తోనే మనందరం ఐక్యతా స్ఫూర్తి పొందగలుగుతాం. ఇదే భావన తో మనందరం ముందుకు నడుస్తూ అందరినీ మనతో కలిసి నడిచేలా చేస్తూ ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ కల సాకారం చేసే ప్రయత్నం సాగించాలి.

నాతో కలిసి చెప్పండి –

సర్దార్ పటేల్ – జైహో!

సర్దార్ పటేల్ – జైహో!

సర్దార్ పటేల్ – జైహో!

దేశ ఐక్యతను కొనియాడుదాం!

దేశ ఐక్యతను కొనియాడుదాం!

దేశ ఐక్యతను కొనియాడుదాం!

దేశ ఐక్యతను కొనియాడుదాం!

దేశ ఐక్యతను కొనియాడుదాం!

ధన్యవాదాలు.