ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ గుజరాత్ లోథాల్లో నేషనల్ మారిటైం హెరిటేజ్ కాంప్లెక్స్ (ఎన్ఎంహెచ్సీ) అభివృద్ధికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయనున్నారు.
మాస్టర్ ప్రణాళిక ప్రకారం స్వచ్ఛంద సంస్థలు, విరాళాల ద్వారా నిధులు సమీకరించిన తర్వాత 1బీ దశ, రెండో దశలను పూర్తి చేసేందుకు కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది.
1బీ దశ కింద లైట్ హౌస్ మ్యూజియం నిర్మాణానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ లైట్ హౌసెస్ అండ్ లైట్‌షిప్స్(డీజీఎల్‌ఎల్) నిధులు సమకూర్చనుంది.
భవిష్యత్ ఎన్‌ఎంహెచ్‌సీకి సంబంధించిన దశల అభివృద్ధి, నిర్వహణ కోసం సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం, 1860 ప్రకారం ఓడరేవులు, సరుకు రవాణా, జలమార్గాల మంత్రి నేతృత్వంలోని పాలక మండలి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనున్నారు.
ఇప్పటికే 1ఏ దశ పనులు 60 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఈ దశ పనులు 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు 1ఏ, 1బీ దశలను ఈపీసీ విధానంలో, రెండో దశను ల్యాండ్ సబ్ లీజింగ్/పీపీపీ ద్వారా చేపట్టనున్నారు. ఎన్ఎంహెచ్సీని ప్రపంచస్థాయి వారసత్వ మ్యూజియంగా అభివృద్ధి చేయనున్నారు.
ఉపాధి కల్పన సామర్థ్యం:
ఎన్ఎంహెచ్సీ ప్రాజెక్టు అభివృద్ధిలో 22వేల మందికి ప్రత్యక్షంగా, 7వేల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది.
లబ్ధిదారుల సంఖ్య:
ఎన్ఎంహెచ్సీ నిర్మాణం ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. స్థానిక ప్రజలు, పర్యాటకులు, సందర్శకులు, పరిశోధకులు, స్కాలర్లు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, సాంస్కృతిక సంస్థలు.. పర్యావరణం, సంరక్షణ సమూహాలు, వ్యాపారులకు ఎంతో సహాయపడుతుంది.
నేపథ్యం:
దేశ 4,500 సంవత్సరాల పురాతన సముద్ర వారసత్వాన్ని ప్రదర్శించడానికి ప్రధాన మంత్రి విజన్ ప్రకారం ఓడరేవులు, సరుకురవాణా, జలమార్గ మంత్రిత్వ శాఖ (ఎంఓపీఎస్‌డబ్ల్యూ) లోథాల్ వద్ద ప్రపంచ స్థాయి ఎన్ఎంహెచ్సీ ని ఏర్పాటు చేస్తోంది.
ఎన్ఎంహెచ్సీ మాస్టర్ ప్రణాళికను ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ సంస్థ మెసర్స్ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ రూపొందించగా.. 1ఏ దశ నిర్మాణాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్‌కు అప్పగించారు.
ఎన్ఎంహెచ్సీని వివిధ దశల్లో అభివృద్ధి చేయాలని ప్రణాళిక వేశారు. వీటిలో
* 1ఏ దశలో 6 గ్యాలరీలతో ఎన్ఎంహెచ్సీ మ్యూజియం ఉండనుంది. ఇందులో బాహ్య నావికా కళాఖండాలు(ఎక్సటర్నల్ నావల్ ఆర్టిఫ్యాక్ట్స్) (ఐఎన్ఎస్ నిశాంక్, సీ హారియర్ యుద్ధ విమానం, యూహెచ్ 3 హెలికాప్టర్ మొదలైనవి)..ఓపెన్ అక్వాటిక్ గ్యాలరీ, జెట్టీ నడకదారితో కూడిన లోథాల్ టౌన్షిప్ ప్రతిరూప నమూనా ఉండనున్నాయి.
* 1బీ దశలో మరో 8 గ్యాలరీలతో ఎన్ఎంహెచ్సీ మ్యూజియం, ప్రపంచంలోనే ఎత్తైన లైట్‌హౌజ్ మ్యూజియం, బాగీచా కాంప్లెక్స్ (సుమారు 1500 కార్ల పార్కింగ్ సదుపాయం, ఫుడ్ హాల్, మెడికల్ సెంటర్ మొదలైనవి) ఉండనున్నాయి.
* రెండో దశలో కోస్టల్ స్టేట్స్ పెవిలియన్స్ (ఆయా తీరప్రాంత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు అభివృద్ధి చేయనున్నాయి), ఆతిథ్య జోన్ (మారిటైమ్ థీమ్ ఎకో రిసార్ట్ అండ్ మ్యూజ్యూటెల్స్), లోథాల్ నగరం ప్రత్యక్ష అనుభవాన్ని పొందే ఏర్పాటు, మారిటైమ్ ఇనిస్టిట్యూట్ అండ్ హాస్టల్, 4 థీమ్ పార్కులు (మారిటైమ్ థీమ్ పార్కు, నావికా దళం థీమ్ పార్కు, వాతావరణ మార్పు థీమ్ పార్కు,, స్మారక చిహ్నాల పార్కు, అడ్వెంచర్ అండ్ అమ్యూజ్మెంట్ పార్కు) ఉంటాయి.
***