Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్‌లోని న‌వ్‌సారిలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

గుజరాత్‌లోని న‌వ్‌సారిలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గుజరాత్‌లోని న‌వ్‌సారిలో ప‌లు అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో హాజరైన తల్లులు, సోదరీమణులు, కుమార్తెల  ప్రేమ, ఆప్యాయత, ఆశీర్వాదాలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రత్యేకమైన రోజున దేశంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహా కుంభమేళాలో గంగా మాత ఆశీస్సులు పొందానని, ఈ రోజు మాతృశక్తి మహా‌ కుంభమేళాలో ఆశీర్వాదం పొందానని ఆయన తెలిపారు. ఈ రోజు గుజరాత్‌లో జీ-సఫాల్ (జీవనోపాధిని పెంపొందించడానికి అంత్యోదయ కుటుంబాల కోసం గుజరాత్ పథకం), జీ-మైత్రి (గ్రామీణ ఆదాయాన్ని పెంచేందుకు ప్రజలకు గుజరాత్ అందించే మెంటార్‌షిప్ అండ్ యాక్సిలరేషన్) అనే రెండు పథకాలను ప్రారంభించిన విషయాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. వివిధ పథకాల నిధులను నేరుగా మహిళల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశామని, ఈ విషయంలో ప్రతిఒక్కరిని  అభినందిస్తున్నట్లు తెలిపారు.

ఈ రోజు మహిళలకు అంకితమని అన్న ఆయన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. తాను డబ్బు పరంగా కాకుండా కోట్లాది మంది తల్లులు, సోదరీమణులు, కుమార్తెల ఆశీస్సుల వల్ల ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా భావిస్తున్నానని సగర్వంగా పేర్కొన్నారు. “ఈ ఆశీర్వాదాలు నాకు గొప్ప బలం, సంపద, రక్షణ కవచం” అని ఆయన ప్రధానంగా అన్నారు.

మహిళలను గౌరవించే ప్రాముఖ్యతను ప్రస్తావించిన ప్రధాని ఇది సమాజం, దేశం అభివృద్ధికి ఇదే మొదటి అడుగు అని అన్నారు. “దేశం వేగవంతంగా పురోగతి చెందేందుకు భారత్ ఇప్పుడు మహిళల నేతృత్వంలోని అభివృద్ధి మార్గంలో నడుస్తోంది” అని పేర్కొన్నారు. మహిళల జీవితాల్లో గౌరవం, సౌలభ్యం.. ఈ రెండింటికీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. మరుగుదొడ్ల నిర్మాణం గురించి మాట్లాడిన ఆయన వాటిని ‘ఇజ్జత్ ఘర్’ లేదా ‘డిగ్నిటీ హౌస్‌లు’గా అభివర్ణించారు. ఇవి కోట్లాది మంది మహిళల గౌరవాన్ని పెంచినట్లు తెలిపారు. మహిళలకు కోట్లాది బ్యాంకు ఖాతాలు తెరవడం, వారిని బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావటం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. వంట విషయంలో పొగ కష్టాల నుంచి మహిళలను కాపాడేందుకు ఉజ్వల సిలిండర్లను అందించటం గురించి కూడా మాట్లాడారు. పనిచేసే మహిళల ప్రసూతి సెలవులను ప్రభుత్వం 12 వారాల నుంచి 26 వారాలకు పెంచిందని ఆయన పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం చేయాలనే ముస్లిం సోదరీమణుల డిమాండ్‌ను ప్రభుత్వం గుర్తించి.. లక్షలాది ముస్లిం సోదరీమణుల ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని రూపొందించిందని వివరించారు. జమ్ముాకశ్మీర్‌లో ఆర్టికల్ 370 అమల్లో ఉన్నప్పుడు మహిళలు అనేక హక్కులను కోల్పోయారని గుర్తు చేసిన ఆయన.. రాష్ట్రం వెలుపల ఎవరినైనా పెళ్లి చేసుకుంటే పూర్వీకుల ఆస్తిపై హక్కును కోల్పోయేవారని, ఆర్టికల్ 370 రద్దుతో జమ్ముకశ్మీర్ మహిళలు ఇప్పుడు తమ హక్కులను పొందుతున్నారని వ్యాఖ్యానించారు.

సమాజంలోని వివిధ స్థాయిల్లో.. ప్రభుత్వంలో, పెద్ద సంస్థల్లో మహిళలకు పెరుగుతున్న అవకాశాలను ప్రధానంగా ప్రస్తావించిన మోదీ.. “రాజకీయాలు, క్రీడలు, న్యాయవ్యవస్థ లేదా పోలీసు.. ఇలా ప్రతి రంగంలో మహిళలు రాణిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. 2014 నుంచి కీలక పదవుల్లో మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం అత్యధిక సంఖ్యలో మహిళా మంత్రులను చూసిందని, పార్లమెంటులో మహిళల ఉనికి కూడా పెరిగిందని తెలిపారు. 2019లో 78 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారని, 18వ లోక్‌సభలో 74 మంది మహిళా ఎంపీలు సభలో ఉన్నారని తెలిపారు. న్యాయవ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోందని, జిల్లా కోర్టుల్లో వారి సంఖ్య 35 శాతానికి పైగా ఉందన్నారు. పలు రాష్ట్రాల్లో సివిల్ న్యాయమూర్తులుగా కొత్తగా నియమితులైన వారిలో 50 శాతానికి పైగా మహిళలే ఉన్నారని, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద అంకుర వ్యవస్థను కలిగిన భారత్‌లో దాదాపు సగానికి పైగా అంకురాల్లో నాయకత్వ స్థానాల్లో మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. ప్రధాన అంతరిక్ష యాత్రలకు నాయకత్వం వహించిన మహిళా శాస్త్రవేత్తల గణనీయమైన కృషిని ఆయన ప్రస్తావించారు. ప్రపంచంలోనే అత్యధిక మంది మహిళా పైలట్లు భారత్‌లో ఉండటం గర్వకారణమన్నారు. మహిళా పోలీసు అధికారులు, అధికారులు భద్రతా ఏర్పాట్లలో ఉన్న ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మహిళల పాత్రను గుర్తించారు. స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలతో తాను అంతకు ముందు జరిపిన సంభాషణను పంచుకున్నారు. వారి ఉత్సాహం, ఆత్మవిశ్వాసం భారత మహిళల బలానికి నిదర్శనమని పేర్కొన్నారు. వికసిత్ ‌భారత్ సంకల్పం నెరవేరుతుందని, ఈ లక్ష్యసాధనలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారని ఆయన పునరుద్ఘాటించారు.

మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి గుజరాత్ ఒక ప్రధాన ఉదాహరణ అని అన్న ప్రధాని… మహిళల బలం, కృషితో తయారై విజయవంతమైన సహకార నమూనాను రాష్ట్రం దేశానికి అందించిందని తెలిపారు. అమూల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపును, గుజరాత్ గ్రామాలకు చెందిన లక్షలాది మంది మహిళలు పాల ఉత్పత్తిని ఒక విప్లవంగా మార్చిన తీరును ప్రధానంగా తెలిపారు. గుజరాతీ మహిళలు తమను తాము ఆర్థికంగా బలోపేతం చేసుకోవడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారని అన్నారు. గుజరాతీ మహిళలు ప్రారంభించిన లిజ్జత్ పాపడ్ ఇప్పుడు వందల కోట్ల బ్రాండ్‌గా మారినట్లు పేర్కొన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా తాను ఉన్న కాలాన్ని గుర్తు చేసుకున్న మోదీ.. మహిళలు, బాలికల సంక్షేమం కోసం చిరంజీవి యోజన, బేటీ బచావో అభియాన్, మమతా దివస్, కన్యా కేలవానీ రథయాత్ర, కున్వర్బాయి ను మమేరు, సాత్ ఫెరా సముహ్ లగ్న యోజన, అభయం హెల్ప్‌లైన వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు. సరైన విధానాల ద్వారా మహిళల శక్తిని ఎలా పెంచవచ్చో గుజరాత్ యావత్ దేశానికి చాటి చెప్పిందని అన్నారు. పాడిపరిశ్రమ పనుల్లో నిమగ్నమైన మహిళల ఖాతాలకు నేరుగా నిధులను బదిలీ చేయడం గుజరాత్‌లో ప్రారంభమై ఇప్పుడు దేశవ్యాప్తంగా లక్షలాది మంది లబ్ధిదారులకు విస్తరించినట్లు పేర్కొన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా వేల కోట్ల రూపాయల కుంభకోణాలను అరికట్టి పేదలకు సాయం అందించడానికి వీలు కలిగిందని అన్నారు.

భుజ్ భూకంపం తర్వాత పునర్నిర్మాణం సమయంలో మహిళలకు వారి పేరిట ఇళ్లను అందించడం ద్వారా సాధికారత కల్పించడంలో ప్రభుత్వం చేసిన కృషిని ప్రస్తావించిన మోదీ.. పీఎం-ఆవాస్ యోజనలో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నామని, 2014 నుంచి దాదాపు 3 కోట్ల మంది మహిళలు ఇంటి యజమానులయ్యారని తెలిపారు. దేశవ్యాప్తంగా గ్రామాలకు నీరందించిన జల్ జీవన్ మిషన్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడంపై గురించి కూడా మాట్లాడారు. గత ఐదేళ్లలో వేలాది గ్రామాల్లోని 15.5 కోట్ల ఇళ్లకు పైపుల ద్వారా నీరు చేరిందని, ఈ మిషన్ విజయవంతం కావడంలో మహిళా జల కమిటీల పాత్ర ఎంతో ఉందన్నారు. ఈ నమూనా గుజరాత్‌లో ఆవిర్భవించిందని ఇప్పుడది దేశవ్యాప్తంగా నీటి సంక్షోభాన్ని పరిష్కరిస్తోందని వివరించారు.

నీటి ఎద్దడి సమస్య గురించి మాట్లాడుతూ నీటి సంరక్షణ ప్రాముఖ్యత గురించి ప్రధానంగా ప్రస్తావించారు. కేంద్ర జల్ శక్తి మంత్రి శ్రీ సీ.ఆర్.పాటిల్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా “వాననీటిని ఒడిసి పట్టండి” అనే కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. వర్షపు నీరు పడే చోటనే సంరక్షించడం ద్వారా వృథాగా వెళ్లకుండా నిరోధించడానికి ఉద్దేశించినది ఇది. వర్షపు నీటిని పొదుపు చేసేందుకు చెరువులు, చెక్ డ్యాంలు, బోరుబావులను  పునరుద్ధరించటం, సామాజిక ఇంకుడు గుంతలు సహా 5 వేలకు పైగా ప్రాజెక్టులను పూర్తి చేసిన న‌వ్‌సారి మహిళల కృషిని కొనియాడారు. న‌వ్‌సారిలో ఇప్పటికీ వందలాది నీటి సంరక్షణ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని, ఒకే రోజులో 1,000 ఇంకుడు గుంతలను నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. వర్షపునీటి సంరక్షణ, నీటి సంరక్షణ విషయంలో గుజరాత్‌లోని ప్రముఖ జిల్లాలలో న‌వ్‌సారి జిల్లా ఒకటి అని అన్న ఆయన.. వీటికి సంబంధించి సాధించిన విజయాలకు గాను నవసారి తల్లులు, సోదరీమణులు, కుమార్తెలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

“గుజరాత్ మహిళల బలం, వారి సహకారం ఒక్క రంగానికే మాత్రమే పరిమితం కాలేదు” అని తెలిపిన ఆయన.. గుజరాత్ పంచాయితీ ఎన్నికలలో 50% సీట్లు మహిళలకు రిజర్వ్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రధానిగా తనను దిల్లీకి పంపినప్పుడు అదే అనుభవాన్ని, నిబద్ధతను దేశ వ్యాప్తంగా తీసుకొచ్చినట్లు తెలిపారు. కొత్త పార్లమెంటులో ఆమోదం పొందిన మొదటి బిల్లు మహిళా సాధికారతకు ఉద్దేశించినదేనని, దీనిని నారీ శక్తి వందన్ అధినియం అని పిలుస్తున్నామని, ఈ బిల్లును సాధారణ గిరిజన నేపథ్యం నుంచి వచ్చిన రాష్ట్రపతి ఆమోదించారని సగర్వంగా పేర్కొన్నారు. ఇక్కడ హాజరైన మహిళల్లో ఒకరు ఎంపీ లేదా ఎమ్మెల్యే అయి వేదికపై కూర్చునే రోజు ఎంతో దూరంలో లేదని విశ్వసం వ్యక్తం చేశారు.

భారతదేశం ఆత్మ గ్రామీణ భారతంలో ఉందన్న మహాత్మా గాంధీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ “గ్రామీణ మహిళల సాధికారతలోనే గ్రామీణ భారత ఆత్మ దాగి ఉంది” అని అన్నారు. మహిళల హక్కులు, అవకాశాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని, ఈ ఆర్థిక పురోగతికి లక్షలాది మహిళలు పునాదులు వేశారన్నారు. ఈ ఘనత సాధించటంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మహిళా స్వయం సహాయక సంఘాల పాత్ర గణనీయమైనదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా 10 కోట్లకు పైగా మహిళలు 90 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలను నడుపుతున్నారని, ఒక్క గుజరాత్‌లోనే 3 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ లక్షలాది మహిళల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని..వారిని “లాఖ్ పతి  దీదీలు” చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే 1.5 కోట్ల మంది మహిళలు ‘లాఖ్ పతి దీదీలు’గా మారారని, వచ్చే ఐదేళ్లలో మొత్తం 3 కోట్ల మంది మహిళలను ‘లాఖ్ పతి దీదీ’లుగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

ఒక సోదరి “లాఖ్ పతి దీదీ”గా మారినప్పుడు మొత్తం కుటుంబం రాత మారుతుందని అన్న మోదీ.. మహిళలు తమ పనిలో ఇతర గ్రామీణ మహిళలను భాగస్వాములను చేస్తారని, క్రమంగా ఇంటి ఆధారిత పనిని ఆర్థిక ఉద్యమంగా మారుస్తారని అభిప్రాయపడ్డారు. స్వయం సహాయక సంఘాల సామర్థ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం గత దశాబ్దంలో వాటికి సంబంధించిన బడ్జెట్‌ను ఐదు రెట్లు పెంచిందని,  ఈ స్వయం సహాయక బృందాలకు రూ.20 లక్షల వరకు పూచీకత్తు లేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు కొత్త నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు, కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానం చేసేందుకు అవకాశాలు కల్పిస్తున్నారు.

దేశంలోని మహిళలు ప్రతి అనుమానాన్ని, భయాన్ని అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారన్నారు.  ‘డ్రోన్ దీదీ’ పథకాన్ని ప్రారంభించినప్పుడు డ్రోన్ల వంటి ఆధునిక సాంకేతికతను గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించటంపై చాలా మందికి సందేహాలు ఉండేవన్నారు. అయితే సోదరీమణులు, కుమార్తెల ప్రతిభ, అంకితభావంపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. నేడు ‘నమో డ్రోన్ దీదీ’ కార్యక్రమం వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కొత్త విప్లవాన్ని తీసుకువస్తోందని.. ఈ మార్పునకు నాయకత్వం వహిస్తోన్న మహిళలకు మంచి ఆదాయాన్ని అందిస్తోందని ఆయన అన్నారు. ‘బ్యాంక్ సఖి’, ‘బీమా సఖి’ వంటి పథకాలు గ్రామాల్లో మహిళలకు కొత్త అవకాశాలను కల్పించినట్లు పేర్కొన్నారు. గ్రామీణ మహిళల సాధికారత కోసం లక్షలాది మహిళలను అనుసంధానిస్తూ, వారి ఆదాయాన్ని పెంచుతూ ‘కృషి సఖి’, ‘పశు సఖి’ వంటి కార్యక్రమాలను ప్రారంభించారని,  ప్రభుత్వ చర్యల వల్ల గుజరాత్‌లో వీలైనంత ఎక్కువ మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చాలని అన్నారు. మరో 10 లక్షల మంది మహిళలను “లాఖ్ పతి దీదీలు” గా మార్చే కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, గుజరాత్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా అభినందించారు.

ప్రధాన మంత్రిగా ఎర్రకోట నుంచి చేసిన తన మొదటి ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలను పునరుద్ఘాటించిన మోదీ.. మహిళలపై నేరాలను నిరోధించడానికి, మెరుగైన సమాజాన్ని నిర్మించడానికి కుమార్తెలను మాత్రమే కాకుండా కుమారులకు కూడా దిశానిర్దేశం చేయాల్సిన ప్రాముఖ్యతను ప్రధానంగా చెప్పారు. గత దశాబ్దకాలంగా ప్రభుత్వం మహిళల భద్రతకు పెద్దపీట వేసిందని, వారిపై నేరాలను నిరోధించేందుకు చట్టాలను కఠినతరం చేస్తోందన్నారు. మహిళలపై తీవ్రమైన నేరాలకు సత్వర న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని, దేశవ్యాప్తంగా 800 కోర్టుల ఏర్పాటుకు ఆమోదం లభించిందని, వీటిలో చాలా వరకు ప్రస్తుతం పనిచేస్తున్నాయని వివరించారు. అత్యాచారం, పోక్సోకు సంబంధించిన సుమారు మూడు లక్షల కేసుల పరిష్కారాన్ని ఈ కోర్టులు వేగవంతం చేశాయి. అత్యాచారం వంటి హేయమైన నేరాలకు మరణశిక్ష విధించే నిబంధనను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆయన పునరుద్ధాటించారు. 24 గంటలూ పనిచేసే మహిళా హెల్ప్ లైన్‌ను బలోపేతం చేయడం, మహిళల కోసం ఒకే దగ్గర అన్నీ లభించే కేంద్రాలను ఏర్పాటు చేయటం గురించి మాట్లాడారు. ప్రస్తుతం ఇలాంటి కేంద్రాలు దేశవ్యాప్తంగా 800 పనిచేస్తున్నాయని, 10 లక్షల మంది మహిళలకు సహాయం అందిస్తున్నాయని వివరించారు.

వలసవాద చట్టాలను తుడిచివేస్తూ కొత్తగా అమలు చేసిన భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) మహిళల భద్రతకు సంబంధించిన నిబంధనలను మరింత బలోపేతం చేసిందని.. మహిళలు, పిల్లలపై నేరాలను పరిష్కరించడానికి ప్రత్యేక అధ్యాయాన్ని జోడించిందని ప్రధానంగా చెప్పారు. బాధితులకు న్యాయం అందటంలో తరచూ జాప్యం జరుగుతోందన్న ఆవేదనలో నిజం ఉందన్న ఆయన.. ఈ సమస్యలను పరిష్కరించడానికి భారతీయ శిక్షాస్మృతి ప్రకారం అత్యాచారం వంటి ఘోరమైన నేరాలకు 60 రోజుల్లో అభియోగాలు నమోదు చేసి, 45 రోజుల్లో తీర్పు వెలువరించాలనే నిబంధన ఉన్నట్లు వివరించారు. కొత్త చట్టాల వల్ల ఎక్కడి నుంచైనా ఈ-ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేసే వెసులుబాటు కలుగుతుందని, దీంతో పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవడం సులభమవుతుందని అన్నారు. ఏ మహిళ అయినా అఘాయిత్యాలకు గురైతే జీరో ఎఫ్ఐఆర్ నిబంధన ప్రకారం ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేయొచ్చు. అంతేకాకుండా అత్యాచార బాధితుల వాంగ్మూలాలను ఆడియో-వీడియో మార్గాల ద్వారా పోలీసులు నమోదు చేయొచ్చని, దీనికి చట్టబద్ధ గుర్తింపు ఉందని ఆయన పేర్కొన్నారు. బాధితులకు గణనీయమైన మద్ధతు దొరికేలా వైద్యులు మెడికల్ రిపోర్టులు పంపే సమయాన్ని 7 రోజులుగా నిర్ణయించినట్లు తెలిపారు.

బీఎన్‌ఎస్‌లోని కొత్త నిబంధనలు ఇప్పటికే ఫలితాలను ఇస్తున్నాయని ప్రధానంగా చెప్పిన మోదీ.. గత అక్టోబర్‌లో సూరత్ జిల్లాలో జరిగిన ఒక విషాద సంఘటనను గుర్తు చేశారు. అక్కడ సామూహిక అత్యాచారం కేసులో 15 రోజుల్లో అభియోగాలు మోపి, కొన్ని వారాల్లోనే దోషులకు జీవిత ఖైదు విధించినట్లు తెలిపారు. బీఎన్ఎస్ అమలుతో దేశవ్యాప్తంగా మహిళలపై నేరాల విచారణ వేగవంతమైనట్లు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఓ మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిందని, చార్జిషీట్ దాఖలు చేసిన 30 రోజుల్లోనే బీఎన్‌ఎస్ కింద తొలి దోషిగా నిర్ధారణ అయినట్లు తెలిపారు. కోల్‌కతాలో ఏడు నెలల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన దోషికి కోర్టు మరణశిక్ష విధించగా, నేరం జరిగిన 80 రోజుల్లోనే తీర్పు వెలువడింది. బీఎన్ఎస్, ఇతర ప్రభుత్వ నిర్ణయాలు మహిళల భద్రతను ఎలా మెరుగుపరిచాయో, సత్వర న్యాయాన్ని ఎలా నిర్ధారిస్తున్నామో నిరూపించడానికి వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఈ ఉదాహరణలను ప్రధాన మంత్రి ప్రధానంగా పేర్కొన్నారు.

మహిళల కలలకు ఎలాంటి అడ్డంకులు రానివ్వబోమని పునరుద్ఘాటించిన ప్రధాని..ఒక కుమారుడు తన తల్లికి ఎలా సేవ చేస్తాడో ఆలాగే భారతమాతకు, దేశంలోని తల్లులకు, కూతుళ్లకు కూడా సేవ చేస్తున్నానని అన్నారు. ప్రజల కృషి, అంకితభావం, ఆశీస్సులు 2047 నాటికి వికసిత్‌ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి దోహదపడతాయని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేసిన ఆయన.. దేశంలోని ప్రతి తల్లి, సోదరి, కుమార్తెకు మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

గుజరాత్ ముఖ్య‌మంత్రి శ్రీ భూపేంద్ర భాయి ప‌టేల్, కేంద్ర జల్ శక్తి మంత్రి శ్రీ సీఆర్. పాటిల్ ఈ కార్య‌క్ర‌మానికి హాజ రయ్యారు.

నేపథ్యం:

ప్రభుత్వం చేస్తున్న కృషికి మహిళా సాధికారత మూలస్తంభంగా ఉంది. ప్రధాని దార్శనికతకు అనుగుణంగా వారి సర్వతోముఖాభివృద్ధి దిశగా అడుగులు వేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. దీనికి అనుగుణంగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని న‌వ్‌సారి జిల్లాలోని వంశీ బోర్సీ గ్రామంలో జరిగిన లాఖ్ పతి దీదీ కార్యక్రమంలో ప్రధాని పాల్గొని లాఖ్ పతి దీదీలతో ముచ్చటించారు. 5 గురు లక్షాధికారులైన మహిళలను లాఖ్ పతి దీదీ ధ్రువీకరణ పత్రాలతో సత్కరించారు.

గ్రామీణ జీవనోపాధికి అనువైన వాతావరణాన్ని సృష్టించడానికి కృషి చేస్తున్న అంకురాలకు జీ-మైత్రి పథకం ఆర్థిక సహాయం, సవాళ్లను అధిగమించేందుకు కావాల్సిన మద్దతును అందిస్తుంది.

గుజరాత్‌లోని రెండు ఆకాంక్షిత జిల్లాలు, పదమూడు ఆకాంక్షిత బ్లాక్‌లలో అంత్యోదయ కుటుంబాలకు చెందిన స్వయం సహాయక బృంద మహిళలకు జీ-సఫల్ ఆర్థిక సహాయం, వ్యవస్థాపకతకు సంబంధించిన శిక్షణను అందిస్తుంది.