కార్యకర్త: సర్… మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడాలన్న నా కల ఈ రోజు నెరవేరింది.
ప్రధానమంత్రి: మంచిది… అంటే- మీరిప్పుడు నిద్రపోతున్నారన్న మాట.
కార్యకర్త: లేదు సర్… మిమ్మల్ని చూస్తుంటే ఓ గొప్ప కథానాయకుడిని కలిసిన అనుభూతి కలుగుతోంది.
కార్యకర్త: ఇక్కడకు వచ్చి, అన్ని సాయుధ దళాలనూ చూడాలన్నది నాకు అతిపెద్ద కల. ముఖ్యంగా మిమ్మల్ని నేరుగా చూడటం కోసమే నేనొచ్చాను.
ప్రధానమంత్రి: మంచిది… మంచిది..
కార్యకర్త: మీతో ముఖాముఖి మాట్లాడుతున్నాను కానీ, ఇప్పటికీ నా కళ్లను నేనే నమ్మలేకపోతున్నాను!
ప్రధానమంత్రి: మరేమనుకున్నారు… భారత ప్రజాస్వామ్య శక్తికి నిదర్శనమిదే.
కార్యకర్త: మీకు చాలాచాలా ధన్యవాదాలు సర్!
ప్రధానమంత్రి: మిమ్మల్ని మీరు మరొక రాష్ట్ర మిత్రుడికి పరిచయం చేసుకుని, ఆ రాష్ట్రం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించి ఉంటారు. అలాగే వారి భాషలో కొన్ని వాక్యాలు మాట్లాడటం కూడా నేర్చుకుని ఉంటారు. ఇక్కడున్నవారిలో అలాంటి వ్యక్తులెవరు?
కార్యకర్త: సర్… మేము పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినవారితో కూర్చున్నాం. నేను వారి నుంచి కొంత తెలుసుకునే ప్రయత్నం చేశాను. మేము అన్నం తింటుండగా దాని గురించి మాట్లాడుతూ వారిలో ఒకరు ‘ఎక్టో ఎక్టో భాత్ ఖావే’ అన్నారు.
ప్రధానమంత్రి: అందరూ అన్నం తినాలి. తానూ తినాలని అతడు చెప్పాడా?
కార్యకర్త: ఖాబో
ప్రధానమంత్రి: తినాలి.
కార్యకర్త: సర్… జొల్ ఖాబో, ఇంకా ఏమున్నాయక్కడ? తొ అమి కేమో నాచో అమి భాలో అచి (ద్వితీయ భాష)
కార్యకర్త: సర్.. నేను ముంగేర్ నుంచి వచ్చాను… అక్కడి ప్రజలందరి తరఫున మీకు నా అభివందనం.
ప్రధానమంత్రి: ముంగేర్‌కు నా నమస్కారాలు… యోగాకు నెలవుగా ఆ నేల అంతర్జాతీయ ప్రాచుర్యం పొందింది.
కార్యకర్త: అవునవును సర్.
ప్రధానమంత్రి: అయితే, మీరిక్కడి అందరికీ యోగా గురువయ్యారన్న మాట!
కార్యకర్త: అంటే- నేను ప్రతి ఒక్కరికీ భాగస్వామిని కాలేను సర్. అయితే, మా బృందంలోని వారితో కలసి, కొన్ని జట్లలో భాగం కాగలను.
ప్రధానమంత్రి: యావత్ ప్రపంచం నేడు యోగాతో అనుసంధానం అవుతోంది.
కార్యకర్త: నిజమే సర్.
ప్రధానమంత్రి: అవును.
కార్యకర్త: సర్… మేము నిన్న నేషనల్ స్టేడియం శిబిరంలో మీ కోసం రాసిన ఈ రెండు పంక్తులు వినండి… “జయహో, జయహో భరతమాత, జయహో భారత ప్రజానీకం… జయహో రెపరెపలాడే నవ పతాకం… జయహో, జయహో, జయహో ఉగ్రవాద భయానికి తావులేదు… శత్రు సంహారం సాగాలి… అందరి హృదయాల్లో ప్రేమ, నమ్రత పరిఢవిల్లాలి. జయహో, జయహో, జయహో.”
ప్రధానమంత్రి: జయహో!
కార్యకర్త: జయహో, ధన్యవాదాలు సర్.
కార్యకర్త: మీరు ప్రారంభించిన స్వచ్ఛ భారత్ మిషన్, జాతీయ ఆరోగ్య మిషన్ వంటి కార్యక్రమాలు దేశ ప్రగతికి ఎంతగానో తోడ్పడ్డాయి. అలాగే మీరొక అయస్కాంతంలా మా యువతరాన్ని ఆకర్షిస్తారు. అందుకే మిమ్మల్ని కలవాలని అందరూ తహతహలాడతారు. ఇటువంటి వ్యక్తిత్వంగల మీరు మా ప్రధాని కావడం మాకందరికీ గర్వకారణం.
ప్రధానమంత్రి: పరిశుభ్ర భారత్ నిర్మాణానికి మనం అనుసరించాల్సిన సూత్రమేదైనా ఉంటే అదేమిటో చెప్పగలరా?
కార్యకర్త: నేను నవరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్లాను సర్.. ఈ విధంగా మనం ఇతరులకూ స్ఫూర్తినిచ్చేలా ఉండాలి.
ప్రధానమంత్రి: మీరన్నది నిజమే… దేశం పరిశుభ్ర భారత్ కావాలంటే 140 కోట్ల మంది భారతీయులు మురికి, చెత్తకు తావివ్వబోమని ప్రతినబూనాలి. అప్పుడు మురికికి కారకులెవరూ ఉండరు కాబట్టి, భారత్ పరిశుభ్రంగా ఉంటుంది.
కార్యకర్త: జై హింద్ సర్… నా పేరు సుష్మిత రోహిదాష్.. ఒడిశా నుంచి వచ్చాను.
ప్రధానమంత్రి: జగ్ జగన్నాథ్!
కార్యకర్త: జగ్ జగన్నాథ్ సర్.. మీరే నా స్ఫూర్తిప్రదాత. నేను మిమ్మల్నొక మాట అడగాలనుకుంటున్నాను. జీవితంలో విజయం సాధించాలంటే నేనేం చేయాలి… అలాగే విజయానికి వాస్తవ నిర్వచనం ఏమిటి?
ప్రధానమంత్రి: వైఫల్యాన్ని ఎన్నడూ పట్టించుకోరాదు. వైఫల్యాన్ని అంగీకరించడం, దాన్నొక సాకుగా భావించడమంటే విజయానికి శాశ్వతంగా దూరం కావడమే. దాన్నుంచి పాఠం నేర్చినవారే శిఖరాగ్రానికి చేరగలరు. వైఫల్యంతో కుంగిపోరాదు.. అలాంటి అనుభవం నుంచి నేర్చుకునే ఆసక్తిని పెంచుకోవాలి. అలా చేయగలిగినవారే అంతిమంగా ఉన్నత శిఖరాలు అందుకోగలరు.
కార్యకర్త: సర్… నాదొక ప్రశ్న. మీరు రోజుకు కేవలం మూడునాలుగు గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటారని విన్నాను. మరి ఈ వయసులో మీరు అంతటి శక్తి, ఉత్తేజం ఎలా పొందగలుగుతున్నారు?
ప్రధానమంత్రి: ఇది కాస్త కఠినమైన ప్రశ్నే! మీలాంటి యువతను తరచూ కలుసుకోవడం నాకెంతో ఉత్తేజాన్ని, ప్రేరణను ఇస్తుంది. మీ అందర్నీ చూసినపుడు నాకెంతో స్ఫూర్తి కలుగుతుంది. దేశంలోని రైతుల గురించి ఆలోచిస్తే- వారు నిత్యం ఎన్ని గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేస్తారో నాకు అర్థమవుతుంది. అలాగే సైనికులను జ్ఞాపకం చేసుకుంటే- సరిహద్దుల వద్ద గంటలకొద్దీ కాపలా విధులు నిర్వర్తిస్తుండటం గుర్తుకొస్తుంది. ఈ విధంగా దేశంలో ప్రతి ఒక్కరూ చాలా కష్టపడుతుంటారు. మనమంతా వారిని గమనిస్తూ ఆ తరహాలో జీవించడానికి కాస్తయినా యత్నించాలి. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే విశ్రాంతి తీసుకునే, నిద్రించే హక్కు మనకు లేదనిపిస్తుంది. వారంతా ఎంతో కఠినంగా కర్తవ్యం నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా దేశంలోని 140 కోట్లమంది భారతీయులు నాకూ ఒక బాధ్యత అప్పగించారు. సరే… ఇళ్లకు తిరిగి వెళ్లాక తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేవాలని నిర్ణయించుకున్నవారు మీలో ఎందరున్నారు? మీరు ఆ సమయానికి మేలుకోగలరా లేక మేలుకోవాల్సిన అవసరం ఉంటుందా?
కార్యకర్త: నేను మేలుకోవాల్సిన అవసరం ఉంది సర్.
ప్రధానమంత్రి: లేదు… లేదు… ఇప్పుడు ఈలలు వేస్తున్నవారిలో ఎవరైనా కావచ్చు- వారు ఓ ఐదు నిమిషాలు ఆలోచించండి. ఏదేమైనా… తెల్లవారుజామునే నిద్రలేచే అలవాటు జీవితంలో చాలా ఉపయోగకరం. లోగడ నేను కూడా మీలాగా ‘ఎన్‌సిసి’ కేడెట్‌గా ఉన్నాను. శిబిరాలలో పాల్గొనే వేళ తెల్లవారడానికి చాలా ముందే నిద్ర లేవాల్సి ఉండేది. ఆ విధంగా నాకెంతో క్రమశిక్షణ అబ్బింది. అలా ఉదయాన్నే నిద్రలేచే అలవాటు నేటికీ నాకెంతో విలువైన సంపద. దీనివల్ల ప్రపంచం మేల్కొనడానికి ముందే నా పనుల్లో అధికశాతం పూర్తిచేసేస్తాను. కాబట్టి మిత్రులారా! మీరు కూడా పెందలకడనే మేల్కొనడం అలవాటు చేసుకుంటే జీవితాంతం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
కార్యకర్త: సర్… నేనొక విషయం కచ్చితంగా చెప్పాలని భావిస్తున్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ తరహాలో స్వరాజ్యం సృష్టించగల వారెఎవరైనా ఉంటే, అది ఒక్క నరేంద్ర మోదీ మాత్రమే.
ప్రధానమంత్రి: ప్రతి ఒక్కరినుంచీ మనం నేర్చుకోవాల్సిందే. ఆ మేరకు ఛత్రపతి శివాజీ మహారాజును కూడా ఆదర్శంగా తీసుకోవాలి. మరి మీరిక్కడ నేర్చుకున్నదేమిటో చెప్పండి.
కార్యకర్త: వివిధ డైరెక్టరేట్ల నుంచి వచ్చినవారితో స్నేహం పెంచుకోవడం, వారితో సంభాషించడం, మమేకం కావడం వంటివాటి ద్వారా యావద్దేశ సమైక్యతకు ప్రతీక అనిపిస్తుంది.
ప్రధానమంత్రి: సరే… మీరు ఇంట్లో ఉండగా ఎన్నడూ కూరగాయలు తాకి కూడా ఉండకపోవచ్చు. అమ్మతో తరచూ గొడవ పడుతూ ఉండవచ్చు. అయితే, ఇక్కడ మీరు కూరగాయలు తినడం కూడా నేర్చుకోవాలి. సోదరా… ఇక్కడిలా ఉండాలి, అంటే మీ జీవితంలో ఇదొక కొత్త విషయం అన్నమాట!
కార్యకర్త: సర్… నేనిక్కడ ఏ రకంగానైనా సర్దుకుపోవడం నేర్చుకున్నాను.
కార్యకర్త: సర్… సర్, నేను ప్రాథమికంగా కశ్మీర్ పండిట్ కుటుంబ సభ్యుడిని. ఇప్పుడు 9వ తరగతి చదువుతున్నాను. ఇంట్లో నేనెప్పుడూ ఒక్క పని కూడా చేసింది లేదు. ఎందుకంటే- నేను పాఠశాలకు వెళ్ళాలి… తిరిగి వచ్చాక చదువుకోవాలి… ట్యూషన్ వగైరాలకు వెళ్లాలి. అయితే, ఇక్కడికి వచ్చాక మన పనులు మనం చేసుకోవాలనే స్వతంత్ర వైఖరి నేను నేర్చుకున్న అత్యంత ముఖ్యమైన అంశం. నేనిక్కడ అన్ని పనులూ నేర్చుకున్నాను. ఇంటికి వెళ్లగానే ఇకపై నా చదువుసంధ్యలతోపాటు అన్ని పనుల్లో అమ్మకు నా వంతు సాయం చేస్తాను.
ప్రధానమంత్రి: (చమత్కరిస్తూ) అలాగా… నువ్విప్పుడు మాట్లాడిన వీడియో మీ అమ్మకు చేరుతుంది.. నువ్వు కచ్చితంగా దొరికిపోతావ్!
కార్యకర్త: ఇక్కడికి వచ్చాక నేను నేర్చుకున్న మొదటి విషయం- కుటుంబమంటే మనతో నివసించే వారు, బంధుమిత్రులు మాత్రమే కాదు. ఇక్కడి స్నేహితులు, సీనియర్లతో కూడిన ఉమ్మడి కుటుంబం కూడా అని నాకు అర్థమైంది. ఈ వాస్తవాన్ని నేను సదా గుర్తుంచుకుంటాను.
ప్రధానమంత్రి: ఇది ఒకే భారత్… శ్రేష్ఠ భారత్!
కార్యకర్త: అవును సర్.
ప్రధానమంత్రి: సరే… ఇక్కడ ఈ 30 రోజుల తర్వాత గణతంత్ర దినోత్సవ కవాతుకు కొందరు ఎంపికైతే, మరికొందరికి అవకాశం దక్కి ఉండకపోవచ్చు. దీనిపై మీకు ఏదో ఒక భావన కలిగి ఉంటుంది కదా.. మరి మీరేమనుకుంటున్నారు?
కార్యకర్త: సర్… ఎంపిక కావడం లేదా కాకపోవడంతో నిమిత్తం లేదు… అందుకోసం ప్రయత్నించడమే ఒక విజయమని నా భావన.
ప్రధానమంత్రి: నిజంగానే ఇదొక గొప్ప విషయం.. మనం ఎంపికైనా, కాకపోయినా మనవంతు కృషి లోపం లేదు… ‘ఎన్‌సిసి’ అంటే ఇదే!
కార్యకర్త: అవును సర్.
ప్రధానమంత్రి: అయితే, మీకందరికీ యూనిఫాం ధరించడం ఆనందమా లేక సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించడం ఆనందమా?
కార్యకర్తలు: (ముక్తకంఠంతో) రెండూ సర్…
ప్రధానమంత్రి: సరే… మీరంతా ఇక్కడ నెల రోజులున్నారు. కాబట్టి, మీ ఇంట్లోని వారితో, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉంటారు కదా?
కార్యకర్త: అవును సర్.
ప్రధానమంత్రి: అలాగే మిత్రులతోనూ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉంటారు కదా?
కార్యకర్త: అవును సర్.
ప్రధానమంత్రి: సరే… వారంతా మీతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా మాట్లాడటం ఎలా సాధ్యమైందో మీకు తెలుసా? మొదటిది సాంకేతిక పరిజ్ఞానం.. రెండోది డిజిటల్ ఇండియా.. మూడోది వికసిత భారత్. ఇక భారత్ తరహాలో అతి చౌకగా డేటా లభ్యమయ్యే దేశాలు ప్రపంచంలో కొన్ని మాత్రమే. కాబట్టే, నిరుపేదలు కూడా నేడు వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా తమ ఆప్తులతో హాయిగా మాట్లాడగలుగుతున్నారు. అలాగే మీలో ఎందరు డిజిటల్ చెల్లింపుల కోసం ‘యుపిఐ’ని వాడుతున్నారు? అద్భుతం.. నవతరం నేడు జేబులో నగదుతో కాకుండా మొబైల్ ఫోన్‌తో బయటకు వెళ్తున్నది. అదలా ఉంచితే- ‘ఎన్‌సిసి’ జీవితంలో మీకు చాలా సేవలందించింది. మీకెంతో మేలు ఒనగూడింది… అయితే, ఇంతకుముందు మీకు లేనిదేమిటి?
కార్యకర్త: జై హింద్ సర్! సమయపాలన, సమయ నిర్వహణ, నాయకత్వ పటిమ.
ప్రధానమంత్రి: సరే… మరెవరైనా జవాబిస్తారా?
కార్యకర్త: సర్… ‘ఎన్‌సిసి’ నుంచి నేను నేర్చుకున్న అతి ముఖ్యమైన పాఠం ప్రజా సేవ. రక్తదాన శిబిరాల నిర్వహణ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటివి కూడా అందులో భాగమే.
ప్రధానమంత్రి: చూడండి… కేంద్ర ప్రభుత్వం ‘మై భారత్’ లేదా ‘మేరా యువ భారత్’ వేదికను నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికిపైగా యువత, మహిళలు ఈ వేదిక కింద నమోదయ్యారు. ఇందులో చేరిన తర్వాత వారంతా ఒక బృహత్ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. చాలామంది ‘వికసిత భారత్’పై చర్చలు, క్విజ్, వ్యాస రచన, వక్తృత్వం వగైరా పోటీల్లో విశేష ప్రతిభను ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారు. ఇప్పుడు చెప్పండి… మీరు చేయబోయే మొట్టమొదటి పని ఏమిటి?
కార్యకర్త: అలాగే చేస్తాం సర్.
ప్రధానమంత్రి: మై భారత్‌లో ఇదంతా నమోదవుతుంది.
కార్యకర్త: అవును సర్.
ప్రధానమంత్రి: మీరు ‘ఎన్‌సిసి’లో నేర్చుకున్నదేదో అది కొన్నేళ్లపాటు మీతోనే ఉంటుంది. అయితే, మై భారత్ జీవితాంతం మీకు తోడుగా ఉంటుంది.
కార్యకర్త: అవును సర్.
ప్రధానమంత్రి: మరి మీరు దాని కోసం ఏదైనా చేస్తారా?
కార్యకర్త: చేస్తాం సర్.
ప్రధానమంత్రి: రాబోయే 25 ఏళ్లకుగాను భారత్ ఒక లక్ష్యం నిర్దేశించుకుంది. అదేమిటో మీకు తెలుసా? ఒక్కసారి మీ పిడికిలి బిగించి, చేతిని పైకెత్తి బిగ్గరగా నినదించండి.
కార్యకర్త: వికసిత భారత్
ప్రధానమంత్రి: మీరంటున్నది ఏ సంవత్సరం నాటికి?
కార్యకర్తలు: (ముక్తకంఠంతో) 2047!
ప్రధానమంత్రి: సరే… మనం 2047 సంవత్సరాన్ని ఎందుకు ఎంచుకున్నాం?
కార్యకర్తలు: అప్పటికి 100 సంవత్సరాలు పూర్తవుతాయి.
ప్రధానమంత్రి: ఎవరికి?
కార్యకర్తలు: మన స్వాతంత్ర్యానికి
ప్రధానమంత్రి: మోదీజీతోపాటు భారత స్వాతంత్ర్యానికి.
కార్యకర్తలు: 100 సంవత్సరాలు పూర్తవుతాయి.
ప్రధానమంత్రి: అప్పటికల్లా మనం సాధించాల్సిన లక్ష్యమేమిటి?
కార్యకర్తలు: వికసిత భారత్
ప్రధానమంత్రి: ఈ దేశం అభివృద్ధి చెందాలి. మరి అభివృద్ధి చేసేదెవరు?
కార్యకర్తలు: మేం చేస్తాం.
ప్రధానమంత్రి: ఇది ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యత కాదంటారా?
కార్యకర్తలు: కాదు సర్…
ప్రధానమంత్రి: దేశంలోని 140 కోట్ల మంది పౌరులు ఏదైనా సానుకూల సంకల్పం పూనితే, దాన్ని సాకారం చేయడం అసాధ్యమేమీ కాదు. మన కర్తవ్య నిబద్ధతతో అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో మనం ఒక కీలక శక్తిగా మారగలం. తల్లిని అమితంగా ప్రేమించని వారెవరు.. అందరూ ప్రేమిస్తారు! అలాగే భూమాతను కూడా ఎంతగానో ప్రేమించేవారు మనలో ఎందరో ఉంటారు. అలాంటి వారంతా నేను ప్రకటించిన తల్లిపట్ల, భూమాత మీద గౌరవాదరాలకు ప్రతీక అయిన ‘అమ్మ పేరిట ఓ మొక్క’ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. ఆ మేరకు మీ తల్లితో కలసి ఓ మొక్క నాటండి. ఇది మీ తల్లి పేరిట నాటినదని, ఈ మొక్క పచ్చగా ఎదిగేలా నిరంతరం శ్రద్ధ వహిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం తొలి లబ్ధిదారు భూమాతేనని గుర్తుంచుకోండి.
కార్యకర్త: నా పేరు బతామిపి… ఇడు మిష్మి గిరిజన తెగకు చెందిన నేను అరుణాచల్ ప్రదేశ్‌లోని దివాంగ్‌వ్యాలీ జిల్లా నుంచి వచ్చాను. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచీ ఈ జిల్లా వేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతేకాదు.. దేశం నలుమూలలా ఉన్న ప్రతి ఒక్కరికీ దీనిగురించి తెలియడమే కాదు.. సందర్శించేందుకు వస్తారు.
ప్రధానమంత్రి: అరుణాచల్‌కు ఒక ప్రత్యేకత ఉంది.. మన దేశంలో సూర్యుని తొలి కిరణం ప్రసరించేది ఈ గడ్డపైనేనని మనందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రానికి మరొక ప్రత్యేకత కూడా ఉంది- పరిచయస్థులు ఎదురుపడినపుడు మనం “రామ్ రామ్” లేదా “నమస్తే” అంటుంటాం.. కానీ, అరుణాచల్ ప్రజలు స్వాభావికంగానే “జై హింద్” అంటూ పరస్పర అభివాదం చేసుకుంటారు. మీరు అక్కడి వైవిధ్యం, కళ, ప్రకృతి సౌందర్యంతోపాటు ప్రజల ప్రేమాభిమానాలను చవిచూడాలని భావిస్తే, ఈ రోజునుంచే మిజోరం, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అస్సాం, మేఘాలయ సహా యావత్ అష్టలక్ష్మి’ ప్రాంతాన్ని సందర్శించడం ప్రారంభించండి. ఈశాన్య భారతంలో సందర్శనీయ విశేషాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి, పర్యటనకు రెండుమూడు నెలలు కూడా సరిపోకపోవచ్చు.
ప్రధానమంత్రి: మీరు సభ్యులుగా ఉన్న ‘ఎన్‌ఎస్‌ఎస్’ యూనిట్ మీ ప్రాంతంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించింది? ఏ విషయంలో మీరంతా చక్కగా పనిచేస్తారని అందరూ అనుకుంటారు? ఈ యువకులు దేశం కోసం ఏదైనా చేయగలరని వారనుకోవడం విన్నారా? అలాంటి అనుభవం ఏదైనా ఉంటే పంచుకుంటారా?
కార్యకర్త: సర్… నేను చెబుతాను.
ప్రధానమంత్రి: మీరు ఏ ప్రాంతం వారు?
కార్యకర్త: సర్… నా పేరు అజయ్ మోదీ, నేను జార్ఖండ్ నుంచి వచ్చాను. మా యూనిట్ చేసినదేమిటో చెప్పాలనుకుంటున్నా..
ప్రధానమంత్రి: మీరు ‘మోదీ’యా, ‘మోతీ’నా?
కార్యకర్త: మోదీ సర్.
ప్రధానమంత్రి: సరే…
కార్యకర్త: నేను మోదీ.
ప్రధానమంత్రి: (నవ్వుతూ) అందుకే మీరు నన్ను గుర్తుపట్టగలిగారు.
కార్యకర్త: అవును సర్.
ప్రధానమంత్రి: సరే.. చెప్పండి.
కార్యకర్త: సర్… మీరన్నట్లుగా మా యూనిట్ చేసిన ఓ మంచి పనికి ప్రశంసలు దక్కాయి. మా రాష్ట్రంలోని దుమ్కాలో మహిరి తెగవారు వెదురుతో ఎంతో అందమైన వస్తువులను తయారు చేస్తారు. కానీ, అవి కొన్ని సీజన్లలో మాత్రమే అమ్ముడవుతాయి. కాబట్టి, మిగిలిన కాలంలో వారికి ఉపాధి ఉండదు. అందుకని, మేము వీరిలో కొందరిని సమీకరించి, వారిని అగరుబత్తీలు చేసే కర్మాగారాలతో సంధానించాం సర్.
ప్రధానమంత్రి: అది సరేగానీ, అసలు ‘అగరుబత్తి’ అనే పదం ఎలా వచ్చిందో తెలుసా? దీనివెనుక మీరంతా తెలుసుకోవాల్సిన ఆసక్తికర ఉదంతం ఉంది. త్రిపుర రాష్ట్ర రాజధాని పేరేమిటో మీకు తెలుసా?
కార్యకర్త: అగర్తల సర్.
ప్రధానమంత్రి: ఆ పేరులో ఏముంది… మనం దేనిగురించి మాట్లాడుకుంటున్నాం?
కార్యకర్త: అగరుబత్తీల గురించి సర్.
ప్రధానమంత్రి: అగర్తల అడవులలో లభించే అగరు కలప ప్రత్యేక, ఆహ్లాదకర సుగంధానికి ప్రసిద్ధి చెందింది. ఈ చెట్ల నుంచి సేకరించే నూనె అత్యంత విలువైనదేగాక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటిలో ఒకటి. ఈ అరుదైన అగరు సుగంధమే ఆ కలపతో అగరుబత్తి తయారీ సంప్రదాయానికి దారితీసింది. సరే… ప్రభుత్వం ‘జిఇఎం’ (ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్) పోర్టల్ ఏర్పాటు చేసింది. మీ ప్రాంతంలోని చేతివృత్తులవారు ఇందులో తమ ఉత్పత్తిని, దాని ధరను నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వానికి అవసరమైతే ఆ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది కాబట్టి, వారికి ఆర్డర్లు లభిస్తాయి. మీలాంటి విద్యావంతులైన యువత ఈ విషయంలో వారికి తోడ్పాటునివ్వాలి. దేశవ్యాప్తంగాగల స్వయం సహాయ బృందాల (ఎస్‌హెచ్‌జి) సభ్యులైన 3 కోట్ల మంది మహిళలను “లక్షాధికారి సోదరీమణులు”గా రూపుదిద్దాలన్నది నా కల. ఈ లక్ష్యంలో భాగంగా ఇప్పటిదాకా 1.3 కోట్ల మందిని “లక్షాధికారి సోదరీమణులు”గా మార్చాను.
కార్యకర్త: సర్… మా అమ్మకు కుట్టుపని నేర్చుకుంది… ఇప్పటికీ ఆ పని చేస్తూనే ఉంది. ఆమె ‘చనియా’లను చాలా చక్కగా తయారు చేయగలదు. ఈ సంప్రదాయ వస్త్ర విశేషాన్ని నవరాత్రి సమయంలో ధరిస్తారని మీకు తెలిసే ఉంటుంది. మా అమ్మ కుట్టే ‘చనియా’లు ఇప్పుడు విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి.
ప్రధానమంత్రి: అద్భుతం!
కార్యకర్త: సర్… ఈ విధంగా మీరొక మార్గం ఏర్పరిచారు. “లక్షాధికారి సోదరీమణి” కార్యక్రమం వికసిత భారత్ నిర్మాణంలో కచ్చితంగా కీలక పాత్ర పోషించగలదు.
ప్రధానమంత్రి: సరే… మీరు విదేశాల నుంచి బృందాలను కూడా కలిసి ఉంటారు. అలాంటి వారితో మీలో ఎందరు బలమైన స్నేహబంధం ఏర్పరచుకోగలిగారు? మిమ్మల్ని కలిసినపుడు వారడిగిన ప్రశ్నలేమిటి… భారత్ గురించి వారేం తెలుసుకోవాలని భావిస్తున్నారు… ఇంకా ఏమేం అడిగారు?
కార్యకర్త: సర్… వాళ్లు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికత, రాజకీయాలు వంటి అంశాలపై ఆసక్తి చూపారు.
ప్రధానమంత్రి: ఓహో… రాజకీయాల గురించి కూడానా!
కార్యకర్త: నమస్తే సర్… నేను నేపాల్ నుంచి వచ్చాను. నా పేరు రోజినా బాన్. భారత్ సందర్శనతోపాటు ముఖ్యంగా మిమ్మల్ని కలవడం కోసం మేమెంతో ఉత్కంఠతో, ఉత్సాహంగా ఎదురుచూశాం. మీకు, మీ సాదర ఆతిథ్యం, ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు.. చాలాచాలా ధన్యవాదాలు సర్!
కార్యకర్త: మేము బయల్దేరే ముందు మారిషస్‌లోని భారత హైకమిషనర్ మమ్మల్ని కలిశారు. ఈ సందర్భంగా “భారత్‌ను సందర్శించండి… అది మీ రెండో ఇల్లు” అన్నారు. ఆయన చెప్పిన మాట అక్షరాలా నిజం.
ప్రధానమంత్రి: అద్భుతం.
కార్యకర్త: నిజంగా మేమంతా మా ఇంట్లో ఉన్నట్టే భావిస్తున్నాం. ఇందుకుగాను మీకెంతో కృతజ్ఞులం. మారిషస్-భారత్ మధ్య సహకారం, స్నేహ సంబంధాలు, సౌభ్రాత్రం వర్ధిల్లాలి.
ప్రధానమంత్రి: నిజమే… ఇది మీ రెండో ఇల్లు మాత్రమే కాదు… మీ అందరి పూర్వికుల మొదటి ఇల్లు ఇదే!
కార్యకర్త: అవును సర్… వాస్తవమే!
కార్యకర్త: కేసరియా… మా దేశాన్ని సందర్శించండి.
ప్రధానమంత్రి: అభినందనలు!
కార్యకర్త: (ఆలాపన) సారే జహా సే అచ్ఛా హిందూస్థాన్ హమారా హమారా, సారే జహా సే అచ్ఛా హమ్ బుల్‌బులే హై ఇస్‌కే, యే గుల్‌సితా హమారా హమారా.. సారే జహాన్ సే అచ్ఛా.
ప్రధానమంత్రి: అనేకానేక అభినందనలు సోదరా!
కార్యకర్త: ధన్యవాదాలు సర్…
ప్రధానమంత్రి: మీకందరికీ ధన్యవాదాలు… అనేకానేక ధన్యవాదాలు!
***