ఖతర్ అమిర్ (దేశాధినేత) శ్రీ షేక్ తమిమ్ బిన్ హమద్ అల్ థానితో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ మాట్లాడారు. ఖతర్ దేశాన్ని సందర్శించాలని ప్రధాని శ్రీ నరేంద్రమోదీ కి ఫోన్ చేసి ఆహ్వానించిన అమిర్‌తో మాట్లాడుతూ ప్రధాని పలు విషయాలు గుర్తు చేసుకున్నారు.
ఖతర్ అమిర్ ఈ సంవత్సరం మార్చి నెలలో భారతదేశాన్ని సందర్శించిన విషయం తెలిసిందే. ఆయన సందర్శనతో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలలో నూతనోత్తేజం వచ్చిందని ప్రధాని గుర్తు చేశారు. ఖతర్‌తో సంబంధాలకు భారతదేశం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ప్రధాని స్పష్టం చేశారు. ఖతర్ లో నివసిస్తున్న భారతీయుల భద్రత, సంక్షేమం కోసం అమిర్, ఖతర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఈ సందర్భంగా ప్రదాని శ్రీ మోదీ అభినందించారు.
ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి తీసుకుంటున్న చర్యలపై ఇరువురు నేతలు చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, భద్రత, రక్షణ, సాంస్కృతిక రంగాలలోను ప్రజల మధ్యన పరస్పరం నెలకొంటున్న బంధాలపైనా నేతలు వివరంగా మాట్లాడుకున్నారు. భారతదేశ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉండడానికి ఖతర్ ప్రాధాన్యతనిస్తోందన్న విషయాన్ని ఆయన ప్రధాని శ్రీ మోదీకి గుర్తు చేశారు.
ప్రాదేశిక శాంతి, సుస్థిరతల విషయంలో ఖతర్ పోషిస్తున్న పాత్రను ఈ సందర్బంగా ప్రధాని అభినందించారు.
ఖతర్ ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించిన ప్రధాని శ్రీ మోదీ…ఇరు ప్రభుత్వాలకు వీలైన తేదీలు కుదరగానే తాను తప్పకుండా ఖతర్‌ను సందర్శిస్తానని అమిర్‌తో చెప్పారు.