Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్’ ప్రారంభ కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించిన‌ ప్ర‌ధాన మంత్రి


‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్’ ఒక‌టో సంచిక‌ న్యూ ఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇన్ డోర్ స్టేడియ‌మ్ లో ఈ రోజు ప్రారంభ‌మ‌వుతున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించారు.

స‌భికుల‌ను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగిస్తూ, క్రీడ‌లు మ‌న యువ‌జ‌నుల జీవ‌నంలో ఒక కేంద్ర స్థానాన్ని ఆక్ర‌మించాల‌ని పేర్కొన్నారు. క్రీడలు వ్యక్తిత్వ వికాసంలో ఒక ముఖ్యమైన సాధనం అని ఆయన పేర్కొన్నారు.

యువ‌తీ యువ‌కులు వారి తీరిక లేన‌టువంటి కార్య‌క్ర‌మాల మధ్యే క్రీడ‌ల‌కు సైతం స‌మ‌యాన్ని వెచ్చించాలని ఆయ‌న ఉద్భోదించారు. స‌భికుల‌లో భాగ‌మైన ప్ర‌ముఖ క్రీడాకారుల‌ను గురించి ఆయ‌న ప్ర‌స్తావిస్తూ, వారు కూడా ఎన్నో అవ‌రోధాల‌ను ఎదుర్కొనివుండి ఉండ‌వ‌చ్చ‌ని, అయిన‌ప్ప‌టికీ వారు ప‌ట్టు విడువ‌క తాము ఏమిటన్నది నిరూపించుకొన్న‌ారని వివ‌రించారు.

భార‌త‌దేశంలో క్రీడా ప్ర‌తిభ‌కు లోటు లేద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు. మ‌న దేశం య‌వ్వ‌న‌భ‌రితమైనటువంటి దేశం. మ‌రి, మ‌నం క్రీడ‌ల‌లో మ‌రింత‌గా రాణించ‌వచ్చు అని ఆయ‌న అన్నారు.

ప్ర‌పంచ రంగ‌స్థ‌లంలో భార‌త‌దేశానికి ప్రాముఖ్యం పెరుగుతూ వ‌స్తోంద‌ని ఆయ‌న వివ‌రిస్తూ, దీని అర్థం ఒక బ‌ల‌మైన సైన్యం మ‌రియు శ‌క్తివంత‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌ మాత్ర‌మే కాదు, ఇందులో శాస్త్రవేత్త‌లుగా, క‌ళాకారులుగా, క్రీడాకారులుగా పేరు తెచ్చుకొన్న భార‌తీయులు కూడా క‌లిసి ఉన్నారు అని ఆయ‌న చెప్పారు. భార‌త‌దేశం ఇటువంటి మ‌రిన్ని శిఖ‌రాల‌ను అందుకోగ‌ల‌ద‌న్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. భార‌త‌దేశ యువ‌త‌రం ప‌ట్ల త‌న‌కు న‌మ్మ‌కం ఉందని ఆయ‌న పేర్కొన్నారు.

‘ఖేలో ఇండియా’ అంటే కేవ‌లం ప‌త‌కాలు గెలుచుకోవ‌డం కాద‌ని ఆయ‌న చెప్పారు. మ‌రింత అధికంగా ఆట‌ల‌లో పాలుపంచుకోవ‌డానికిగాను ఒక ప్ర‌జా ఉద్య‌మానికి శ‌క్తిని అందించే ప్ర‌య‌త్న‌ం అని ఆయ‌న వివ‌రించారు. దేశ‌వ్యాప్తంగా క్రీడ‌లు మ‌రింత ప్ర‌జాద‌ర‌ణ‌కు నోచుకొనేలా చేసే ప్ర‌తి ఒక్క అంశం మీద మేం శ్ర‌ద్ధ వ‌హించాల‌ని భావిస్తున్నాం అని ఆయ‌న అన్నారు.

భార‌త‌దేశంలో పల్లె ప్రాంతాల నుండి మ‌రియు చిన్న చిన్న న‌గ‌రాల నుండి వ‌చ్చిన యువ‌జ‌నులు క్రీడాకారులుగా రాటుదేల‌డం సంతోషాన్ని ఇస్తోందని శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు. మ‌ద్దతు అవ‌స‌ర‌మైన యువ‌జ‌నులు కూడా ఉన్నారు.. వారికి ప్రభుత్వం అండగా నిల‌వాల‌ని కోరుకుంటోందని ఆయ‌న తెలిపారు.

క్రీడల‌ను ప్రేమించే వారు ఒక ఉద్వేగంతో ఆడుతారు, అంతే త‌ప్ప న‌గ‌దు బ‌హుమ‌తుల కోసం ఆడ‌రు అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ఈ కార‌ణంగానే క్రీడాకారులు ఒక ప్ర‌త్యేక వ‌ర్గం అని ఆయ‌న అన్నారు. భార‌తీయ క్రీడాకారులు గెలిచిన‌ప్పుడు అత‌డికి లేదా ఆమెకు మువ్వన్నెల జెండాను చేత ధ‌రించే అవ‌కాశం ద‌క్కినప్పుడు అదొక అత్యంత అరుదైన భావ‌నను కలగజేస్తుందంటూ ఆ ఘ‌డియ యావ‌త్తు దేశ ప్ర‌జ‌ల‌కు ఉత్సాహాన్ని ప్ర‌సాదిస్తుంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

***