‘ఖేలో ఇండియా’ కార్యక్రమాన్ని 2017-18 నుండి 2019 – 20 మధ్య కాలానికి గాను 1,756 కోట్ల రూపాయల వ్యయంతో పునర్ వ్యవస్థీకరించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది భారతీయ క్రీడా చరిత్రలో ఒక మహత్తర పరిణామం; క్రీడలను వ్యక్తిగత, సాముదాయిక, ఆర్థిక మరియు దేశ పురోభివృద్ధికి ఒక సాధనంగా ఉపయోగపడేటట్టు మలచాలన్నదే ఈ కార్యక్రమం ధ్యేయం.
పునర్ వ్యవస్థీకరించిన తరువాత ‘ఖేలో ఇండియా’ కార్యక్రమం అవస్థాపన, కమ్యూనిటీ స్పోర్ట్స్, ప్రతిభావంతులను గుర్తించడం, శ్రేష్ఠత్వ సాధన దిశగా శిక్షణను ఇవ్వడం, స్పర్ధాత్మక స్వరూపాన్ని నిర్దేశించడం మరియు స్పోర్ట్స్ ఎకానమీ సహా క్రీడలకు సంబంధించిన యావత్ ముఖ చిత్రాన్ని ప్రభావితం చేయగలుగుతుంది.
ప్రధానాంశాలు:
ఈ కార్యక్రమంలో కొన్ని ప్రధానాంశాలు ఈ కింది విధంగా ఉంటాయి:
• ఇది వరకు ఎరుగని విధంగా ఒక అఖిల భారతీయ క్రీడా రంగ సంబంధ ఉపకార వేతన పథకాన్ని అమలు చేస్తారు. ఎంపిక చేసిన కొన్ని క్రీడా విభాగాలలో ఈ పథకాన్ని ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిభావంతులైన 1,000 మంది యువ క్రీడాకారులకు వర్తింప చేస్తారు.
• ఈ పథకంలో భాగంగా ఎంపిక చేసే ప్రతి ఒక్క క్రీడాకారునికి/క్రీడాకారిణికి ప్రతి సంవత్సరం 5.00 లక్షల రూపాయల విలువైన ఉపకార వేతనాన్ని- వరుసగా 8 సంవత్సరాల పాటు- అందజేస్తారు.
• అభిరుచి కలిగిన ప్రతిభావంతులైన యువతీ యువకులు పోటీతో కూడిన క్రీడలలో రాణించేందుకు వారికి దీర్ఘకాలిక క్రీడా పురోగతి పథాన సాగేందుకు మునుపు ఎన్నడూ లేనటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రపంచ వేదికలో గెలవడం కోసం పోటీ పడటానికి అత్యంత స్పర్ధను కనబరిచే క్రీడాకారుల బృందాన్ని సిద్ధం చేయడం జరుగుతుంది.
• ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 20 విశ్వవిద్యాలయాలను క్రీడా ప్రావీణ్య నిలయాలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో సాగుతుంది. ప్రతిభావంతులైన క్రీడాకారులు విద్యాభ్యాసం చేస్తూనే స్పర్ధాత్మక క్రీడలలో ముందుకు పోయేందుకు ఈ కార్యక్రమం వీలు కల్పిస్తుంది.
• ఆరోగ్యదాయకమైన జీవన సరళిని కలిగి ఉండేటటు వంటి క్రియాశీలమైన బృందాలను ఈ కార్యక్రమం సిద్ధం చేస్తుంది.
• 10 ఏళ్ళ నుండి 18 ఏళ్ల మధ్య వయస్సు ఉండే దాదాపు 200 మిలియన్ బాలలను ఒక పెద్ద జాతీయ శారీరిక పటుత్వ ఉద్యమంలో భాగస్తులను చేయాలన్నది ఈ కార్యక్రమం లక్ష్యాలలో ఒకటి. ఆ వయోవర్గం లోని బాలలందరి లోనూ శారీరక దృఢత్వానికి కూడా ఈ కార్యక్రమంతోడ్పడుతుంది.
ప్రభావం:
• పురుషులు, మహిళల మధ్య సమానత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు ఆశించిన లక్ష్యాలను సాధించేందుకు క్రీడల మాధ్యమానికి ఉన్న శక్తిని ఈ కార్యక్రమం ద్వారా వినియోగించుకోనున్నారు.
• కల్లోలిత ప్రాంతాల, ప్రగతి రీత్యా వెనుకబడిన ప్రాంతాల యువతీ యువకులను క్రీడారంగ కార్యకలాపాలలో భాగస్తులను చేయడం ద్వారా వారు అనుత్పాదక కార్యకలాపాల వైపు, విచ్ఛిన్నకర కార్యకలాపాల వైపు వెళ్ళకుండా వారు దేశ నిర్మాణ ప్రక్రియలో చేరేటట్లు చూడటం కోసం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు.
• పాఠశాల స్థాయిలో, కళాశాల స్థాయిలో స్పర్థ ప్రమాణాలను పెంచడానికీ, వ్యవస్థీకృత క్రీడా పోటీలలో పాల్గొనే అవకాశాలను గరిష్ఠ స్థాయికి మెరుగు పరచడానికీ ఉద్దేశించిన కార్యక్రమమిది.
• క్రీడా సంబంధ శిక్షణను సులభతరం చేసేందుకు మొబైల్ యాప్స్ ను వినియోగించుకోవడం, ప్రతిభను ఉపయోగించుకోవడం కోసం నేషనల్ స్పోర్ట్స్ టాలెంట్ సెర్చ్ పోర్టల్ ఏర్పాటు, దేశవాళీ ఆటల కోసం రూపొందించిన ఇంటర్ యాక్టివ్ వెబ్‌సైట్, క్రీడా సదుపాయలను అన్వేషించి వాటిని ఉపయోగించుకోవడానికి జిఐఎస్ ఆధారితమైన సమాచార వ్యవస్థ, తదితర అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో క్రీడలను గురించిన ప్రచారాన్ని ముమ్మరం చేయడం కూడా ఈ కార్యక్రమం ధ్యేయాలలో మరొకటి.
• ‘‘క్రీడలు అందరి కోసం’’, ‘‘క్రీడలు శ్రేష్ఠత్వం కోసం’’.. ఈ రెండు ఆశయాల సాధన దిశగా పయనించడం ఈ కార్యక్రమ ధ్యేయాలలో ఇంకొక ధ్యేయంగా ఉంది.