Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ

క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ


క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ), న్యూడిల్లీలోని సీబీసీఐ కేంద్రం ఆవరణలో ఈ రోజు నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. క్యాథలిక్ చర్చి ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ తరహా కార్య్రమానికి ఓ ప్రధానమంత్రి హాజరు కావడం ఇదే తొలిసారి. కార్డినల్స్, బిషప్‌లు, చర్చిలో ప్రధాన నాయకులతో పాటు క్రైస్తవ సమాజానికి చెందిన ముఖ్యమైనవారితో ప్రధాని సంభాషించారు.  

దేశ ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కొన్ని రోజుల క్రితం కేంద్ర మంత్రి జార్జి కురియన్ గృహంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం, ఈ రోజు  క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా (సీబీసీఐ) ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సీబీసీఐ 80వ వార్షికోత్సవం జరుపుకొంటున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ప్రత్యేకత సంతరించుకుంది. ఈ మైలురాయిని చేరుకున్న సందర్భంగా సీబీసీఐకి, ఈ సంస్థతో అనుబంధం ఉన్నవారందరికీ శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రధానమంత్రి నివాసంలో గతంలో సీబీసీఐతో కలసి క్రిస్మస్ జరుపుకొన్న సందర్భాన్ని ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ రోజు అందరూ సీబీసీఐ ప్రాంగణంలో సమావేశమయ్యారు. ‘‘ఈస్టర్ సమయంలో సేక్రెడ్ హార్ట్ క్యాథడ్రెల్ చర్చిని నేను దర్శించుకున్నాను. మీ అందరి నుంచి నేను పొందిన ఆదరణకు కృతజ్ఞుడను. ఈ ఏడాది ఆరంభంలో ఇటలీలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశాల సమయంలో పోప్ ఫ్రాన్సిస్ నుంచి కూడా ఇదే అభిమానాన్ని నేను పొందాను. గత మూడేళ్లలో అది మా రెండో సమావేశం. భారత్‌ను సందర్శించాల్సిందిగా నేను ఆయన్ను ఆహ్వానించాను.’’ అని శ్రీ మోదీ అన్నారు. సెప్టెంబర్‌లో న్యూయార్క్ సందర్శించినప్పుడు కార్డినల్  పియట్రో పరోలిన్‌తో సమావేశమయ్యానని ప్రధాని తెలిపారు. ఈ ఆధ్యాత్మిక సమావేశాలు సేవ పట్ల అంకితభావాన్ని కలిగి ఉండేలా ప్రేరేపిస్తాయి.

ఈ మధ్యే కార్డినల్ జార్జి కూవకడ్‌తో తాను జరిపిన చర్చలను ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఆయనకు ఇటీవలే పోప్ ఫ్రాన్సిస్‌ కార్డినల్ నియమించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జార్జి కురియన్ సారథ్యంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాన్ని పంపినట్లు ప్రధాని వెల్లడించారు. ‘‘ఓ భారతీయుడు ఇలాంటి విజయాన్ని సాధించినప్పుడు దేశం మొత్తం గర్వంతో ఉప్పొంగిపోతుంది. నేను మరోసారి ఈ అద్బుతమైన విజయం సాధించిన జార్జి కూవకడ్‌ను అభినందిస్తున్నాను’’ అని శ్రీ మోదీ అన్నారు.

దశాబ్దం క్రితం యుద్ధ వాతావరణం నెలకొన్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఫాదర్ అలెక్సిస్ ప్రేమ్ కుమార్‌ను రక్షించిన సందర్భంతో పాటు ఇతర జ్ఞాపకాలను ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఫాదర్ అలెక్సిస్ ప్రేమ్ కుమార్ ఎనిమిది నెలల పాటు బందీగా ఉన్నారని, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన్ను క్షేమంగా ఇంటికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందని అన్నారు. ‘‘ఈ విషయంలో మనం విజయం సాధించినప్పుడు వారి కుటుంబ సభ్యుల గొంతులో వినిపించిన ఆనందాన్ని నేను ఎన్నటికీ మరచిపోలేను. అదే విధంగా యెమెన్‌లో ఫాదర్ టామ్‌ను బంధించిన సందర్భంలోనూ, ఆయన్ను వెనక్కి తీసుకువచ్చేందుకు కూడా అవిశ్రాంతంగా పనిచేశాం. ఆయన్ను నా ఇంటికి ఆహ్వానించే గౌరవం నాకు దక్కింది. గల్ఫ్ సంక్షోభ సమయంలో మన నర్సు సోదరీమణులను రక్షించేందుకు కూడా అంతే శ్రమించి విజయం సాధించాం’’ అని ప్రధానమంత్రి వెల్లడించారు. ఈ ప్రయత్నాలన్నీ దౌత్య కార్యకలాపాలు మాత్రమే కాదని, కుటుంబ సభ్యులను తిరిగి తీసుకొచ్చే భావోద్వేగపరమైన నిబద్ధతను తెలియజేస్తాయని శ్రీ మోదీ వివరించారు. భారతీయులు ఎక్కడ ఉన్నప్పటికీ సంక్షోభ సమయాల్లో వారిని రక్షించడమే ప్రస్తుత భారత్ తన విద్యుక్త ధర్మంగా భావిస్తోంది.

కొవిడ్ – 19 మహమ్మారి సమయంలో మాదిరిగానే జాతీయ ఆసక్తులతో పాటు మానవ ప్రయోజనాలకు కూడా భారతీయ విదేశాంగ విధానం ప్రాధాన్యమిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఎన్నో దేశాలు సొంత ప్రయోజనాలపైనే దృష్టి సారించగా, భారత్ మాత్రం 150 దేశాలకు ఔషధాలు, వ్యాక్సిన్లు పంపి నిస్వార్థంగా సాయం చేసింది. గయానాలాంటి దేశాలు కృతజ్ఞతాభావం ప్రకటించడంతో ఇది అంతర్జాతీయంగా సానుకూల ప్రభావాన్ని చూపించింది. ఎన్నో ద్వీప దేశాలు, పసిఫిక్ దేశాలు, కరీబియన్ దేశాలు కూడా భారత్ చేపట్టిన మానవతా చర్యలను ప్రశంసించాయి. భారత్ అనుసరిస్తున్న మానవ కేంద్ర విధానం 21వ శతాబ్దపు ప్రపంచాన్ని మెరుగుపరిచేందుకు సిద్ధంగా ఉంది అని ప్రధాని వివరించారు.

క్రీస్తు బోధనలు ప్రధానంగా ప్రేమ, సామరస్యం, సోదరభావాన్ని తెలియజేస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు. హింస, విధ్వంసం చెలరేగినప్పుడు అది తనను బాధిస్తుందన్న ప్రధాని, ఇటీవల జర్మనీలోని క్రిస్మస్ మార్కెట్, 2019లో శ్రీలంకలో ఈస్టర్ సమయంలో బాంబు పేలుళ్ల బాధితులకు నివాళులు అర్పించారు.

జూబ్లీ సంవత్సరం ఆరంభం కావడంతో ఈ క్రిస్మస్ మరింత ప్రత్యేకమని శ్రీ మోదీ అన్నారు. విశ్వాసం గురించి ప్రస్తావిస్తూ.. ‘‘సామర్థ్యానికి, శాంతికి మూలంగా విశ్వాసాన్ని పరిశుద్ధ బైబిల్ పరిగణిస్తుంది. నమ్మకం, సానుకూల దృక్పథమే మనకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. మానవత్వానికి, మెరుగైన ప్రపంచానికి, శాంతి, పురోగతి, సమృద్ధి సాధించడానికి విశ్వాసముంచుదాం’’ అని శ్రీ మోదీ అన్నారు.

గత పదేళ్లలో 250 మిలియన్ల మంది భారతీయులు పేదరికాన్ని అధిగమించారని, పేదరికంపై విజయం సాధించవచ్చనే నమ్మకమే దీనికి కారణమని ప్రధానమంత్రి అన్నారు. భారత్ పదో స్థానం నుంచి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది, ఇది మన ఆత్మవిశ్వాసానికి, పట్టుదలకు నిదర్శనం. అభివృద్ధి చెందుతున్న ఈ సమయం – అంకుర సంస్థలు, సైన్స్, క్రీడలు, ఔత్సాహిక పారిశ్రామిక రంగం తదితర రంగాల్లో యువతకు లభించే అవకాశాలతో భవిష్యత్తుపై కొత్త నమ్మకాన్ని తీసుకువచ్చింది. ‘‘ఆత్మవిశ్వాసంతో నిండిన భారతీయ యువత దేశాన్ని పురోగతి దిశగా నడిపిస్తూ, అభివృద్ధి చెందిన భారత్ అనే కల సాకారమవుతుందనే నమ్మకాన్ని ఇస్తున్నారు’’ అని ప్రధాని పేర్కొన్నారు.

గడచిన పదేళ్లలో భారతీయ మహిళలు గొప్ప సాధికారతను సాధించారని, ఔత్సాహిక పారిశ్రామిక రంగం, డ్రోన్లు, విమానయానం, భద్రతా దళ రంగాల్లో రాణిస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. మహిళా సాధికారత సాధించనిదే ఏ దేశమూ ముందుకు సాగలేదనే విషయాన్ని వారి ప్రగతి తెలియజేస్తోందని పేర్కొన్నారు. ఎక్కువ మంది మహిళలు శ్రామిక శక్తి, నైపుణ్య కార్మిక శక్తిలో భాగస్వాములవడం దేశ భవిష్యత్తుపై కొత్త ఆశలు తీసుకొచ్చిందని శ్రీమోదీ అన్నారు.

మొబైల్, సెమీ కండక్టర్ తయారీ రంగాల్లో గత పదేళ్లలో భారత్ గణనీయమైన పురోగతిని సాధించిందని, ప్రపంచ సాంకేతిక కేంద్రంగా మారిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. టెక్నాలజీ, ఫిన్‌టెక్ ద్వారా పేదవారికి సాధికారత కల్పిస్తోందని, ఇంతకు ముందెన్నడూ లేని వేగంతో కొత్త ఎక్స్‌ప్రెస్ మార్గాలు, గ్రామీణ రహదారులు, మెట్రో మార్గాలు తదితర మౌలిక సదుపాయాలను దేశం నిర్మించుకుంటోందని వివరించారు. ఈ విజయాలు భారతదేశ భవిష్యత్తుపై నమ్మకాన్ని, ఆశావహదృక్పథాన్ని కల్పిస్తున్నాయని, అదే విశ్వాసంతో ప్రపంచం కూడా భారత్‌లో వేగంగా జరుగుతున్న అభివృద్ధిని, సామర్థ్యాన్ని వీక్షిస్తోందని అన్నారు.

ఒకరి బాధలను మరొకరు పంచుకోవాలని, ఒకరి సంక్షేమానికి మరొకరు బాధ్యత వహించాలని బైబిల్ బోధిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ ఆలోచనతోనే కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయడం, విద్యను అందించి ఇతరులను వృద్ధిలోకి తీసుకురావడం లేదా ఆరోగ్య పథకాలను అమలు చేస్తూ ప్రజలకు సేవ చేయడం ద్వారా వివిధ సంస్థలు సామాజిక సేవలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఈ ప్రయత్నాలన్నింటినీ సమష్టి బాధ్యతలుగా చూడాలని ఆయన అన్నారు.

ప్రపంచానికి కరుణ, నిస్వార్థ సేవా మార్గాన్ని ఏసు క్రీస్తు చూపించారని ప్రధాని అన్నారు. ఈ విలువలను మన జీవితాల్లో భాగం చేసుకుని మన విధులకు ప్రాధాన్యమిచ్చేందుకే మనం క్రిస్మస్‌ పర్వదినాన్ని జరుపుకొంటున్నాం, ఏసును స్మరించుకుంటున్నాం. ఇది మన వ్యక్తిగత బాధ్యత మాత్రమే కాదు సామాజిక విధి కూడా. ‘‘ప్రస్తుతం దేశం ఇదే స్ఫూర్తితో, ‘సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ అనే సంకల్పం ద్వారా ముందుకు సాగుతోంది. గతంలో చాలా అంశాలను మనకు బోధించేవారు కాదు. మానవ దృక్కోణంలో అవి ఇప్పుడు చాలా అవసరం. వాటినే ప్రాధాన్యాంశాలుగా మార్చాం. కఠినమైన నియమాలు, సంప్రదాయాల నుంచి ప్రభుత్వాన్ని బయటకు తీసుకువచ్చాం. సున్నితత్వాన్ని కొలమానంగా మార్చాం. ప్రతి పేదవాడికీ శాశ్వత నివాసం కల్పిస్తూ, ప్రతి గ్రామానికి విద్యుత్ అందిస్తూ, ప్రజల జీవితాల్లో అంధకారాన్ని తరిమేస్తూ, శుద్ధమైన తాగునీటిని అందించడంతో పాటు డబ్బు లేదనే కారణంతో ఎవరూ వైద్యానికి దూరమవకుండా భరోసా కల్పించాం. ఇలాంటి సేవలు, పరిపాలన అందించేలా సున్నితమైన వ్యవస్థను రూపొందించాం’’ అని శ్రీ మోదీ వెల్లడించారు.

ప్రభుత్వ కార్యక్రమాలు వివిధ సమూహాల పరిస్థితులను మెరుగుపరిచాయని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. పీఎం ఆవాసయోజన ద్వారా మహిళల పేరిట నిర్మించిన ఇళ్లు వారిని శక్తిమంతం చేస్తున్నాయి. నారీ శక్తి వందన్ అధీనియం చట్టం పార్లమెంటులో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతుంది. ఒకప్పుడు ప్రతిరంగంలోనూ వెనకబడి ఉన్న ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి ఇప్పుడు ప్రభుత్వ మౌలికవసతుల నుంచి ఉద్యోగాల వరకు అన్నిచోట్లా ప్రాధాన్యం లభిస్తోందని శ్రీ మోదీ అన్నారు. ఆర్థికాభివృద్ధికి పరిపాలనలో సున్నితత్వం అవసరమని, కిసాన్ క్రెడిట్ కార్డులు, మత్స్య సంపద యోజన తదితర పథకాలు లక్షల సంఖ్యలో మత్స్యకారుల జీవితాలను మెరుగుపరిచాయని, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందిందని అన్నారు.

‘‘సబ్ కా ప్రయాస్ లేదా సమష్టి కృషి గురించి నేను ఎర్రకోట నుంచి మాట్లాడాను, ఇది దేశ భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ పోషించే పాత్ర గురించి ప్రముఖంగా తెలియజేస్తుంది. సామాజిక స్పృహ ఉన్న భారతీయులు నిర్వహించిన స్వచ్ఛభారత్ లాంటి ఉద్యమాలు, పరిశుభ్రతను, మహిళలు, పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరిచాయి’’ అని ప్రధాని వివరించారు. తృణధాన్యాలను (శ్రీ అన్న), స్థానిక కళాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలు, ప్రకృతిమాతను, మన మాతృమూర్తులను గౌరవించే ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారం వేగమందుకున్నాయి. ఎంతో మంది క్రైస్తవులు సైతం ఈ కార్యక్రమాల్లో భాగం పంచుకున్నారు. అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించేందుకు ఈ సమష్టి ప్రయత్నాలు అవసరం.

ఈ సమష్టి ప్రయత్నాలు దేశాన్ని పురోగతి దిశగా నడిపిస్తాయని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ‘‘అభివృద్ధి చెందిన భారత దేశం మన సమష్టి లక్ష్యం. మనమంతా కలసి దాన్ని కచ్చితంగా సాధిస్తాం. భవిష్యత్తు తరాలకు వికసిత భారత్ ను అందించాల్సిన బాధ్యత మనందరిదీ. మరోసారి మీ అందరికీ హృదయపూర్వకంగా క్రిస్మస్, జూబ్లీ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని శ్రీ మోదీ ప్రసంగాన్ని ముగించారు. 

 

 

***

MJPS/VJ