Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కోవిడ్-19 పోరాటంలో భాగస్వాములందరితోను ప్రధానమంత్రి సంప్రదింపులు కొనసాగింపు


కరోనా వైరస్ పై పోరాటం పతాక స్థాయిలో ఉన్న నేపథ్యంలో పరిస్థితిపై ప్రత్యక్ష సమాచారం తెలుసుకునే ప్రయత్నాలు
కోవిడ్-19పై భారత పోరాటంలో భాగం పంచుకుంటున్న వారందరితోనూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంప్రదింపులు కొనసాగించనున్నారు.

వైరస్ వ్యాప్తిని అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా శ్రీ మోదీ ఎలక్ర్టానిక్ మీడియా బృందాలు, భారత కార్పొరేట్ రంగం ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు.

నిరంతర సంప్రదింపులు, సమావేశాలు

కోవిడ్-19పై పోరాటానికి గల మార్గాలు, సాధనాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి శ్రీ మోదీ జనవరి నుంచి భిన్న రంగాలకు చెందిన ప్రతినిధులు, అధికారులతో పలు విడతలుగా సమావేశాలు, చర్చలు నిర్వహించారు.
కేబినెట్ సెక్రటరీ, ప్రిన్సిపల్ కార్యదర్శితో ప్రధానమంత్రి రోజువారీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమావేశాల్లో అధికారులు ఆయనకు తాజా పరిస్థితిని క్రమం తప్పకుండా వివరిస్తున్నారు.

కోవిడ్-19పై పోరాటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నాయకత్వంలోని మంత్రుల బృందం ఎప్పటికప్పుడు ప్రధానమంత్రికి వివరిస్తోంది.

అందరికీ ఒక మార్గదర్శి

ప్రజలందరూ సామాజిక దూరం పాటించేలా చేసే ప్రయత్నంలో భాగంగా ఈ సారి హోలీ వేడుకల్లో తాను పాల్గొనడంలేదని ప్రధానమంత్రి ప్రకటించారు.

జాతినుద్దేశించి ప్రసంగం-జనతా కర్ఫ్యూ

కోవిడ్-19ని దీటుగా ఎదుర్కొనే ప్రయత్నంలో అందరినీ సమాయత్తం చేయడం కోసం 2020 మార్చి 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతాకర్ఫ్యూ పాటించాలని, ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని 19వ తేదీ రాత్రి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి పిలుపు ఇచ్చారు. కరోనా వైరస్ పై పోరాటానికి “సంకల్పం, సంయమనం” అనే రెండంశాల మంత్రాన్ని శ్రీ నరేంద్రమోదీ ప్రబోధించారు.

నిత్యావసర వస్తువులన్నీ తగినంతగా సరఫరా అవుతాయని హామీ ఇస్తూ ప్రజలు భీతావహులై కొనుగోళ్లు చేయవద్దని ఆ ప్రసంగంలో ప్రధానమంత్రి ప్రజలను కోరారు.

కోవిడ్-19 ఆర్థిక చర్యల టాస్క్ ఫోర్స్

కోవిడ్-19 మహమ్మారి వల్ల ఏర్పడుతున్న ఆర్థిక సవాలుపై స్పందించి తగు చర్యలు తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి సారథ్యంలో “కోవిడ్-19 ఎకనామిక్ రెస్పాన్స్ టాస్క్ ఫోర్స్” ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థలోని భాగస్వామ్య వర్గాలన్నింటితోనూ ఆ టాస్క్ ఫోర్స్ సంప్రదించి, చర్చించిన అనంతరం వారందించిన సమాచారం ఆధారంగా ఆ సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఆ సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు తీసుకున్న చర్యలన్నీ సక్రమంగా అమలు జరిగేందుకు కూడా టాస్క్ ఫోర్స్ చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు.

అలాగే వ్యాపార వర్గాలు, అధికాదాయ వర్గాల్లోని వారు అల్పాదాయ వర్గాలకు చెందిన వారి ఆర్థిక అవసరాలు గుర్తించి వివిధ సేవలందించే సిబ్బంది విధులకు హాజరు కాలేని సమయానికి వేతనాల కోత విధించవద్దని కూడా ప్రధానమంత్రి అభ్యర్థించారు. ఇలాంటి సమయాల్లో మానవత్వం అత్యంత కీలకమని ఆయన నొక్కి చెప్పారు.

ఫార్మారంగంతో సమావేశం
ఈ సంక్షోభ సమయంలో ఔషధాలు, వైద్యపరికరాల నిరంతరం సరఫరా అయ్యేలా చూసే ప్రయత్నంలో భాగంగా 2020 మార్చి 21న ప్రధానంత్రి ఫార్మా రంగం ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమయ్యారు. కోవిడ్-19 పరీక్షలకు అత్యంత కీలకమైన ఆర్ఎన్ఏ టెస్టింగ్ కిట్లు యుద్ధప్రాతిపదికపై తయారుచేయాలని ఆ సంప్రదింపుల్లో భాగంగా ప్రధానమంత్రి కోరారు. ఎపిఐలు తగినంతగా సరఫరా అయ్యేలా చూసేందుకు, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించేందుక ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.

అత్యవసర ఔషధాలు తగినంతగా సరఫరాలో ఉండేలా చూడడం చాలా ప్రధానమని, ముఖ్యంగా బ్లాక్ మార్కెటింగ్ ను నివారించాలని ఆయన ఆదేశించారు.

రాష్ర్టాలతో కలిసికట్టుగా ఉమ్మడి పోరాటం

ప్రధానమంత్రి మార్చి 20వ తేదీన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రాష్ర్టాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. కోవిడ్-19 సవాలును కలిసికట్టుగా ఎదుర్కొందామని ఆ సమావేశంలో పిలుపు ఇచ్చారు. వైరస్ వ్యాప్తిపై నిరంతర నిఘా వేయాలని, పరిస్థితిని తరచు పర్యవేక్షిస్తూ ఉండాలని పిలుపు ఇస్తూ కేంద్రం, రాష్ర్టాలు ఆ మహమ్మారిపై ఉమ్మడి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని ప్రధానమంత్రి అన్నారు.

వైరస్ ను అరికట్టడంలో దేశం కీలక దశలో ఉన్నదని రాష్ర్టాల నాయకత్వానికి భరోసా ఇస్తూ అయినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.

కరోనాను అరికట్టేందుకు కేంద్రం ఇప్పటివరకు తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రులకు వివరిస్తూ దేశంలో స్థూల పరిస్థితిని తాను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్న తీరును ప్రధానమంత్రి వివరించారు.

దేశంలో టెస్టింగ్ సదుపాయాలు పెంచాలని, సమాజంలో నిరాదరణకు గురవుతున్న వర్గాలకు మరింత మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రులు ప్రధానమంత్రికి నివేదించారు. రాష్ర్టాలకు అన్ని రకాల మద్దతు ఇస్తామని హామీ ఇస్తూ ఆరోగ్య కార్యకర్తల సామర్థ్యాలను మరింతగా పెంచాలని, ఆరోగ్య మౌలిక వసతులు మరింత వేగంగా విస్తరించాలని ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి సూచించారు. బ్లాక్ మార్కెటింగ్ ను, అసాధారణంగా ధరలు పెరిగిపోవడాన్ని నివారించేందుకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వాణిజ్య మండలులతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రులకు సూచించారు. వీలైనంత వరకు సరళంగానే వ్యవహరించాలని అభ్యర్థిస్తూ తప్పనిసరి అయితే చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని ప్రధానమంత్రి వారికి సూచించారు.

సార్క్ ప్రాంతంతో సమన్వయం

కోవిడ్-19 అరికట్టడంలో భాగంగా ప్రాంతీయంగా సంప్రదింపులు, చర్చలు నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని సూచించిన తొలి నాయకుడు మన ప్రధానమంత్రే. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన ప్రపంచ జనాభాలో అధిక శాతం ప్రజలు నివశిస్తున్న సార్క్ దేశాల నాయకులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సమావేశమయ్యారు. 2020 మార్చి 15వ తేదీన భారత నాయకత్వంలో సార్క్ దేశాల నాయకుల సమావేశం జరిగింది.

కోవిడ్-19పై పోరాటానికి సహకార స్ఫూర్తిని ప్రబోధించిన తొలి నాయకుడుగా నిలిచిన శ్రీ మోదీ సార్క్ దేశాలన్నింటి స్వచ్ఛంద వాటాలతో కోవిడ్-19 ఎమర్జెన్సీ నిధి ఏర్పాటును ప్రతిపాదించడంతో పాటు భారత్ తన వంతుగా 10 మిలియన్ డాలర్ల వాటా అందిస్తుందని ప్రకటించారు. తక్షణ చర్యలకు అవసరం అయ్యే వ్యయాల కోసం భాగస్వామ్య దేశాల్లో ఏ దేశం అయినా ఆ నిధిని ఉపయోగించుకోవచ్చునని ఆయన సూచించారు.

సార్క్ లోని ఇతర దేశాలు నేపాల్, భూటాన్, మాల్దీవులు కూడా ఎమర్జెన్సీ నిధికి తమ వంతు వాటా ప్రకటించాయి.

అంతర్జాతీయ ప్రయత్నాలు

2020 మార్చి 12వ తేదీన యుకె ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతోను, 17వ తేదీన సౌదీ అరేబియా కింగ్ డమ్ రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ తోను ప్రధానమంత్రి టెలిఫోన్ సంభాషణ చేశారు.

నిలిచిపోయిన పౌరులకు అండ

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న చైనా, ఇటలీ, ఇరాన్ వంటి దేశాలు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 200 మందికి పైగా పౌరులను స్వదేశానికి తరలించేందుకు ప్రధానమంత్రి నాయకత్వంలో భారత్ చర్యలు తీసుకుంది.