Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కోవిడ్-19 పై పోరాటానికి రూ.3100 కోట్లు కేటాయించిన పిఎం కేర్స్ ఫండ్ ట్రస్ట్


కోవిడ్-19పై పోరాటానికి పిఎంకేర్స్ నిధి నుంచి రూ.3100 కోట్లు కేటాయించాలని పిఎం కేర్స్ (అత్యవసర పరిస్థితిలో ప్రధానమంత్రి పౌర సహాయ, పునరావాస కార్యక్రమం) ఫండ్ ట్రస్ట్ నిర్ణయించింది. ఆ రూ.3100 కోట్లలో రూ.2000 కోట్లు వెంటిలేటర్ల కొనుగోలుకు, రూ.1000 కోట్లు వలస కార్మికుల రక్షణకు, రూ.100 కోట్లు వాక్సిన్ అభివృద్ధి కార్యకలాపాల మద్దతుకు కేటాయిస్తారు.

గౌరవ ప్రధానమంత్రి (ఎక్స్ అఫీషియో) నాయకత్వంలో రక్షణ, హోం, ఆర్థిక శాఖ మంత్రులు ఇతర ఎక్స్ అఫీషియో సభ్యులుగా మార్చి 27న ట్రస్ట్ ఏర్పడింది. కోవిడ్-19పై భారత పోరాటానికి మద్దతుగా పిఎంకేర్స్ ఫండ్ కు ఉదారంగా విరాళాలందించిన దాతలందరికీ ఈ ప్యాకేజి ప్రకటించిన సందర్భంగా ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

ఎ) 50 వేల వెంటిలేటర్లు

దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులను దీటుగా ఎదుర్కొనేందుకు మౌలిక వసతులు పెంచడం లక్ష్యంగా పిఎం కేర్స్ నిధి నుంచి రూ.2000 కోట్ల వ్యయంతో 50 వేల మేడ్ ఇన్ ఇండియా వెంటిలేటర్లు కొనుగోలు చేస్తారు. కోవిడ్-19 బారిన పడి ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంటున్న వారికి మెరుగైన చికిత్స అందించేందుకు ఈ వెంటిలేటర్లను అన్ని రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ఆస్పత్రులకు అందచేస్తారు.

బి) వలస కార్మికుల సహాయ చర్యలు

వలస కార్మికుల కోసం ప్రస్తుతం తీసుకున్న సంక్షేమ చర్యలను మరింత పటిష్ఠం చేయడం కోసం పిఎం కేర్స్ నిధి నుంచి రూ.1000 కోట్లు రాష్ట్రప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఏకమొత్తంలో సహాయంగా అందిస్తారు. వలస కార్మికులకు బస ఏర్పాటు, ఆహారం సరఫరా, వైద్య సహాయం అందించేందుకు, వారి ప్రయాణం ఏర్పాట్లు చేయడానికి ప్రస్తుతం చేస్తున్న కృషిని పటిష్ఠం చేయడానికి జిల్లా కలెక్టర్లు/ మునిసిపల్ కమిషనర్లకు నిధులు అందించడం కోసం రాష్ట్రప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ నిధులు కేటాయిస్తారు. రాష్ట్రప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు నిధుల కేటాయింపులో పరిగణనలోకి తీసుకునే అంశాలు…(ఎ) 2011 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతం జనాభా – 50% వెయిటేజి (బి) తాజా గణాంకాల ప్రకారం ఆ తేదీ నాటికి కోవిడ్-19 కేసులు – 40% వెయిటేజి (సి) అన్ని రాష్ర్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు కనీస మౌలిక నిధి హామీ కింద సమాన వాటా – 10% వెయిటేజి పరిగణనలోకి తీసుకుంటారు. రాష్ట్రప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వైపరీత్య సహాయ కమిషనర్ ద్వారా జిల్లా కలెక్టర్/ జిల్లా మెజిస్ర్టేట్/ మునిసిపల్ కమిషనర్లకు ఈ నిధులు అందచేస్తారు.

సి) టీకా మందు అభివృద్ధి

కోవిడ్-19పై పోరాటానికి చక్కని టీకా మందు అత్యంత అవసరం. అలాంటి అత్యాధునికమైన టీకా మందు డిజైన్, అభివృద్ధిలో భారత విద్యావేత్తలు, స్టార్టప్ లు, పరిశ్రమ సంఘటితం అయ్యారు. ఆ టీకా మందు డిజైనర్లు, డెవలపర్లకు మద్దతు ఇచ్చేందుకు పిఎం కేర్స్ నిధి నుంచి రూ.1000 కోట్లు అందచేస్తారు. కీలకమైన అలాంటి టీకా మందు అభివృద్ధికి సహాయ హస్తంగా అందిస్తున్న ఈ నిధిని ముఖ్య శాస్ర్తీయ సలహాదారు పర్యవేక్షణలో ఉపయోగిస్తారు.