నోవెల్ కరోనా వైరస్ (కోవిడ్-19) పై పరిస్థితిని, వివిధ మంత్రిత్వ శాఖలు ఇంతవరకు తీసుకున్న చర్యల ను, గౌరవనీయులైన ప్రధాన మంత్రి 2020 మార్చి 7వ తేదీన ఉదయం 11 గంటల 30 నిముషాల కు సమీక్షించారు. ఈ సమావేశం లో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయ్ శంకర్, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విని కుమార్ చౌబే, కేబినెట్ కార్యదర్శి శ్రీ రాజీవ్ గుఁబా, నీతీ ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ కె. పాల్, రక్షణ సిబ్బంది అధిపతి జనరల్ బిపిన్ రావత్, ఆరోగ్య శాఖ కార్యదర్శులు, ఫార్మా, పౌర విమానయానం, విదేశీ వ్యవహారాలు, ఆరోగ్య పరిశోధన, దేశీయ వ్యవహారాలు, నౌకా రవాణా, ఎన్.డి.ఎమ్.ఎ., శాఖల తో పాటు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ చేపట్టిన చర్యలు, ప్రస్తుత పరిస్థితిపై ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి వివరించారు. ఇతర మంత్రిత్వ శాఖలు కూడా కోవిడ్-19 కి సంబంధించి తమ సంసిద్ధత, ప్రతిస్పందన పై వివరణ ఇచ్చాయి. ప్రవేశ ప్రాంతాలు, సమాజం లోనూ ప్రధాన ప్రాంతాల్లో నిఘా, ప్రయోగశాల ల తోడ్పాటు, ఆసుపత్రుల సంసిద్ధత, రవాణా, లాజిస్టిక్స్, విపత్తు సమాచార ప్రసారం వంటి అంశాల ను తమ వివరణల్లో ప్రధానం గా ప్రస్తావించారు.
భారత దేశం లో మందులు, మందుల లో ఉపయోగించే పదార్థాలు, ఇతర వినియోగ వస్తువుల నిల్వలు సమృద్ధి గా ఉన్నాయని, ఫార్మా శాఖ కార్యదర్శి తెలియ జేశారు.
అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సరిహద్దు ప్రాంతాల్లో నిరంతర నిఘా, ప్రోటోకాల్ ప్రకారం కమ్యూనిటీ స్థాయి నిఘా, ఎవరితోనూ కలవకుండా ఉండే విధంగా (ఐసొలేశన్) కోసం ఆసుపత్రుల్లో తగినన్ని పడకలు అందుదాటు లో ఉంచడం వంటి అంశాలపై ఈ సమావేశం లో చర్చించారు. సకాలం లో స్పందించడానికి వీలుగా రాష్ట్రాల తో సమర్ధవంతమైన సమన్వయం ఈ సమయం లో ఎంతైనా అవసరమని డాక్టర్ హర్ష వర్ధన్ స్పష్టం చేశారు. ఎక్కువ మందిని ఆసుపత్రుల్లో చేర్చడానికి వీలుగా పడకల సంఖ్య ను పెంచవలసిన అవసరాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు నొక్కి చెప్పారు. ఇరాన్ నుండి భారతీయుల ను స్వదేశాని కి తీసుకు రావాలన్న విజ్ఞప్తి ఈ సమావేశం లో ప్రధానం గా చర్చకు వచ్చింది.
ఇంతవరకు తగిన చర్యలు చేపట్టినందుకు గౌరవ ప్రధాన మంత్రి అన్ని శాఖల ను అభినందించారు. మారుతున్న పరిస్థితుల కు అనుగుణం గా ప్రతిస్పందించడం లో భారతదేశం సంసిద్ధం గా ఉండాలని కోరారు. అన్ని శాఖలు సమన్వయం తో పని చేయాలనీ, ఈ వ్యాధి గురించి సమాజం లో అవగాహన కలిగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కోవిడ్-19 యాజమాన్యం కోసం దేశవ్యాప్తం గానూ, వివిధ దేశాల్లోనూ, రాష్ట్రాల ల్లోనూ అనుసరిస్తున్న చర్యల్లో ఉత్తమ పద్ధతుల ను గుర్తించి, వాటిని అమలు చేయాలని, ఆయన అధికారుల ను కోరారు. నిపుణులు సూచించిన ప్రకారం, ప్రజలు సాధ్యమైనంత వరకు ఎక్కువ సంఖ్య లో గుమిగూడి ఉండవద్దనీ, ‘చేయవలసిన’ మరియు ‘చేయకూడని’ పనుల పట్ల అవగాహన కలిగి ఉండాలనీ ఆయన చెప్పారు. వైరస్ వ్యాపించిన పక్షం లో ఎవరినీ కలవకుండా ఉండే (క్వారంటైన్) ప్రదేశాలనూ, క్లిష్టమైన సంరక్షణ ప్రదేశాలనూ గుర్తించడానికి వీలుగా అవసరమైన చర్యల ను వెంటనే చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఇరాన్ లో ఉండే భారతీయుల కు ముందస్తు పరీక్షలు నిర్వహించి, వారిని స్వదేశాని కి తరలించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారుల ను ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా, ఈ అంటువ్యాధిని నివారించడానికి వీలుగా ముందస్తుగా తగినంత ప్రణాళిక తో, సమయానుకూలం గా స్పందించవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
Prime Minister reviews the situation on COVID-19 with concerned Ministries. https://t.co/2TQz3Mnwzx
— PMO India (@PMOIndia) March 7, 2020
via NaMo App pic.twitter.com/JQJioAoiJX