దేశంలో కోవిడ్-19 స్థితిగతులు, టీకాలకు సంబంధించి ప్రజారోగ్య వ్యవస్థ సంసిద్ధతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం తన అధ్యక్షతన రెండు గంటలపాటు సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్-19 వ్యాప్తి, కేసులపై ప్రపంచ స్థితిగతుల గురించి ప్రధానమంత్రికి అధికారులు వివరించారు. మహమ్మారి పాదం మోపింది మొదలు వివిధ దేశాల్లో కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరగడంపై ప్రపంచ అనుభవాలను వారు తెలియజేశారు. ఈ నేపథ్యంలో కోవిడ్-19 కేసులు, పరీక్షలలో నిర్ధారణ శాతంపైనా ప్రధాని సమీక్షించారు.
దేశవ్యాప్తంగా టీకాలు వేయడంలో ప్రగతితోపాటు ‘హర్ ఘర్ దస్తక్’ కార్యక్రమం కింద సాగుతున్న కృషిని అధికారులు ప్రధానికి వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ- రెండో మోతదు టీకా విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉందని, అలాగే తొలి మోతాదు తీసుకున్న అందరికీ సకాలంలో రెండో మోతాదు అందేలా చూడటంపై రాష్ట్రాలను అప్రమత్తం చేయాలని ప్రధాని ఆదేశించారు. దేశంలో ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న రోగనిరోధకత ప్రతిస్పందన పరీక్షలు, ప్రజారోగ్య స్పందనలో పరిణామాల గురించి అధికారులు ప్రధానికి వివరించారు.
వివిధ దేశాల్లో ఆందోళన కలిగిస్తున్న వైరస్ కొత్తరకం ‘ఒమిక్రాన్’- దాని లక్షణాలు, ప్రభావం గురించి అధికారులు ప్రధానికి విశదీకరించారు. దీంతోపాటు భారతదేశంలో పరిణామాలపైనా సమావేశం చర్చించింది. వైరస్ కొత్త రకం వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు. కొత్త ముప్పు ముంచుకొస్తున్నందున ప్రజలంతా మరింత అప్రమత్తం కావాలని, మాస్క్ ధారణతోపాటు సామాజిక దూరం వంటి ముందు జాగ్రత్తలను విస్మరించరాదని ప్రధాని సూచించారు. అంతర్జాతీయ ప్రయాణికుల రాక, మార్గదర్శకాలకు అనుగుణంగా వారికి పరీక్షల నిర్వహణ అంశాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ‘అధిక ముప్పు’ గుర్తింపుగల దేశాలనుంచి వచ్చేవారిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. కొత్త కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షల సడలింపుపై ప్రణాళికలను సమీక్షించాలని అధికారులకు ప్రధాని సూచించారు.
దేశంలో వైరస్ జన్యుక్రమ రూపకల్పన కృషితోపాటు దేశీయంగా వ్యాప్తిలోగల రకాలపై పరిశీలన సారాంశాన్ని అధికారులు ప్రధానికి తెలియజేశారు. నిబంధనలకు తగినట్లుగా అంతర్జాతీయ ప్రయాణికులు, సమాజం నుంచి జన్యుక్రమ నిర్ధారణ కోసం నమూనాలను సేకరించాలని ప్రధాని ఈ సందర్భంగా ఆదేశించారు. వీటిని ‘ఇన్సాకాగ్’ (INSACOG) కింద ఇప్పటికే ఏర్పాటు చేసిన ప్రయోగశాలల నెట్వర్క్ సహా కోవిడ్-19 నిర్వహణ నిమిత్తం గుర్తించిన ముందస్తు హెచ్చరిక ఆనవాళ్ల ద్వారా పరీక్షించాలని సూచించారు. జన్యుక్రమ నిర్ధారణ కృషిని ముమ్మరం చేయడమే కాకుండా మరింత విస్తృతపరచాల్సిన అవసరం గురించి ప్రధాని నొక్కిచెప్పారు.
రాష్ట్ర, జిల్లా స్థాయిలలో సరైన అవగాహన దిశగా రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అధిక కేసులు నమోదయ్యే ప్రాంతాల్లో ముమ్మర నియంత్రణ.. చురుకైన నిఘా కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతం ఎక్కువ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలకు అవసరమైన సాంకేతిక సహాయం అందించాలని కూడా ఆయన ఆదేశించారు. అలాగే గాలిద్వారా వ్యాపించే వైరస్ లక్షణం దృష్ట్యా ఇళ్లలో సరైన గాలి, వెలుతురు ఉండేవిధంగా అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉందని ప్రధాని చెప్పారు.
కొత్త ఔషధ ఉత్పత్తుల విషయంలో తాము విధాన సౌలభ్యాన్ని పాటిస్తున్నామని అధికారులు ప్రధానమంత్రికి వివరించారు. దీనిపై ఆయన స్పందిస్తూ- వివిధ ఔషధాల ముందస్తు నిల్వలు తగినంతగా ఉండేవిధంగా రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాల్సిందిగా ని అధికారులను ఆదేశించారు. ఆయా రాష్ట్రాల్లో పిల్లల వైద్య సౌకర్యాలుసహా మౌలిక వైద్య వ్యవస్థల పనితీరును అక్కడి ప్రభుత్వాలతో కలిసి పరిశీలించాలని ఆయన అధికారులను కోరారు. ప్రతి రాష్ట్రంలో ‘పీఎస్ఏ’ ఆక్సిజన్ ప్లాంట్లు, వెంటిలేటర్లు సవ్యంగా పనిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకోవాలని కూడా ప్రధాని సూచించారు.
ఈ సమావేశంలో మంత్రిమండలి కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా; నీతి ఆయోగ్ (ఆరోగ్యం) సభ్యులు డాక్టర్ వి.కె.పాల్; హోంశాఖ కార్యదర్శి శ్రీ ఎ.కె.భల్లా; ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్; ఔషధ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ గోఖలే; బయో టెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ బలరామ్ భార్గవ; ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ శ్రీ వైద్య రాజేష్ కోటేచా; ఆయుష్ శాఖ కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రా; పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి ఆర్.ఎస్.శర్మ; జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏ) సీఈవో ప్రొఫెసర్ కె.విజయ రాఘవన్ (కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్రీయ సలహాదారు)సహా పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
Reviewed the COVID-19 and vaccination related situation. In light of the new variant, we remain vigilant, with a focus on containment and ensuring increased second dose coverage. Would urge people to continue following social distancing and wear masks. https://t.co/ySXtQsPCag
— Narendra Modi (@narendramodi) November 27, 2021