దేశంలో కోవిడ్-19 పరిస్థితి, ఆరోగ్య మౌలిక వసతులు, సౌకర్యాల సంసిద్ధత, టీకాల కార్యక్రమం పురోగతి, కొత్త కోవిడ్-19 రకాల ఆవిర్భావం, దేశ ప్రజానీకం ఆరోగ్యంపై వాటి ప్రభావం తదితరాలపై అంచనా దిశగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ తన అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కోవిడ్-19 కేసుల పెరుగదల నేపథ్యంలో ఈ అత్యున్నత భేటీలో ఆయన సమీక్షించారు.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 పరిస్థితితోపాటు కొన్ని దేశాల్లో కేసులు పెరుగుతుండటంపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, నీతి ఆయోగ్ సభ్యుడు ఈ సందర్భంగా ఆయనకు సమగ్ర వివరణ ఇచ్చారు. అలాగే 2022 డిసెంబర్ 22తో ముగిసిన వారంలో రోజువారీ కేసుల సగటు 153కు తగ్గి, వారంవారీ వ్యాప్తి 0.14 శాతానికి పతనమైందని వెల్లడించారు. ఈ మేరకు మన దేశంలో కోవిడ్ క్రమంగా తగ్గుముఖం పడుతోందని ప్రధానమంత్రికి తెలిపారు. అయితే, 6 వారాలనుంచి ప్రపంచమంతటా రోజువారీగా సగటున 5.9 లక్షల కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. వారి వివరణల అనంతరం ప్రధానమంత్రి స్పందిస్తూ- ఉదాసీనతకు తావివ్వకుండా నిశిత నిఘా పెట్టాలని అధికారులను అప్రమత్తం చేశారు. కోవిడ్ పీడ ఇంకా తొలగిపోలేదని, ప్రస్తుత పర్యవేక్షణ చర్యలను… ముఖ్యంగా విమానాశ్రయాల్లో బలోపేతం చేయాలని ఆదేశించారు.
పరికరాలు, ప్రక్రియలు, మానవ వనరుల పరంగా అన్ని స్థాయులలోని కోవిడ్ యంత్రాంగం మొత్తం ఉన్నతస్థాయి సంసిద్ధతతో ఉండాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఆక్సిజన్ సిలిండర్లు, పీఎస్ఏ ప్లాంట్లు, వెంటిలేటర్లు, మానవ వనరులుసహా ఆస్పత్రి మౌలిక వసతుల కార్యాచరణ సంసిద్ధతకు భరోసా కల్పించేలా కోవిడ్ నిర్దిష్ట సౌకర్యాలన్నిటినీ తనిఖీ చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ఈ చర్యల్లో భాగంగా జన్యుక్రమం నమోదు, వ్యాధి నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంపు వగైరాల వేగం పెంచాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. జన్యక్రమం నమోదుకు నిర్దేశించిన ‘ఇన్సాకాగ్’ (INSACOG) జన్యుక్రమం నమోదు ప్రయోగశాలల (ఐజీఎల్ఎల్)తో వీలైనన్ని ఎక్కువ నమూనాలను పంచుకోవాలని రాష్ట్రాలను కోరారు. దేశంలో వైరస్ కొత్తరకాల వ్యాప్తి ఉన్నట్లయితే, వాటిని త్వరగా పసిగట్టడానికి ఈ చర్యలు తోడ్పడతాయని చెప్పారు. తద్వారా ప్రజారోగ్య చర్యలను సులువుగా చేపట్టే వీలుంటుందని పేర్కొన్నారు.
కోవిడ్ సముచిత ప్రవర్తనను అన్నివేళలా.. ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ముఖ్యంగా రాబోయే పండుగల సీజన్ దృష్ట్యా ఇదెంతో కీలకమని స్పష్టం చేశారు. ఈ మేరకు రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో తప్పకుండా మాస్కు ధరించాలని సూచించారు. వృద్ధులతోపాటు దుర్బల వర్గాలవారికి ముందుజాగ్రత్త టీకాలు ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. దేశంలో ప్రజారోగ్య వ్యవస్థకు సంబంధించి మందులు, టీకాలు, పడకల వంటి సదుపాయాల లభ్యత తగినంతగా ఉన్నట్లు అధికారులు ప్రధానమంత్రికి తెలిపారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ- నిత్యావసర ఔషధాల లభ్యతసహా వాటి ధరలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న మన ముందువరుస ఆరోగ్య సిబ్బంది కృషిని ప్రముఖంగా వివరిస్తూ అదే నిస్వార్థం, అంకితభావం కొనసాగించాల్సిందిగా ప్రధాని వారికి ఉద్బోధించారు.
ఈ సమావేశంలో- కేంద్ర హోం మంత్రి శ్రీ అమిత్ షా; ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ; పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా; విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్; సమాచార-ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్; ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి శ్రీమతి భారతి ప్రవీణ్ పవార్; ప్రధాని ముఖ్య కార్యదర్శి శ్రీ పి.కె.మిశ్రా, నీతి ఆయోగ్ సీఈవో శ్రీ పరమేశ్వరన్ అయ్యర్; నీతి ఆయోగ్ (ఆరోగ్య విభాగం) సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్; మంత్రిమండలి కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా; ప్రధానమంత్రి కార్యాలయ సలహాదారు శ్రీ అమిత్ ఖారే; హోంశాఖ కార్యదర్శి శ్రీ ఎ.కె.భల్లా; శ్రీ రాజేష్ భూషణ్, కార్యదర్శి హెచ్ఎఫ్డబ్ల్యూ); డీహెచ్ఆర్ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ బహల్; ఔషధ విభాగం కార్యదర్శి (ఇన్చార్జి) శ్రీ అరుణ్ బరోకా; ఇతర శాఖల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
******
Chaired a meeting to review the public health response to COVID-19. Stressed on ramping up testing, genome sequencing and to ensure operational readiness of COVID infrastructure. Also emphasised on the need to follow COVID appropriate behaviour. https://t.co/RJpUT9XLiq
— Narendra Modi (@narendramodi) December 22, 2022