Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కోవిడ్‌-19 తాజా స్థితిపై అన్ని రాష్ర్టాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల ముఖ్య‌మంత్రుల స‌మావేశంలో ప్ర‌ధాని ప్ర‌సంగం పూర్తి పాఠం

కోవిడ్‌-19 తాజా స్థితిపై అన్ని రాష్ర్టాలు, కేంద్ర‌పాలిత ప్రాంతాల ముఖ్య‌మంత్రుల స‌మావేశంలో ప్ర‌ధాని ప్ర‌సంగం పూర్తి పాఠం


దేశంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితి తీవ్ర‌తను స‌మీక్షించిన స‌మ‌యంలో మీరంతా ఎన్నో ముఖ్య‌మైన అంశాలు ప్ర‌స్తావించారు. ఎన్నో స‌ల‌హాలు ఇచ్చారు. క‌రోనా విస్త‌ర‌ణ జోరుగా ఉన్న‌, మ‌ర‌ణాల సంఖ్య అధికంగా ఉన్న రాష్ర్టాల‌తో ప్ర‌త్యేక చ‌ర్చ జ‌ర‌గ‌డం చాలా స‌హ‌జం. కాని ఇత‌ర రాష్ర్టాలు కూడా చాలా చ‌క్క‌ని స‌ల‌హాలు ఇవ్వొచ్చు. కాబ‌ట్టి స‌మ‌ర్థ‌వంత‌మైన వ్యూహం రూపొందించేందుకు అవ‌స‌ర‌మైన సానుకూల స‌ల‌హాలు ఇవ్వాల‌ని మీ అంద‌రినీ అభ్య‌ర్థిస్తున్నాను.
దేశంలో మ‌రోసారి స‌వాలుతో కూడిన వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతోంద‌ని కేంద్ర‌ ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఆరోగ్య‌ శాఖ కార్య‌ద‌ర్శి ఇచ్చిన ప్రెజెంటేష‌న్ స్ప‌ష్టంగా తెలుపుతోంది. కొన్ని రాష్ర్టాల్లో అయితే ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌న‌క‌రంగా ఉంది. ఇలాంటి వాతావ‌ర‌ణంలో పాల‌నా వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌ర‌చ‌డం అత్యంత కీల‌కం. ఏడాది పాటు సాగిన ఈ పోరాటంలో కొంత అల‌స‌ట ఏర్ప‌డింద‌ని, కొంత నిర్ల‌క్ష్య వైఖ‌రి వ‌చ్చింద‌ని నేను అర్ధం చేసుకోగ‌ల‌ను. కాని రాబోయే రెండు, మూడు వారాల్లో మ‌నం మ‌న పాల‌నా వ్య‌వ‌స్థ బ‌లం ఏమిటో నిరూపించాల్సిన అవ‌స‌రం ఉంది.
మిత్రులారా,
ఈ రోజు స‌మీక్ష‌లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన అంశాలు కొన్ని కీల‌క‌మైన‌వి. వాటిపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించ‌డం అవ‌స‌రం.

మొద‌టిది, భార‌త్ లో ప్ర‌స్తుతం కేసుల సంఖ్య తొలి విడ‌తలో న‌మోదైన గ‌రిష్ఠ కేసుల సంఖ్య‌ను మించిపోయింది. కేసుల పెరుగుద‌ల రేటు గ‌తంలో క‌న్నా చాలా వేగంగా ఉంది.

రెండోది. మ‌హారాష్ట్ర, చ‌త్తీస్ గ‌ఢ్‌, పంజాబ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, గుజ‌రాత్ స‌హా ప‌లు రాష్ర్టాల్లో కేసుల సంఖ్య ఇప్పుడు తొలి విడ‌త‌ను మించిపోయింది. కొన్ని రాష్ర్టాల్లో సంఖ్య కూడా పెరుగుతోంది. ఇది మ‌నంద‌రం తీవ్రంగా ఆందోళ‌న చెందాల్సిన స్థితి.

ఇక మూడో అంశం. గ‌తంతో పోల్చితే ఈ సారి ప్ర‌జ‌ల్లో చాలా అల‌స‌త్వం క‌నిపిస్తోంది. కొన్ని రాష్ర్టాల్లో పాల‌నా యంత్రాంగం కూడా మంద‌కొడిగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. ఈ ప‌రిస్థితిలో ప్ర‌స్తుత కేసుల పెరుగుద‌ల మ‌రిన్ని గాయాల‌ను జోడిస్తోంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు తిరిగి ఇప్పుడు యుద్ధ ప్రాతిప‌దిక‌న కృషి చేయ‌డం అవ‌స‌రం.

మిత్రులారా,
ఇన్ని స‌వాళ్లున్నా కూడా గ‌తంలో క‌న్నా మ‌న‌కి మంచి అనుభ‌వం వ‌న‌రులు ఉన్నాయి. ఇప్పుడు వ్యాక్సిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. క‌ష్టించి ప‌ని చేసే స్వ‌భావం ఉన్న డాక్ట‌ర్లు, ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు, ఆరోగ్య సంర‌క్ష‌ణ సిబ్బంది ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో ప‌రిస్థితిని అదుపులో ఉంచేందుకు స‌హాయ‌ప‌డ్డారు, ఇంకా కృషి కొన‌సాగిస్తూనే ఉన్నారు. గ‌తంలోని అనుభ‌వాల‌ను మీరంద‌రూ ఎంతో చ‌క్క‌గా వినియోగించుకుంటార‌ని ఆశిస్తున్నాను.

గ‌త ఏడాది ప‌రిస్థితి ఏమిటో ఒక్క‌సారి ఆలోచించండి. మ‌న‌కి టెస్టింగ్ లాబ్ లు లేవు. మాస్కుల అందుబాటు కూడా ఆందోళ‌న‌క‌ర‌మైన అంశంగానే నిలిచింది. పిపిఎఫ్ కిట్లు లేవు. అలాంటి స‌మ‌యంలో ఆ సంక్లిష్ట ప‌రిస్థితి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు మ‌న ముందున్న ఒకే ఒక మార్గం లాక్ డౌన్‌. ఆ త‌ర్వాత మ‌నం అన్నింటినీ వేగ‌వంతం చేయ‌గ‌లిగాం. ఆ వ్యూహం ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రం అయింది. మ‌నం వ‌న‌రులు స‌మీక‌రించుకుని సొంత సామ‌ర్థ్యాల‌ను పెంచుకున్నాం. ప్ర‌పంచంలో ఏది అందుబాటులో  ఉంటే దాన్ని అందుకుని లాక్ డౌన్ స‌మ‌యంలో ఉప‌యోగించుకున్నాం.

ఈ రోజున అన్ని వ‌న‌రులు ఉన్న‌ప్ప‌టికీ ఇది మ‌న పాల‌నా యంత్రాంగానికి ఒక‌ ప‌రీక్షా స‌మ‌యం. ఇప్పుడు మ‌నం సూక్ష్మ క‌ట్ట‌డి జోన్ల‌పై దృష్టి పెట్టాలి. చిన్న క‌ట్ట‌డి జోన్ల‌పై అధికంగా దృష్టి సారించాలి. ఎక్క‌డెక్క‌డ రాత్రి క‌ర్ఫ్యూ అమ‌లులో ఉందో అక్క‌డ దానికి “క‌రోనా క‌ర్ఫ్యూ” అని పేరు పెట్టాలి. ప్ర‌జ‌ల్లో క‌రోనా వైర‌స్ చైత‌న్యం కొన‌సాగించాలి.

కొంత మంది తెలివిగా క‌రోనా రాత్రి స‌మ‌యంలోనే దాడి చేస్తుందా అనే వాదం తెర పైకి తెచ్చారు. కాని రాత్రి క‌ర్ఫ్యూ అనేది ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆమోదించిన విధానం.  మ‌నం క‌రోనా శ‌కంలో ఉన్నామ‌ని అది ప్ర‌జ‌ల‌కు గుర్తు చేస్తుంది. అదే స‌మ‌యంలో సాధ్య‌మైనంత వ‌ర‌కు జీవ‌న‌శైలికి విఘాతం క‌ల‌గ‌కుండా నిరోధిస్తుంది.

ఇత‌ర కార్య‌క‌లాపాలేవీ ప్ర‌భావితం కాకుండా ఉండ‌డానికి వీలుగా “క‌రోనా క‌ర్ఫ్యూ” రాత్రి 9 లేదా 10 గంట‌ల‌కు ప్రారంభ‌మై ఉద‌యం 5 లేదా 6 గంట‌ల వ‌ర‌కు ఉండ‌డం మంచిది. అందుకే దీన్ని “క‌రోనా క‌ర్ఫ్యూ”గా ప్రాచుర్యంలోకి తేవాలి.  ప్ర‌జ‌లు క‌రోనా వైర‌స్ గురించి చైత‌న్య‌వంతులు కావ‌డానికి క‌రోనా క‌ర్ఫ్యూ దోహ‌ద‌ప‌డుతుంది. మ‌నంద‌రం దీనిపై దృష్టి కేంద్రీక‌రించాలి. నేను ముందుగానే చెప్పిన‌ట్టు వీలైన‌న్ని అధిక‌ వ‌న‌రులు మ‌నం స‌మీక‌రించుకోవ‌డం, క‌ట్ట‌డి జోన్లు ప్ర‌క‌టించ‌డం, స‌త్ఫ‌లితాలు సాధించ‌డం అవ‌స‌రం. అలాగే పాల‌నా వ్య‌వ‌స్థ‌ను క‌ట్టుదిట్టం చేయ‌డం, ప్ర‌తీ ఒక్క దాన్ని సూక్ష్మంగా ప‌రిశీలించ‌డం కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నం చేయాలి. ఈ వ్యూహం మంచి ఫ‌లితాల‌నిస్తుంది, న‌న్ను న‌మ్మండి.
తొలి విడ‌తలో యాక్టివ్ కేసుల సంఖ్య 10 ల‌క్ష‌ల నుంచి 1.25 ల‌క్ష‌ల‌కు దింప‌డంలో మ‌నం విజ‌యం  సాధించాం. దాన్ని సాధ్యం చేయ‌డానికి ఉప‌యోగించిన వ్యూహ‌మే ఇప్పుడు కూడా స‌మ‌ర్థ‌వంతంగా నిలుస్తుంది. త‌గిన‌న్ని వ‌న‌రులు అందుబాటులో లేని కాలంలోనే మ‌నం ఈ విజ‌యం సాధించాం. మ‌రి ఇప్పుడో మంచి వ‌న‌రులున్నాయి, అనుభ‌వం ఉంది. ప్ర‌స్తుత గ‌రిష్ఠ కేసుల సంఖ్య మ‌రింత పెర‌గ‌కుండా క‌ట్ట‌డి చేసి నిలువ‌రించ‌గ‌ల సామ‌ర్థ్యం మ‌న‌కుంది.

టెస్ట్, ట్రాక్‌, ట్రీట్ వ్యూహం, క‌రోనా అనుగుణ వైఖ‌రి, కోవిడ్ అదుపు మూడింటిపై మ‌నం దృష్టి కేంద్రీక‌రించాల‌ని అనుభ‌వం చెబుతోంది. రాష్ట్ర ప్ర‌భుత్వ యంత్రాంగాల స‌హాయంతో రాష్ర్టాల్లో క‌రోనా ధోర‌ణుల‌పై విశ్లేష‌ణ లేదా స‌ర్వే నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రులంద‌రికీ నేను సూచిస్తున్నాను. గ‌త క‌రోనా కాలంలో కూడా ఇదే జ‌రిగింది. దాంతో ప్ర‌జ‌ల్లో క‌రోనా ప‌ట్ల భ‌యం ఏర్ప‌డి ఏ మాత్రం స్వ‌ల్ప ల‌క్ష‌ణాలున్నా త‌క్ష‌ణ కార్యాచ‌ర‌ణ‌కు దిగే వారు. రెండో విష‌యం ఏమిటంటే ఈ సారి ఎలాంటి ల‌క్ష‌ణాలు లేని రోగుల సంఖ్య అధికంగా ఉంది. అందుకే వారంతా తాము సాధార‌ణ జ‌లుబుతో మాత్ర‌మే బాధ ప‌డుతున్న‌ట్టు భావిస్తున్నారు.

ల‌క్ష‌ణాలేవీ లేక‌పోవ‌డం వ‌ల్ల కుటుంబంలోని ఇత‌ర స‌భ్యులు ఎప్ప‌టి వ‌లెనే క‌లిసి మెలిసి తిరుగుతున్నారు. ఫ‌లితంగా కుటుంబం మొత్తం క‌రోనా బారిన ప‌డుతోంది. తీవ్ర‌త పెరిగిన‌ప్పుడు మాత్ర‌మే మ‌నం అధికంగా దృష్టి పెడ‌తాం. అలాగే క‌రోనా విష‌యంలో ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యంగా మార‌డం కూడా కేసుల సంఖ్య  పెరిగేందుకు దోహ‌ద‌ప‌డింది. చురుగ్గా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం ఒక్క‌టే దానికి ప‌రిష్కారం. మ‌నం ఎంత ఎక్కువ‌గా క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య పెంచ‌గ‌లిగితే అంత‌గా ల‌క్ష‌ణాలు లేకుండానే క‌రోనా బారిన ప‌డిన వారిని గుర్తించి క్వారంటైన్ కు పంప‌గ‌లుగుతాం.  త‌ద్వారా మొత్తం కుటుంబం క‌రోనా బారిన ప‌డ‌కుండా కాపాడ‌గ‌లుగుతాం. అందుకే ఇప్పుడు మ‌నం వ్యాక్సినేష‌న్ క‌న్నా ప‌రీక్ష‌ల గురించి ఎక్కువ‌గా చ‌ర్చించాలి. ప‌రీక్ష‌లు జ‌రుగుతున్న తీరును మ‌నంద‌రం మార్చాలి.

క‌రోనా వ్యాప్తికి కార‌ణం అవుతున్న వారిని క‌ట్ట‌డి చేయ‌డం ఇప్ప‌టి త‌క్ష‌ణావ‌స‌రం. మీరు తీసుకుని వ‌స్తే త‌ప్ప ఈ క‌రోనా ఇంటిలోకి దానంత‌ట అదే ప్ర‌వేశించ‌లేద‌ని  నేను గ‌తంలో చెప్పాను. క‌రోనా నిబంధ‌న‌లు పాటించేలా ప్ర‌జ‌ల‌ను చేత‌న్య‌వంతుల‌ను చేయాల్సిన అవ‌స‌రం ఉంది. టెస్టింగ్‌, ట్రాకింగ్ ఇందులో ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయి. క‌రోనా టెస్టింగ్ ను మ‌నం తేలిగ్గా తీసుకోకూడ‌దు.

ప్ర‌తీ ఒక్క రాష్ట్రంలోనూ క‌రోనా ప‌రీక్ష‌ల సంఖ్య పెంచ‌డం ద్వారా మాత్ర‌మే పాజిటివిటీ రేటు 5 శాతం క‌న్నా దిగువ‌కు వ‌స్తుంది. ప్రారంభంలో క‌రోనా గ‌ణాంకాలు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఒక రాష్ట్రం అద్భుతంగా ప‌ని చేస్తోంది, కేసులు పెరుగుతున్న‌కొద్ది మిగ‌తా రాష్ర్టాలు వెనుక‌బ‌డిపోతున్నాయంటూ ప్రాచుర్యంలోకి వ‌చ్చిన మాట‌లు మీకు గుర్తుండే ఉంటుంది. రాష్ర్టాల‌ను విమ‌ర్శించ‌డం కొంద‌రికి ఫ్యాష‌న్ గా మారింది. పెరుగుతున్న కేసుల సంఖ్య చూసి చింతించ‌వ‌ద్దు, మీ ప‌నితీరు సంతృప్తిక‌రంగా లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే అలా జ‌రుగుతోంద‌ని టెన్ష‌న్ ప‌డ‌వ‌ద్దు, దానికి బ‌దులుగా ప‌రీక్ష‌ల‌పై దృష్టి పెట్టండి అని తొలి స‌మావేశంలోనే నేను చెప్పాను. అదే మాట ఇప్పుడు కూడా చెబుతున్నాను. కేసుల సంఖ్య పెరుగుతున్నంత మాత్రాన మీరేదో త‌ప్పు చేశార‌ని అర్ధం కాదు. ప‌రీక్ష‌ల సంఖ్య పెంచ‌డం వ‌ల్ల‌నే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. అదొక్క‌టే మ‌న ముందున్న ప‌రిష్కారం. విమ‌ర్శించే వారుంటారు, వారిని అలాగే మాట్లాడుకోనీయండి, మ‌నం విమ‌ర్శ‌ను కూడా భ‌రించ‌క త‌ప్ప‌దు.
ప‌రీక్ష‌ల సంఖ్య పెంచ‌డం పాజిటివిటీ  రేటు పెర‌గ‌డానికి కార‌ణం అవుతుంటే అలాగే కానీయండి. కేవ‌లం సంఖ్య ఆధారంగా రాష్ర్టాల ప‌నితీరును నిర్ఱారించ‌కూడ‌దు. అందుకే ఆ ఒత్తిడి నుంచి బ‌య‌ట‌ప‌డి టెస్టింగ్ పై దృష్టి పెట్టాల‌ని మీ అంద‌రికీ నా అభ్య‌ర్థ‌న‌.

ఆర్ టి-పిసిఆర్ టెస్టుల సంఖ్య 70 శాతానికి పెంచ‌డం మ‌న ల‌క్ష్యం కావాలి. ఆర్ టి-పిసిఆర్ టెస్టులు నిర్వ‌హిస్తున్న వారు శాంపిల్స్ తీసుకోవ‌డంలో సోమ‌రిత‌నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని  వార్త‌లు వ‌చ్చాయి. వాటిలో నిజం ఎంత అనేది నేను ప‌రిశీలించ‌లేదు. ప‌రీక్ష‌లు స‌క్ర‌మంగా చేయ‌క‌పోతే టెస్టులో నెగిటివ్ ఫ‌లిత‌మే వ‌స్తుంది. ఏది ఏమైనా దాన్ని నిలువ‌రించాల్సి ఉంది. స‌రిగా టెస్ట్ చేసిన‌ట్ట‌యితే పాజిటివ్ కేసుల‌కు మాత్ర‌మే చికిత్స చేయ‌డం సాధ్య‌మ‌వుతుంది. టెస్ట్ లు స‌రిగా జ‌ర‌గ‌క‌పోతే వైర‌స్‌ కుటుంబం మొత్తానికి, చివ‌రికి ఇరుగు పొరుగు వారికి విస్త‌రిస్తుంది.

ఆర్ టి-పిసిఆర్ టెస్టులు పెంచాల‌నే విష‌యం గ‌త స‌మావేశంలో కూడా మ‌నం చ‌ర్చించుకున్నాం. అదే మాట ఇప్పుడు ఇక్క‌డ పున‌రుద్ఘాటిస్తున్నాను.  ప్ర‌తీ ఒక్క‌రికీ కొన్ని లాబ్ లు నెగెటివ్ రిపోర్ట్, మ‌రికొన్ని లాబ్ లు పాజిటివ్ రిపోర్టు ఇస్తున్న విష‌యం మీరు గ‌మ‌నించే ఉంటారు. ఇది స‌రైన చిత్రాన్ని మ‌న‌కి ఇవ్వ‌దు. ఎక్క‌డ ఏ లోపం ఉందో మ‌నం గుర్తించాలి. కొన్ని రాష్ట్రాలు మౌలిక వ‌స‌తుల‌ను కూడా పెంచాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌న‌వ ఎంత వేగంగా అది చేయ‌గ‌లిగితే అంత మెరుగైన ఫ‌లితం పొంద‌గ‌లుగుతాం.

లాబ్ ల‌లో షిఫ్ట్ ల సంఖ్య పెంచాల్సి వ‌స్తే దాన్ని త‌క్ష‌ణం చేయాలి. నేను గ‌తంలోనే చెప్పిన‌ట్టు క‌ట్ట‌డి జోన్ల‌లో టెస్టుల‌కు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపాల్సిన అవ‌స‌రం ఉంది. క‌ట్ట‌డి జోన్ల‌లో ఏ ఒక్క వ్య‌క్తిని ప‌రీక్షించ‌కుండా వ‌ద‌ల‌కూడ‌దు. అప్పుడు త్వ‌రిత ఫ‌లితాలు మీరే చూస్తారు.

మిత్రులారా,
పాల‌నా యంత్రాంగం స్థాయిలోనే ట్రాకింగ్‌, టెస్టింగ్‌, క‌ట్ట‌డిని పెంచాల్సిన అవ‌స‌రం ఉంది. క‌రోనా పాజిటివ్ కేసు బ‌య‌ట‌ప‌డిన 72 గంట‌ల వ్య‌వ‌ధిలోనే వారితో సన్నిహితంగా మెలిగిన‌ క‌నీసం 30 మందిని గుర్తించ‌డం మ‌న ల‌క్ష్యం కావాలి. అలాగే క‌ట్ట‌డి జోన్ల స‌రిహ‌ద్దులు కూడా స్ప‌ష్టంగా గుర్తించాలి. అది సందిగ్ధంగా ఉండ‌కూడ‌దు. ఒక ఆరంత‌స్తుల భ‌వ‌నంలో రెండు ఫ్లాట్ల‌లో పాజిటివ్ కేసులు గుర్తించినంత మాత్రాన ఆ ప్రాంతం మొత్తాన్ని క‌ట్ట‌డి జోన్ గా మార్చ‌కూడ‌దు. ప‌రిస‌రాల్లోని ట‌వ‌ర్ ను కూడా సీల్ చేయ‌కూడ‌దు. ఒక ట‌వ‌ర్ మొత్తాన్ని లేదా ఒక ప్రాంతాన్ని సీల్ చేయ‌డానికి ఎంతో ప్ర‌య‌త్నం అవ‌స‌రం లేదు.

మీరంద‌రూ ప్ర‌స్తుత ప‌రిస్థితి విష‌యంలో అప్ర‌మ‌త్తంగానే ఉన్నారు. అప్ర‌మ‌త్త‌త విష‌యంలో ఎలాంటి నిర్లిప్త‌త ప‌నికిరాదు. కోవిడ్ అల‌స‌ట ఇందుకు దారి తీయ‌డాన్ని మ‌నం అనుమ‌తించ‌కూడ‌దు. నిర్దిష్ట కాల‌ప‌రిమితిలో ఒక సారి కాంటాక్ట్ ల‌ను గుర్తిస్తున్న రాష్ర్టాలు మంచి ఫ‌లితాలు సాధిస్తున్నాయి.

క‌ట్ట‌డి జోన్ల‌కు సంబంధించిన ప్రామాణిక అనుస‌ర‌ణీయ‌ నియ‌మావ‌ళిని (ఎస్ఓపి) ఎంతో అనుభ‌వంతో రూపొందించ‌డం జ‌రిగింది. అలాగే ఆ నియ‌మావ‌ళిలో ఎప్ప‌టికప్పుడు స‌వ‌ర‌ణ‌లు కూడా చేస్తున్నారు. అందువ‌ల్ల ఆ ఎస్ఓపిల‌ను తుచ త‌ప్ప‌కుండా అనుస‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి. అప్పుడే మంచి ఫ‌లితాలు సాధ్యం. దానిపై దృష్టి సారించాల‌న్న‌ది మీ అంద‌రికీ నా అభ్య‌ర్థ‌న‌.

మిత్రులారా,
మ‌న చ‌ర్చ‌ల్లో మ‌ర‌ణాల రేటు గురించి ఆందోళ‌న ప్ర‌క‌టించాం. మ‌ర‌ణాల రేటును మ‌నం క‌నిష్ఠ స్థాయికి త‌గ్గించాల్సి ఉంది. వాస్త‌వానికి సాధార‌ణ జీవితం గ‌డుపుతూ ఏదైనా ఆరోగ్య స‌మ‌స్య ఏర్ప‌డిన‌ప్పుడు దాన్ని సాధార‌ణ రుగ్మ‌త‌గానే భావించి కుటుంబం అంత‌టికీ వైర‌స్ వ్యాపింప‌చేస్తున్న వారే అస‌లు స‌మ‌స్య‌కు మూల కార‌ణం. ప‌రిస్థితి దారుణంగా క్షీణించిన‌ప్పుడు మాత్ర‌మే వారు ఆస్ప‌త్రికి వెళ్తున్నారు.  టెస్టింగ్ పూర్త‌య్యే స‌మ‌యానికి చాలా కాలం వృధా అవుతోంది. ప్ర‌తీ ఆస్ప‌త్రిలో మ‌ర‌ణాల‌కు సంబంధించిన స‌మాచారం బ‌య‌ట‌కు రావాలి. ఏ ద‌శ‌లో వ్యాధిని గుర్తించారు, రోగిని ఎప్పుడు చేర్చారు, రోగికి ఇత‌ర వ్యాధులేవైనా ఉన్నాయా, మ‌ర‌ణానికి కార‌ణం ఏమిటి వంటి వివ‌రాల‌న్నీ బ‌య‌ట‌పెట్టాలి. మ‌న ద‌గ్గ‌ర స‌మ‌గ్ర డేటా ఉన్న‌ట్ట‌యితే ప్రాణాలు ర‌క్షించ‌డం తేలిక‌.

మిత్రులారా,
ఢిల్లీలోని ఎయిమ్స్ క‌రోనాపై ప్ర‌తీ మంగ‌ళ‌, శుక్ర‌వారాల్లో వెబినార్లు నిర్వ‌హిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాలు చెందిన వైద్యులు అందులో పాలు పంచుకుంటున్నారు. ఈ కృషి కొన‌సాగాలి.జాతీయ క్లినిక‌ల్ మేనేజ్ మెంట్ విధానాల‌పై అవ‌గాహ‌న ఏర్ప‌డాలంటే రాష్ర్టాల్లోని అన్ని ఆస్ప‌త్రులు ఈ వెబినార్ల‌లో పాల్గొనాలి. వైద్య సిబ్బంది అంద‌రికీ ఈ వెబినార్ల ద్వారా వీట‌న్నింటి గురించి వివ‌రించాలి. అలాగే నిర్దిష్ట కాల‌ప‌రిమితిలో అంబులెన్సులు, వెంటిలేట‌ర్లు, ఆక్సిజెన్ ల‌భ్య‌త‌పై స‌మీక్ష నిర్వ‌హించాలి. గ‌త విడ‌తలో కేసులు గ‌రిష్ఠ స్థాయిల‌కు చేరిన స‌మ‌యం క‌న్నా ఈ సారి ఆక్సిజెన్ విస్తృతంగా వినియోగించ‌డంలేదు. అందుకే మ‌నం ప్ర‌తీ ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించి నివేదిక‌లు ప‌రీక్షిస్తూ ఉండాలి.

మిత్రులారా,
మ‌నం రోజుకి 40 ల‌క్ష‌ల వ్యాక్సినేష‌న్ మైలురాయిని దాటాం. వ్యాక్సినేష‌న్ కి సంబంధించిన ఎన్నో ముఖ్య‌మైన అంశాలు కూడా మ‌న చ‌ర్చ‌ల్లో ముందువ‌రుస‌లో ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. మీ అధికారులంద‌రినీ వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాముల‌ను చేయండి. వ్యాక్సినేష‌న్  కి సంబంధించిన అన్ని స‌దుపాయాలు మ‌న ద‌గ్గ‌ర ఉన్నాయి. ఆ విష‌యంలో మ‌నం ప్ర‌పంచంలోని సంప‌న్న దేశాల క‌న్నా ఏ విధంగానూ భిన్నం కాదు. మీరంతా దాన్ని అధ్య‌య‌నం చేయాలి. మీరంద‌రూ విద్యావంతులే, దాన్ని ఒక సారి ప‌రిశీలించండి.

కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధితో పాటు వ్యాక్సినేష‌న్ త‌యారీని గ‌రిష్ఠ స్థాయికి పెంచే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అలాగే వ్యాక్సిన్ల నిల్వ‌లు, వృధా వంటి  అంశాల‌పై కూడా చ‌ర్చ‌లు చోటు చేసుకుంటున్నాయి. వ్యాక్సినేష‌న్ ఎలా అభివృద్ధి చెందుతుంద‌నేది మీ అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. త‌గినంత‌గా స‌మ‌యం లేని వాతావ‌ర‌ణంలో అంత పెద్ద ప్ర‌యోగ‌శాల‌లు ఏర్పాటు చేయ‌డం సాధ్యం కాదు. అందుబాటులో ఉన్న వాటిని ఉప‌యోగించుకోవాలి. దాన్ని ప్రాధాన్యంలో నిల‌పాలి.  ఒకే రాష్ర్టానికి మొత్తం స్టాక్ అంతా కేటాయించి మంచి ఫ‌లితాలు రావాల‌ని ఆశించడం ఏ విధంగాను మంచి వైఖ‌రి కాదు. మొత్తం దేశ ప్ర‌యోజ‌నాలు దృష్టిలో ఉంచుకుని మ‌నం వ్య‌వ‌హ‌రించాలి. వ్యాక్సిన్ వృధాను నివారించ‌డమే క‌రోనా నిర్వ‌హ‌ణ‌లో అతి పెద్ద విష‌యం.

మిత్రులారా,
అంద‌రితో విస్తృతంగా చ‌ర్చించి రాష్ట్ర ప్ర‌భుత్వాల‌న్నింటి అనుమ‌తితోనే జాతీయ స్థాయి వ్యూహం రూపొందించ‌డం జ‌రిగింది. వైర‌స్ వ్యాప్తి అత్య‌ధికంగా ఉన్న జిల్లాల్లో 45 సంవ‌త్స‌రాల వ‌య‌సు పైబ‌డిన అంద‌రికీ వ్యాక్సినేష‌న్ చేయించేందుకు దృష్టి సారించాలి. ఇది మీరు సాధించి తీరాలి. నేను ఒక స‌ల‌హా ఇస్తాను. కొన్ని సంద‌ర్భాల్లో ప‌రిస్థితిని మార్చేందుకు అది స‌హాయ‌ప‌డుతుంది. ఏప్రిల్ 11వ తేదీన జ్యోతిబా పూలే జ‌యంతి, 14న బాబా సాహెబ్ జ‌యంతి ఉన్నాయి. ఆ రెండు రోజుల మ‌ధ్య‌న మ‌నం “టీకా ఉత్స‌వ్” లేదా వ్యాక్సిన పండుగ నిర్వ‌హించ‌వ‌చ్చునా, “టీకా ఉత్స‌వ్” వాతావ‌ర‌ణం క‌లిగించ‌గ‌ల‌మా?
ఈ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం ద్వారా ఈ స‌మ‌యంలో ఎలాంటి వృధాకు తావు లేని విధంగా అర్హులైన వారంద‌రికీ గ‌రిష్ఠ స్థాయిలో వ్యాక్సినేష‌న్ చేయించాలి. ఈ “టీకా ఉత్స‌వ్” జ‌రిగే నాలుగు రోజుల కాలం ఎలాంటి వృధా లేకుండా చేసిన‌ట్ట‌యితే మ‌న వ్యాక్సినేష‌న్ సామ‌ర్థ్యం కూడా పెరుగుతుంది. మ‌న‌కు ప్ర‌స్తుతం ఉన్న వ్యాక్సినేష‌న్ సామ‌ర్థ్యాన్ని  పూర్తి స్థాయిలో ఉప‌యోగించుకోవాలి. ఇందుకోసం అవ‌స‌రం అయితే వ్యాక్సినేష‌న్ కేంద్రాల‌ను కూడా పెంచాలి. మ‌రి ఏప్రిల్ 11-14 తేదీల మ‌ధ్య మ‌నం ఏ విధంగా క‌దులుతామో చూద్దాం. అలా చేసిన‌ట్ట‌యితే మ‌నం సంతృప్తి పొంద‌గ‌లుగుతాం. ప‌రిస్థితిని మార్చేందుకు అది ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఎంత వీలైతే అంత అధికంగా వ్యాక్సిన్ డోస్ లు అందించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వ యంత్రాంగానికి నేను చెప్పాను. “టీకా ఉత్స‌వ్” స‌మ‌యంలో వీలైనంత ఎక్కువ మందికి టీకా అందేలా చూడ‌డం మ‌న ప్రాధాన్యం కావాలి.
దేశంలోని యువ‌త‌కు నేను ఒక అభ్య‌ర్థ‌న చేస్తున్నాను. 45 సంవ‌త్స‌రాల వ‌య‌సు దాటిన అంద‌రూ వ్యాక్సినేష‌న్ చేయించుకునేందుకు మీరు స‌హాయ‌ప‌డండి. యువ‌త అంద‌రికీ నా ప్ర‌త్యేక అభ్య‌ర్థ‌న ఇది. మీరంతా ఆరోగ్యంతో ఉన్నారు, మీలో వ‌న‌రులు అపారం, ఆ శ‌క్తితో మీరు ఎన్నో చేయ‌గ‌లుగుతారు. సామాజిక దూరం పాటించ‌డం, మాస్కులు ధ‌రించ‌డం వంటివి యువ‌త చేయ‌గ‌లిగితే క‌రోనా వారి ద‌రికి కూడా చేర‌దు.
యువ‌త‌లో ముందు జాగ్ర‌త్త వైఖ‌రిని మ‌నం అల‌వ‌ర‌చాలి. వ్యాక్సినేష‌న్ చేయించుకోవాల‌ని వారిని ఒత్తిడి చేసే బ‌దులు నియ‌మావ‌ళి పాటించేలా వారిలో స్ఫూర్తి నింపాలి. యువ‌త స‌వాలును స్వీక‌రించిన‌ట్ట‌యితే వారు స్వ‌యంగా నిబంధ‌న‌లు పాటించ‌డ‌మే కాదు, ఇత‌రులు కూడా నిబంధ‌న‌లు పాటించేలా చేయ‌గ‌లుగుతారు. మ‌నం పాజిటివ్‌ కేసుల గ‌రిష్ఠ స్థాయికి చేరిన నాటి ప‌రిస్థితిని మ‌నం ఊహించుకున్న‌ట్ట‌యితే మ‌నం విశ్వాసంతో ముందుకు క‌దులుతాం.

ప్ర‌భుత్వం అభివృద్ధి చేసిన డిజిట‌ల్ వ్య‌వ‌స్థ కూడా ప్ర‌జ‌ల‌కు వ్యాక్సినేష‌న్ లో ఉప‌యోగ‌కారిగా ఉంది. ప్ర‌జ‌లు దాన్ని ప్ర‌శంసిస్తున్నారు. కాని పేద కుటుంబాల‌కు టెక్నాల‌జీ అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల దాని గురించి తెలియ‌దు. అలాంటి కుటుంబాల‌కు కూడా స‌హాయ‌ప‌డాల‌ని యువ‌త‌ను నేను అభ్య‌ర్థిస్తున్నాను. ఎన్ సిసి, ఎన్ఎస్ఎస్, ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌ల‌ను మ‌నం ఉప‌యోగించుకోవ‌డం ద్వారా ప్ర‌జ‌ల‌కు ఊర‌ట క‌ల్పించ‌వ‌చ్చు.

భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు మురికివాడ‌ల్లో నివ‌శిస్తున్నారు. వారికి కూడా ఈ విష‌యాల‌న్నీ తెలియ‌చేయాలి. ఇందుకు అవ‌స‌రం అయిన వ‌లంటీర్లు, పౌర స‌మాజ ప్ర‌తినిధులు, యువ‌త‌ను ప్ర‌భుత్వాలు స‌మీక‌రించాలి. వారంద‌రికీ ప్రాధాన్య‌తా క్ర‌మంలో టీకా వేయించేందుకు మ‌నం ప్ర‌య‌త్నించాలి. ఈ కృషి ద్వారా మ‌నం సంతృప్తి పొంద‌గ‌లుగుతాం. వ్యాక్సినేష‌న్ వేయించ‌డ‌మే కాదు, వ్యాక్సినేష‌న్ త‌ర్వాత కూడా ఎలాంటి నిర్ల‌క్ష్యం లేకుండా మ‌నం చూడాలి. ఇప్పుడు త‌మ‌కు ఏం కాద‌న్న న‌మ్మ‌కం ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డ‌డ‌మే పెద్ద స‌వాలు. ఔష‌ధాలే కాదు, క‌రోనా నియ‌మావ‌ళి కూడా క‌ఠినంగా పాటించాల‌ని నేను తొలి రోజు నుంచి చెబుతూనే ఉన్నాను.

వ్యాక్సినేష‌న్ త‌ర్వాత కూడా మాస్కులు ధ‌రించ‌డం, ఇత‌ర‌ క‌రోనా నియ‌మావ‌ళి పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి అనే విష‌యం మ‌నం ప‌దే ప‌దే ప్ర‌జ‌ల‌కు చెప్పాలి. మాస్కుల విష‌యంలో మ‌నం చైత‌న్యం తిరిగి క‌ల్పించ‌డంతో పాటు ఇత‌ర నియ‌మావ‌ళిని కూడా వివ‌రించాలి. ఇందుకోసం స‌మాజంలో ప‌లుకుబ‌డి గ‌ల వారు, సామాజిక సంస్థ‌లు, సెల‌బ్రిటీల‌ స‌హాయం తిరిగి తీసుకోవాలి. గ‌వ‌ర్న‌ర్ల వ్య‌వ‌స్థ‌ను కూడా మ‌నం గ‌రిష్ఠంగా ఉపయోగించుకోవాల‌ని మీ అంద‌రినీ కోరుతున్నాను.

గ‌వ‌ర్న‌ర్ల నాయ‌క‌త్వం, ముఖ్య‌మంత్రుల మార్గ‌ద‌ర్శ‌కంలో అన్ని రాష్ర్టాలు అఖిల ప‌క్ష స‌మావేశాలు నిర్వ‌హించి ఆచ‌ర‌ణీయ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాలి. ఎన్నికైన  ప్ర‌జాప్ర‌తినిధులంద‌రితోనూ వ‌ర్చువ‌ల్ వెబినార్లు నిర్వ‌హించాల‌ని నేను గ‌వ‌ర్న‌ర్లు, ముఖ్య‌మంత్రుల‌ను అభ్య‌ర్థిస్తున్నాను. ప‌ట్ట‌ణ సంస్థ‌లు, గ్రామీణ పాల‌నా సంస్థ‌ల నుంచి ఈ కృషి ప్రారంభం కావాలి. ఈ అంశాన్ని రాజ‌కీయం చేయ‌కూడ‌ద‌ని, మ‌నంద‌రం క‌లిసిక‌ట్టుగా ప‌ని చేయాల‌నే సానుకూల సందేశం దాని ద్వారా అందుతుంది.

ముఖ్య‌మంత్రులు చాలా అంశాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతూ ఉంటారు గ‌నుక గ‌వ‌ర్న‌ర్లు మ‌త సంస్థ‌ల నాయ‌కులు, పౌర స‌మాజ నాయ‌కులు, సెల‌బ్రిటీలు, ర‌చ‌యిత‌లు, క‌ళాకారులు, క్రీడాకారులు, ఇత‌రుల‌తో వెబినార్లు లేదా శిఖ‌రాగ్ర స‌మావేశాలు నిర్వ‌హించాలి. భిన్న రంగాల్లోని వారిని ఒకే తాటి పైకి తీసుకురావ‌డానికి ఈ ప్ర‌య‌త్నం దోహ‌ద‌ప‌డుతంద‌ని నేను భావిస్తున్నాను. నియ‌మావ‌ళి పాటించ‌డం, టెస్టుల‌కు వెళ్ల‌డంపై ఆ స‌మావేశాల స‌హాయంతో చైత‌న్యం పెంచాలి. మ‌నం టెస్టింగ్ గురించి మ‌రిచిపోయి వ్యాక్సినేష‌న్ కు ప‌రుగులు తీస్తున్నాం. అందుబాటులోకి రాగానే వ్యాక్సిన్ దానంత‌ట‌దే ప్ర‌జ‌ల‌ను చేరుతుంది. గ‌తంలో మ‌నం వ్యాక్సిన్ లేకుండానే క‌రోనాపై పోరాటంలో విజ‌యం సాధించామ‌నే విష‌యం మ‌రిచిపోకూడ‌దు. అప్ప‌ట్లో వ్యాక్సిన్ వ‌స్తుంద‌న్న హామీ కూడా మ‌న‌కి లేదు. కాని ఈ రోజు మ‌న‌కి ఆ భ‌యం లేదు.

మ‌నం ఈ వ్యాక్సిన్ పై పోరాటం సాగించే ధోర‌ణిని బ‌ట్టి మ‌నం దానిపై తిరిగి విజ‌యం సాధించ‌గ‌లుగుతాం. మొత్తం కుటుంబం క‌రోనా బారిన ప‌డేందుకు కార‌ణం ఏదీ నాకు క‌నిపించ‌డంలేదు. నేను చెప్ప‌డం కాదు, మీరే దాన్ని ప‌రిశీలించుకోవ‌చ్చు. ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే క‌రోనా వ్యాప్తి చెందుతోంది. త‌దుప‌రి ద‌శ‌లో అప్ప‌టికే ఏదో ఒక వ్యాధితో బాధ ప‌డుతున్న వారిని అది చుట్టుముడుతోంది. ఆ త‌ర్వాత మొత్తం కుటుంబాన్ని క‌ష్టంలోకి నెట్టేస్తోంది.

అందుకే టెస్టింగ్ గురించి మ‌నం ఎక్కువ‌గా ప్ర‌చారం చేయాలి. ఈ రోజు మ‌న‌కి అన్ని వ‌న‌రులు అందుబాటులో ఉన్నాయి. ఒకే ఒక్క లాబ్ ఏర్పాటు చేయ‌డం నుంచి ప్రారంభించి ఇప్పుడు దేశంలోని ప్ర‌తీ ఒక్క జిల్లాలోనూ లాబ్ లు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఈ లాబ్ వ‌స‌తులు ఉప‌యోగించుకోకుండా మ‌నం క‌రోనాను ఎలా క‌ట్ట‌డి చేయ‌గ‌లం?

ఈ అంశాన్ని రాజ‌కీయం చేయ‌డం విష‌యానికి వ‌స్తే మొద‌టి రోజు నుంచి నేను ఎన్నో ర‌కాల ప్ర‌క‌ట‌న‌లు చూస్తూనే ఉన్నాను, కాని నోరు తెరిచి ఏమీ మాట్లాడ‌లేదు. దేశ ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డమే మ‌నంద‌రి ప‌విత్ర విధి అని నేను భావిస్తాను. ప్ర‌జ‌ల‌కు సేవ చేసే భాగ్యం మ‌న‌కి భ‌గ‌వంతుడు క‌ల్పించాడు. ఈ క్లిష్ట స‌మ‌యంలో మ‌నం ఆ విధిని నిర్వ‌ర్తించ‌డం త‌ప్ప‌నిస‌రి. రాజ‌కీయం చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన వారే ఇందుకు ముందుకు రావ‌డం ఆనంద‌దాయ‌కం. ముఖ్య‌మంత్రులు కూడా రాజ‌కీయ నాయ‌కులంద‌రితో స‌మావేశాలు నిర్వ‌హించి వివిధ అంశాలు వారితో చ‌ర్చించాలి. ఇది ప‌రిస్థితిలో ఎంతో మార్పు తీసుకువ‌స్తుంది. ఎలాంటి జాప్యం లేకుండానే మ‌నం ఈ క‌ష్టాన్ని గ‌ట్టెక్క‌గ‌ల‌మ‌నే విశ్వాసం నాకుంది.

మందులే కాదు, నియ‌మావ‌ళి క‌ఠినంగా పాటించండి అనేదే మ‌రోసారి నేను ఇచ్చే మంత్రం. ఆ అంశంపై ఎలాంటి రాజీ వ‌ద్దు. కొంద‌రు జ‌లుబు చేసి మందులు వేసుకుంటూ ఉంటారు, కాని వ‌ర్షం ప‌డుతుంటే బ‌య‌ట‌కు వెళ్లే స‌మ‌యంలో మాత్రం గొడుగు వాడ‌రు. ఇది మంచిది కాదు. మీకు జ‌లుబు చేసి మందులు వాడుతున్నా వ‌ర్షంలో బ‌య‌ట‌కు వెళ్లే స‌మ‌యంలో గొడుగు వాడ‌డం లేదా రెయిన్ కోట్ ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి. క‌రోనా కూడా అలాంటిదే. నియ‌మావ‌ళి క‌ఠినంగా పాటించ‌డం ఒక్క‌టే ప్ర‌త్యామ్నాయం.

గ‌తంలో మ‌నం క‌రోనాను క‌ట్ట‌డి చేసిన విధంగానే ఈ సారి కూడా చేయాలి. మీరంద‌రూ చొర‌వ ప్ర‌ద‌ర్శించి దీన్ని సాధిస్తార‌న్న న‌మ్మ‌కం నాకుంది. ప‌రిస్థితిపై ఆందోళ‌న చెంద‌డ‌మే కాదు, టెస్టింగ్ పై కూడా దృష్టి పెట్టాలి. అప్పుడే మ‌నం ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌గ‌లుగుతాం. వ్యాక్సినేష‌న్ అనేది దీర్ఘ‌కాల ప్ర‌క్రియ‌. ఇప్పుడు మ‌నం టీకా ఉత్స‌వ్ పై దృష్టి కేంద్రీక‌రించి వ్యాక్సిన్ లో కొత్త శిఖ‌రాలు చేరడంపై దృష్టి కేంద్రీక‌రించాలి. కొత్త విశ్వాసం క‌ల్పించ‌డానికి ఒక చిన్న సంద‌ర్భం చాలును.

మీ స‌ల‌హాల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను, ధ‌న్య‌వాదాలు.

గ‌మ‌నిక : ఇది ప్ర‌ధాన‌మంత్రి హిందీ ప్ర‌సంగానికి అనువాదం మాత్ర‌మే.