ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాల సంసిద్ధతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ తన అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఔషధాలు, ఆక్సిజెన్, వెంటిలేటర్లు, వ్యాక్సినేషన్ లభ్యత సహా పలు అంశాలను ఈ సమావేశంలో చర్చించారు.
దేశం అంతా ఐక్యంగా నిలిచి గత ఏడాది కోవిడ్ ను ఓడించింది, అవే సూత్రాలు పాటిస్తూ మరింత వేగంగా, మరింత సమన్వయంతో కృషి చేయడం ద్వారా ఈ సారి కూడా విజయం సాధించగలం అని ప్రధానమంత్రి చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో టెస్టులు నిర్వహించడం, ట్రాక్ చేయడం, చికిత్స చేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. మరణాల శాతం తగ్గించాలంటే టెస్టింగ్, సరైన ట్రాకింగ్ కీలకమన్నారు. ప్రజల ఆందోళనల పట్ల స్థానిక యంత్రాంగాలు సానుభూతితో సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు.
మహమ్మారిని అదుపు చేసే విషయంలో రాష్ర్టాలతో సన్నిహిత సమన్వయం అవసరమని ప్రధానమంత్రి ఆదేశించారు. కోవిడ్ రోగుల చికిత్స కోసం ఆస్పత్రుల్లో పడకలు పెంచేందుకు తగు చర్యలన్నీ తీసుకోవాలని ఆయన సూచించారు. తాత్కాలిక ఆస్పత్రులు, ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటు ద్వారా అదనంగా పడకల సరఫరా పెంచేందుకు కృషి చేయాలని ఆయన కోరారు.
కరోనా చికిత్సలో ఉపయోగించే కీలక ఔషధాలకు పెరిగిన డిమాండును తట్టుకునేందుకు భారత ఫార్మా పరిశ్రమ పూర్తి సామర్థ్యాలు వినియోగించుకోవలసిన అవసరం గురించి కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. రెమ్ డెసివిర్, ఇతర ఔషధాల సరఫరా తాజా స్థితిత గురించి ఆయన సమీక్షించారు. రెమ్ డెసివిర్ లభ్యతను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను సమావేశంలో ప్రధానమంత్రికి వివరించారు. ప్రభుత్వం చేసిన కృషి కారణంగా రెమ్ డిసివిర్ ఉత్పాదక సామర్థ్యం జనవరి–ఫిబ్రవరిలో ఉన్న నెలకి 27-29 లక్షల వయల్స్ నుంచి మే నాటికి 74.10 లక్షల వయల్స్ కు పెంచినట్టు వివరించారు. సరఫరా కూడా 67,900 వయల్స్ నుంచి 2,06,000 వయల్స్ కు పెరిగిందని తెలిపారు. కేసులు ఆందోళనకరంగా పెరుగుతూ అధిక డిమాండు గల రాష్ర్టాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు ఆయన చెప్పారు. ఉత్పత్తి సామర్థ్యాల పెంపు తాజాస్థితిని గురించి కూడా ప్రధానమంత్రి తెలుసుకుని రాష్ర్టాల సమన్వయంతో సరఫరాల వ్యవస్థలోని ఇబ్బందులను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు. రెమ్ డెసివిర్, ఇతర ఔషధాల వినియోగం అనుమతించిన వైద్య మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని, వాటి దుర్వినియోగం, బ్లాక్ మార్కెటింగ్ ను కఠినంగా అరికట్టాలని ప్రధానమంత్రి ఆదేశించారు.
ఇప్పటికే అనుమతించిన మెడికల్ ఆక్సిజెన్ ప్లాంట్లు సత్వరం ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిఎం కేర్స్ సహాయంతో 32 రాష్ర్టాల్లో 162 పిఎస్ఏ ఆక్సిజెన్ ప్లాంట్లు ఏర్పాటు కానున్నాయి. లక్ష సిలిండర్ల సమీకరణకు చర్యలు తీసుకుంటున్నామని, వాటిని త్వరలో రాష్ర్టాలకు సరఫరా చేస్తామని అధికారులు ప్రధానమంత్రికి వివరించారు. తీవ్ర భారాన్ని మోస్తున్న 12 రాష్ర్టాల్లో ప్రస్తుత అవసరాలు, భవిష్యత్ అవసరాలను పరిశీలించి మెడికల్ ఆక్సిజెన్ నిరంతరం సరఫరా అయ్యేలా చూస్తున్నామని హామీ తెలిపారు. 12 రాష్ర్టాలకు ఏప్రిల్ 30వ తేదీ వరకు అందించిన మెడికల్ ఆక్సిజెన్ పై సరఫరా మ్యాపింగ్ చేస్తున్నట్టు వారు తెలియచేశారు. ప్రస్తుత మహమ్మారి తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఔషధాల తయారీకి, పరికరాల ఉత్పత్తికి అవసరం అయిన ఆక్సిజెన్ కూడా సరఫరా చేయాలని ప్రధానమంత్రి సూచించారు.
వెంటిలేటర్ల లభ్యత, సరఫరా స్థితిని కూడా ప్రధానమంత్రి సమీక్షించారు. వీటి సరఫరా గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వాస్తవిక స్థితి పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వ్యవస్థను ఉపయోగించుకోవడంపై రాష్ర్టాలను చైతన్యవంతం చేయాలని ఆయన ఆదేశించారు.
దేశంలో వ్యాక్సినేషన్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వ, ప్రయివేటు రంగ సామర్థ్యాలను పూర్తిగా వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి ఆదేశించారు.
కేబినెట్ కార్యదర్శి, ప్రధానమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఫార్మా కార్యదర్శి, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె.పాల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
***
Reviewed preparedness to handle the ongoing COVID-19 situation. Aspects relating to medicines, oxygen, ventilators and vaccination were discussed. Like we did last year, we will successfully fight COVID with even greater speed and coordination. https://t.co/cxhTxLtxJa
— Narendra Modi (@narendramodi) April 17, 2021
Prime Minister reviews preparedness of public health response to COVID-19. https://t.co/jN6FLOvAY0
— PMO India (@PMOIndia) April 17, 2021
via NaMo App pic.twitter.com/c0BU752nfP