దేశవ్యాప్తంగా ఇటీవల కోవిడ్-19 కేసుల నమోదు పెరుగుతున్న దృష్ట్యా ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పి.కె.మిశ్రా తన అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో కోవిడ్-19 పరిస్థితి, ఆరోగ్య మౌలిక సదుపాయాలతోపాటు రవాణా, మందులు, టీకాల కార్యక్రమం తదితర అంశాల్లో ప్రజారోగ్య వ్యవస్థ సన్నద్ధతను సమావేశం సమీక్షించింది. దీంతోపాటు కోవిడ్-19 కేసులు వేగంగా పెరగడంపై తీసుకోవాల్సిన కీలక చర్యలపై చర్చించింది.
ఈ సమావేశంలో కేంద్ర మంత్రిమండలి కార్యదర్శి శ్రీ రాజీవ్ గౌబా; నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వినోద్ పాల్; ఆర్థికశాఖ కార్యదర్శి శ్రీ టి.వి.సోమనాథన్; ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్; ఔషధ పరిశ్రమల విభాగం కార్యదర్శి శ్రీమతి ఎస్.అపర్ణ; పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ రాజీవ్ బన్సల్; ఆయుష్ కార్యదర్శి శ్రీ రాజేష్ కోటేచా; డిహెచ్ఆర్, ఐసీఎంఆర్ డీ.జీ శ్రీ రాజీవ్ బహల్; బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి శ్రీ రాజేష్ ఎస్ గోఖలే; సమాచార-ప్రసార శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
సమీక్షలో భాగంగా- ప్రపంచవ్యాప్త కోవిడ్-19 పరిస్థితులపై విస్తృత సమాచారంతో ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ సమగ్ర ప్రదర్శ ఇచ్చారు. దేశంలోనూ కోవిడ్-19 మళ్లీ వేగంగా వ్యాపిస్తున్నదని తెలిపారు. ప్రధానంగా 8 రాష్ట్రాల్లో (కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్) కేసులు అధికంగా నమోదవుతున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా రోగ నిర్ధారణ పరీక్షలు ముమ్మరంగా సాగుతున్నందున కేసుల నమోదు అధికంగా కనిపిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఇందులో చురుకైన కేసులపై సమగ్ర విశ్లేషణ ఇస్తూ ఈ 8 రాష్ట్రాల్లో నమోదైనవాటిలో 92 శాతం నివాస ఏకాంత చికిత్సకు పరిమితమైనవేనని వివరించారు.
ఈ ప్రదర్శన సందర్భంగా 2023 జనవరి నుంచి వివిధ రకాల వైరస్ జన్యుక్రమం నిర్ధారణ సమాచారంతోపాటు భారత్లో విస్తరిస్తున్న నిష్పత్తిని కూడా వివరించారు. అటుపైన దేశవ్యాప్తంగా టీకాల పరిస్థితి గురించి, మందుల లభ్యతతోపాటు వైద్య మౌలిక సదుపాయాల సన్నద్ధతపైనా సమావేశం చర్చించింది. గౌరవనీయ ప్రధానమంత్రి ఆదేశాల మేరకు కార్యాచరణకు తగిన మౌలిక సదుపాయాలపై అంచనాల దిశగా ప్రయోగాత్మక కసరత్తు చేపట్టినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పరిస్థితులను భాగస్వామ్య వ్యవస్థలకు అందజేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు కోవిడ్-19 టీకాల కార్యక్రమ వ్యయం, మందులతోపాటు టీకా ముడిపదార్థాల బడ్జెట్ కేటాయింపులు తదితరాలపైనా సమావేశం సమీక్షించింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నుంచి ముందస్తు అనుమతితో నిమిత్తం లేకుండా తయారీదారుల నుంచి అవసరమైన కోవిడ్ టీకాలను నేరుగా కొనుగోలు చేసుకోవచ్చునని ఇప్పటికే రాష్ట్రాలకు సూచించినట్లు ఆ శాఖ కార్యదర్శి తెలిపారు. రాష్ట్రాల్లోగల ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తయారీదారుల నుంచి నేరుగా టీకాలు కొనుగోలు చేయవచ్చునని, వీటిని ప్రస్తుతం అమలులోగల మార్గదర్శకాల ప్రకారం వేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ విస్తృత వివరణాత్మక ప్రదర్శన అనంతరం డాక్టర్ పి.కె.మిశ్రా మాట్లాడుతూ- స్థానికస్థాయిలో కేసుల పెరుగుదలకు అనుగుణంగా ఉప-జిల్లా స్థాయిదాకా తగుమేర ఆరోగ్య మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాలతో సంప్రదించి సమగ్రంగా సన్నద్ధమయ్యేలా చూడాలని సూచించారు. కేంద్రం మార్గనిర్దేశం చేస్తున్న రాష్ట్రాలకు తాజా పరిణామాల ఆధారంగా పంపాల్సిన సలహాల స్థాయిని అంచనా వేసి, నవీకరించాలని చెప్పారు.
ముఖ్యంగా కొత్త కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రదేశాల గుర్తింపుపై తక్షణం దృష్టి సారించడం అత్యంత ప్రధానమని మిశ్రా స్పష్టం చేశారు. ఆ మేరకు ఐఎల్ఐ/ఎస్ఎఆర్ఐ కేసుల ధోరణిని రాష్ట్రాలు పర్యవేక్షించాలని, కోవిడ్-19 నిర్ధారణకు తగిన నమూనాలను పంపడమే కాకుండా సంపూర్ణ జన్యునిర్ధారణ ప్రక్రియ వేగం పెంచడంపైనా సమావేశం చర్చించింది. కోవిడ్ మహమ్మారికి సంబంధించిన “పరీక్ష, అనుసరణ, చికిత్స, టీకాలు, కోవిడ్ అనుగుణ ప్రవర్తన” సహిత ఐదంచెల సమర్థ వ్యూహం కొనసాగింపునకు డాక్టర్ పి.కె.మిశ్రా ఆదేశించారు. అదే సమయంలో కోవిడ్ సముచిత ప్రవర్తనపై ఏమరుపాటుకు తావులేకుండా పౌరులను అప్రమత్తం చేసేలా అవగాహన పెంచడం కూడా చికిత్సతో సమానమని నొక్కిచెప్పారు. ఏదేమైనా కోవిడ్-19 పరిస్థితిపై గట్టి నిఘా అవసరమని, మహమ్మారి వ్యాప్తి నిరోధానికి తగిన పటిష్ఠ చర్యలపై అలసత్వం ఎంతమాత్రం కనిపించరాదని అధికారులకు స్పష్టం చేశారు.
*****