కోల్ ఇండియా లిమిటెడ్‌కు అనుబంధంగా పని చేస్తున్న నష్టదాయక పిఎస్‌యుల్లో 2007 జనవరి ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చే విధంగా 2007 సంవత్సరం నాటి వేతన సవరణను అమలుపరచాలన్న కార్యదర్శుల స్థాయి కమిటీ సిఫారసులను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ప్రత్యేక ఏర్పాటు కింద దీన్ని అమలుపరిచేందుకు సిఐఎల్‌కు అనుమతి ఇచ్చారు. కాని ఇతర నష్టదాయక పిఎస్‌యుల్లో కూడా ఇదే తరహా ప్రత్యేక ఏర్పాటుకు దీన్ని ఒక మార్గదర్శకంగా చేసుకునే వీలుండదు.
ఆయా పిఎస్‌యుల్లోని ఎగ్జిక్యూటివ్‌లకు, యూనియన్లతో సంబంధం లేని సూపర్‌వైజర్లకు పనితీరు ఆధారిత వేతనాలు (పిఆర్‌పి) చెల్లించేందుకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆయా సంస్థలు ఆర్జిస్తున్న నష్టాలు మినహాయించగా సిఐఎల్ అనుబంధ కంపెనీలు సాధించిన లాభాలు, వేరుగా సిఐఎల్ ఆర్జించిన లాభాల నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసే నిధి నుంచి ఈ చెల్లింపులు చేయాలని నిర్ణయించారు. కాని ఇందుకోసం ఏర్పాటు చేసే నిధిని ఏ ఏడాదికి ఆ ఏడాది ఉపయోగించాల్సి ఉంటుంది. మిగిలిన సొమ్ము ఏమైనా ఉంటే దాన్ని తదుపరి ఏడాదికి బదిలీ చేసే వీలుండదు.
అనుబంధ సంస్థల మధ్య బదిలీకి అవకాశం ఉన్నందు వల్ల ఎగ్జిక్యూటివ్‌ల వేతనాల మధ్య సమానత్వాన్ని తీసుకువచ్చేందుకు, నష్టదాయక సిపిఎస్ఇలు, సిపిఎండిఐఎల్‌లలో పని చేసే ఎగ్జిక్యూటివ్‌ల నైతిక స్థైర్యాన్ని నిలబెట్టేందుకు ఈ చర్య ఉపయోగపడుతుంది.
నేపథ్యం
ఐదు అనుబంధ కంపెనీలకు ఒక హోల్డింగ్ కంపెనీగా సిఐఎల్‌ను 1975లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు అనుబంధంగా పని చేస్తున్న ఏడు కంపెనీలు, సిఐఎల్ ఎగ్జిక్యూటివ్‌ల నియామకం, రిక్రూట్‌మెంట్, పోస్టింగ్, కంపెనీల మధ్య బదిలీలు, ఇతర సిబ్బంది సంబంధిత వ్యవహారాలన్నీ హోల్డింగ్ కంపెనీ సీఐఎల్ చేతిలోనే ఉంటాయి. దీని వల్ల సిఐఎల్‌కు, అనుబంధ సంస్థలకు ఎగ్జిక్యూటివ్‌లను ఒక సెంట్రల్ కాడర్ నుంచి ఎంపిక చేస్తారు. అందరినీ హోల్డింగ్ కంపెనీ సిఐఎల్ ఉద్యోగులుగానే పరిగణిస్తారు.