Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కోల్‌ కాతా లో బెలూడ్ మ‌ఠ్ ను సంద‌ర్శించిన ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ


స్వామి వివేకానందుల వా రి జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవం నేపథ్యం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోల్‌కాతా లోని బెలూడ్ మఠాన్ని ఈ రోజు న సందర్శించారు. ఆయన అక్కడి సాధువుల తో కొద్దిసేపు ముచ్చటించారు. దేశ వాసులందరికీ బెలూడ్ మఠ సందర్శన ఒక పవిత్ర యాత్ర వంటిది అయితే తనకు మాత్రం స్వగృహాని కి తిరిగి రావడం వంటిది అని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో అన్నారు. ఈ పవిత్ర ప్రదేశం లో ఒక రాత్రి బస చేయడం తన కు లభించినటువంటి గౌరవం అని తాను భావిస్తున్నానని ఆయన అన్నారు. స్వామి రామకృష్ణ పరమహంస తో పాటు మాతా శారదా దేవి, స్వామి బ్రహ్మానంద, స్వామి వివేకానందులు తదితర గురుదేవుల ఉనికి ని ఇక్కడ అనుభూతి చెందవచ్చు అని ప్రధాన మంత్రి అన్నారు. ఇంతకుముందు ఇక్కడ కు వచ్చి, స్వామి ఆత్మస్థానంద జీ ఆశీర్వాదం స్వీకరించిన సమయం లో ఆయన తనకు ప్రజాసేవా మార్గాన్ని ఉపదేశించారని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చుకొన్నారు. ‘‘నేడు ఆయన భౌతికం గా దూరం అయినప్పటికీ ఆయన చూపిన మార్గం మనకు సదా పథనిర్దేశం చేస్తున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

మఠం లోని యువ సాధువుల నడుమ కొన్ని క్షణాల ను గడిపే అవకాశం దక్కిందని, ఆ సమయం లో కొద్దిసేపు వారి మనోభావాల తో మమేకం అయ్యానని ఆయన పేర్కొన్నారు. స్వామి వివేకానందుల వారి వ్యక్తిత్వం, బోధన లు, స్వర మాధుర్యం తో ఆకర్షితులై వారు అందరూ ఈ మార్గం వైపు మళ్లారని చెప్పారు. అయితే, ఇక్కడ కు చేరుకొన్న తరువాత మాత శారదా దేవి ఒడి లో లభించే మాతృప్రేమ స్థిర నివాసం ఏర్పరచుకొనేటట్టు చేస్తుందని తెలిపారు. ‘‘తెలిసో, తెలియకో దేశ యువతరం లో ప్రతి ఒక్కరు వివేకానందుల వారి సంకల్పం లో భాగస్వాములు అవుతున్నారు. కాలం మారింది.. దశాబ్దాలు గడచిపోయాయి.. దేశం లో మార్పు వచ్చింది.. కానీ, స్వామి వారి సంకల్పం నేటికీ యువత ను మేల్కొల్పి ఉత్తేజితులను చేస్తూనే వుంది. అంతే కాదు, ఆయన కృషి తరతరాలకు ఇదేవిధమైనటువంటి స్ఫూర్తి ని ఇస్తూ ఉంటుంది’’ అని ప్రధాన మంత్రి వివరించారు.

మనం ఒంటరి గా ప్రపంచాన్ని మార్చగలమా? అనే భావన లో ఉన్న యువతరాని కి ‘‘మనం ఎన్నడూ ఒంటరులం కాదు’’ అన్న సరళ మంత్రాన్ని ప్రధాన మంత్రి ఉపదేశించారు. ఈ 21వ శతాబ్దం లో న్యూ ఇండియా నిర్మాణానికి దృఢ సంకల్పం తో జాతి ముందడుగు వేస్తున్నదని, ఈ సంకల్పాలు ఒక్క ప్రభుత్వాని కే చెందినవి కావు, మొత్తం 130 కోట్ల దేశవాసులు, యువత కంటున్న కలలే అని ఆయన అన్నారు. దేశ యువతరం తో సంధానానికి సాగుతున్న ఉద్యమం తప్పక విజయవంతం కాగలదని గడచిన అయిదు సంవత్సరాల అనుభవం స్పష్టం చేస్తున్నదని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ ఐదేళ్ల కు ముందు భారతదేశం పరిశుద్ధం అవుతుందా, కాదా? దేశం లో డిజిటల్ చెల్లింపులు ఇంత భారీగా పెరగగలవా? అన్న నిరుత్సాహం అలముకొని ఉండేదన్నారు. కానీ, నేడు యువతరం పగ్గాల ను తన చేతి లోకి తీసుకున్న నేపథ్యం లో మార్పు లు ప్రస్ఫుటం అవుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత 21వ శతాబ్దపు తొలి దశాబ్దం లో భారతదేశం మార్పునకు పునాది యువతరం లో పెల్లుబికిన అభినివేశం, శక్తియుక్తులే అని ఆయన స్పష్టం చేశారు. యువతరం సమస్యలను ఎదుర్కొంటుంది… వాటి పరిష్కరిస్తుంది. అది సవాళ్ల కే సవాలు ను విసరగలదు. ఈ ఆలోచన ల ధోరణి కి అనుగుణంగానే దశాబ్దాలు గా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది అని ఆయన చెప్పారు.

పౌరసత్వ సవరణ చట్టం పై యువతరం లో అవగాహన ను కల్పించి, సంతృప్తిపరచడం ద్వారా వారి మది లోని అపోహల ను తొలగించే బాధ్యత ఈ జాతీయ యువజనోత్సవం నేపథ్యం లో తనపై ఉందని భావిస్తున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టం పౌరసత్వాన్ని హరించేది కాదని, పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించబడిన చట్టం అంటూ ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ విభజన నేపథ్యం లో మత విశ్వాసాల కారణం గా పీడన కు, హింస కు, అణచివేత కు గురి అవుతున్న వారి కి భారత పౌరసత్వం సులభం గా మంజూరు అయ్యేలా ప్రస్తుత చట్టాని కి సవరణ ను మాత్రమే చేశామని చెప్పారు. ఆనాడు మహాత్మ గాంధీ సహా అనేక మంది నాయకులు దీని ని ఆమోదించారని తెలిపారు. అంతేకాకుండా ఒక వ్యక్తి ఏ మతాని కి చెందిన వారైనా, దైవం పై నమ్మిక ఉన్నా- లేకున్నా, భారత రాజ్యాంగం పై విశ్వాసం ప్రకటిస్తే నిర్దేశిత విధానాల ప్రకారం భారత పౌరసత్వాని కి ఈనాడు కూడా అర్హులే అని వివరించారు. ఈ చట్టం వల్ల ఈశాన్య భారత జనాభా పై గల ప్రతికూల ప్రభావాన్ని తొలగించే దిశగానూ నిబంధనల ను తమ ప్రభుత్వం చేర్చిందని ఆయన అన్నారు. దీని పై ఇంత సుస్పష్ట వివరణ ఇస్తున్నా పౌరసత్వ సవరణ చట్టం విషయం లో కొందరు కేవలం రాజకీయ స్వార్థం తో గందరగోళం సృష్టిస్తున్నారని తెలిపారు. అయితే, పౌరసత్వ చట్టం లో ఈ సవరణ వల్ల వివాదం తలెత్తి ఉండకపోతే పాకిస్తాన్‌ లో అల్పసంఖ్యాక వర్గాలపై ఎటువంటి దురాగతాలు జరిగాయో, మానవ హక్కుల ఉల్లంఘన ఏ స్థాయి లో ఉందో ప్రపంచాని కి తెలిసేది కాదు అని ఆయన అన్నారు. తాము తీసుకొన్న ఈ చర్య తో పాకిస్తా లో అల్పసంఖ్యాక వర్గాల పై 70 సంవత్సరాలు గా జరుగుతున్న నేరాల కు ఆ దేశం సంజాయిషీ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది అన్నారు.

పౌరులు గా మన బాధ్యతల ను, కర్తవ్యాల ను పూర్తి అంకితభావం తో, నిజాయతీ తో నెరవేర్చాలి అని మన సంస్కృతి, మన రాజ్యాంగం నిర్దేశిస్తున్నాయి అని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ఆ మేరకు ప్రతి భారతీయుడి పైనా సమాన బాధ్యత ఉంటుందని, ఈ మార్గం లో పయనించినప్పుడే భారతదేశాన్ని ప్రపంచ యవనిక పై తన సహజ స్థానం లో చూడగలమని పేర్కొన్నారు. మన వ్యవస్థ మూలాలలో ఉన్నది, ప్రతి భారతీయుడి నుండీ స్వామి వివేకానందుల వారు కోరుకున్నది కూడా ఇదే అని ప్రధాన మంత్రి వివరించారు. తదనుగుణంగా ఆయన స్వప్న సాకారం దిశ గా మనం అందరమూ దృఢ సంకల్పం తో ముందంజ వేద్దాము అని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.