Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కొలంబో లో 2017 మే 12 వ తేదీన జ‌రిగిన ఇంటర్ నేషనల్ వేసాక్ డే ఉత్సవాలలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

కొలంబో లో 2017 మే 12 వ తేదీన జ‌రిగిన ఇంటర్ నేషనల్ వేసాక్ డే ఉత్సవాలలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

కొలంబో లో 2017 మే 12 వ తేదీన జ‌రిగిన ఇంటర్ నేషనల్ వేసాక్ డే ఉత్సవాలలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

కొలంబో లో 2017 మే 12 వ తేదీన జ‌రిగిన ఇంటర్ నేషనల్ వేసాక్ డే ఉత్సవాలలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


అత్యంత ఆదరణీయులైన శ్రీ లంక మ‌హా నాయ‌కొంతేరొ

అత్యంత ఆదరణీయులైన శ్రీలంక సంగారాజ‌తాయ్ రోస్

మాననీయులైన మ‌త‌, ఆధ్యాత్మిక నేత‌లు

గౌర‌వ‌నీయ‌లైన శ్రీ లంక అధ్య‌క్షుడు, శ్రేష్ఠుడైన శ్రీ  మైత్రిపాల సిరిసేన‌

గౌర‌వ‌నీయులైన శ్రీ లంక ప్ర‌ధాని, శ్రేష్ఠుడైన శ్రీ రానిల్ విక్ర‌మ‌సింఘే

గౌర‌వ‌నీయులైన శ్రీ లంక పార్ల‌మెంట్ స్పీక‌ర్, శ్రేష్ఠుడైన శ్రీ కారూ జ‌య‌సూరియ‌

వెసాక్ దినోత్స‌వ అంత‌ర్జాతీయ మండ‌లి అధ్య‌క్షుడు, అత్యంత ఆదరణీయులైన డాక్ట‌ర్ బ్రాహ్మిణ్ పండిత్,

గౌరవనీయులైన ప్ర‌తినిధులు

ప్రసార మాధ్యమాల నుండి విచ్చేసిన మిత్రులు, శ్రేష్ఠులారా, లేడీస్ అండ్ జెంటిల్ మెన్‌

న‌మ‌స్కారాలు. ఆయుబువ‌న్

 

వెసాక్ అతి ప‌విత్ర‌మైనటువంటి రోజులలో ఒకటి.

 

త‌థాగ‌తుడైన బుద్ధ భ‌గ‌వానుని పుట్టిన‌ రోజును మాన‌వాళి ఎంతో ఉత్సాహం గా జ‌రుపుకునే రోజు ఇది.  బుద్దుని లోని ఔన్న‌త్యాన్ని స్మ‌రించుకునే రోజు ఇది. ఉన్న‌త‌మైన స‌త్యాన్ని గురించి ఆలోచించే రోజు ఇది.  కాలాలతో సంబంధం లేకుండా ధ‌మ్మ ప్రాధాన్య‌ాన్ని, నాలుగు విశిష్ట స‌త్యాల‌ను గురించి స్మ‌రించుకునే రోజు ఇది. .

 

దానం, ఉచిత న‌డ‌వ‌డిక‌, త్యాగం, వివేకం, శ‌క్తి, స‌హ‌నం, స‌త్య‌సంధ‌త‌, ప‌ట్టుద‌ల‌, ప్రేమ‌పూర్వ‌క ద‌యాగుణం, స‌మ‌దృష్టి…ఈ ప‌ది ల‌క్ష‌ణాల గురించి మ‌నం స్మ‌రించుకునే దినం ఇది.

 

శ్రీ ల‌ంక లోను, భార‌త‌దేశం లోను ఈ రోజుకు చాలా ప్రాధాన్య‌ం ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న బౌద్ధుల‌కు ఈ రోజు చాలా ముఖ్య‌మైన రోజు.  కొలంబో లో ఏర్పాటు చేసిన ఇంటర్ నేషనల్ వేసాక్ డే ఉత్సవాల‌కు ముఖ్య అతిథిగా న‌న్ను ఆహ్వానించినందుకు అధ్య‌క్షుడు, శ్రేష్ఠుడైన శ్రీ మైత్రిపాల సిరిసేన‌కు, శ్రేష్ఠుడైన ప్ర‌ధాని శ్రీ రానిల్ విక్ర‌మ‌సింఘేకు, శ్రీ లంక ప్ర‌జ‌ల‌కు నా హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను.  ఈ ప‌విత్ర‌మైన రోజున మీ అంద‌రికీ సంపూర్ణ స్వ‌యంచేత‌న పొందినటువంటి భార‌త‌దేశపు 125 కోట్ల మంది భార‌తీయుల త‌ర‌ఫున శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాను.

 

శ్రేష్ఠులు మరియు స్నేహితులారా,

 

ప్ర‌పంచానికి అమూల్య‌మైన బుద్ధ భ‌గ‌వానుడిని, ఆయ‌న సేవ‌ల‌ను అందించిన ప్రాతం మ‌న‌ది.  యువ‌రాజు సిద్ధార్ధుడు భార‌త‌దేశంలోని బుద్ధ‌గ‌య‌లో  బుద్ధునిగా అవ‌త‌రించాడు.  ప్ర‌పంచంలోని బౌద్ధులంద‌రికీ బుద్ధ‌గ‌య ప్ర‌ధాన ప‌విత్ర ప్ర‌దేశం.  బుద్ధ భ‌గ‌వానుడు త‌న మొద‌టి ప‌విత్ర సందేశాన్ని వారాణసీలో వెలువరించారు.  వారాణసీ పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికి నేను ప్రాతినిధ్యం వ‌హించ‌డం నాకు ల‌భించిన గౌర‌వం.  వారాణసీలో బుద్ధ భ‌గ‌వానుడు ఇచ్చిన‌ మొద‌టి సందేశమే  ధ‌మ్మప‌దం మొద‌ల‌వ‌డానికి మూలం. మన జాతీయ ప్ర‌తిమ‌లు బుద్ధత‌త్వాన్నుండి ప్రేరణను పొందాయి.. బుద్దుని త‌త్వం అందులో నుండి బయలుదేరిన ప‌లు మార్గాలు మ‌న ప‌రిపాల‌న, సంస్కృతి, తాత్విక చింత‌న‌లో క‌ల‌గ‌లిసిపోయాయి.  బౌద్ధ త‌త్వంలోని దైవిక ప‌రిమ‌ళం భార‌త‌దేశంలో బ‌య‌లుదేరి ప్ర‌పంచ‌మంతా విస్త‌రించింది.  మ‌హారాజు అశోకుని పిల్ల‌లు మ‌హేంద్ర‌, సంఘ‌మిత్ర లు భార‌త‌దేశాన్నుండి బ‌య‌లుదేరి శ్రీ లంక కు చేరుకొని ఇ్క‌డ ధ‌మ్మ‌దూత‌లుగా వ్య‌వ‌హ‌రించారు.  ఈ నేల‌కు ఎంతో విలువైన ధ‌మ్మ కానుక‌ను అంద‌జేశారు.

 

అన్ని దానాల్లోనూ ధ‌మ్మ దాన‌మే అతి పెద్ద‌దని బుద్ధుడు స్వ‌యంగా పేర్కొన్నారు.  బుద్దుని బోధ‌న‌లను విశ్వ‌వ్యాప్తం చేస్తున్న ప్ర‌ధాన కేంద్రాల్లో ఒక‌టిగా నిలిచింది శ్రీ లంక.  శ‌తాబ్దాల అనంతరం బౌద్ధ త‌త్వాన్ని ప్ర‌చారం చేయ‌డానికి అన‌గారిక ధ‌ర్మ‌పాలుడు ప‌ర్య‌ట‌న ను మొద‌లుపెట్టారు.  ఈ సారి ఈ ప‌ర్య‌ట‌న మొద‌లైంది శ్రీలంక‌ నుండి భార‌త‌దేశానికి.  బౌద్ధ‌మ‌తం పుట్టిన చోటనే బౌద్ధాన్ని పునః ప్ర‌తిష్టించ‌డానికి ఆయ‌న కృషి చేశారు.  ఒక రకంగా చెప్పాలంటే మీరు మ‌మ్మ‌ల్ని తిరిగి మా మూలాల్లోకి తీసుకుపోయారు.  బౌద్ధ వార‌స‌త్వంలోని అతి ముఖ్య‌మైన అంశాల‌ను ప‌రిర‌క్షించ‌డానికి శ్రీ లంక చేస్తున్న కృషి ప్ర‌శంస‌నీయం.. ప్ర‌పంచం మీకు ఈ విష‌యంలో రుణ‌ప‌డి ఉంటుంది.  బౌద్ధ‌త‌త్వ వార‌స‌త్వాన్ని గుర్తు చేసుకుంటూ సంబ‌రాలు చేసుకోవ‌డానికి వైశాఖ ప‌ర్వ‌దినం స‌ముచిత‌మైన రోజు.

 

స్నేహితులారా,

 

దైవ‌సంక‌ల్పం కార‌ణంగా భార‌త‌దేశం, శ్రీ లంక ల మ‌ధ్య‌ స్నేహ సంబంధాలు కాల‌క్ర‌మంలో ప‌టిష్టమ‌య్యాయి.  మ‌న బంధానికి బౌద్ధ‌మ‌త‌మ‌నేది నిరంత‌రం నిలవ‌గ‌లిగే వెలుగుల‌ను అద్దింది.  ప‌క్క‌పక్క‌నే ఉన్న మ‌న రెండు దేశాల మ‌ధ్య‌ పెన‌వేసుకున్న‌ బంధం అనేక అంశాల్లోకి విస్త‌రించింది.  బౌద్ధం లోని అవినాభావ సంబంధ‌మున్న‌ విలువ‌ల కార‌ణంగా రెండు దేశాల బంధం బ‌లోపేతమైంది.  అంతే కాదు, మ‌న రెండు దేశాలు క‌లిసి పంచుకొనే భ‌విష్య‌త్తు కోసం ప‌రిమితులు లేని అవ‌కాశాల‌ను క‌ల్పించింది.  రెండు దేశాల స్నేహమ‌నేది ఇరు దేశాల ప్ర‌జ‌ల హృద‌యాల్లో నుండి వచ్చింది.  రెండు దేశాల స‌మాజాల్లో ఇది ప‌టిష్టంగా ఉంది.

ఇరు దేశాల మ‌ధ్య‌న వున్న బౌద్ధ సంబంధాల‌ను గౌర‌విస్తూ, వాటిని మ‌రింత బ‌లోపేతం చేసుకోవ‌డానికి నేను ఇక్క‌డ ఒక ప్ర‌క‌ట‌న చేయ‌డానికి సంతోషిస్తున్నాను.. అదేమిటంటే, ఈ ఏడాది ఆగ‌స్టు నుండి కొలంబో, వారాణసీ ల మ‌ధ్య‌ ఏర్ ఇండియా నేరుగా విమానాలు న‌డుపుతుంది.  దీనివ‌ల్ల శ్రీ లంక‌ లోని నా సోద‌ర‌ సోద‌రీమణులు భార‌త‌దేశంలోని బౌద్ధ ప‌ర్యాట‌క ప్రాంతాలైన శ్రావ‌స్తి, కుశీన‌గ‌ర్‌, సంకాశ‌, కౌశాంబి, సార‌నాథ్ ల‌ను సంద‌ర్శించ‌డానికి వీలు క‌లుగుతుంది.  ఇక్క‌డి నా త‌మిళ సోద‌ర‌ సోద‌రీమ‌ణులు కూడా వారాణసీ లోని కాశీ విశ్వ‌నాథుడిని ద‌ర్శించుకోవ‌డం ఈ నూత‌న స‌ర్వీసు ద్వారా సులువ‌వుతుంది.

 

ఆదరణీయులైన బౌద్ధ సాధువులారా, శ్రేష్ఠులు మరియు స్నేహితులారా,

 

శ్రీ లంక‌ తో బంధాల విష‌యంలో  మేం ఉన్న‌త‌మైన అవ‌కాశాల స్థాయికి చేరుకున్నామ‌ని నేను భావిస్తున్నాను.  ఇరు దేశాల మ‌ధ్య‌ ప‌లు రంగాలలో భాగ‌స్వామ్యాల విష‌యంలో అద్భుత‌మైన ప్ర‌గ‌తిని సాధించే స‌ద‌వకాశం మ‌న ముందు ఉంది.  ఇరు దేశాల స్నేహబంధాలు విజ‌యవంతం అవుతున్నాయ‌న‌డానికి స‌రైన కొల‌మానం ఏమిటంటే, రెండు దేశాలు ప్ర‌గ‌తి సాధించ‌డం, విజ‌యాల‌ను మూట‌గ‌ట్టుకోవ‌డ‌మ‌ని మేం అనుకుంటున్నాం. శ్రీ లంక‌ లోని సోద‌ర సోద‌రీమ‌ణులు ఆర్ధికంగా ప్ర‌గ‌తి సాధించ‌డానికిగాను మేం మా కార్యాచ‌ర‌ణ విష‌యంలో నిబ‌ద్ధులమై ఉన్నాం.  అభివృద్ధి విష‌యంలో స‌హ‌కారాన్ని మ‌రింత బ‌లోపేతం చేసుకోవ‌డానికి ఇరు దేశాల మ‌ధ్య‌ సుహృద్భావ మార్పుల కోసం, ఆర్ధిక వృద్ధి కోసం మేం పెట్టుబ‌డుల‌ను కొన‌సాగిస్తాం.  ఇరు దేశాలు వాటికి ఉన్న విజ్ఞానాన్ని, సామ‌ర్థ్యాన్ని, సౌభాగ్యాన్ని పంచుకోవ‌డంలోనే మ‌న బ‌లం దాగి ఉంది.  వాణిజ్య‌ం, పెట్టుబ‌డుల రంగాలలో మ‌నం గ‌ణ‌నీయ‌మైన స్థాయిలో భాగ‌స్వాములుగా ఉన్నాం.  వాణిజ్యం, పెట్టుబ‌డులు, సాంకేతిక‌త‌, ఆలోచ‌న‌లు మొద‌లైన‌వి స్వేచ్ఛ‌గా ఇరు దేశాల‌ మ‌ధ్య‌న ప్ర‌వ‌హిస్తే రెండు దేశాలు ప‌ర‌స్ప‌రం ల‌బ్ధిని పొందగలవు.  భార‌త‌దేశం సాధించే శీఘ్ర ప్ర‌గ‌తి మొత్తం మ‌న ప్రాంతానికి అనేక లాభాల‌ను తెచ్చిపెడుతుంది.  ముఖ్యంగా శ్రీ లంక‌ కు లాభం చేకూరుతుంది.  మౌలిక సదుపాయాల క‌ల్ప‌న‌, అనుసంధానం, ర‌వాణా, ఇంధ‌న రంగాలలో మ‌న స‌హ‌కారాన్ని మ‌రింత పెంచుకోవలసి ఉంది.  ఇరు దేశాల మ‌ధ్య‌ గ‌ల అభివృద్ధి భాగ‌స్వామ్యం.. దాదాపుగా అన్ని రంగాల‌కు విస్త‌రించింది.  వ్య‌వ‌సాయం, విద్య‌, ఆరోగ్యం, పున‌రావాసం, ర‌వాణా, విద్యుత్తు, నీరు, నివాస గృహాలు, క్రీడ‌లు, మాన‌వ‌ వ‌న‌రులు, సంస్కృతి.. ఇలా అన్ని రంగాలలో మ‌న అభివృద్ధి భాగస్వామ్యం కొన‌సాగుతోంది.

 

ఈ రోజు శ్రీ లంక‌ తో భార‌త‌దేశ అభివృద్ధిపరమైన స‌హ‌కారం 2.6 బిలియ‌న్ అమెరికా డాల‌ర్ల‌కు చేరుకుంది.  దీని వెనుక ఉన్న ఒకే ఒక ల‌క్ష్యం శ్రీ లంక ప్ర‌జ‌ల‌కు శాంతిపూర్వ‌క‌మైన, సౌభాగ్య‌క‌ర‌మైన‌, భ‌ద్ర‌త క‌లిగిన భ‌విష్య‌త్తును అందించ‌డ‌మే..  ఎందుకంటే, శ్రీ లంక ప్ర‌జ‌ల ఆర్ధిక‌, సామాజిక సౌభాగ్య‌మ‌నేది 125 కోట్ల భార‌తీయుల‌తో ముడిప‌డి ఉంది.  ఎందుకంటే భూభాగం మీద కావ‌చ్చు, హిందూ మ‌హాస‌ముద్ర జ‌లాల్లో కావ‌చ్చు.. ఇరు దేశాల స‌మాజాల భ‌ద్ర‌త అవిభాజ్య‌ం.  శ్రీ లంక అధ్య‌క్షుడు శ్రీ సిరిసేన‌ తోను, ప్ర‌ధాని శ్రీ విక్ర‌మ‌సింఘే తోను నేను జ‌రిపిన సంభాష‌ణ‌లు ఇరు దేశాల ఉమ్మ‌డి ల‌క్ష్యాల‌ను అందుకోవ‌డానికి మ‌రింత‌గా దోహదం చేస్తాయి.  శ్రీ లంక త‌న దేశంలో శాంతి విల‌సిల్ల‌డానికి, ప్ర‌జ‌లు ప్ర‌గ‌తి సాధించ‌డానికి ముఖ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకున్నది.  కాబ‌ట్టి శ్రీ లంక అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు భార‌త‌దేశం ఒక స్నేహితునిగా, భాగ‌స్వామిగా స‌హ‌కారాన్ని అందిస్తోంది.

 

ఆదరణీయులైన స‌న్యాసులారా, శ్రేష్ఠులు మరియు స్నేహితులారా,

 

రెండువేల ఐదు వంద‌ల సంవ‌త్స‌రాల క్రితం బుద్ధ భ‌గ‌వానుడు ఇచ్చిన సందేశం ఈ ఇర‌వై ఒక‌టో శ‌తాబ్దంలో కూడా సముచితంగా ఉంది.  బుద్ధ భ‌గ‌వానుడు ప్ర‌తిపాదించిన మ‌ధ్యేమార్గం మ‌న‌కు చాలా నేర్పుతుంది.  ఈ సందేశానికి ఉన్న సార్వ‌త్రిక‌త‌, నిత్యం ప‌నికొచ్చే స్వ‌భావాలు చాలా గొప్ప‌వి.  ఇవి దేశాల మ‌ధ్య‌ ఐక‌మ‌త్యానికి దోహ‌దం చేస్తాయి.  ద‌క్షిణ‌, మ‌ధ్య‌, ఆగ్నేయ‌, తూర్పు ఆసియా దేశాలు వాటి బౌద్ధ బంధాల‌ను భార‌త‌దేశంతో క‌లిగి ఉన్నందుకు గ‌ర్విస్తున్నాయి.

 

వేసాక్ డే ని ప్ర‌తిఫ‌లించేలా తీసుకున్న మ‌ఖ్యాంశాలు సామాజిక న్యాయం, సుస్థిర‌మైన ప్ర‌పంచ శాంతి.  ఇవి బుద్ధ‌భ‌గ‌వానుని బోధ‌న‌ల‌ను చాలా లోతుగా ప్ర‌తిబింబిస్తున్నాయి.  ఈ ముఖ్యాంశాలు చూడడానికి స్వ‌తంత్రంగా ఉన్న‌ట్టు అనిపిస్తాయి.  అయితే ఇవి ఒక‌దానితో మరొక‌టి ముడిప‌డి ఉన్న‌వి;  ఒక‌దానిపైన మ‌రొక‌టి ఆధార‌ప‌డి ఉన్నవీనూ.  స‌మాజాల మ‌ధ్య‌ గానీ, స‌మాజాల లోపు గానీ సంభ‌వించే సంఘ‌ర్ష‌ణ‌ల‌కు సామాజిక న్యాయం అనే అంశం ముడిప‌డి ఉంది.  మ‌నిషి లోని అత్యాశ‌ కార‌ణంగా జ‌నించే దాహం వ‌ల్ల ముఖ్యంగా ఈ ఘ‌ర్ష‌ణ ఏర్ప‌డుతుంది.  మ‌నిషి లోని అత్యాశ‌ కార‌ణంగానే మాన‌వాళి తన చుట్టుప‌క్క‌ల‌ స‌హ‌జ వాతావ‌ర‌ణాన్ని లోబ‌రుచుకొని నాశ‌నం చేయ‌డం జ‌రుగుతోంది.  మ‌న‌కు ఉన్న కోరిక‌ల‌న్నింటినీ జ‌యించాల‌నే అత్యాశ‌ కార‌ణంగానే స‌మాజంలో ఆదాయ అస‌మాన‌త‌లు ఏర్ప‌డ్డాయి.  త‌ద్వారా సామాజిక ప్రశాంత‌త నాశ‌న‌మైంది.

 

అదే విధంగా ప్ర‌స్తుతం సుస్థిర‌మైన ప్ర‌పంచ శాంతి సాధ‌న‌కు ఏర్ప‌డుతున్న అతి పెద్ద స‌వాల్ అనేది దేశాల మ‌ధ్య‌ వున్న ఘ‌ర్ష‌ణ వాతారవ‌రణం కార‌ణంగానే ఖ‌చ్చితంగా ఏర్ప‌డుతున్న‌ద‌ని చెప్ప‌లేం.  ద్వేషం, హింస‌ ల‌లో పాతుకుపోయిన దృక్ప‌థాలు, ఆలోచ‌న‌ విధానాలు, సంస్థ‌ల వ‌ల్ల‌ కూడా సుస్థిర ప్ర‌పంచ శాంతి సాధ్యం కావ‌డం లేదు.  ప్రాంతీయంగా విజృంభిస్తున్న ఉగ్ర‌వాద భూత‌ం విధ్వంస‌క శ‌క్తుల భావాల‌ నుండి జ‌న్మించి త‌ర‌చుగా కోర‌లు చాస్తోంది.  మ‌న దుర‌దృష్టం కొద్దీ మ‌న  ప్రాంతంలో  విద్వేష భావాలు, వాటిని విస్త‌రిస్తున్న శ‌క్తులు చ‌ర్చ‌ల‌కు అనుకూలంగా లేరు.  వారు మృత్యు క్రీడ‌కు, విధ్వంసానికి మాత్ర‌మే సిద్ధంగా ఉన్నారు.  ప్ర‌పంచ వ్యాప్తంగా పెరుగుతున్న హింస‌కు బుద్ధ భ‌గ‌వానుడు ఇచ్చిన శాంతి సందేశ‌మే ప‌రిష్కారం చూపుతుంద‌ని నేను బ‌లంగా న‌మ్ముతున్నాను.

 

ఘ‌ర్ష‌ణ లేక‌పోతేనే శాంతి ఉంటుంద‌ని ఊరకనే నిరాశ‌గా మాట్లాడుకోవ‌డం కాదు.. చ‌ర్చ‌లు, ప్రశాంత‌త‌, న్యాయం అనేవి ప్రేమ‌తో కూడిన ద‌య‌, వివేకం మీద ఆధార‌ప‌డి వుంటాయి.  అప్పుడే ఆశాపూరిత‌మైన శాంతి సిద్ధిస్తుంది.  బుద్ధ‌ భ‌గ‌వానుడు ఏం చెప్పారు.. శాంతి కంటే మించిన ఉన్న‌త సౌఖ్యం మ‌రొక‌టి లేద‌ని ఆయన అన్నారు.  ఆయ‌న జ‌న్మించిన విశాఖ ప‌ర్వ‌దిన సంద‌ర్భంగా నా సంక‌ల్పం  ఏమిటంటే, భార‌త‌దేశం, శ్రీ లంక లు క‌లిసిక‌ట్టుగా ప‌ని చేసి, బుద్ధ భ‌గ‌వానుని ఆద‌ర్శాల‌ను నెర‌వెరుస్తాయనేదే.  త‌ద్వారా  ఉభయ దేశాల ప్ర‌భుత్వాలు శాంతి, అంద‌రికీ ఆవాసం, అంద‌రినీ క‌లుపుకుపోవ‌డం, ద‌య‌తో కూడిన విధానాల‌ను, ప్ర‌వ‌ర్త‌న‌ను క‌లిగిన  పరిపాల‌న‌ను అందిస్తాయి.  అత్యాశ‌ను, ద్వేషాన్ని, అజ్ఞానాన్ని వ‌దలివేయాల‌నుకొనే,  స్వేచ్ఛగా బ‌తికే వ్య‌క్తులు, కుటుంబాలు, సంఘాలు, దేశాలు అనుస‌రించాల్సిన నిజ‌మైన మార్గం ఇదే.  విస్తృతంగా చెప్పాలంటే ప్ర‌పంచానికి ఇదే మార్గం అనుస‌ర‌ణీయం.

 

ఆదరణీయులైన సాధువులారా, శ్రేష్ఠులు మరియు  స్నేహితులారా,

 

ప‌విత్ర‌మైన వైశాఖ పర్వ‌దిన సంద‌ర్భంగా చీక‌టిని త‌రిమికొట్టడానికి మ‌నంద‌రం క‌లిసి జ్యోతులను వెలిగిద్దాం.  ఆత్మ‌శోధ‌న చేసుకుందాం.  కేవ‌లం స‌త్యాన్నే న‌మ్ముకుందాం.  బుద్ధ భ‌గ‌వానుని మార్గాన్ని అనుస‌రించేలా మ‌న కార్య‌క్ర‌మాల‌ను అంకితం చేద్దాం.  ఆయ‌న అందించిన‌ వెలుగు ప్రపంచానికే వెలుగ‌వుతుంది.

 

ధ‌మ్మ‌ప‌దంలోని 387వ ప‌ద్యం చెప్పేదేమిటంటే..

 

दिवातपतिआदिच्चो,रत्तिंगओभातिचंदिमा.

सन्न्द्धोखत्तियोतपति,झायीतपति ब्राह्मणों.

अथसब्बमअहोरत्तिंग,बुद्धोतपतितेजसा.

 

దీనికి,

 

సూర్యుడు ప‌గ‌టిని వెలిగిస్తాడు..

చంద్రుడు రాత్రికి వెలుగుల్ని అందిస్తాడు..

యుద్ధ వీరుడు తన ఆయుధాల‌తో రాణిస్తాడు..

బ్రాహ్మ‌ణుడు ధ్యానంతో వెలుగొందుతాడు..

అయితే, చైత‌న్య‌పూరిత‌మైన వ్య‌క్తి తన తేజస్సును ప‌గ‌లు- రాత్రి అనే తేడా లేకుండా ప్ర‌స‌రింప‌చేస్తాడు.. అని అర్థం.

 

మీతో గ‌డిపే ఈ అవ‌కాశాన్ని నాకు ప్రసాదించినందుకు మీకంద‌రికీ నా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను..

 

క్యాండీలో బుద్ధ భ‌గ‌వానుని ప‌విత్ర దంత అవ‌శేషాన్ని క‌లిగిన శ్రీ ద‌లాద మ‌లిగవా దేవాల‌యాన్ని ఈ మ‌ధ్యాహ్నం ద‌ర్శించుకోవ‌డానికి వెళ్తున్నాను.  బుద్ధ భ‌గ‌వానుని త్రి ర‌త్నాలైన బుద్ధ‌, ధ‌మ్మ‌, సంఘ మ‌న అంద‌రికీ ఆశీర్వాదాలు అందిస్తాయని ఆశిస్తూ..

 

మీకు ఇవే నా ధన్యవాదాలు.

అనేకానేక ధన్యవాదాలు.

 

***