హాంబర్గ్ లో జి 20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కొరియా గణతంత్రం అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ మూన్ జే-ఇన్ ను కలుసుకొన్నారు. అధ్యక్ష ఎన్నికలలో విజేతగా నిలచినందుకుగాను ప్రెసిడెంట్ శ్రీ మూన్ కు ప్రధాన మంత్రి శ్రీ మోదీ స్వయంగా అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ తనను అభినందిస్తూ ప్రధాన మంత్రి ఫోన్ లో సంభాషించడాన్ని జ్ఞాపకం చేసుకొన్నారు. అంతే కాక, శ్రీ మోదీ కొరియా భాషలో ట్విటర్ లో అభినందన సందేశాన్ని పంపించడాన్ని కూడా శ్రీ మూన్ గుర్తుకు తెచ్చుకొంటూ, ఆ ట్వీట్ ను దక్షిణ కొరియా ప్రజలు ఎంతో ఆత్మీయంగా స్వీకరించారని ఆయన చెప్పారు. ఇరువురు నేతలూ భారతదేశానికి, దక్షిణ కొరియాకు మధ్య నెలకొన్న ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా- మరీ ముఖ్యంగా ‘మేక్ ఇన్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’, ‘స్టార్ట్ అప్ ఇండియా’, తదితర కార్యక్రమాలలో పాలుపంచుకోవడం ద్వారా- పెంపొందించుకోవాలన్న నిబద్ధతను వ్యక్తం చేశారు. వీలయినంత త్వరలో భారతదేశ పర్యటనకు రావలసిందిగా అధ్యక్షుడు శ్రీ మూన్ ను ప్రధాన మంత్రి ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని అధ్యక్షుడు స్వీకరించారు.
ఇటలీ ప్రధాన మంత్రి, శ్రేష్ఠుడు శ్రీ పావొలో జెంటోలిని తో ప్రధాన మంత్రి శ్రీ మోదీ జరిపిన చర్చలు ద్వైపాక్షిక సంబంధాలను- మరీ ముఖ్యంగా వ్యాపారం, పెట్టుబడులు, ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాల విషయంలో ఈ సంబంధాలను- పెంపు చేసుకోవడం ప్రధానంగా సాగాయి. ఈ సంవత్సరం నవంబరులో భారతదేశంలో జరిగే ఫూడ్ ప్రాసెసింగ్ ఎగ్జిబిషన్ అయినటువంటి ‘వరల్డ్ ఫూడ్ ఇండియా’ లో ఇటలీ పాలుపంచుకోవాలంటూ ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఆహ్వానించారు. ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసుకొనే దిశగా రెండు దేశాల మధ్యతరహా సంస్థలకు మధ్య అన్యోన్యతను ప్రోత్సహించడానికి ప్రాధాన్యమివ్వవలసివుందని నేతలు ఇరువురూ అంగీకరించారు. ఇటలీ ప్రధాని తమ దేశంలో పారిశ్రామిక రంగంతో సహా పలు రంగాలలో భారతీయ పెట్టుబడులను ప్రశంసించారు. ఆఫ్రికాలో అభివృద్ధిని ప్రోత్సహించడానికి, జల వాయు పరివర్తనను నిరోధించడానికి అనువైన పరిష్కారాలను అందించేందుకు కలసి కృషి చేయగల అవకాశాలపైన కూడా ఉభయ నాయకులు చర్చ జరిపారు.
ప్రధాన మంత్రి శ్రీ మోదీ మరియు నార్వే ప్రధాని ఎర్నా సోల్ బర్గ్ గారు ద్వైపాక్షిక అంశాలపై, ప్రత్యేకించి ఆర్థిక సంబంధాలను పటిష్ఠపరచుకోవడం గురించి చర్చించారు. నేషనల్ ఇన్ వెస్ట్ మెంట్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లో నార్వే కు చెందిన పెన్షన్ ఫండులు ప్రాతినిధ్యం వహించాలంటూ ప్రధాన మంత్రి వాటిని ఆహ్వానించారు. యుఎన్ జిఎ సమావేశాల వేళ ఓశియన్ సమావేశంలో పాల్గొనవలసిందిగా భారతదేశాన్ని నార్వే ప్రధాని ఆహ్వానించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్ డిజి) సాధనలో సహకారానికి ప్రతీకాత్మకంగానా అన్నట్టు ఒక ఫుట్ బాల్ ను ప్రధాని సోల్ బర్గ్ గారు సమావేశం ముగింపు సమయంలో ప్రధాన మంత్రి శ్రీ మోదీ కి అందజేశారు. ఆ ఫుట్ బాల్ మీద ఎస్ డి జి అనే అక్షరాలు చిత్రించి ఉన్నాయి.
***