Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేరళ లో పర్యటించిన ప్రధాన మంత్రి; రక్షణ చర్యలను, సహాయక కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహణ


కేరళ లో వరదల కారణంగా తలెత్తిన పరిస్థితి ని సమీక్షించడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పర్యటించారు. సమీక్ష సమావేశం ముగిసిన తరువాత, వాతావరణ పరిస్థితులు అనుకూలించిన మేరకు, ఆయన రాష్ట్రం లోని వరద బాధిత ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలకు కలిగిన నష్టాన్ని విమానంలో నుంచి పరిశీలించారు. ఈ వైమానిక పరిశీలన లో గవర్నరు, ముఖ్యమంత్రి, కేంద్ర సహాయ మంత్రి శ్రీ కె.జె. అల్ఫోన్స్, ఇంకా అధికారులు ప్రధాన మంత్రి ని అనుసరించారు.

వరదల కారణంగా జరిగిన ప్రాణ నష్టం, ఆస్తినష్టాల పట్ల ప్రధాన మంత్రి దు:ఖాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి శ్రీ పినారాయీ విజయన్ తోను, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతోను జరిగిన ఒక సమావేశంలో ప్రధాన మంత్రి రాష్ట్రం లో వరద పరిస్థితిపై సమీక్ష ను నిర్వహించారు.

సమావేశం అనంతరం, ప్రధాన మంత్రి రాష్ట్రానికి 500 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇది 2018 ఆగస్టు 12వ తేదీన హోం శాఖ మంత్రి ప్రకటించిన 100 కోట్ల రూపాయల కు అదనం. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించిన మేరకు ఆహారధాన్యాలు, మందులు తదితర సహాయ సామగ్రిని కూడా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

మృతుల సంబంధికులకు 2 లక్షల రూపాయల వంతున, ఇంకా తీవ్రంగా గాయపడిన వారికి 50 వేల రూపాయల చొప్పున ప్రధాన మంత్రి జాతీయ సహాయక నిధి నుంచి అందజేస్తామని కూడా ప్రధాన మంత్రి ప్రకటించారు.

నష్టం అంచనాకై ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని, బాధిత కుటుంబాలకు / లబ్ధిదారులకు సామాజిక భద్రత పథకాలలో భాగంగా పరిహారాన్ని సకాలంలో విడుదల చేయాలని ప్రధాన మంత్రి బీమా కంపెనీలను ఆదేశించారు. ఫసల్ బీమా యోజన లో భాగంగా క్లెయిములను శీఘ్రంగా పరిష్కరించవలసిందంటూ కూడా ఆదేశాలు జారీ అయ్యాయి.

రాష్ట్రంలో వరదల వల్ల ధ్వంసమైన ప్రధాన జాతీయ రహదారులను ప్రాధాన్య ప్రాతిపదికన మరమ్మతు చేయాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ఎఐ)ను ప్రధాన మంత్రి ఆదేశించారు. విద్యుత్తు సరఫరా సదుపాయాలను పునరుద్ధరించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి వీలైన అన్ని విధాల సహాయాన్ని అందించాలంటూ ఎన్ టి పి సి, పిజిసిఐఎల్ ల వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఆదేశించారు.

రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదల్లో కచ్చా ఇళ్లు కోల్పోయిన గ్రామీణులకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ లో భాగంగా.. శాశ్వత నిరీక్షకుల జాబితా తాలూకు ప్రాధాన్య క్రమంతో నిమిత్తం లేకుండానే.. ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నారు.

మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో భాగంగా రాష్ట్రానికి 5.5 కోట్ల వ్యక్తిగత పనిదినాలను 2018-19 కార్మిక బడ్జెటు లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే, రాష్ట్రం సమర్పించే అభ్యర్థన మేరకు అర్హత గల పనిదినాల మంజూరును పరిశీలించేందుకు అంగీకరించింది.

నష్టం వాటిల్లిన తోట పంటలను రైతులు మళ్లీ సాగుచేసుకునేందుకు ఉద్యాన పంటల సమగ్రాభివృద్ధి కార్యక్రమం లో భాగంగా సహాయాన్ని అందించడం జరుగుతుంది.

కేరళ లో వరద పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం నిరంతర ప్రాతిపదికన సన్నిహితంగా పర్యవేక్షిస్తోంది. ఈ ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు అవసరమైన అన్నిరకాల తోడ్పాటును అందజేయడం జరుగుతుంది. వరద పరిస్థితి పై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి తో తరచుగా సంభాషిస్తూ పురోగతిని గురించి వాకబు చేస్తున్నారు.

ప్రధాన మంత్రి ఆదేశాల మేరకు హోం శాఖ సహాయ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు ఈ నెల 21వ తేదీన పర్యాటక శాఖ సహాయ (ఇన్ చార్జి) మంత్రి శ్రీ కె.జె. అల్ఫోన్స్, ఉన్నత స్థాయి అధికారుల బృందం తో వరద బాధిత ఆలప్పుళ, కోటయమ్ జిల్లాల్లో వరద పరిస్థితి ని, రక్షణ-సహాయ కార్యక్రమాలను పరిశీలించి సమీక్షించనున్నారు.

ఈ నెల 12వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్- పర్యాటక శాఖ సహాయ (ఇన్ చార్జి) మంత్రి శ్రీ కె.జె. అల్ఫోన్స్, ఇతర సీనియర్ అధికారులతో కలసి వరద బాధిత ప్రాంతాలను, కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను గగనతలం నుంచి పరిశీలించారు. అనంతరం కేరళ ముఖ్యమంత్రితోను, ఇతర మంత్రులతోను, అధికారులతోను ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అదే సమయంలో జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి రూ.100 కోట్ల ముందస్తు సహాయాన్ని ప్రకటించారు.

మరోవైపు జూలై 21న రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన విజ్ఞాపన మేరకు ఈ నెల 7 నుంచి 12వ తేదీ వరకు కేంద్ర అంతర-మంత్రిత్వ బృందం (ఐఎమ్ సిటి) రాష్ట్రంలో వరద నష్టాల అంచనా నిమిత్తం పర్యటించింది.

రాష్ట్రంలో 1300 మంది జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం సిబ్బంది తో కూడిన 57 బృందాలు 435 పడవలతో రక్షణ, సహాయక చర్యలలో పాల్గొంటున్నాయి. అలాగే 5 కంపెనీల సరిహద్దు భద్రత దళ సిబ్బందితోపాటు కేంద్ర పారిశ్రామిక భద్రత (సిఐఎస్ఎఫ్) దళం సిబ్బంది, సత్వర కార్యాచరణ బలగం (ఆర్ఎఎఫ్) సిబ్బంది సేవలను కూడా రక్షణ-సహాయ కార్యక్రమాల్లో వినియోగిస్తున్నారు.

సైన్యం, వాయుసేన, నావికాదళ, తీర రక్షణ దళాల సిబ్బంది కూడా రాష్ట్రంలో సహాయ, రక్షణ కార్యక్రమాల్లో తమ వంతు సేవలందిస్తున్నారు. ఇందులో భాగంగా 38 హెలికాప్టర్లు సహా 20 విమానాలను నిత్యావసరాలు, ఆహారపదార్థాలు తదితరాల రవాణా కోసం వినియోగిస్తున్నారు. అంతేకాకుండా సైన్యం లోని 790 మంది సుశిక్షిత సిబ్బంది తో కూడిన 10 కాలమ్స్, 10 బృందాలు ఇంజనీరింగ్ కార్యాచరణ దళాలు (ఇటిఎఫ్) కూడా సేవలందిస్తున్నాయి. ఇక నావికా దళానికి చెందిన 82 బృందాలు, తీర రక్షణ దళానికి చెందిన 42 దళాలు, 2 నౌకలు కూడా రక్షణ, సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాయి.

ఈ నెల 9వ తేదీ నుంచి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, సైన్యం, నావికాదళాల సంయుక్త సిబ్బంది 6,714 మంది బాధితుల రక్షణ/తరలింపు చర్యలు చేపట్టడంతోపాటు 891 మందికి వైద్యసేవలను అందించాయి.

అనూహ్య ప్రకృతి బీభత్సం సవాలు ఎదుర్కోవడం లో రాష్ట్ర ప్రభుత్వ కృషి ని ప్రధాన మంత్రి కొనియాడారు. వరద నీటి నడుమ చిక్కుకున్న వారి రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. వరద పరిస్థితిని ఎదుర్కొనడంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాలా చేయూతను అందిస్తుందని ప్రధాన మంత్రి హామీని ఇచ్చారు.