Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్ర బడ్జెట్ పై ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

కేంద్ర బడ్జెట్ పై ప్రధానమంత్రి ప్రసంగ పాఠం


దేశ అభివృద్ధి ప్రయాణంలో ఈ రోజు ఓ ముఖ్య మజిలీకి చేరుకొన్నాం.  ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షల బడ్జెట్, ఇది మన దేశంలో ప్రతి ఒక్కరి కలలను నెరవేర్చే బడ్జెట్. అనేక రంగాల్లో యువత ప్రవేశించడానికి వీలుగా వాటి తలుపులను మేం తెరిచాం. అభివృద్ధి చెందిన భారత్ ఉద్యమాన్ని ముందుకు నడిపేది సామాన్య పౌరులే. ఈబడ్జెట్ బలాన్ని ఇంతలంతలు చేసేస్తుంది. పొదుపు మొత్తాలను, పెట్టుబడిని, వినియోగాన్ని, వృద్ధిని శరవేగంగా పెంచేయనుంది. ఈ జనతా జనార్దన్ బడ్జెట్ ను.. ప్రజల బడ్జెట్ ను తీసుకువచ్చినందుకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ జీని, ఆమెకు సహకారాన్ని అందించిన ఆమె బృందం సభ్యులందరినీ నేను అభినందిస్తున్నాను.

మిత్రులారా,

బడ్జెట్ అనేసరికి ప్రభుత్వ ఖజానాను ఏయే పద్ధతుల్లో నింపాలన్న అంశంపైనే దృష్టంతా కేంద్రీకృతం అవుతుంది, అయితే ఈ బడ్జెట్ సరిగ్గా దీనికి భిన్నమైందిగా ఉంది.  పరమాణు ఇంధన ఉత్పత్తిలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని తీసుకున్న నిర్ణయం చాలా చరిత్రాత్మక నిర్ణయం. ఇది పరమాణు ఇంధనాన్ని పౌరుల ప్రయోజనాలకు వినియోగించుకొంటూ రాబోయే కాలంలో దేశాభివృద్ధి ప్రయాణానికి చక్కటి బాటను వేస్తుంది. ఉద్యోగకల్పనకు అవకాశాలున్న అన్ని రంగాలకు అన్ని విధాలుగా బడ్జెట్లో
ప్రాధాన్యాన్నిచ్చారు.  నేను రెండు అంశాలను మీ దృష్టికి తీసుకురాదలుస్తున్నాను.. రాబోయే కాలంలో ఒక పెద్ద మార్పును తీసుకురాగలిగిన సంస్కరణలను గురించి నేను చర్చిస్తాను. ఒకటోది – మౌలిక సదుపాయాల రంగ హోదా దక్కిన కారణంగా, దేశంలో పెద్ద పెద్ద నౌకలను తయారు చేయడాన్ని ప్రోత్సహించనున్నారు; ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ (స్వయంసమృద్ధ భారత్ ఉద్యమం) జోరందుకొంటుంది. మరి మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, అత్యంత అధిక స్థాయిలలో ఉద్యోగాలను అందించగలిగింది నౌకానిర్మాణ రంగమే అనే సంగతే. అదే విధంగా, దేశంలో పర్యాటక  రంగానికి చాలా శక్తిసామర్థ్యాలున్నాయి. మొట్టమొదటిసారిగా, 50 ముఖ్య పర్యాటక కేంద్రాల్లో నిర్మించబోయే హోటళ్లను మౌలిక సదుపాయాల రంగ పరిధిలోకి చేర్చడం ద్వారా పర్యాటక రంగానికి ఎనలేని ప్రాధాన్యాన్నిస్తున్నారు. ఇది ఆతిథ్య రంగానికి ఉత్తేజాన్ని అందించే దిశలో దోహదం చేయనుంది. ఆతిథ్య రంగం ఉద్యోగ కల్పనలో చాలా పెద్ద అవకాశాలున్న రంగం. ఇక పర్యాటక రంగాన్ని చూస్తే ఇది కూడా ఒక రకంగా అనేక విధాలైన ఉద్యోగాలను కల్పించడంలో అతి పెద్ద రంగమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం, దేశం అభివృద్ధి, వారసత్వం.. మంత్రంతో ముందుకు కదులుతోంది. ఈ బడ్జెటులో, దీనికోసం చాలా ప్రధాన, నిర్దిష్ట చర్యలను చేపట్టారు. జ్ఞాన భారత్ మిషన్‌‌ను చేతిరాతలో ఉన్న ఒక కోటి పుస్తకాలను కాపాడాలనే ఆశయంతో తీసుకువచ్చారు. దీనితోపాటే, భారతీయ జ్ఞాన పరంపర నుంచి ప్రేరణను అందుకొని ఒక జాతీయ డిజిటల్ భాండాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు. అంటే టెక్నాలజీని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొంటారు, అలా ఉపయోగించుకొంటూ మన సాంప్రదాయక జ్ఞానామృతాన్ని సేకరిస్తారన్న మాట.

మిత్రులారా,

రైతుల కోసం బడ్జెటులో ఉన్న ప్రకటనలు వ్యవసాయ రంగంలోను, పూర్తి గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోనూ  ఒక కొత్త విప్లవానికి ఆధారాన్ని ఏర్పరుస్తాయి. పీఎం ధన్-ధాన్య కృషి యోజనలో భాగంగా, 100 జిల్లాల్లో నీటిపారుదల సదుపాయాలను, మౌలిక సదుపాయాలను అభివృద్ధిపరుస్తారు. రైతులకు మరింత సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని రూ. 5 లక్షలకు పెంచుతున్నారు.

మిత్రులారా,

ఇప్పుడు ఈ బడ్జెట్లో, రూ. 12 లక్షల వరకు ఉండే ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా చేశారు. అన్ని ఆదాయ వర్గాల వారికీ పన్నును తగ్గించారు కూడా. మన మధ్యతరగతి ప్రజానీకం, స్థిర ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాల్లో ఉన్న వారు.. ఆ తరహా మధ్య తరగతి జనం దీని వల్ల చాలా పెద్ద ప్రయోజనం అందుకోబోతున్నారు. ఇదే మాదిరిగా, కొత్త వృత్తులలో చేరిన వారు, కొత్త కొలువులను దక్కించుకొన్న వారు.. వారికి కూడా ఈ ఆదాయపు పన్ను మినహాయింపు ఒక భారీ అవకాశంగా మారనుంది.

మిత్రులారా,

తయారీపై ఈబడ్జెట్లో సమగ్రంగా దృష్టి సారించారు. దీనివల్ల ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఎంఎస్ఎంఈలు, చిన్న స్థాయి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు బలం పుంజుకొంటారు, కొత్త ఉద్యోగాలు అందివస్తాయి. జాతీయ తయారీ మిషన్ మొదలు క్లీన్‌టెక్, తోలు, పాదరక్షలు, ఆటవస్తువుల తయారీ పరిశ్రమ వరకు.. ఇలా అనేక రంగాలకు ప్రత్యేక మద్దతునిచ్చారు. లక్ష్యం స్పష్టంగా ఉంది.. అది, దేశంలో తయారు చేసిన వస్తూత్పత్తులు ప్రపంచ మార్కెటులో రాణించాలి అనేదే.

మిత్రులారా,

రాష్ట్రాల్లో పెట్టుబడికి తగిన పోటీతత్వంతో కూడిన పరిస్థితిని కల్పించడంపైన బడ్జెట్లో విశేష ప్రాధాన్యాన్నిచ్చారు. ఎంఎస్ఎంఈలకు, అంకుర సంస్థలకు పరపతి పూచీకత్తును రెట్టింపు చేస్తూ ఒక ప్రకటనను చేర్చారు. దేశంలో ఔత్సాహిక పారిశ్రామికులుగా మారాలని కోరుకొనే ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం రూ. 2 కోట్ల వరకు రుణాన్ని, అది కూడా ఎలాంటి పూచీకత్తు చూపనక్కరలేకుండానే, అందించే పథకం కూడా ఉంది. ఈ బడ్జెట్లో, నవ యుగం ఆర్థిక వ్యవస్థను లెక్కలోకి తీసుకొని, గిగ్ వర్కర్లను ఉద్దేశించి ఒక పెద్ద ప్రకటనను చేశారు. తొలిసారి, గిగ్ వర్కర్లను ఈ-శ్రమ్ (e-shram) పోర్టల్‌లో నమోదు చేసుకోనున్నారు. దీని తరువాత, వీరు ఆరోగ్యసంరక్షణ, ఇంకా ఇతర సామాజిక భద్రత పథకాల ప్రయోజనాలను అందుకొంటారు. ఈ చర్య శ్రమను గౌరవించాలన్న ప్రభుత్వ నిబద్ధతను చాటిచెబుతోంది. శ్రమయేవ జయతే. నియంత్రణ పరమైన సంస్కరణల మొదలు ఆర్థిక సంస్కరణల వరకు చూశారంటే, జన్ విశ్వాస్ 2.0 వంటి నిర్ణయాలు కనీస స్థాయి ప్రభుత్వం, నమ్మకం పునాదిగా పాలన పట్ల మా నిబద్ధతను మరింత బలపరచేవే.

మిత్రులారా,

ఈ బడ్జెట్ దేశ ప్రస్తుత తక్షణావసరాలను లెక్కలోకి తీసుకోవడం ఒక్కటే కాకుండా, మనం భవిష్యత్తు కాలానికి సన్నద్ధం కావడంలో కూడా సాయపడనుంది. అంకుర సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసే డీప్ టెక్ ఫండ్, జియో స్పేషియల్ మిషన్, న్యూక్లియర్ ఎనర్జీ మిషన్.. ఇవన్నీ ఆ తరహా ముఖ్య నిర్ణయాలే. ఈ చరిత్రాత్మక ప్రజా బడ్జెట్ ను  అందుకొంటున్నందుకుగాను దేశ ప్రజలందరికీ నేను మరో సారి అభినందనలు తెలియజేయడంతోపాటు ఆర్థిక మంత్రిని కూడా అభినందిస్తున్నాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు.

గమనిక: ఇది ప్రధాని ప్రసంగానికి స్థూల అనువాదం. ఆయన హిందీలో ప్రసంగించారు.

 

***