Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్ర ప్ర‌భుత్వం-బ్యాంకులు, బీమా కంపెనీలు, ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌ల్లోని ఉద్యోగాల స‌మానీక‌ర‌ణ‌కు మంత్రిమండ‌లి ఆమోదం; ఓబీసీ రిజ‌ర్వేష‌న్ల‌లో ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌ల‌ దిగువ కేట‌గిరీల ఉద్యోగుల పిల్ల‌ల‌కు ల‌బ్ధి


ఓబీసీ రిజ‌ర్వేష‌న్ల ప‌రిధిలోని అభ్య‌ర్థులు ఆ ల‌బ్ధిని కోరేందుకు వీలుగా కేంద్ర ప్ర‌భుత్వం-బ్యాంకులు, బీమా కంపెనీలు, ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌ల్లోని ఉద్యోగాల స‌మానీక‌ర‌ణ‌కు సంబంధించిన విధివిధానాల‌కు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన‌ మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు 24 సంవ‌త్స‌రాలుగా నెల‌కొన్న అనిశ్చితికి తెర‌ప‌డింది. అంతేకాకుండా కేంద్ర ప్ర‌భుత్వంలోని దిగువ కేట‌గిరీల ఉద్యోగుల పిల్ల‌ల‌తో స‌మానంగా ప్ర‌భుత్వ‌రంగ సంస్థలు, ఇత‌ర సంస్థ‌ల్లో దిగువ కేట‌గిరీల్లో ప‌నిచేసే ఉద్యోగుల పిల్ల‌లు కూడా ఓబీసీ రిజ‌ర్వేష‌న్ల ల‌బ్ధి పొందే వీలు క‌లుగుతుంది. ఉద్యోగ స‌మాన‌త్వం లేనందువ‌ల్ల ఇలాంటి సంస్థలలో సీనియర్ హోదాలో ఉన్నవారి వారి పిల్లలు సంప‌న్నశ్రేణికి చెందిన‌వారైన‌ప్ప‌టికీ ఆదాయ ప్ర‌మాణానికి త‌ప్పుడు భాష్యంతో ఓబీసీలుగా చ‌లామ‌ణి అవుతూ వారికి కేటాయించిన ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను చేజిక్కించుకుంటున్నారు. దీంతో సంప‌న్నశ్రేణికి చెంద‌ని నిజ‌మైన ఓబీసీల‌కు స‌మానావ‌కాశాలు ల‌భించ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మంత్రిమండ‌లి తీసుకున్న నిర్ణ‌యం దీనికి అడ్డుక‌ట్టవేసింది.

ఉద్యోగ స‌మానీక‌ర‌ణ‌తోపాటు ఇత‌ర వెనుక‌బ‌డిన వ‌ర్గాల (ఓబీసీ)కు సంపన్న శ్రేణి నిబంధ‌న‌ను వ‌ర్తింప‌జేసే ప్ర‌స్తుత వార్షికాదాయ ప‌రిమితిని రూ.6 ల‌క్ష‌ల నుంచి రూ.8 ల‌క్ష‌ల‌కు పెంచే ప్ర‌తిపాద‌న‌ను కూడా మంత్రిమండ‌లి ఆమోదించింది. దేశంలో సామాజికంగా ముందంజ‌వేసిన (సంప‌న్న శ్రేణి) వ్య‌క్తులు/వ‌ర్గాల‌ను ఓబీసీ ప‌రిధినుంచి త‌ప్పించేందుకే ఈ నిర్ణ‌యం తీసుకుంది. వినియోగ‌దారు ధ‌ర‌ల సూచీలో పెరుగుద‌ల ఆధారంగా ఈ వార్షికాదాయ ప‌రిమితి పెంపును నిర్ధారించింది. త‌ద్వారా కేంద్ర ప్ర‌భుత్వ స‌ర్వీసుల‌లో ఉద్యోగాల‌తోపాటు కేంద్రీయ విద్యా సంస్థ‌ల‌లో ప్ర‌వేశాల‌కు ఓబీసీ రిజ‌ర్వేష‌న్ల ల‌బ్ధిని మ‌రింత‌మంది పొందగ‌లుగుతారు.

ఇత‌ర వెనుక‌బ‌డిన వ‌ర్గాల వారికి సామాజిక న్యాయక‌ల్ప‌న‌లో మ‌రింత సార్వ‌జనీక‌ర‌ణకు తాను చేస్తున్న కృషిలో భాగంగా ప్ర‌భుత్వం తాజా చ‌ర్య‌లు తీసుకుంది. త‌ద‌నుగుణంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల జాతీయ క‌మిష‌న్‌కు రాజ్యాంగ‌బ‌ద్ధ‌త క‌ల్పించే బిల్లును ప్ర‌భుత్వం ఇప్ప‌టికే పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టింది. అలాగే రాజ్యాంగంలోని 340 అధిఃక‌ర‌ణం కింద క‌మిష‌న్ ఏర్పాటుకు కూడా నిర్ణ‌యించింది. ఓబీసీల‌లోనూ బాగా వెనుక‌బ‌డి ఉన్న మ‌రింత మందికి కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు, కేంద్రీయ విద్యా సంస్థ‌ల‌లో రిజ‌ర్వేష‌న్ల ల‌బ్ధి క‌లిగేవిధంగా ఈ క‌మిష‌న్ ఓబీసీ ఉప వ‌ర్గీక‌ర‌ణ చేప‌డుతుంది. ఏక‌కాలంలో తీసుకున్న ఈ నిర్ణ‌యాల‌తో కేంద్రీయ విద్యా సంస్థ‌లు, కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల‌లో ఓబీసీల‌కు మ‌రింత ప్రాతినిధ్యం ల‌భిస్తుంద‌ని అంచ‌నా. అంతేకాకుండా ఈ వ‌ర్గాల‌లోని మ‌రింత మంది నిరుపేద‌ల‌కు సామాజిక ప్ర‌గ‌తిలో భాగ‌స్వామ్యం, అవ‌కాశాలు అందుబాటులోకి వ‌స్తాయ‌ని భావిస్తోంది.

నేప‌థ్యం:

సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన వ్యక్తులను ఇత‌ర వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌నుంచి మినహాయించేందుకు హేతుబ‌ద్ధ, అవసరమైన సామాజిక ఆర్థిక ప్రమాణాలను నిర్ధారించి, అమలు చేయాల‌ని రిటి పిటిష‌న్ (సి) 930/1990పై (ఇంద్రా సాహ్ని కేసు) విచార‌ణ అనంత‌రం సుప్రీం కోర్టు 16.11.1992నాటి తీర్పులో కేంద్ర‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. త‌ద‌నంత‌రం 1993 ఫిబ్ర‌వ‌రిలో నిపుణుల క‌మిటీని ఏర్పాటు చేయ‌గా, ఓబీసీల నుంచి సామాజికంగా ముందంజ వేసిన వ్యక్తుల (సంప‌న్న శ్రేణి)ను నిర్ధారించే ప్ర‌మాణాల‌ను సిఫార‌సు చేస్తూ 10.03.1993న ప్ర‌భుత్వానికి నివేదిక స‌మ‌ర్పించింది. సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ నివేదిక‌ను ఆమోదించి, సిబ్బంది-శిక్ష‌ణ వ్య‌వ‌హారాల శాఖ‌కు పంప‌గా, సంప‌న్న శ్రేణిని మిన‌హాయించ‌డంపై ఆ శాఖ 08.09.1993న అధికారిక ఉత్త‌ర్వులు జారీచేసింది.

ఈ ఉత్త‌ర్వుద్వారా ఆరు వ‌ర్గాల‌ను (ఎ) రాజ్యాంగ‌/చ‌ట్ట‌బ‌ద్ధ నియామ‌కాలు (బి) కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌లోని గ్రూప్‌-ఎ, బిస‌హా ప్ర‌భుత్వ‌రంగ/చ‌ట్ట‌బ‌ద్ధ‌ సంస్థ‌లు, విశ్వ‌విద్యాల‌యాల ఉద్యోగులు (సి) సైన్యంలో క‌ల్న‌ల్ అంత‌క‌న్నా ఎక్కువ‌ స్థాయి, అర్ధ సైనిక బ‌ల‌గాల్లో స‌మాన‌స్థాయి ఉద్యోగాలు (డి) వైద్యులు, ఇంజ‌నీర్లు, న్యాయ‌వాదులు, మేనేజ్‌మెంట్ క‌న్స‌ల్టెంట్లు వ‌గైరా (ఇ) వ్య‌వ‌సాయ క్షేత్రాలు లేదా ఖాళీ స్థ‌లాలు/భ‌వ‌నాలు వంటి ఆస్తుల య‌జ‌మానులు (ఎఫ్‌) ఆదాయ‌/సంప‌ద ప‌న్ను చెల్లింపుదారుల‌ను సంప‌న్న శ్రేణిగా గుర్తించింది.

ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌లు, బ్యాంకులు, బీమా సంస్థ‌లు, విశ్వవిద్యాల‌యాలు వ‌గైరాల‌లోని త‌త్స‌మాన హోదాగ‌ల లేదా స‌రిపోల్చ‌గ‌ల అధికారుల విష‌యంలోనూ అవ‌స‌ర‌మైన మార్పుచేర్పుల‌తో ఈ పారామితులు వ‌ర్తిస్తాయ‌ని స‌ద‌రు అధికారిక ఉత్త‌ర్వు స్ప‌ష్టం చేసింది. ఇందుకు త‌గిన‌ట్లుగా కేంద్ర ప్ర‌భుత్వంలోని ఉద్యోగాల‌తో ఈ సంస్థ‌ల‌లోని పోస్టుల స‌మాన‌త్వ స్థాయిని ప్ర‌భుత్వం నిర్ధారించాల‌ని పేర్కొంది. త‌ద్వారా ఈ సంస్థ‌ల‌లోని అధికారుల‌కు ఆదాయ నిబంధ‌న‌ను వ‌ర్తింప‌జేసేందుకు స‌మాన‌త్వ నిర్ధార‌ణకు వీలుంటుంద‌ని వివ‌రించింది. అయితే, స‌ద‌రు స‌మాన‌త్వ స్థాయిని నిర్ధారించే క‌స‌ర‌త్తు ప్రారంభ‌మే కాని ఫ‌లితంగా అది 24 ఏళ్లుగా మూల‌న ప‌డి ఉండిపోయింది.

ఈ నేప‌థ్యంలో ఉద్యోగాల స‌మానీక‌ర‌ణ నిర్ధార‌ణపై కూలంక‌ష ప‌రిశీల‌న సాగింది. ఆ మేర‌కు కేంద్ర‌ ప్ర‌భుత్వరంగ సంస్థ‌ల‌లో అన్ని బోర్డుస్థాయి, నిర్వాహ‌క స్థాయి ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలను ప్ర‌భుత్వంలోని గ్రూప్‌-ఎ ఉద్యోగాల‌తో స‌మానం చేయ‌గా, ఇక‌పై వారిని సంప‌న్న శ్రేణిగా ప‌రిగ‌ణిస్తారు. అలాగే ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు, ప్ర‌భుత్వ‌రంగ బీమా సంస్థ‌ల‌లోని జూనియ‌ర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్‌-1 అంత‌క‌న్నా ఎక్కువ స్థాయిగ‌ల పోస్టుల‌ను కేంద్ర ప్ర‌భుత్వంలోని గ్రూప్-ఎ ఉద్యోగాల‌తో స‌మానం చేయ‌గా, వారిని సంప‌న్న‌శ్రేణిగా ప‌రిగ‌ణిస్తారు. ఇక ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థ‌లు, ప్ర‌భుత్వ‌రంగ బీమా సంస్థ‌ల‌లోని క్ల‌ర్కులు, ప్యూన్లకు సంబంధించి ఆదాయ నిర్ధార‌ణ స‌మయానుకూలంగా మారుతూంటుంది. ఈ మేర‌కు విస్తృత మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ అయిన నేప‌థ్యంలో ప్ర‌తి బ్యాంకు, ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌, బీమా కంపెనీ వీటిని త‌మ‌త‌మ బోర్డుల ముందుంచి ఆయా ఉద్యోగాల‌ను గుర్తించాల్సి ఉంటుంది.