కేంద్రీయ పారిశ్రామిక భద్రత దళం (సిఐఎస్ఎఫ్) యొక్క గ్రూప్ ‘ఎ’ ఎగ్జిక్యూటివ్ కాడర్ లో కాడర్ రివ్యూ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది సిఐఎస్ఎఫ్ లో సీనియర్ డ్యూటీ పదవులలో పర్యవేక్షక సిబ్బందిని పెంచేందుకు అసిస్టెంట్ కమాండెంట్ మొదలుకొని అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్థాయి వరకు వేరు వేరు స్థానాలలో 25 పదవులను సృష్టించేందుకు వీలు కల్పిస్తుంది.
సిఐఎస్ఎఫ్ కాడర్ పునర్ నిర్మాణం ఫలితంగా గ్రూప్ ‘ఎ’ లో పదవులు 1252 నుండి 1277 కు పెరుగుతాయి. ఇందులో అడిషనల్ డైరెక్టర్ జనరల్ పదవులు 2, ఇన్‌స్పెక్టర్ జనరల్ పదవులు 7, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఉద్యోగాలు మరియు కమాండెంట్ ఉద్యోగాలు చెరి 8 చొప్పున పెరుగుతాయి.
ప్రభావం :
సిఐఎస్ఎఫ్ లో ఈ విధమైన గ్రూప్ ‘ఎ’ పదవులను సృష్టించిన తరువాత ఈ దళం యొక్క పర్యవేక్షక సామర్ధ్యంతో పాటు కెపాసిటీ బిల్డింగ్ కూడా పెంపొందుతుంది. గ్రూప్ ‘ఎ’ పదవుల తాలూకు కాడర్ రివ్యూ లో భాగంగా ప్రతిపాదిత ఉద్యోగాలను సకాలంలో సృష్టించడం ఈ దళం యొక్క పర్యవేక్షక సామర్ధ్యాన్ని, పాలక సామర్ధ్యాన్ని ఇనుమడింపచేయగలదు.
పూర్వరంగం :
1968 నాటి సిఐఎస్ఎఫ్ చట్టం ద్వారా సిఐఎస్ఎఫ్ ఆవిర్భవించింది. ఈ దళాన్ని కేంద్రం యొక్క సాయుధ బలగంగా ప్రకటిస్తూ సదరు చట్టంలో 1983 లో సవరణను తీసుకువచ్చారు. ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులకు భద్రతను కల్పించి వాటిని రక్షించడం సిఐఎస్ఎఫ్ మూల శాసనపత్రం ప్రధానోద్ధేశంగా ఉంది. దీని విధులను విస్తృతం చేసి ప్రైవేటు రంగ యూనిట్లకు కూడా భద్రతా కవచాన్ని అందించేందుకు, కేంద్ర ప్రభుత్వం అప్పగించేటటువంటి ఇతర విధులను కూడా చేర్చేందుకు1988వ, 1999వ మరియు 2009వ సంవత్సరాలలో ఈ చట్టంలో సవరణలు చేయడం జరిగింది.
కేవలం మూడు బెటాలియన్ లతో 1969 లో సిఐఎస్ఎఫ్ ఆవిర్భవించింది. 12 రిజర్వు బెటాలియన్ లు, ఇంకా ప్రధాన కేంద్రం మినహా ఇతర సిఎపిఎఫ్ ల మాదిరి సిఐఎస్ఎఫ్ కు బెటాలియన్ నిర్మాణ క్రమమంటూ ఏదీ లేదు. ప్రస్తుతం ఈ దళం దేశమంతటా విస్తరించిన 336 పారిశ్రామిక సంస్థలకు (59 విమానాశ్రయాలు సహా) భద్రత ఏర్పాట్లను సమకూర్చుతోంది. 1969 లో 3192 మంది మంజూరు చేసినటువంటి సిబ్బందితో మొదలైన ఈ దళం 30.06.2017 నాటికి విస్తరించి 1,49,088 కి చేరుకొంది. సిఐఎస్ఎఫ్ ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంది. ఈ సంస్థకు డిజి అధిపతిగా ఉన్నారు. డిజి పదవి ఎక్స్-కాడర్ పదవిగా ఉంది.