Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కెన‌డా ప్ర‌ధానిని అభినందించిన ప్ర‌ధాన‌మంత్రి


కెన‌డా ప్ర‌ధానమంత్రిగా నియ‌మితులైన లిబ‌ర‌ల్ పార్టీ నేత శ్రీ జ‌స్టిన్ ట్రుడ్యుతో భార‌త ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ టెలిఫోన్‌లో సంభాషించారు. కెన‌డాలో ఇటీవ‌లే ముగిసిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో లిబ‌ర‌ల్ పార్టీని విజ‌య‌ప‌థంలో న‌డిపించినందుకు శ్రీ ట్రుడ్యును ఆయ‌న అభినందించారు. ఆయ‌న సార‌థ్యంలో కెన‌డా మ‌రింత అభివృద్ధి సాధించి, ప్ర‌గ‌తి ప‌థంలో దూసుకుపోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. గ‌త ఏప్రిల్‌లో కెన‌డా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా శ్రీ ట్రుడ్యుతో భేటీని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని శ్రీ మోదీ గుర్తు చేశారు. ప్ర‌జాస్వామ్యం, బహుళ‌త్వం, చ‌ట్టాలు, ప్ర‌జ‌సంబంధాలు ఉమ్మ‌డి పునాదులుగా భార‌త్‌, కెన‌డా సంబంధాలు ముడిప‌డ్డాయ‌ని ప్ర‌ధాని శ్రీ మోదీ అన్నారు. కెన‌డాతో వ్యూహాత్మ‌క సంబంధాన్ని మ‌రింత విస్త‌రించ‌టానికి భార‌త్ అత్యంత ప్రాధాన్యాన్ని ఇస్తుంద‌ని ఆయ‌న తెలిపారు.

ప్ర‌ధాని శ్రీ మోదీ అభినంద‌న‌ల‌కు కెన‌డా ప్ర‌ధాని శ్రీ ట్రుడ్యు సాద‌రంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ప్ర‌ధాని శ్రీ మోదీతో క‌ల‌సి భార‌త్‌, కెన‌డా మైత్రి, బంధాన్ని మ‌రింత బ‌లోపేతం చేయ‌టానికి, రాజ‌కీయ‌, ఆర్థిక‌, ర‌క్ష‌ణ రంగాలతోపాటు అన్నింటా అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తాన‌ని శ్రీ ట్రుడ్యు ఉద్ఘాటించారు. భార‌త్‌కు అధికారిక ప‌ర్య‌ట‌న‌కు రావాల‌ని ప్ర‌ధాని ఆహ్వానించ‌గా, అందుకు శ్రీ ట్రుడ్యు ఆనందంగా అంగీక‌రించారు. రాబోయే జీ-20, సీఓపీ స‌ద‌స్సుల సంద‌ర్భంగా క‌ల‌సుకోవాల‌ని ఇద్ద‌రు నేత‌లు అభిప్రాయ‌ప‌డ్డారు.