Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కెన్యాలో ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటన సంద‌ర్భంగా ఆయన వెలువరించిన ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ (జులై 11, 2016)

కెన్యాలో ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పర్యటన సంద‌ర్భంగా ఆయన వెలువరించిన ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌ (జులై 11, 2016)


మాననీయ మహోదయులు అధ్యక్షుడు శ్రీ ఉహురు కెన్యాట్టా,

డిప్యూటీ ప్రెసిడెంట్ శ్రీ విలియం రూతో,

సోదర, సోదరీమణులారా..

హిస్ ఎక్స్ లెన్సీ, మీ దయాభరిత వచనాలకు ఇవే నా ధన్యవాదములు.

ఇక్కడ నైరోబీలో ఉన్నందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. నాకు, నా వెంట వచ్చిన ప్రతినిధి వర్గానికీ స్వాగతం పలికి, ఆతిధ్యం ఇచ్చినందుకు అధ్యక్షులు శ్రీ కెన్యాట్టా కు నా కృతజ్ఞతలు. ఎక్స్ లెన్సీ అధ్యక్షుడు శ్రీ ఉహురు గారూ, మీ పేరు లో “ఉహురు” అంటే “స్వాతంత్ర్యం” అని నాకు చెప్పారు.. ఈ రకంగా మీ జీవనయానం స్వాతంత్ర్య కెన్యా ప్రయాణం లాగే ఉంది. ఈ రోజు మీతో నేను గడపగలగడం నాకు దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను.

స్నేహితులారా,

కెన్యా భారతదేశానికి ఎంతో విలువైన, నమ్మకమైన భాగస్వామి. ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎంతో పురాతనమైనవి, ఎంతో ఉన్నతమైనవి. వలసవాదంపై పోరాటం చేసిన ఉమ్మడి వారసత్వాన్ని మనం పంచుకున్నాము.

మన ప్రజల చరిత్రాత్మకమైన పరస్పర సంబంధాలు మన విస్తృతస్థాయి భాగస్వామ్యానికి పటిష్ట స్థావరంగా ఉన్నాయి. వీటిని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి –

• వ్యవసాయం, ఆరోగ్యం నుండి అభివృద్ధి పరమైన సహాయం వరకూ;

• వ్యాపారం, వాణిజ్యం నుండి పెట్టుబడుల వరకూ;

• మన ప్రజల మధ్య సన్నిహిత సంబంధాల నుండి సామర్ధ్య నిర్మాణం వరకూ;

• తరచుగా రాజకీయ సంప్రదింపుల నుండి రక్షణ, భద్రతా సహకారం వరకూ;

మొదలైన ఎన్నో విషయాలతో పాటు ఈ రోజు అధ్యక్షులవారూ, నేనూ అన్ని విషయాలపై మన సంబంధాలను పూర్తి స్థాయిలో సమీక్షించాం.

స్నేహితులారా,

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో భారతదేశం ఒక ఉజ్జ్వల కేంద్రంగా ఉంది. అలాగే కెన్యా కూడా పటిష్టమైన అవకాశాలు గల కేంద్రంగా ఉంది. భారతదేశానికి కెన్యా అతి పెద్ద వ్యాపార భాగస్వామి. దీనితో పాటు రెండో అతిపెద్ద పెట్టుబడిదారు కూడా. అయితే మరింత సాధించడానికి తగిన సామర్ధ్యం కూడా ఉంది.

మన ఆర్ధిక వ్యవస్థలు ఇతోధిక ప్రయోజనాన్ని పొందాలని అధ్యక్షుల వారూ, నేను అంగీకరించాం. ఇందుకోసం

– వాణిజ్య సంబంధాలను మరింతగా పెంచుకోవాలి;

– విభిన్నమైన మరిన్నివ్యాపార మార్గాల కోసం చర్యలు తీసుకోవాలి; ఇంకా,

– మన పెట్టుబడుల సంబంధాలను మరింత విస్తరించుకోవాలి.

దీని వల్ల ప్రాంతీయ ఆర్ధిక శ్రేయస్సు ఇప్పటికన్నా పెరిగేందుకు అవకాశం లభిస్తుంది. వీటిలో ప్రభుత్వాలు వాటి వంతు పాత్రను నిర్వహిస్తూండగా, మన వాణిజ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి రెండు దేశాల వ్యాపార వర్గాలు వాటి వంతు కీలక పాత్రను పోషించవలసిన అవసరం ఉంది. ఈ రోజు నిర్వహించనున్న ఇండియా- కెన్యా బిజినెస్ ఫోరమ్ సమావేశానికి నేను స్వాగతం పలుకుతున్నాను. భారతదేశం, కెన్యా లు అభివృద్ధిచెందుతున్న దేశాలే కాక నవకల్పన సమాజాలు (ఇన్నోవేషన్ సొసైటీస్) కూడా. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అది ప్రక్రియ అయినా, లేక ఉత్పత్తులు అయినా, లేదా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానమైనా.. మన నవకల్పనలు మన సమాజానికే పరిమితం కాలేదు. అవి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని ప్రజల అభివృద్ధికి కూడా సహాయపడుతున్నాయి. వీటిలో ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మందికి సాధికారత కల్పించిన M-Pesa అనేది ఒక ప్రామాణిక నవకల్పన. నవకల్పనల సాంకేతిక పరిజ్ఞానాన్ని వాణిజ్యపరంగా తీర్చిదిద్దడానికి రెండు వర్గాలు కలసి పనిచేస్తున్నాయి. ఇందులో కొన్ని ఈ రోజు జరిగే బిజినెస్ ఫోరమ్ సమావేశంలో స్పష్టంగా వెలుగు చూసే అవకాశం ఉంది.

స్నేహితులారా,

బహుముఖ అభివృద్ధి భాగస్వామ్యమనేది మన ద్వైపాక్షిక సంబంధాలకు ఒక కీలక స్తంభం లాంటిది. మన అభివృద్ధి ప్రాధాన్యాలు కూడా దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. అభివృద్ధి అనుభవాలను, నైపుణ్యాలను పంచుకోవడం, రాయితీ రేట్లకు రుణాలను, సామర్ధ్యాలను అందజేయడంద్వారా కెన్యా అభివృద్ధి పథకాలకు సహాయం చేయడానికి భారతదేశం సిద్ధంగా ఉంది. వ్యవసాయ యాంత్రీకరణ, జౌళి, చిన్న, మధ్య తరహా రంగాల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారతీయ రుణాలు త్వరగా అందజేసేందుకు మేం ఎదురుచూస్తున్నాం. 60 మిలియన్ డాలర్ల భారతీయ రుణ పథకం కింద చేపట్టిన విద్యుత్ సరఫరా పాజెక్టు సాధించిన ప్రగతి మాకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. భూ తాపాన్ని తగ్గించడానికి కెన్యా విజయవంతంగా కృషి చేసింది. అలాగే విద్యుత్తు వినియోగ సామర్ద్యాన్ని పెంచే ఎల్ ఇ డి ఆధారిత వీధి దీపాల ఏర్పాటు వంటి ఇంకా కొన్ని కొత్త రంగాలలో మనం కలసి పనిచేద్దాము. ఆరోగ్య సంరక్షణ ప్రాజెక్టు కు అధ్యకుడు శ్రీ ఉహురు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిసింది. భారతదేశ శక్తి సామర్ధ్యాలు ముఖ్యంగా ఫార్మస్యూటికల్స్ రంగంలో మీ ప్రాధాన్యాలకు అనుగుణంగా జతపరచుకొని కెన్యాలో అందుబాటు ధరలలో సమర్ధంగా పనిచేసే ఒక ఆరోగ్య పరిరక్షణ విధానానికి రూపకల్పన చేయడానికి వీలు ఉంది. దీని ద్వారానే సమాజంలోని అవకాశాలను అందుకోవచ్చు. కెన్యా ఒక ప్రాంతీయ ఆరోగ్య కేంద్రంగా రూపుదిద్దుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక కెన్యాట్టా నేషనల్ హాస్పిటల్ కు భారతదేశానికి చెందిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, భారతీయ కేన్సర్ చికిత్సా యంత్రమైన “భాభాట్రాన్” సేవలందిస్తోందని తెలుసుకుని నేను చాలా సంతోషించాను. ఎయిడ్స్ చికిత్సకు పనికివచ్చే చికిత్సా విధానంతో పాటు అత్యవసర మందులు, వైద్య పరికరాలను కూడా మేం ఉచితంగా సరఫరా చేస్తున్నాం.

స్నేహితులారా,

మన యువతీ యువకుల విజయానికి అవకాశాలు కల్పించలేకపోతే మన సమాజాలు అభివృద్ధి చెందవు అనే విషయాన్ని మేం గుర్తించాం. ఇందుకోసం మేం విద్యాకోర్సులు, వృత్తి విద్యా కోర్సులు, నైపుణ్యాభివృద్ధి రంగాలలో కెన్యా తో భాగస్వాములం కావడానికి సిధ్దంగా ఉన్నాం.

స్నేహితులారా,

అభివృద్ధి సవాళ్లు మనకు ఒకే రకంగా ఉన్నట్లే భద్రతా, స్థిరత్వం విషయంలో ఆందోళనలను అధ్యక్షుల వారు, నేను ఒకరికొకరు పంచుకున్నాం. భారతదేశం, కెన్యా లు హిందూ మహాసముద్రంతో కలసి ఉన్నాయి. మన రెండు దేశాలు పటిష్ట సముద్రయాన సంప్రదాయాలు కలిగి ఉన్నాము. దీనివల్ల సముద్ర తీర భద్రతా రంగంలో మన సన్నిహిత సహకారం – మొత్తం రక్షణ, భద్రత వ్యవహారాలలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇప్పుడు మనం రక్షణ సహకారంపై సంతకాలు చేసిన అవగాహనాపూర్వక ఒప్పంద పత్రం మన రక్షణ సంస్థల మధ్య సంస్థాగత సహకారాన్ని పటిష్ఠపరచేదే. పెద్ద సంఖ్యలో సిబ్బంది మార్పిడి, నైపుణ్యం మరియు అనుభవాలు ఇచ్చిపుచ్చుకోవడం, శిక్షణ మరియు సంస్థల నిర్మాణం, జల సంబంధమైన శాస్త్రపరిజ్ఞానం లో సహకారం, పరికరాల సరఫరా మొదలైనవి ఈ ఒప్పందంలో భాగంగా ఉన్నాయి. తీవ్రవాదం, రాడికల్ భావజాలం మన ప్రజలకు, మన దేశాలకు, మన ప్రాంతానికి, అలాగే మొత్తం ప్రపంచానికీ ఒక ఉమ్మడి సవాలుగా ఉందని అధ్యక్షుల వారూ, నేను గుర్తించాం. సైబర్ భద్రత, మందులు, మాదక ద్రవ్యాలు, మానవుల అక్రమ రవాణా వంటి రంగాలలో మన భద్రతా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని మేం ఏకాభిప్రాయానికి వచ్చాం.

స్నేహితులారా,

నిన్నకెన్యాలో అధ్యక్షుల వారు, నేను ప్రవాస భారతీయులతో చిరస్మరణీయమైన సంప్రదింపులు జరిపాము. అధ్యక్షుడు శ్రీ ఉహురు చెప్పినట్లు “వారు భారతీయ మూలాలను పరిరక్షిస్తున్నప్పటికీ వారు గర్వించదగ్గ కెన్యా దేశస్థులే”. మేం మన ఆర్ధిక వ్యవస్థ మరియు సమాజాల మధ్య పటిష్టమైన సంబంధాలను నెలకొల్పుతుండగా, వారు నమ్మకమైన బంధాన్ని, పటిష్టమైన వారధిని పరిరక్షిస్తున్నారు. భారతీయుల శక్తిమంతమైన సంప్రదాయం ఇప్పటికే కెన్యా సుసంపన్న సమాజంలో ఒక భాగమైందని ప్రకటించడానికి నేను ఆనందపడుతున్నాను. కెన్యా లో ఈ ఏడాదే ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ను ప్రదర్శించనున్నాము.

మాననీయ మహోదయులు అధ్యక్షుడు శ్రీ ఉహురు గారూ,

ముగించే ముందు, నాకు లభించిన ఘనమైన స్వాగతానికి గాను మీకు, మీ ప్రభుత్వానికి, మీ ప్రజలకూ నేను మరో సారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.

నేను, భారతీయ పౌరులు భారతదేశంలోకి మీకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నాం.

మీకు నా ధన్యవాదాలు.

అందరికీ మరీ మరీ కృతజ్ఞతలు..