Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కువైట్ లో ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్ ‘హలా మోదీ ‘లో ప్రధాన మంత్రి ప్రసంగం తెలుగు అనువాదం

కువైట్ లో ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్ ‘హలా మోదీ ‘లో ప్రధాన మంత్రి ప్రసంగం తెలుగు అనువాదం


భారత్ మాతాకీ-జై!

భారత్ మాతాకీ-జై!

భారత్ మాతాకీ-జై!

నమస్కారం!

నేను కువైట్‌కు వచ్చి కేవలం రెండున్నర గంటలు మాత్రమే అయింది. అయితే, నేను ఇక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి ఇది నా ప్రాంతం అనే భావన, ఆత్మీయతా భావం నన్ను అల్లుకుపోయినట్టు అనిపిస్తోంది. మీరు అందరూ భారత్‌లోని వివిధ రాష్ట్రాల నుంచి  వచ్చారు, కానీ మీ అందరినీ చూసినప్పుడు, నాకు ఒక మినీ భారత దేశం కనిపిస్తోంది. ఇక్కడ నేను ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ప్రాంతాల నుంచి  వేర్వేరు భాషలు, మాండలికాలు మాట్లాడే ప్రజలను చూస్తున్నాను. అయినా, అందరి హృదయాలలో ఒకే విధమైన ప్రతిధ్వని వినిపిస్తోంది, అందరి హృదయాలలో ఒకే గొంతు మారుమోగుతోంది – భారత్ మాతాకీ జై, భారత్ మాతాకీ జై!

ఇక్కడ ఒక సాంస్కృతిక ఉత్సవ వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుతం, మీరు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నారు. కొద్ది రోజుల్లో పొంగల్ రాబోతోంది. మకర సంక్రాంతి, పొంగల్, లోహ్రీ, బిహు వంటి అనేక పండుగలు ఎంతో దూరంలో లేవు. మన దేశం ప్రతి మూలలో జరుపుకొనే ఈ పండుగలకీ, క్రిస్మస్‌కీ, నూతన సంవత్సరానికి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఇక్కడ సంస్కృతితో పండుగ వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుతం క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం సిద్ధమవుతున్నారు. మరి కొద్ది రోజుల్లో  పొంగల్ రాబోతోంది. మకర సంక్రాంతి అయినా, లోహ్రీ అయినా, బిహు అయినా, ఇలా ఏ పండుగ అయినా అవి ఎంతో దూరంలో లేవు. క్రిస్మస్, నూతన సంవత్సరంతో పాటు దేశంలోని ప్రతి మూలా జరుపుకొనే అన్ని పండుగల సందర్భంగా నేను మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

స్నేహితులారా,

ఈ రోజు, ఈ క్షణం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకం. 43 ఏళ్ల తర్వాత అంటే నాలుగు దశాబ్దాల తర్వాత ఓ భారత ప్రధాని కువైట్ కు వచ్చారు. భారత్ నుంచి కువైట్ వెళ్లడానికి కేవలం నాలుగు గంటల సమయం పడుతుంది. కానీ ఒక ప్రధాని ఈ ప్రయాణం చేయడానికి నాలుగు దశాబ్దాలు పట్టింది. మీలో చాలా మంది తరతరాలుగా కువైట్ లో నివసిస్తున్నారు. మీలో కొందరు ఇక్కడే పుట్టారు కూడా. ప్రతి సంవత్సరం వందలాది మంది భారతీయులు మీ సమాజంలో చేరుతున్నారు. మీరు కువైట్ సమాజానికి భారతీయ రుచిని జోడించారు, కువైట్ చిత్రాన్ని భారత నైపుణ్య రంగులతో అలంకరించారు, భారతదేశ ప్రతిభను, సాంకేతికతను, సంప్రదాయాన్ని కువైట్ జీవన శైలిలో మిళితం చేశారు.  అందుకే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను- మిమ్మల్ని కలవడానికి మాత్రమే కాదు, మీరు సాధించిన విజయాలను వేడుక చేసుకోవడానికి.

స్నేహితులారా,

కొద్దిసేపటి క్రితమే ఇక్కడ పనిచేస్తున్న భారతీయ కార్మికులు, నిపుణులను కలిశాను. ఈ స్నేహితులు నిర్మాణ పనుల్లో నిమగ్నమై అనేక ఇతర రంగాలలో కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయ సమాజ సభ్యులు కువైట్ వైద్య మౌలిక సదుపాయాలకు ఎంతో బలంగా నిలుస్తున్నారు. మీలో ఉపాధ్యాయులుగా ఉన్నవారు కువైట్ తరువాతి తరాన్ని బలోపేతం చేయడానికి దోహదపడుతున్నారు. మీలో ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్ లుగా ఉన్న వారు కువైట్ లో తదుపరి తరం మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నారు.

స్నేహితులారా,

నేను కువైట్ నాయకత్వంతో మాట్లాడినప్పుడల్లా, వారు మీ అందరినీ అమితంగా ప్రశంసిస్తారు. కువైట్ పౌరులు కూడా మీ కృషి, నిజాయితీ, నైపుణ్యాల కారణంగా మీ పట్ల గొప్ప గౌరవాన్ని కలిగి ఉన్నారు.  ఈ రోజు, భారతదేశం రెమిటెన్స్ లలో ప్రపంచ అగ్రగామిగా ఉంది, ఈ ఘనతలో ఎక్కువ భాగం మీలాంటి కష్టపడి పనిచేసే స్నేహితులందరికీ చెందుతుంది. మీ కృషిని భారతదేశంలోని మీ సహచరులు కూడా ఎంతో గౌరవిస్తున్నారు.

స్నేహితులారా,

మనల్ని కట్టిపడేసేది దౌత్యం మాత్రమే కాదు, హృదయాల అనుసంధానం కూడా. మా ప్రస్తుత సంబంధాలు మా భాగస్వామ్య చరిత్రలా బలంగా ఉన్నాయి.

భారత్,కువైట్ మధ్య ఉన్న సంబంధం నాగరికతల, సముద్రపు,సుహృద్భావ, వ్యాపార సంబంధాలపై ఆధారపడింది. భారత్ , కువైట్ అరేబియన్ సముద్ర తీరాలు వ్యతిరేక దిశల్లో ఉన్నప్పటికీ, దౌత్య సంబంధాలు మాత్రమే కాకుండా, హృదయాల అనుసంధానం కూడా మనలను కలుపుతోంది. మన ప్రస్తుత బంధం మన భాగస్వామ్య చరిత్ర అంత బలంగా ఉంది. ఇప్పుడు మనమిది చూస్తున్నాం. ఒకప్పుడు కువైట్ నుంచి ముత్యాలు, ఖర్జూరాలు, అద్భుతమైన గుర్రపు జాతులు భారత్‌కు పంపేవారు. అదే సమయంలో భారత్ నుంచి బియ్యం, చాయ్, మసాలాలు, వస్త్రాలు కలప వంటి ఎన్నో వస్తువులు కువైట్‌కు వస్తుండేవి. కువైట్ నావికులు సుదీర్ఘ ప్రయాణాలు చేసే  నౌకలను నిర్మించడానికి భారతదేశం నుంచి వచ్చిన టేకు కలపను ఉపయోగించారు.  కువైట్ ముత్యాలు భారత్ కు వజ్రాలంత విలువైనవి. నేడు, భారతీయ ఆభరణాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి, కువైట్ ముత్యాలు ఆ వారసత్వానికి దోహదం చేశాయి. గత శతాబ్దాలలో, కువైట్, భారతదేశం మధ్య నిరంతర ప్రయాణం, వాణిజ్యం ఎలా ఉండేదనే దాని గురించి  గుజరాత్‌లో పెద్దలు తరచూ కథలుగా చెప్పేవారు. ముఖ్యంగా 19 వ శతాబ్దంలో కువైట్ వ్యాపారులు సూరత్ కు రావడం ప్రారంభించారు. ఆ సమయంలో సూరత్ కువైట్ ముత్యాలకు అంతర్జాతీయ మార్కెట్ గా ఉండేది. గుజరాత్ లోని సూరత్, పోర్ బందర్, వెరావల్ వంటి ఓడరేవులు ఈ చారిత్రక సంబంధాలకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

కువైట్ వ్యాపారులు గుజరాతీ భాషలో అనేక పుస్తకాలను కూడా ప్రచురించారు. గుజరాత్ తర్వాత కువైట్ వ్యాపారులు ముంబైతో పాటు ఇతర మార్కెట్లలో కూడా తమ ఉనికిని చాటుకున్నారు. ప్రముఖ కువైట్ వ్యాపారి అబ్దుల్ లతీఫ్ అల్ అబ్దుల్ రజాక్ రాసిన ‘ముత్యాల బరువును లెక్కించడం ఎలా’ అనే పుస్తకం ముంబైలో ప్రచురితమైంది. చాలా మంది కువైట్ వ్యాపారులు తమ ఎగుమతి, దిగుమతి వ్యాపారాల కోసం ముంబై, కోల్కతా, పోర్బందర్, వెరావల్, గోవాలో కార్యాలయాలను తెరిచారు. ఇప్పటికీ ముంబైలోని మహమ్మద్ అలీ వీధిలో అనేక కువైట్ కుటుంబాలు నివసిస్తున్నాయి.  60-65 ఏళ్ల క్రితం భారత్ లో మాదిరిగానే కువైట్ లో కూడా భారత రూపాయిని వాడేవారని తెలిస్తే చాలా మందికి ఆశ్చర్యం కలగక మానదు. అప్పట్లో కువైట్ లోని ఓ దుకాణంలో ఎవరైనా ఏదైనా కొనుగోలు చేస్తే భారత రూపాయిలను కరెన్సీగా స్వీకరించేవారు. భారతీయ కరెన్సీ పదజాలంలో భాగమైన “రూపియా”, “పైసా”, “ఆనా” వంటి పదాలు కువైట్ ప్రజలకు బాగా సుపరిచితం.

స్నేహితులారా,

కువైట్ స్వాతంత్ర్యానంతరం ఆ దేశాన్ని గుర్తించిన మొదటి దేశాలలో భారత్ ఒకటి. అందుకే మన గతం, వర్తమానం రెండింటిలోనూ ఎన్నో జ్ఞాపకాలను, లోతైన సంబంధాలను పంచుకునే దేశాన్ని, సమాజాన్ని సందర్శించడం నిజంగా నాకు చిరస్మరణీయం.  కువైట్ ప్రజలకు, ప్రభుత్వానికి రుణపడి ఉంటాను. నన్ను సాదరంగా ఆహ్వానించినందుకు కువైట్ అమీర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

స్నేహితులారా,

గతంలో సంస్కృతి, వాణిజ్యం ద్వారా ఏర్పడ్డ బంధం ఇప్పుడు ఈ కొత్త శతాబ్దంలో కొత్త శిఖరాలకు చేరుకుంటోంది. నేడు, కువైట్ భారతదేశానికి చాలా ముఖ్యమైన ఇంధన,వాణిజ్య భాగస్వామిగా ఉంది, కువైట్ కంపెనీలకు భారతదేశం ఒక ప్రధాన పెట్టుబడి గమ్యస్థానంగా ఉంది. న్యూయార్క్ లో జరిగిన మా సమావేశంలో కువైట్ యువరాజు చెప్పిన ఒక మాట నాకు బాగా గుర్తుంది. ‘ మాకు అవసరమైనప్పుడు, భారతదేశం మా గమ్యస్థానం” అని ఆయన అన్నారు. భారత్, కువైట్ పౌరులు కష్టకాలంలో, సంక్షోభ సమయాల్లో ఒకరికొకరు అండగా నిలిచారు. కరోనా మహమ్మారి సమయంలో ఇరు దేశాలు అన్ని విధాలుగా పరస్పరం అండగా నిలిచాయి. భారత్ కు చాలా సహాయం అవసరమైనప్పుడు కువైట్ లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేసింది. ప్రతి ఒక్కరూ వేగంగా పనిచేయడానికి స్ఫూర్తినిచ్చేలా యువరాజు స్వయంగా ముందుకు వచ్చారు.  కువైట్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో సహాయపడటానికి భారత్ కూడా వ్యాక్సిన్లు, వైద్య బృందాలను పంపడం ద్వారా తన మద్దతును అందించడం నాకు సంతృప్తి ఇచ్చింది. కువైట్, దాని పరిసర ప్రాంతాలకు అవసరమైన ఆహార సరఫరాకు కొరత లేకుండా చూసేందుకు భారత్ తన ఓడరేవులను తెరిచి ఉంచింది.  ఈ ఏడాది జూన్ లో కువైట్ లో జరిగిన ఒక హృదయ విదారక సంఘటన—మంగాఫ్ లో జరిగిన అగ్నిప్రమాదం—అనేక మంది భారతీయుల ప్రాణాలను బలితీసుకుంది. ఈ వార్త వినగానే చాలా ఆందోళన చెందాను.అయితే ఆ సమయంలో కువైట్ ప్రభుత్వం నిజమైన సోదర దేశంగా మద్దతు తెలిపింది. కువైట్ స్ఫూర్తికి, కరుణకు అభివాదం చేస్తున్నాను.

స్నేహితులారా,

సుఖదుఃఖాల్లో ఒకరికొకరు అండగా నిలిచే ఈ సంప్రదాయం మన పరస్పర సంబంధానికి, నమ్మకానికి పునాది వేస్తుంది. రాబోయే దశాబ్దాల్లో, మనం శ్రేయస్సులో మరింత గొప్ప భాగస్వాములు అవుతాము. మన లక్ష్యాలు విభిన్నమైనవి కావు. కువైట్ ప్రజలు నవ కువైట్ నిర్మాణానికి కృషి చేస్తుంటే, 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు భారత ప్రజలు అంకితమయ్యారు. వాణిజ్యం, ఆవిష్కరణల ద్వారా విలక్షణ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కువైట్ లక్ష్యంగా పెట్టుకోగా, భారత్ కూడా సృజనాత్మకతపై దృష్టి సారించి నిరంతరం తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటోంది. ఈ రెండు లక్ష్యాలు ఒకదానికొకటి అనుబంధంగా ఉంటాయి.  ఫిన్ టెక్ నుంచి హెల్త్ కేర్ వరకు, స్మార్ట్ సిటీల నుంచి గ్రీన్ టెక్నాలజీస్ వరకు న్యూ కువైట్ సృష్టికి అవసరమైన సృజనాత్మకత, నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, మానవ వనరులు అన్నీ భారత్ లో అందుబాటులో ఉన్నాయి. భారత్ స్టార్టప్ లు కువైట్ లోని ప్రతి అవసరానికి అత్యాధునిక పరిష్కారాలను అందిస్తాయి. నైపుణ్యం కలిగిన భారత యువత కువైట్ భవిష్యత్ ప్రయాణానికి కొత్త బలాన్ని చేకూరుస్తారు.

స్నేహితులారా,

ప్రపంచ నైపుణ్య రాజధానిగా మారే సత్తా భారత్ కు ఉంది. భారత్ వచ్చే అనేక దశాబ్దాలు ప్రపంచంలోనే అధిక యువ జనాభా కలిగిన దేశంగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో నైపుణ్యాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ ను తీర్చే సామర్థ్యం భారత్ కు ఉంది. ఇందుకోసం ప్రపంచ అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య అభివృద్ధి,  నైపుణ్య మెరుగుదలపై భారత్ దృష్టి సారిస్తోంది, ఇటీవలి సంవత్సరాలలో, భారతదేశం గల్ఫ్ దేశాలు, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, మారిషస్, యుకె, ఇటలీతో సహా దాదాపు రెండు డజన్ల దేశాలతో వలస, ఉపాధి ఒప్పందాలపై సంతకం చేసింది. ప్రపంచ దేశాలు కూడా నైపుణ్యం కలిగిన భారత మానవ వనరుల కోసం తలుపులు తెరుస్తున్నాయి.

స్నేహితులారా,

విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల సంక్షేమం, సౌకర్యాల కోసం వివిధ దేశాలతో అనేక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. ఈ-మైగ్రేట్ పోర్టల్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ పోర్టల్ ద్వారా విదేశీ కంపెనీలు, రిజిస్టర్డ్ ఏజెంట్లను ఒకే వేదిక పైకి తీసుకొచ్చారు. దీనివల్ల ఎక్కడ మానవ వనరులకు డిమాండ్ ఉంది, ఏ రకమైన మానవ వనరులు అవసరం, ఏ కంపెనీకి అవసరమో గుర్తించడం సులభం అవుతుంది. ఈ పోర్టల్ అభినందనీయం. గత 4-5 సంవత్సరాలలో కోట్లాది మంది కార్మికులు గల్ఫ్ దేశాలకు వచ్చారు. ఈ పోర్టల్ వల్ల  గత నాలుగైదేళ్లలో లక్షలాది మంది కార్మికులు గల్ఫ్ దేశాలకు వచ్చారు. ఇటువంటి ప్రతి చొరవకు ఒకే లక్ష్యం ఉంటుంది- భారతదేశం నుంచి  వచ్చే ప్రతిభావంతులు ప్రపంచ పురోగతికి దోహదం చేస్తారని, పని కోసం విదేశాలకు వెళ్ళే వారికి ఎల్లప్పుడూ అవసరమైన మద్దతు ఉంటుందని ఇది స్పష్టం చేస్తుంది. కువైట్ లోని మీరంతా కూడా ఈ విషయంలో భారత్ చేస్తున్న ప్రయత్నాల వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు.

స్నేహితులారా,

మనం ప్రపంచంలోని ఎక్కడ నివసిస్తున్నప్పటికీ, మనం ఉన్న దేశాన్ని గౌరవిస్తాం. భారత్ కొత్త శిఖరాలకు చేరడాన్ని చూస్తుంటే మనకు అపార ఆనందం కలుగుతుంది. మీరు అందరూ భారత్ నుంచి వచ్చినవారే, ఇక్కడ నివసిస్తున్నప్పటికీ మీ హృదయాల్లో భారతీయతను కాపాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మంగళ్ యాన్ విజయం పట్ల ఏ భారతీయుడు గర్వపడడు? చంద్రుడిపై చంద్రయాన్ ల్యాండ్ అయినందుకు ఏ భారతీయుడు సంతోషించి ఉండడు? నేను చెప్పింది నిజమే కదా? నేడు భారత్ కొత్త స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇది ప్రపంచంలోనే నంబర్ వన్ ఫిన్ టెక్ వ్య్వవస్థకు నిలయం. భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థనుకలిగి ఉంది. ఇంకా ప్రపంచంలో రెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా ఉంది.

నేను మీతో ఒక గణాంకాన్ని పంచుకుంటాను, మీరు దానిని వినడానికి సంతోషిస్తారని నేను కచ్చితంగా అనుకుంటున్నాను. గత పదేళ్లలో భారత్ అంతటా వేసిన ఆప్టికల్ ఫైబర్ పొడవు భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరం కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ. నేడు, భారతదేశం ప్రపంచంలోని అత్యంత డిజిటల్ అనుసంధానిత కలిగిన దేశాలలో ఒకటి. చిన్న పట్టణాల నుంచి గ్రామాల వరకు డిజిటల్ సాధనాలను ప్రతి భారతీయుడు ఉపయోగిస్తున్నాడు. భారత్ లో స్మార్ట్ డిజిటల్ వ్యవస్థలు ఇక విలాసం కాదు. అవి ఇప్పుడు సామాన్యుడి దైనందిన జీవితంలో భాగమయ్యాయి. ఒక కప్పు టీని ఆస్వాదించడం, వీధిలో పండ్లు కొనడం లేదా డిజిటల్ చెల్లింపులు చేయడం వంటి వాటిలో భారత్ డిజిటల్ సౌలభ్యాన్ని అందిపుచ్చుకుంది. కిరాణా సరుకులు, ఆహారం, పండ్లు, కూరగాయలు లేదా రోజువారీ గృహోపకరణాలను ఆర్డర్ చేయడం ఇప్పుడు క్షణాల్లో పని. మొబైల్ ఫోన్ల ద్వారా ఇట్టే చెల్లింపులు జరుగుతున్నాయి. డాక్యుమెంట్లను భద్రపరిచేందుకు డిజిలాకర్, విమానాశ్రయాల్లో నిరాటంకంగా ప్రయాణించడానికి డిజియాత్ర, టోల్ బూత్ ల వద్ద సమయాన్ని ఆదా చేయడానికి ఫాస్టాగ్ ఉన్నాయి. భారత్ డిజిటల్ స్మార్ట్ గా మారుతోంది. ఇది ఆరంభం మాత్రమే. యావత్ ప్రపంచానికి దిశానిర్దేశం చేసే ఆవిష్కరణల్లోనే భారత్ భవిష్యత్తు ఉంది. భవిష్యత్ భారత్ ప్రపంచ అభివృద్ధికి కేంద్రంగా, ప్రపంచ వృద్ధి చోదకశక్తిగా ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, సెమీకండక్టర్స్, లీగల్, ఇన్సూరెన్స్, కాంట్రాక్టింగ్, కమర్షియల్ రంగాలకు భారత్ ప్రధాన కేంద్రంగా మారే సమయం ఎంతో దూరంలో లేదు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక కేంద్రాలు భారత్ లో స్థిరపడటాన్ని మీరు చూస్తారు. గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, గ్లోబల్ టెక్నాలజీ సెంటర్లు, గ్లోబల్ ఇంజినీరింగ్ సెంటర్లకు భారత్ భారీ హబ్ గా అవతరించనుంది.

స్నేహితులారా,

ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా భావిస్తాం. ప్రపంచ సంక్షేమం గురించి ఆలోచిస్తూ ‘విశ్వబంధు’గా (ప్రపంచ మిత్రుడు) భారత్ ముందుకు వెళ్తోంది. భారత్ ప్రదర్శిస్తున్న ఈ  స్ఫూర్తిని ప్రపంచం కూడా గుర్తిస్తోంది. నేడు, డిసెంబర్ 21, 2024 న, ప్రపంచం తన మొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఇది భారతదేశ వేలాది సంవత్సరాల ధ్యాన సంప్రదాయానికి అంకితం. 2015 నుంచి, ప్రపంచం జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొంటోంది, ఇది భారతదేశ యోగా సంప్రదాయానికి అంకితం. 2023 లో, ప్రపంచం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని జరుపుకొంది. ఇది భారతదేశ ప్రయత్నాలు, ప్రతిపాదనల ద్వారా సాధ్యమైంది. నేడు భారత దేశ యోగా ప్రపంచంలోని ప్రతి ప్రాంతాన్ని ఏకం చేస్తోంది. భారత సంప్రదాయ వైద్యం, మన ఆయుర్వేదం, మన ఆయుష్ ఉత్పత్తులు ప్రపంచ ఆరోగ్యాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. మన సూపర్ ఫుడ్స్ – చిరుధాన్యాలు, శ్రీ అన్నా పోషకాహారానికి, ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రధాన పునాదిగా మారుతున్నాయి. నలంద నుంచి ఐఐటీల వరకు భారత్ విజ్ఞాన వ్యవస్థ ప్రపంచ విజ్ఞాన అనుకూల వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ఈ రోజు, ప్రపంచ అనుసంధానానికి భారత్ బలమైన ముడిగా మారుతోంది. గత ఏడాది భారత్ లో జరిగిన జీ-20 సదస్సులో  మధ్య ప్రాచ్య యూరప్ కారిడార్ ప్రకటన జరిగింది.ఈ కారిడార్ ప్రపంచ భవిష్యత్తుకు కొత్త దిశానిర్దేశం చేయనుంది.

స్నేహితులారా,

మీ మద్దతు, ప్రవాస భారతీయుల భాగస్వామ్యం లేకుండా ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) ప్రయాణం అసంపూర్ణం. ‘వికసిత్ భారత్’ సంకల్పంలో చేరాలని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. కొత్త సంవత్సరం,  2025 మొదటి నెల, జనవరి  అనేక జాతీయ వేడుకల నెల.  జనవరి 8 నుంచి 10 వరకు భువనేశ్వర్ లో జరిగే ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.  ఈ ప్రయాణంలో మీరు పూరీలోని జగన్నాథుని ఆశీస్సులు తీసుకోవచ్చు. ఆ తర్వాత జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నెలన్నర పాటు జరిగే మహా కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్ రాజ్ ను సందర్శించండి. జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే వేడుకలను వీక్షించి తిరిగి వెళ్ళండి.ఇంకా, మీ కువైట్ స్నేహితులను భారతదేశానికి తీసుకురండి, చుట్టుపక్కల వారికి చూపించండి.  వారిని భారతదేశాన్ని అనుభూతి చెందనివ్వండి. ఒకప్పుడు దిలీప్ కుమార్ సాహెబ్ ఇక్కడ తొలి భారతీయ రెస్టారెంట్ ను ప్రారంభించారు. భారత్ నిజమైన రుచిని అక్కడ మాత్రమే ఆస్వాదించవచ్చు. కాబట్టి, ఈ అనుభూతి కోసం మీ కువైట్ స్నేహితులను సిద్ధం చేయండి.

స్నేహితులారా,

ఈ రోజు ప్రారంభం కానున్న అరేబియన్ గల్ఫ్ కప్ గురించి మీరంతా చాలా ఉత్సాహంగా ఉన్నారని నాకు తెలుసు. కువైట్ జట్టును ఉత్సాహపరిచేందుకు ఆసక్తిగా ఉన్నారు. ప్రారంభోత్సవానికి నన్ను గౌరవ అతిథిగా ఆహ్వానించినందుకు అమీర్ కు కృతజ్ఞతలు. రాజకుటుంబం, కువైట్ ప్రభుత్వానికి మీ అందరిపై, భారత్ పట్ల ఉన్న అపారమైన గౌరవాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఇదే విధంగా ఇకపై కూడా  భారత్-కువైట్ బంధాన్ని మీరు మరింత బలోపేతం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ ఆకాంక్షతో మరోసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు!

భారత్ మాతాకీ-జై!

భారత్ మాతాకీ-జై!

భారత్ మాతాకీ-జై!

చాలా చాలా ధన్యవాదాలు.

గమనిక: ఇది ప్రధాని ప్రసంగానికి సుమారు అనువాదం. ప్రధానమంత్రి అసలు ప్రసంగం హిందీలో చేశారు.

 

***