Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కార్డుల‌ ద్వారా, ఇంకా డిజిటల్ సాధ‌నాల ద్వారా చెల్లింపులకు ప్రోత్సాహం


కార్డుల‌ ద్వారా, ఇంకా డిజిటల్ సాధ‌నాల ద్వారా చెల్లింపుల‌ను జ‌రిపే ప‌ద్ధ‌తిని ప్రోత్స‌హించేందుకు చేప‌ట్ట‌వ‌ల‌సిన చ‌ర్య‌ల‌కు కేంద్ర మంత్రిమండ‌లి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్య‌క్ష‌త వ‌హించారు. ఆర్థిక వ్యవస్థలో నగదు లావాదేవీలను తగ్గించాల‌నే లక్ష్యాన్ని సాధించాల‌ని ఈ చర్య తీసుకున్నారు. ఇందుకోసం పలు స్వల్పకాలిక చర్యల (ఏడాది లోగా అమలు కావ‌ల‌సిన‌వి), మధ్య కాలిక చర్యలకు (రెండు సంవత్సరాల లోగా అమలుకావ‌ల‌సిన‌వి ) ఆమోదం తెలిపారు. ఈ చ‌ర్య‌ల‌ను ప్రభుత్వ శాఖలు/ విభాగాలు/ సంస్థలు అమలు పరచాల్సి ఉంటుంది.

కార్డుల ఆధారిత‌మైన‌ చెల్లింపులు, డిజిట‌ల్ సాధ‌నాల ద్వారా చెల్లింపులు జ‌రిపే ప‌ద్ధ‌తుల‌ను ప్రోత్స‌హించ‌డం వ‌ల్ల పన్నులు చెల్లించ‌కుండా త‌ప్పించుకోవ‌డాన్ని నివారించడం, ప్ర‌భుత్వ చెల్లింపులు, వ‌సూళ్ల కోసం న‌గ‌దు ర‌హిత ప‌ద్ధ‌తికి మ‌ళ్ల‌డం సాధ్య‌ప‌డుతుంది. పౌరులు కార్డులు/ డిజిట‌ల్ సాధ‌నాల ద్వారా లావాదేవీలు జ‌రిపేట‌ట్లుగా విత్త సంబంధ చెల్లింపు సేవ‌ల‌ను వారి అందుబాటులోకి తీసుకు వ‌స్తే వారు రొక్కం చెల్లించి లావాదేవీలు జ‌ర‌ప‌డాన్ని అరిక‌ట్టేందుకు వీల‌వుతుంది. న‌గ‌దుదే పైచేయిగా ఉన్న చెల్లింపుల వ్య‌వ‌స్థ‌ నుంచి న‌గ‌దు చ‌లామ‌ణికి అంత‌గా ప్రాముఖ్యం ఉండ‌ని/ న‌గ‌దు చెల్లింపులు త‌క్కువ‌గా మాత్ర‌మే జ‌రిగే ప‌ద్ధ‌తికి మారాల‌న్న‌ది ఈ విధానం వ‌ల్ల కుదురుతుంది.

కార్డులు, డిజిట‌ల్ సాధ‌నాల ద్వారా చెల్లింపుల‌ను ప్రోత్స‌హించాల‌న్న ప్ర‌తిపాద‌న‌ల తాలూకు ముఖ్య అంశాల‌లో.. ప్ర‌స్తుతం వేరు వేరు ప్ర‌భుత్వ విభాగాలు/ సంస్థ‌లు విధిస్తున్న స‌ర్ ఛార్జి/ స‌ర్వీస్ ఛార్జి/ క‌న్వీనియ‌న్స్ ఫీ ఆన్ కార్డ్/ డిజిట‌ల్ పేమెంట్స్ ఉప‌సంహ‌ర‌ణకు చ‌ర్య‌లు; ప్ర‌భుత్వ విభాగాలలో/ సంస్థ‌లలో త‌గిన స్వీకృతి వ్య‌వ‌స్థ‌ల ఏర్పాటు; కార్డుల లావాదేవీల‌పైన మ‌ర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎమ్ డి ఆర్) క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌; కొన్ని కీల‌క లావాదేవీల విభాగాల‌లో విభిన్న‌మైన ఎమ్ డి ఆర్ స్వ‌రూపాన్ని నిర్దేశించ‌డం ; ఒక నిర్దేశిత ప‌రిమితికి మించిన చెల్లింపుల‌ను కార్డులు/ డిజిట‌ల్ ప‌ద్ధ‌తిలో మాత్ర‌మే జ‌ర‌పాల‌న్న ఆదేశాలు వెలువ‌రించ‌డం; కొన్ని రకాల కార్డు ఉత్పత్తులను అనుమతించేందుకు అవసరమైన సంకేతాల‌తో ముడిప‌డి ఉండే మౌలిక వసతులను సంబంధిత‌ స్టేక్ హోల్డ‌ర్ల‌తో రూప‌క‌ల్ప‌న చేయించడం; డిజిటల్ ఫైనాన్షియల్ లావాదేవీలపై టెలికాం సర్వీసు ఛార్జిలను హేతుబద్దం చేయడం; మొబైల్ బ్యాంకింగును ప్రోత్సహించడం; మోసపూరిత లావాదేవీలపై ఫిర్యాదులను సత్వరం పరిష్కరించేందుకు ప్రత్యేక హామీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, ఇంకా దేశంలో అమ‌ల‌వుతున్న చెల్లింపు విధానం అంతటినీ సమీక్షించడం.. వంటివి ఉన్నాయి.

పూర్వ రంగం :

దేశంలో కార్డు ఆధారిత‌మైన‌ చెల్లింపుల/డిజిటల్ సాధ‌నాల ద్వారా చెల్లింపుల విధానం రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ నగదు చెల్లింపులతో పోల్చితే ఈ విధానం వ్యాప్తి చాలా తక్కువ గానే ఉంది. ఇలాంటి లావాదేవీలు పెరగాలంటే వాటిని ఉప‌యోగించే రీతులు స‌ర‌ళ‌త‌రంగా ఉండ‌టంతో పాటు అవి వెంట‌నే అన్ని ప్రాంతాల్లోనూ అందుబాటులో ఉండాలి; వాటి ద్వారా చెల్లింపులను ఆమోదించగల పరిస్థితి ఉండాలి. కార్డు చెల్లింపులకు మాధ్యమంగా ఉన్న వ‌ర్త‌కుల పైన గాని, లేదా వినియోగ‌దారుల పైన గాని ఎలాంటి అదనపు ఆర్థిక భారం ఉండకూడదు. వాటన్నింటికీ తోడు చెల్లింపులకు త‌గినంత‌ భద్రత ఉండాలి.

కార్డు చెల్లింపులకు దోహదకారి అయిన ఎలక్ట్రానిక్ క్లియరింగ్ స‌ర్వీస్ స్కీమ్, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫ‌ర్, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ స్కీమ్ వంటివన్నీ సమర్థంగానే పని చేస్తున్నప్పటికీ, కార్డు ఆధారిత‌మైన‌ చెల్లింపుల/డిజిటల్ సాధ‌నాల ద్వారా చెల్లింపు వ్యవస్థల ప్రయోజనాలు ఇంకా సగటు ప్రజలకు చేరాల్సి ఉంది. అలాగే కార్డు ఆధారిత‌మైన‌ చెల్లింపుల/డిజిటల్ సాధ‌నాల ద్వారా చెల్లింపులకు దేశవ్యాప్తంగా ఆమోదనీయత రావాలి. కార్డు ఆధారిత‌మైన‌ చెల్లింపుల/డిజిటల్ సాధ‌నాల ద్వారా చెల్లింపులకు ప్రస్తుతం అమలులో ఉన్న విధానంలో అనుభవాలు, ఆధారాలను పరిగణనలోకి తీసుకుంటే వాటిని ప్రోత్సహించే విషయంలో ప్రథమ శ్రేణి నగరాల, ద్వితీయ శ్రేణి నగరాల పైనే దృష్టి సారిస్తున్నారు. అలాగే సాధారణ/సాంప్రదాయిక బ్యాంకింగ్ చానళ్ళు అందుబాటులో ఉన్న పౌరులకే చాలా వ‌ర‌కు పరిమితం చేస్తున్నారు.

2007 సంవత్సరపు పేమెంట్ అండ్ సెటిల్మెంట్ చట్టం ఆధునిక కార్డు ఆధారిత‌మైన‌ చెల్లింపుల/డిజిటల్ సాధ‌నాల ద్వారా చెల్లింపుల వ్యవస్థ ఎక్కువ వ‌ర్గాల‌లో ఆమోదానికి నోచుకొంది. మరింతగా చొచ్చుకుపోయేందుకు కూడా దోహదపడింది. బయోమెట్రిక్స్ ఆధారంగా తనిఖీలు పూర్తి చేసేందుకు వీలుగా ఆధార్ అనుసంధాన చెల్లింపుల విధానాన్ని (ఎఇపిఎస్) ప్రవేశపెట్టడం జరిగింది. ‘రూపే కార్డు’ పేరిట స‌రికొత్త దేశీయ చెల్లింపుల వ్యవస్థను అమలులోకి తెచ్చారు.

భారతీయ‌ రిజర్వ్ బ్యాంకు కూడా ఇటీవలే పేమెంట్ బ్యాంకుల స్థాప‌న‌కు లైసెన్సుల‌ను మంజూరు చేసింది. ప‌ల్లెల నుంచి ప‌ట్ట‌ణాల‌కు వ‌ల‌స‌ పోతున్న శ్రామికుల‌కు, త‌క్కువ ఆదాయం ఆర్జిస్తున్న కుటుంబాల‌కు, చిన్న వ్యాపార‌స్తుల‌కు, ఇంకా అసంఘ‌టిత రంగంలో ఉన్న ఇత‌ర సంస్థ‌ల‌కు చిన్న పొదుపు ఖాతాల‌ను, చెల్లింపులు / రెమిటెన్స్ సేవ‌ల‌ను పేమెంట్ బ్యాంకుల ద్వారా అంద‌జేస్తూ విత్త సేవ‌లను మ‌రింత ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకు రావ‌డం ఈ పేమెంట్ బ్యాంకుల‌ వెనుక ఉన్న ధ్యేయం.