కాబూల్ లో అఫ్గాన్ పార్లమెంట్ భవన నిర్మాణ పనులను పూర్తి చేయడానికి సంబంధించి రూ.969 కోట్లతో సవరించిన వ్యయ అంచనా కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
ఈ ప్రాజెక్టు కింద అఫ్గానిస్తాన్ దేశానికి ఆ దేశ సంప్రదాయాలు, విలువలను దృష్టిలో ఉంచుకొని ఒక కొత్త పార్లమెంట్ భవనాన్ని పూర్తిగా నిర్మించి ఇవ్వాల్సి ఉంది.
అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణ, పునరావాస ప్రక్రియలలో పాలు పంచుకొంటూ భారతదేశం చేస్తున్న కృషిలో ఈ నూతన పార్లమెంట్ భవన నిర్మాణం ఒక భాగం. అఫ్గానిస్తాన్ లో ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్మించి, పటిష్టపరచడంలో భారతదేశం పోషిస్తున్న భూమికకు ఈ ప్రాజెక్టు ఒక ఉదాహరణ. అఫ్గాన్ పార్లమెంట్ భవన నిర్మాణం 2015 డిసెంబరు లో పూర్తి అయింది. ఇప్పుడు శబ్దగ్రహణ వ్యవస్థ, ఫర్నిచర్ ను అమర్చడం సహా తుది మెరుగులు దిద్దే పని సాగుతోంది. 2016 మార్చి 31కల్లా ఈ పార్లమెంట్ భవనాన్ని అఫ్గాన్ పాలనా యంత్రాంగానికి అప్పగిస్తారు.
నేపథ్యం :
ఈ ప్రాజెక్టు పనులను 2015 డిసెంబరు 25న భారతదేశ ప్రధాన మంత్రి, అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు కలసి ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. కొత్త ప్రాంగణ ప్రారంభ సందర్భంగా మిశ్రానో జిర్గా (ఎగువ సభ), వొలేసీ జిర్గా (దిగువ సభ)ల సభ్యులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, దేశంలో ప్రజాస్వామ్యం స్థిరపడిన సందర్భంగా అఫ్గానిస్తాన్ ప్రజలకు, వారు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులకు శుభాభినందనలు తెలియజేశారు.