ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీ లోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో కర్మయోగి సప్తాహ్ – జాతీయ అభ్యాస వారోత్సవాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, మిషన్ కర్మయోగి ద్వారా మన దేశాభివృద్ధికి చోదక శక్తిగా మారే మానవ వనరులను సృష్టించడమే మన లక్ష్యమని అన్నారు. ఇంతవరకు సాధించిన పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి, ఇదే ఉత్సాహంతో పనిచేస్తే, దేశం పురోగతి చెందకుండా ఎవరూ ఆపలేరని అన్నారు. జాతీయ అభ్యాస వారోత్సవాల (నేషనల్ లెర్నింగ్ వీక్ ) సందర్భంగా నేర్చుకునే కొత్త విషయాలు, అనుభవాలు మన పని వ్యవస్థలను మెరుగుపరచడంలో సామర్ధ్యాన్ని అందిస్తాయని, ఇది 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో మనకు సహాయపడుతుందని ఆయన చెప్పారు.
గత పదేళ్లుగా ప్రభుత్వ ఆలోచనా ధోరణిని మార్చడానికి తీసుకున్న చర్యల గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇది నేడు ప్రజలకు సానుకూల ఫలితాలు అందిస్తోందని చెప్పారు. ఇది ప్రభుత్వంలో పని చేస్తున్న వారి ప్రయత్నాల కారణంగానూ, మిషన్ కర్మయోగి వంటి చర్యల ప్రభావం ద్వారానూ సాధ్యమయిందని ఆయన తెలిపారు.
కృత్రిమ మేధను ప్రపంచం ఒక అవకాశంగా భావిస్తుండగా, భారత్ కు ఇది సవాలుతో పాటు అవకాశంగా కూడా మారిందని ప్రధాని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆస్పిరేషనల్ ఇండియా అనే రెండు ఎఐల గురించి ఆయన మాట్లాడారు. ఈ రెండింటినీ సమతుల్యం చేయాల్సిన ఆవశ్యకతను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ… ఆకాంక్షాత్మక భారతదేశాన్ని ముందుకు నడిపించేందుకు మనం కృత్రిమ మేధస్సును విజయవంతంగా ఉపయోగించుకుంటే, అది సరికొత్త మార్పులకు దారితీస్తుందని అన్నారు.
డిజిటల్ విప్లవం, సోషల్ మీడియా ప్రభావంతో అందరికీ సమాచార సమానత్వం ఒక ప్రామాణికంగా మారిందని ప్రధాన మంత్రి అన్నారు. కృత్రిమ మేధతో సమాచారాన్ని విశ్లేషించి అవసరమైనది తీసుకోవడం కూడా అంతే సులువుగా మారుతోంది. పౌరులకు సమాచారం అందించడంతో పాటు ప్రభుత్వ కార్యకలాపాలన్నింటినీ పర్యవేక్షించేలా వారికి సాధికారత కూడా కల్పిస్తోంది. కాబట్టి, పెరుగుతున్న ప్రమాణాలకు అనుగుణంగా ప్రభుత్వోద్యోగులు తమను తాము తాజా సాంకేతిక అభివృద్ధితో మమేకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో మిషన్ కర్మయోగి వారికి సహాయపడుతుంది.
వినూత్న ఆలోచనలు, ప్రజా ప్రయోజన దృక్పథాన్ని అనుసరించాల్సిన అవసరాన్ని ప్రధాని ప్రముఖంగా తెలిపారు. కొత్త ఆలోచనలు కోసం అంకుర సంస్థలు, పరిశోధనా సంస్థలు, యువత సహకారం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ శాఖలు ప్రతి అంశంపై పూర్తి సమాచార యంత్రాంగాలను కలిగి ఉండాలని ఆయన సూచించారు.
ఐజీఓటీ వేదికను ప్రశంసిస్తూ… ఈ ప్లాట్ ఫామ్ పై 40 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారని ప్రధాని తెలిపారు. 1400కు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయని, వివిధ కోర్సులను పూర్తి చేసిన 1.5 కోట్ల మందికి పైగా అధికారులు సర్టిఫికెట్లు అందుకున్నారని తెలిపారు.
సివిల్ సర్వీసు శిక్షణ సంస్థలు స్వతంత్రంగా, ఒకరితో ఒకరు సంబంధం లేకుండా పనిచేయడం వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. వాటి మధ్య భాగస్వామ్యాలు, సహకారాలను పెంపొందించేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. శిక్షణ సంస్థలు ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలని, ప్రపంచ ఉత్తమ పద్ధతులను పరిశీలించి అవలంబించాలని, అలాగే మొత్తం ప్రభుత్వ దృక్పథాన్ని పెంపొందించడానికి సరైన సమాచార మార్గాలను ఏర్పరచుకోవాలని ఆయన సూచించారు.
మిషన్ కర్మయోగిని 2020 సెప్టెంబరులో ప్రారంభించారు. ఇది ప్రపంచ దృక్పథం కలిగి భారతీయ నైతిక విలువలకు అనుగుణంగా భవిష్యత్ పౌర సేవలను లక్ష్యంగా పెట్టుకుంది. జాతీయ అభ్యాస వారం (నేషనల్ లెర్నింగ్ వీక్ – ఎన్ ఎల్ డబ్ల్యు) ప్రభుత్వ ఉద్యోగుల వ్యక్తిగత, వృత్తిగత సామర్థ్యాభివృద్ధికి కొత్త ఊపును అందిస్తూ, “ఒక ప్రభుత్వం” సందేశాన్ని సృష్టిస్తుంది. ఇది అందరినీ జాతీయ లక్ష్యాల బాటలో సమన్వయం చేస్తూ జీవితాంతం నేర్చుకునే ప్రాముఖ్యతను ప్రోత్సహిస్తుంది.
***
Discussed in detail the steps we have taken to change the mindsets of the working of government over the last ten years, whose impact is being felt by people today. This has become possible due to the efforts of the people working in the government and through the impact of…
— Narendra Modi (@narendramodi) October 19, 2024