ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర కేబినెట్ కర్ణాటకలోని “పరివార మరియు తలావర” తెగలను ఎస్ టి జాబితాలో క్రమ కంఖ్య 38 కింద “నాయక”కు పర్యాయపదంగా పరిగణించి జాబితాలో చేర్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది.
ప్రధాన ప్రభావం
తమకు షెడ్యూల్డు తెగల హోదా కల్పించాలన్న కర్ణాటకలోని “పరివార మరియు తలావర” తెగల వారి దీర్ఘకాలిక కోర్కె దీనితో నెరవేరుతుంది. ఈ ఆమోదంతో కర్ణాటకలోని పరివార మరియు తలావర తెగల వారు రాష్ట్రప్రభుత్వం నుంచి షెడ్యూల్డ్ తెగల సర్టిఫికెట్ పొంది ఎస్ టిలకు ఉద్దేశించిన ప్రయోజనాలు అందుకునే వీలు ఏర్పడుతుంది.
నేపథ్యం
కర్ణాటకలో షెడ్యూల్డ్ తెగల జాబితాలోని క్రమసంఖ్య 38 కింద ఉన్న “నాయక”కు పర్యాయపదంగా “పరివార మరియు తలావర” తెగలను గుర్తించి వారిని కూడా ఎస్ టి జాబితాలో చేర్చాలని కర్ణాటక ప్రభుత్వం సిఫారసు చేసింది.
ఏ రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో షెడ్యూల్డ్ తెగల తొలి జాబితాను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రభుత్వంతో చర్చించిన అనంతరం రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ ద్వారా అమలులోకి తెస్తారు. తదుపరి అందులో కొత్త తెగలను చేర్చాలన్నా, ఉన్న తెగలను తొలగించాలన్నా, షెడ్యూల్డ్ తెగల జాబితాలో ఇతర మార్పులేవైనా చేయాలన్నా పార్లమెంటులో చట్టసవరణ ద్వారా మాత్రమే సాధ్యం.