Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కరియప్ప మైదానంలో ‘ఎన్‌సీసీ పీఎం ర్యాలీ’ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం

కరియప్ప మైదానంలో ‘ఎన్‌సీసీ పీఎం ర్యాలీ’ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఢిల్లీలోని కరియప్ప కవాతు మైదానంలో వార్షిక ‘ఎన్‌సీసీ పీఎం ర్యాలీ’లో ప్రసంగించారు. జాతీయ విద్యార్థి సైనిక విభాగం (ఎన్‌సిసి) ఆవిర్భవించి నేటితో 75 సంవత్సరాలు విజయంతంగా పూర్తయిన నేపథ్యంలో విశిష్ట ‘ఆవిర్భావ దినోత్సవ కవర్‌’తోపాటు ప్రత్యేకంగా రూపొందించిన రూ.75 స్మారక నాణేన్ని కూడా ప్రధాని ఆవిష్కరించారు. అనంతరం ‘ఎన్‌సిసి’ విద్యార్థి సైనికులు కన్యాకుమారి నుంచి ఢిల్లీ దాకా తీసుకొచ్చిన ‘ఐక్యతా జ్వాల’ను ప్రధానికి అందజేయగా, కరియప్ప మైదానంలో ఆయన జ్యోతిని వెలిగించారు. పగలు-రాత్రి వేడుకగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ‘ఒకే భారతం-విశిష్ట భారతం’ ఇతివృత్తంతో సాంస్కృతిక ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ‘వసుధైవ కుటుంబకం’ వాస్తవ స్ఫూర్తితో ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా 19 దేశాల నుంచి 196 మంది విద్యార్థి సైనికులను, అధికారులను ప్రతినిధులుగా ఆహ్వానించారు.

   సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- భారతదేశంతోపాటు ‘ఎన్‌సిసి’ కూడా ఈ ఏడాది 75వ వార్షికోత్సవాలు నిర్వహించుకుంటున్నాయని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ‘ఎన్‌సిసి’ నాయకత్వం వహించడమే కాకుండా అందులో భాగం కావడం ద్వారా దేశ నిర్మాణానికి తమ వంతు కృషి చేశారంటూ ఆయన అందరినీ ప్రశంసించారు. ‘ఎన్‌సిసి’ దళ సభ్యులుగా, దేశ యువతగా వీరంతా భారత ‘అమృత తరం’ ప్రతినిధులుగా ఉన్నారని పేర్కొన్నారు. రాబోయే 25 ఏళ్లలో దేశాన్ని సమున్నత శిఖరాలకు చేర్చడానికి, వికసిత-స్వయం సమృద్ధ భారతాని సృష్టించేది మీరేనని ప్రధాని వారికి ఉద్బోధించారు. కన్యాకుమారి నుంచి ఢిల్లీ దాకా నిత్యం 50 కిలోమీటర్ల వంతున 60 రోజులపాటు ఐక్యతా జ్వాల పరుగును పూర్తిచేసిన విద్యార్థి సైనికులను ప్రధాని అభినందించారు. అలాగే ఈ జ్వాల, సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక మహోత్సవం ‘ఒకే భారతం – శ్రేష్ఠ భారతం’ స్ఫూర్తిని మరింత బలోపేతం చేశాయన్నారు.

   ణతంత్ర దినోత్సవ కవాతులో ‘ఎన్‌సిసి’ విద్యార్థులు పాల్గొనడాన్ని ప్రస్తావిస్తూ- తొలిసారి ఇది కర్తవ్యపథ్‌లో నిర్వహించడంలోగల ప్రత్యేకతను ఎత్తిచూపారు. జాతీయ యుద్ధ స్మారకం, పోలీసు స్మారకం, ఎర్రకోటలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియం, ప్రధానమంత్రి సంగ్రహాలయ్, సర్దార్ పటేల్ మ్యూజియం, బి.ఆర్.అంబేడ్కర్‌ మ్యూజియం వంటి ప్రదేశాలను సందర్శించాల్సిందిగా వారికి సూచించారు. తద్వారా జీవితంలో ముందడుగు వేయడానికి కావాల్సిన ఉత్తేజం లభిస్తుందని చెప్పారు.

   దేశాన్ని నడిపే ప్రధాన శక్తి యువత కేంద్రకంగాగల విధానమేనని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. “స్వప్నం సంకల్పమై.. జీవితాన్ని అందుకు అంకితం చేస్తే విజయం తథ్యం. భారత యువతకు ఇది కొత్త అవకాశాల తరుణం. భారత్‌కు తనదైన సమయం వచ్చిందని అన్నివైపుల నుంచీ మనకు స్పష్టంగా తెలుస్తోంది. ప్రపంచమంతా నేడు ఆశాభావంతో భారత్‌ వైపు చూస్తోంది. ఇదంతా దేశంలోని యువతరం ప్రభావమే” అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.

రాబోయే భారత జి-20 అధ్యక్ష బాధ్యతలపై యువతరం ఉత్సాహం చూపడం తనకెంతో గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. “దేశంలో యువశక్తి, ఉత్సాహం ఉప్పొంగుతున్నపుడు ఆ దేశ ప్రాథమ్యాలు సదా యువతకు చెందినవే అయి ఉంటాయి” అని ప్రధాని చెప్పారు. వారి కలల సాకారానికి సాయపడే వేదికల రూపకల్పనకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రస్తావించారు.

   డిజిటల్ విప్లవం.. అంకుర విప్లవం లేదా ఆవిష్కరణ విప్లవం వంటి వివిధ రంగాలు యువతకు అవకాశాల తలుపులు తెరుస్తున్నాయని ప్రధాని వివరించారు. వీటి ద్వారా అత్యధికంగా లబ్ధిపొందేది భారత యువతరమేనని నొక్కిచెప్పారు. ఒకనాడు  అసాల్ట్ రైఫిల్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కూడా దిగుమతి అవుతుండేవన్న వాస్తవాన్ని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే, రక్షణ రంగంలో సంస్కరణల ఫలితంగా నేడు భారత్‌ వందలాది రక్షణ పరికరాలను దేశీయంగానే తయారుచేస్తోందని తెలిపారు. సరిహద్దుల్లో వేగంగా సాగుతున్న మౌలిక సదుపాయాల పనుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇవన్నీ భారత యువతకు సరికొత్త అవకాశాల ప్రపంచానికి బాటలు వేస్తాయని స్పష్టం చేశారు. యువత సామర్థ్యాన్ని విశ్వసిస్తే లభించే సానుకూల ఫలితాలకు భారత అంతరిక్ష రంగం పురోగమనమే నిదర్శనమని ప్రధాని ఉదాహరించారు. యువత ప్రతిభకు అంతరిక్ష రంగం తలుపులు తెరిచిన నేపథ్యంలో తొలి ప్రైవేట్ ఉపగ్రహ ప్రయోగం వంటి గొప్ప ఫలితం వచ్చిందని చెప్పారు. అదేవిధంగా గేమింగ్, యానిమేషన్ రంగం భారత యువ ప్రతిభావంతుల అవకాశాల పరిధిని మరింత విస్తరిస్తున్నాయి. అలాగే వినోదం, రవాణా నుంచి వ్యవసాయం దాకా కొత్త రంగాలకు డ్రోన్‌ సాంకేతికత వ్యాపిస్తున్నదని గుర్తుచేశారు.

   క్షణ దళాలు-సంస్థలతో యువత ముడిపడాలన్న ఆకాంక్షను ప్రస్తావిస్తూ- ఇది ముఖ్యంగా భరతమాత పుత్రికలకు గొప్ప అవకాశాల సమయమని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ మేరకు పోలీసు, పారామిలటరీ బలగాల్లో గత 8 ఏళ్లలో మహిళల సంఖ్య రెట్టింపైందని గుర్తుచేశారు. త్రివిధ సాయుధ బలగాల పరిధిలో మహిళల ప్రవేశానికి మార్గం సుగమం చేయబడిందని తెలిపారు. నావికాదళంలో తొలిసారి మహిళా నావికుల నియామకాన్ని ఆయన ఉదాహరించారు. సాయుధ దళాల్లో మహిళలు పోరాట క్షేత్ర ప్రవేశం కూడా ప్రారంభించారని పేర్కొన్నారు. మహిళా కేడెట్ల తొలి బృందానికి పుణేలోని ‘ఎన్‌డిఎ’లో శిక్షణ మొదలైందని ప్రధాని వెల్లడించారు. సైనిక పాఠశాలల్లో ప్రవేశం పొందిన 1500 మంది బాలికల గురించి ఆయన ప్రస్తావించారు. బాలికల కోసమే ఈ పాఠశాలలు తొలిసారి ఏర్పాటైనట్లు వివరించారు. గత దశాబ్దకాలంలో ‘ఎన్‌సిసి’లోనూ మహిళల భాగస్వామ్యం స్థిరంగా పెరుగుతూ వచ్చిందని చెప్పారు.

   యువశక్తి సామర్థ్యం గురించి ప్రముఖంగా ప్రస్తావిస్తూ- దేశ సరిహద్దు-తీర ప్రాంతాల నుంచి లక్ష మందికిపైగా యువ కేడెట్లు నమోదయ్యారని ప్రధాని వెల్లడించారు. దేశాభివృద్ధి కోసం ఇంత పెద్ద సంఖ్యలో యువత ఏకతాటిపైకి వస్తే సాధించలేని లక్ష్యమంటూ ఏదీ ఉండదని ఆయన నొక్కిచెప్పారు. కేడెట్లు వ్యక్తిగతంగానే కాకుండా ఒక వ్యవస్థగానూ దేశ ప్రగతిలో తమవంతుగా విస్తృత పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో ఎందరో సాహసులు దేశం కోసం తృణప్రాయంగా ప్రాణత్యాగం చేయడానికీ వెనుకాడలేదని గుర్తుచేశారు. అయితే, ఇవాళ దేశం కోసమే జీవించాలన్న సంకల్పమే భారత్‌ను సమున్నత శిఖరాలకు చేర్చగలదని ఆయన వ్యాఖ్యానించారు.

   ప్ర‌జ‌ల మ‌ధ్య విభేద విషబీజాలు నాటి, అగాధం సృష్టించేందుకు కొన్ని స్వార్థశక్తులు య‌త్నిసున్నాయని ప్ర‌ధానమంత్రి హెచ్చ‌రించారు. కానీ, “ఎవరెన్ని కుయుక్తులు పన్నినా భారతదేశ ప్రజానీకంలో ఎన్నటికీ పొరపొచ్చాలు పొడసూపవు” అని ఆయన స్పష్టం చేశారు. “తల్లి పాలలో ఎన్నడూ దోషం ఉండనే ఉండదు… కాబట్టి విషపూరిత శక్తులకు ఐక్యతా మంత్రమే అంతిమ విరుగుడు. ఈ మంత్రం ఒక ప్రతిజ్ఞ.. భారతదేశానికి బలం ఇదే. భారత్‌ ఉజ్వల భవిష్యత్తు సాధనలో ఏకైక మార్గమిదే” అని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు.

   చివరగా- ప్రస్తుత సమయం భారతదేశానికి మాత్రమేగాక యువతరం మొత్తానికీ ‘అమృత కాలమ’ని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశం స్వాతంత్య్ర శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే నాటికి యువతరమే విజయ శిఖరాగ్ర పతాకధారిగా ఉంటుందని వ్యాఖ్యానించారు. అందుకే- “మనం ఏ ఒక్క అవకాశాన్నీ చేజారనివ్వకూడదు. భారతదేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చే దృఢ సంకల్పంతో ముందడుగు వేయాలి” అని ఉద్బోధిస్తూ శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ‘ఎన్‌సిసి’ డీజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ గుర్‌వీర్‌పాల్‌ సింగ్‌, రక్షణ దళాల ప్రధానాధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌, సైనిక దళాధిపతి జనరల్‌ మనోజ్‌ పాండే, నావికా దళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌, వైమానిక దళాధిపతి చీఫ్‌ మార్షల్‌ వివేక్‌ రామ్‌ చౌదరి, రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ గిరిధర్‌ అరమానే తదితరులు పాల్గొన్నారు.