Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కన్యాకుమారి లో అభివృద్ధి ప‌థ‌కాల ప్రారంభోత్స‌వం అనంత‌రం ప్ర‌ధానమంత్రి ప్ర‌సంగం


మిత్రులారా,

ఈ రోజు న ఇక్క‌డ క‌న్యాకుమారి లో ఉండ‌డం నాకు ఎంతో సంతోషం గా ఉంది.

గౌర‌వ‌నీయురాలు అమ్మ‌ జ‌య‌ల‌లిత గారి కి శ్రద్ధాంజలి ని ఘటిస్తూ నా ప్ర‌సంగాన్ని ప్రారంభిస్తాను.

త‌మిళ‌ నాడు ప్ర‌జ‌ల‌ కు ఆమె చేసిన మంచి ప‌నుల ను త‌రాల తరబడి గుర్తుండిపోతుంది.

ఆమె అభివృద్ధి దార్శ‌నిక‌త‌ ను సాకారం చేయ‌డానికి తమిళ‌ నాడు ప్ర‌భుత్వం ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తుండ‌డం నాకు సంతోషం క‌లిగిస్తున్న‌ది.

భార‌త‌దేశం యొక్క తొలి మ‌హిళా ర‌క్ష‌ణ మంత్రి నిర్మ‌ల గారు త‌మిళ‌ నాడు వారు కావ‌డం ప‌ట్ల నేను ఎంతో గ‌ర్విస్తున్నాను.

అస‌మాన ధైర్య‌సాహ‌సాలు గ‌ల వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ కూడా త‌మిళ‌ నాడు వారు కావ‌డం ప‌ట్ల భార‌తదేశంలో ప్రతి ఒక్కరు గ‌ర్వ‌ిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం వివేకానంద కేంద్రాని కి గాంధీ శాంతి బ‌హుమ‌తి లభించడం పట్ల కూడా నేను అభినందనల ను తెలియజేయాలనుకొంటున్నాను.

ఈ కేంద్రం చేస్తున్న సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు ఎంతో ప్ర‌శంస‌నీయ‌మైన‌వి, ప్రేర‌ణాత్మ‌క‌మైన‌వి.

మిత్రులారా,

కొద్దిసేప‌టి క్రితం, మ‌నం రహదారులు, రైల్వేలు, జాతీయ‌ ర‌హ‌దారుల‌ కు సంబంధించి ప‌లు అభివృద్ది ప‌నుల ప్రారంభోత్స‌వాల ను, శంకుస్థాప‌న‌ లను జ‌రుపుకున్నాం.

మ‌దురై, చెన్నై ల మ‌ధ్య మ‌నం అత్యంత వేగంగా న‌డిచే తేజ‌స్ రైలు ను కూడా జెండా ఊపి ప్రారంభించుకున్నాం.

ఇది అత్యంత అధునాత‌న రైలు. మేక్ ఇన్ ఇండియా కు ఇది ఒక గొప్ప ఉదాహ‌ర‌ణ‌. ఇది చెన్నై లోని ఇంటిగ్ర‌ల్ కోచ్ ఫ్యాక్ట‌రీ లోనే త‌యారైంది.

రామేశ్వరం , ధ‌నుష్కోడి ల మ‌ధ్య రైలుమార్గాని కి ఈ రోజు న శంకుస్థాప‌న చేసుకున్నాం.

1964 విప‌త్తు త‌రువాత ఈ మార్గం ధ్వంస‌ం అయింది. కానీ యాభై సంవ‌త్స‌రాలు గా ఈ మార్గాన్ని గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

అస‌లు ఎప్ప‌టికీ చేప‌ట్ట‌ని దాని కంటే ఇప్ప‌టికైనా మించి పోయింది లేదు.
కొత్త పాంబ‌న్ రైలు వంతెన నిర్మాణం కానున్న‌ద‌ని తెలిసి మీరు సంతోషిస్తారు.

మిత్రులారా,

ఇవాళ ప్ర‌పంచం లో శ‌ర‌వేగం తో అభివృద్ధి చెందుతున్నపెద్ద‌ ఆర్థిక వ్య‌వ‌స్థ గ‌ల దేశం భారతదేశం.

భారతదేశం రేప‌టి త‌రం మౌలిక స‌దుపాయాల‌ ను రికార్డు వేగం తో నిర్మిస్తోంది.

అతి పెద్ద స్టార్ట్- అప్ వ్య‌వ‌స్థ‌ గ‌ల దేశాల జాబితా లో మ‌నం ఉన్నాం.

ప్ర‌పంచం లోనే అతి పెద్ద ఆరోగ్య సంర‌క్ష‌ణ కార్య‌క్ర‌మం- ఆయుష్మాన్ భార‌త్ క‌లిగిన దేశం భార‌తదేశం.

మిత్రులారా,

21వ శ‌తాబ్ద‌పు భార‌త‌దేశం వేగం తో, విస్తృత‌ స్థాయి లో ప‌నిచేయ‌వ‌ల‌సి ఉంది. ఎన్‌డిఎ ప్ర‌భుత్వం అదే ప‌ని ని చేస్తోంది.

ఈ ఏడాది బ‌డ్జెటు లో ప్ర‌క‌టించిన ప్ర‌ధాన‌ మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ని గ‌త ఆదివారం ప్రారంభించ‌డం జ‌రిగింది.

ఈ ప‌థ‌కం లో భాగం గా ఐదు ఎక‌రాల వ‌ర‌కు క‌లిగిన రైతులకు సంవ‌త్స‌రానికి ఆరువేల రూపాయ‌ల వంతున కేంద్ర ప్ర‌భుత్వం మూడు వాయిదాల‌ లో న‌గ‌దు స‌హాయం అందిస్తుంది.

1.1 కోటి మంది రైతుల కు వారి బ్యాంకు ఖాతాల‌ లో తొలి వాయిదా మొత్తం ఇప్ప‌టికే నేరు గా జ‌మ చేయ‌డం జ‌రిగింది.

ఫిబ్ర‌వ‌రి 1న ప్రక‌టించిన ఈ ప‌థ‌కం అదే నెల‌ లో వాస్త‌వ రూపం ధ‌రించ‌డాన్ని మీరు ఊహించ‌గ‌ల‌రా ?

ఈ ప‌థ‌కం 24 రోజుల‌ లో కార్య‌రూపం దాల్చ‌డానికి ఇర‌వైనాలుగు గంట‌లూ మేం ప‌నిచేశాం.

మిత్రులారా,

లీపు సంవ‌త్స‌రాల లాగా ఫుట్‌బాల్ ప్ర‌పంచ‌ క‌ప్ ప్ర‌తి నాలుగు సంవ‌త్స‌రాల‌ కు ఒక సారి వ‌స్తుంది. కాంగ్రెస్‌ వారి అసంపూర్తి రుణ‌ మాఫీ కూడా కేవ‌లం ఎన్నిక‌ల ముందే వ‌స్తుంటుంది.

రైతుల‌ కు ఏమీ చేయ‌కుండా, చివ‌ర్లో వ‌చ్చి మేం మీ రుణాలు మాఫీ చేస్తాం అని చెబుతుంటారు.

వాస్త‌వానికి , కాంగ్రెస్ రుణ‌ మాఫీ కొద్దిమంది రైతుల‌కు మాత్ర‌మే ప్ర‌యోజ‌న‌క‌రమైంది.

ఎన్‌డిఎ ప్ర‌భుత్వం యొక్క కిసాన్ స‌మ్మాన్ నిధి ఏవో కొద్ది సంవ‌త్స‌రాల‌ కు ఒక సారి అమ‌లు చేసే ప‌థ‌కం కాదు.

ఈ ప‌థ‌కం తాలూకు ప్ర‌యోజ‌నాలు ప్ర‌తి సంవ‌త్స‌రం అందుతాయి. క‌ష్టించి ప‌నిచేసే రైతుల కు ప‌ది సంవ‌త్స‌రాల‌ లో రమారమి 7.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు అందే అవకాశం ఉంది.

ప్ర‌భుత్వం అత్యంత వేగం గా పెద్ద ఎత్తున క‌దలి ప‌నిచేస్తే, దాని ఫ‌లితం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

మిత్రులారా,

ప్ర‌ముఖ క‌వి, తాత్వికుడు తిరువ‌ళ్లువ‌ర్ ఏమన్నారంటే “అరుదైన అవ‌కాశమంటూ ల‌భిస్తే, ఆ అవ‌కాశాన్ని అందిపుచ్చుకుని అరుదైన ఘ‌న‌కార్యాలు చేయ‌డానికి ఉప‌యోగించండి ” అని.

2014లో, 30 సంవ‌త్స‌రాల త‌రువాత ఒక పార్టీ పార్ల‌మెంటు లో పూర్తి సంఖ్యాధిక్యాన్ని తెచ్చుకొంది.

ప్ర‌జ‌ల తీర్పు స్ప‌ష్టం- వారు క‌ఠిన నిర్ణ‌యాలు , ఘ‌న మైన నిర్ణ‌యాలు తీసుకునే ప్ర‌భుత్వం కావాల‌ని కోరుకున్నారు.

ప్ర‌జ‌లు నిజాయతీ ని కోరుకున్నారు గాని వంశ‌పారంప‌ర్య పాల‌న‌ ను కాదు.

ప్ర‌జ‌లు అభివృద్ధిని కోరుకున్నారు గాని ప‌త‌నాన్ని కాదు.

ప్ర‌జ‌లు ప్ర‌గ‌తిని కోరుకుంటున్నారు గాని విధాన‌ప‌ర‌మైన స్త‌బ్ద‌త‌ ను కాదు.

ప్ర‌జ‌లు అవ‌కాశాల‌ను కోరుకున్నారు గాని అవ‌రోధాల‌ ను కాదు.

ప్ర‌జ‌లు భ‌ద్ర‌త‌ను కోరుకున్నారు గాని ప్రతిష్ఠంభన ను కాదు.

ప్ర‌జ‌లు స‌మ్మిళిత ప్ర‌గ‌తి ని కోరుకున్నారు గాని వోటు బ్యాంకు రాజ‌కీయాల‌ ను కాదు.

స‌బ్‌ కా సాథ్‌, స‌బ్‌ కా వికాస్ అన్న సూత్రం మార్గ నిర్దేశం లో 130 కోట్ల మంది ప్ర‌జ‌ల చురుకైన భాగ‌స్వామ్యం తో ఎన్‌డిఎ ప్ర‌భుత్వం, దేశ ప్ర‌యోజ‌నాల రీత్యా కొన్ని చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యాల‌ ను తీసుకుంది.

ఇందుకు సంబంధించి నేను కొన్ని ప్రాంతీయ‌, జాతీయ స్థాయి ఉదాహ‌ర‌ణ‌ల‌ ను ప్ర‌స్తావిస్తాను.

త‌మిళ నాడు కోస్తా రాష్ట్రం, ఇక్క‌డ మ‌త్స్య‌ పరిశ్మ గొప్ప‌ గా ఉంటుంది.

ఎంతో మంది మ‌త్స్య‌కారులైన సోద‌రులు మరియు సోద‌రీమణులు వారి బతుకుదెరువు కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తారు.

ఇందుకు ప్ర‌త్యేకం గా కొత్త‌ గా మ‌త్స్య విభాగాన్ని ఏర్పాటు చేసిన గౌర‌వం ఎన్‌డిఎ కు ద‌క్కుతుంది.

గ‌త పాల‌కులు మీ వోట్ల ను తీసుకునేందుకు వ‌చ్చారు గాని, మ‌త్స్యకారుల‌ కు ప‌నిచేయాల్సి వ‌చ్చే సరికి వారు చెప్పుకోద‌గిన‌దేదీ చేయ‌లేదు.

మ‌న మ‌త్స్య‌కారుల కు, మ‌హిళ‌ల‌ కు కిసాన్ క్రెడిట్‌ కార్డు ప్ర‌యోజ‌నాల‌ ను కూడా అందించడం జ‌రిగింది.

త‌మిళ‌ నాడు లో స‌ముద్ర అంర్భాగం లో చేప‌లు ప‌ట్టే నౌక‌ల నిర్మాణాని కి కేంద్ర‌ ప్ర‌భుత్వం 300 కోట్ల రూపాయ‌లు మంజూరు చేసింది.

మ‌త్స్య‌కారుల‌ కు అంత‌రిక్ష సాంకేతిక ప‌రిజ్ఞానం నుండి కూడా స‌హాయం ల‌భిస్తోంది.

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నాసంస్థ (ఇస్రో) అభివృద్ధి చేసిన నావికా ప‌రిక‌రాల‌ను అందుబాటు లోకి తెచ్చాం. ఈ ప‌రిక‌రం స్థానిక భాష‌ లో మ‌త్స్య‌కారుల‌ కు స‌మాచారాన్ని అందిస్తుంది.

ఈ ప‌రిక‌రం చేప‌లు అధికం గా ల‌భ్య‌మ‌య్యే జోన్ ల గురించిన స‌మాచారాన్ని అందించ‌డ‌మే కాకుండా మ‌త్స్య‌కారుల‌ కు వాతావ‌ర‌ణ సంబంధిత హెచ్చ‌రిక‌ల‌ ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేస్తుంది.

మిత్రులారా,

మ‌న మ‌త్స్య‌కారులైన సోద‌రుల మరియు సోద‌రీమ‌ణుల ఆదాయాన్ని పెంచాలంటే, మ‌త్స్య‌ సంప‌ద‌ తో ముడిప‌డిన మౌలిక స‌దుపాయాల‌ ను క‌ల్పించాలన్న విష‌యాన్ని మేం అర్థం చేసుకున్నాం.

రామ‌నాథ‌పురం జిల్లా లో ముక‌యూర్ ఫిషింగ్ హార్బ‌ర్ నిర్మాణ‌ ప‌నులు, నాగ‌ప‌ట్ట‌ణం లో పూంపుహార్ ఫిషింగ్ హార్బ‌ర్‌ ప‌నులు దాదాపు పూర్తి అయ్యాయి.

మిత్రులారా,

మ‌త్స్య‌కారుల భ‌ద్ర‌త‌, వారి బాగోగుల గురించి భార‌త ప్ర‌భుత్వం ఎంతో శ్ర‌ద్ధ తీసుకొంటోంది.

2014 వ సంవత్సరం మే నెల నుండి సాగించిన దౌత్య‌ప‌ర‌మైన కృషి కార‌ణం గా 1900 మందికి పైగా మ‌త్స్య‌కారుల ను శ్రీ‌ లంక అధికారులు విడుద‌ల చేశారు.

మిత్రులారా,

ఎన్‌డిఎ ప్ర‌భుత్వం మ‌న కోస్తా తీర ప్రాంతాల‌ పై మ‌రింత దృష్టి పెట్టింది. సంధాన‌ం, సుసంప‌న్న‌త‌ కు అధిక ప్రాధాన్య‌మిచ్చింది.

నౌకాశ్రయాల అభివృద్ధి కంటె ఒక అడుగు ముందుకు వేసి , నౌకాశ్రయాల ఆధారితమైనటువంటి అభివృద్ధి దిశ‌గా మేం ప‌నిచేస్తున్నాం.

మ‌రిన్ని నౌకాశ్రయాల‌ను ఏర్పాటుచేస్తున్నాం.

ప్ర‌స్తుతం ఉన్న నౌకాశ్రయాల సామ‌ర్థ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డం జ‌రుగుతోంది. సాగ‌ర‌ మాల ప్రాజెక్టు కూడా మా దార్శ‌నిక‌త‌ లో భాగం.

ఈ ప్రాజెక్టు ప‌నుల‌ ను ప్ర‌సుత త‌రాన్ని మాత్ర‌మే దృష్టి లో పెట్టుకొని కాక భ‌విష్య‌త్ త‌రాన్నికూడా దృష్టి లో పెట్టుకుని చేప‌ట్టడం జ‌రుగుతున్న‌ది.

మిత్రులారా,

ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త గురించి కూడా ప్ర‌స్తావిస్తాను.

మ‌న మాజీ సైనికుల ఆశీర్వాదం తో, ఒక ర్యాంకు, ఒకే పెన్ష‌న్ విధానాన్ని ఆచ‌ర‌ణ‌ లో సుసాధ్యం చేయ‌గ‌లిగే చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యాన్ని తీసుకున్నాం.
చేయ‌ద‌గిన మంచిప‌ని అది.

ఎంతో కాలం దేశాన్ని ప‌రిపాలించిన వారు ఒఆర్‌ఒపి ని గురించి స‌రైన రీతి లో ఆలోచించాల‌నే అనుకోలేదు.

మిత్రులారా,

భార‌త‌దేశం గ‌త కొన్ని సంవ‌త్స‌రాలు గా ఉగ్ర‌వాద ముప్పు ను ఎదుర్కొంటోంది.
అయితే, ఇప్పుడు ఎంతో మార్పు ఉంది. ఉగ్ర‌వాదం విష‌యం లో భార‌త‌దేశం ఎంత‌మాత్రం నిస్స‌హాయం గా ఉండే ప‌రిస్థితి లేదు.

2004 నుంచి 2014 వ‌ర‌కు ఎన్నో ఉగ్ర‌ దాడులు జ‌రిగాయి.
హైద‌రాబాద్‌, అహమదాబాద్‌, జయ్ పుర్‌, బెంగ‌ళూరు, ఢిల్లీ, ముంబయి, పుణె, ఇత‌ర ప్రాంతాల‌ లో పేలుళ్లు జ‌రిగాయి.

ఈ ఉగ్ర‌ఘాతుకాల‌ కు బాధ్యులైన వారిని శిక్షిస్తార‌ని దేశం యావ‌త్తు ఆశించింది. అయితే ఏమీ జ‌ర‌గ‌లేదు.

న‌వంబ‌ర్ 26 ఉగ్ర‌దాడి జ‌రిగింది. ఉగ్ర‌వాదుల‌పై చ‌ర్య తీసుకుంటార‌ని భార‌త్ భావించింది. కానీ ఏమీ జ‌ర‌గ‌లేదు.

అయితే, యురి సంఘ‌ట‌న జ‌రిగింది. కానీ, మ‌న అస‌మాన ధైర్య‌సాహ‌సాలు గ‌ల సైనికులు ఏం చేశారో మీకు తెలుసు.

పుల్ వామా ఘ‌ట‌న జ‌రిగింది. మ‌న వైమానిక ద‌ళ యోధులు ఏం చేశారో మీరు చూశారు.

దేశానికి అస‌మాన సేవ‌లు అందిస్తున్న వారంద‌రికీ నేను వందనమాచరిస్తున్నాను. వారి అప్ర‌మ‌త్త‌తే మ‌న దేశాన్ని భ‌ద్రంగా ఉంచుతుంది.

న‌వంబ‌ర్ 26 ఉగ్ర‌ దాడుల త‌రువాత అప్ప‌ట్లో వైమానిక‌ ద‌ళం స‌ర్జిక‌ల్ దాడులు జ‌ర‌పాల‌ని నిర్ణ‌యిస్తే యు పి ఎ ప్ర‌భుత్వం అడ్డుకుంద‌న్న వార్తాప‌త్రిక‌ల క‌థ‌నాలు వెలువ‌డిన రోజులు మ‌నం చూశాం. కానీ ఇవాళ‌, మ‌న సైనిక ద‌ళాల‌కు పూర్తి స్వేచ్ఛ‌ ను ఇచ్చి, వారు ఏం చేయ‌ద‌ల‌చుకుంటే అది చేసే స్వేచ్ఛ ఉంద‌న్న వార్త‌లు చ‌దువుతున్నాం.

ఉగ్ర‌వాదుల ప్రభావాన్ని, ఉగ్ర‌వాదం ప్ర‌భావాన్ని త‌గ్గించ‌డం జ‌రిగింది. దీని ని మరింత‌గా త‌గ్గించ‌నున్నాం.

ఇది న్యూ ఇండియా.

ఉగ్ర‌వాదులు జ‌రిపిన న‌ష్టాన్ని వ‌డ్డీ తో స‌హా తిరిగి చెల్లించే భార‌త‌దేశం ఇది.

మిత్రులారా,

గ‌త కొద్ది రోజులు గా జ‌రుగుతున్న ప‌రిణామాలు, మ‌న సైనిక ద‌ళాల బ‌లాన్ని దీటుగా ప్ర‌ద‌ర్శిస్తున్నాయి.

ఈ ప‌రిణామాలు మ‌న దేశ వాసుల‌ ను మ‌రింత స‌న్నిహితం చేశాయి.

మ‌న సైనిక బ‌ల‌గాల‌ కు దేశం యావ‌త్తూ అండ‌గా నిల‌బ‌డిన‌ తీరు అపూర్వం. అందుకు, నేను ప్ర‌తి భార‌తీయుడి కి శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను.

విచార‌క‌ర‌మైన విష‌యం ఏమంటే, కొన్ని రాజకీయ‌ పక్షాలు, మోదీ పై ద్వేషం తో భార‌త‌దేశాన్ని ద్వేషించ‌డం మొద‌లుపెట్టాయి.

ఇందులో ఆశ్చ‌ర్య‌ప‌డాల్సింది ఏమీ లేదు. ఒక‌ వైపు దేశం యావ‌త్తూ మ‌న సైనిక‌ద‌ళాల‌ కు మ‌ద్ద‌తు గా నిలిస్తే, వారు సైనిక బ‌ల‌గాల‌ ను అనుమానిస్తున్నారు.

ఉగ్ర‌వాదంపై భార‌తదేశం సాగిస్తున్న పోరాటాని కి ప్ర‌పంచం మ‌ద్ద‌తును ఇస్తుంటే, కొన్ని రాజ‌కీయ‌ పక్షాలు మాత్రం ఉగ్ర‌వాదం పై మ‌న పోరాటాన్ని అనుమానిస్తున్నాయి.

ఈ వ్య‌క్తుల ప్ర‌క‌ట‌న‌ లు పాకిస్తాన్‌ కు ఉప‌క‌రిస్తూ, భార‌త‌దేశాని కి చేటు చేస్తున్నాయి. ఇటువంటి వ్య‌క్తుల ప్ర‌క‌ట‌నల‌ ను పాకిస్థాన్ పార్ల‌మెంటు లో, పాకిస్థాన్ రేడియో లో హాయిగా ప్ర‌స్తావిస్తున్నారు.

నేను వారిని ఒక‌టే అడ‌గ‌ద‌ల‌చుకున్నాను. మీరు మ‌న సైనిక ద‌ళాల‌ కు మ‌ద్ద‌తిస్తారా లేక వారిని అనుమానిస్తారా ? అని.

వారు త‌మ వైఖ‌రి ఏమిటో స్ప‌ష్టం చేయాలి. వారు మ‌న సైనిక‌ బ‌ల‌గాల‌ ను విశ్వ‌సిస్తారా ? లేక మ‌న భూభాగం పై ఉగ్ర‌వాదాని కి మ‌ద్ద‌తు తెలిపే శ‌క్తుల‌ ను విశ్వ‌సిస్తారా ?

నేను ఈ పార్టీల‌ కు ఒక‌టే చెప్ప‌ద‌ల‌చుకున్నాను. మోదీ వ‌స్తారు, పోతారు. కానీ భార‌త‌దేశం చిర‌ య‌శ‌స్వి.

మీ స్వీయ రాజ‌కీయాల‌ ను బ‌లోపేతం చేసుకోవ‌డాని కి దేశాన్ని బల‌హీన‌ప‌ర‌చ‌డాన్ని ద‌య‌చేసి ఆప‌మ‌ని కోరుతున్నాను.

ర‌క్ష‌ణ విష‌యాలు, దేశ భ‌ద్ర‌త విష‌యాల‌కు వ‌చ్చిన‌పుడు ముందు గా మ‌న‌మంద‌రం భార‌తీయులం, భార‌తీయులం అంతే.

మీ రాజ‌కీయాలు వేచి చూడ‌గ‌ల‌వు. కానీ ఇక్క‌డ ముప్పు ఎదుర్కొంటున్న‌ది మ‌న‌ దేశ భ‌ద్ర‌త.

మిత్రులారా,

అవినీతిని గురించి, న‌ల్ల‌ధ‌నాన్ని గురించి ప్ర‌స్తావించుకుందాం.

ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయి లో కేవ‌లం 15పైస‌లు పేద‌ల‌కు చేరుతోంద‌ని చెప్పిన ప్ర‌ధాన‌ మంత్రుల‌ను దేశం చూసింది.

అలాగే, ల‌క్ష‌ల‌ కోట్ల రూపాయ‌ల కుంభ‌కోణానికి న‌ష్ట‌మేమీ జ‌ర‌గ‌లేద‌ని చెప్పిన దుర‌హంకార పూరిత‌ కేబినెట్ మంత్రుల‌నూ భార‌త‌దేశం చూసింది.

కొంద‌రు అస‌లు అవినీతి జీవ‌న విధానం అనేస్తున్నారు.

ఇది వారికి ఆమోద‌యోగ్య‌మేమో గాని, నాకు మాత్రం కాదు.

అవినీతి కి వ్య‌తిరేకంగా ఎన్‌డిఎ ప్ర‌భుత్వం చ‌రిత్రాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకుంది.
న‌కిలీ కంపెనీలు మూత‌ప‌డ్డాయి, న‌కిలీ లబ్ధిదారుల‌ను తొల‌గించ‌డం జ‌రిగింది.
అవినీతిప‌రులు వారు చేసిన త‌ప్పుడు ప‌నుల‌కు ఇప్పుడు జ‌వాబు చెప్పాలి.

ప్ర‌ముఖ రీకౌంటింగ్ మంత్రి, ప్ర‌జ‌ల‌ ను అవ‌మానించ‌డ‌మే గొప్ప‌గా భావించే వ్య‌క్తి, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ని అవ‌మానించే వ్య‌క్తి, ఆయ‌న పార్టీ కుటుంబ‌మే ముందు అనుకున్న‌ట్టుగా, ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్ లాగా బెయిల్‌ కు ద‌ర‌ఖాస్తుచేసుకున్నారు.

మిత్రులారా,

ఒక‌వైపు అవినీతిపరుల‌ పై తీవ్రం గా విరుచుకుప‌డుతూనే మేం అదే స‌మ‌యం లో నిజాయతీ గా ప‌న్ను చెల్లించే వారిని గౌర‌విస్తున్నాం.

స‌రిగ్గా నెల‌రోజుల క్రితం బ‌డ్జెటు ప్ర‌వేశ‌పెట్టే సంద‌ర్భం గా, ఐదు ల‌క్ష‌ల‌ రూపాయ‌ల‌ వ‌ర‌కూ ఆర్జించే వారు ఆదాయ‌పు ప‌న్ను ను చెల్లించ‌న‌వ‌స‌రం లేద‌ని ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది.

ఈ దేశాన్ని ఎంతో కాలం పాలించిన వారు మ‌ధ్య‌త‌ర‌గ‌తి ని గురించి ఆలోచించారా? వారికి ప‌న్ను రాయితీలు ఇచ్చారా ?

మిత్రులారా,

చాలా సంవ‌త్స‌రాల‌ పాటు కాంగ్రెస్‌ పార్టీ ఒక ర‌క‌మైన ఆర్థిక సంస్కృతి ని పెంపొందిస్తూ వ‌చ్చింది. అది బ‌డా పాల‌క కుటుంబాల స్నేహితులు, కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర్చింది.

సామాన్యుడు ఆర్థికం గా వృద్ధి చెంద‌డానికి ప్రోత్సాహ‌కాలు కానీ, ఆ స‌మ‌ర్థ‌త ను కానీ వారికి క‌ల్పించ‌లేదు.

కాంగ్రెస్ పార్టీ ఆర్థిక సంస్కృతి కి వ్య‌తిరేకంగా మాట్లాడిన వ్య‌క్తి ఎవ‌రైనా ఉంటే అత‌డు త‌మిళ‌ పుత్రుడు సి.రాజ‌గోపాలాచారి గారే.

ఇవాళ , మేం ప్ర‌జ‌ల‌కు హిత‌క‌ర‌మైన‌, సంస్క‌ర‌ణ‌ల‌ తో కూడిన ఆర్ధిక వ్య‌వస్థ‌ ను తీసుకురావ‌డం ద్వారా, రాజాజీ క‌ల‌ల‌ ను సాకారం చేస్తున్నాం.

వ్యాపారం చేయడం లో సౌలభ్యం లో భార‌తదేశం ర్యాంకింగ్ ను 65 స్థానాలు మెరుగుప‌రుచుకుంది. నాలుగు సంవ‌త్స‌రాల క్రితం మ‌న స్థానం 142 లో ఉంటే ప్ర‌స్తుతం అది 77 వ స్థానానికి వ‌చ్చింది.

గ‌త సంవ‌త్స‌రం కేంద్ర‌ప్ర‌భుత్వం ఎంఎస్‌ఎంఇ రంగాని కి ప‌లు ప్ర‌యోజ‌నాలను ప్ర‌క‌టించింది.

ప‌ట్టుమ‌ని 59 నిమిషాల‌లో కోటి రూపాయ‌ల వ‌ర‌కు రుణం పొంద‌డం ప్ర‌స్తుతం సాధ్యం!

అంటే, మీరు చెన్నై కి వెళ్ల‌డానికి ప‌ట్టే స‌మయంకంటే వేగంగా దీనిని పొంద‌వ‌చ్చు.

మిత్రులారా,

మ‌నం భార‌త‌దేశ యువ‌త , వారి మేధ‌స్సు ను పోటీ కి నిలుపుతున్నాం.
అందుకే, మ‌నం యువ భార‌తీయుల వాణిజ్య‌ స్ఫూర్తికి రెక్క‌లు తొడిగేందుకు ముద్ర యోజ‌న‌ ను తీసుకువ‌చ్చాం.

ముద్ర యోజ‌న లో భాగం గా 7 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైబ‌డిన రుణాల‌ను 15 కోట్ల మంది ప్ర‌జ‌లు అందుకున్నారు.

ఈ ప‌థ‌కం లో రుణాలు అందుకుని అగ్ర‌భాగాన ఉన్న రాష్ట్రాల‌ లో త‌మిళ‌ నాడు ఒక‌టి.

మిత్రులారా,

ప్ర‌తిప‌క్షానికి సామాజిక న్యాయం విష‌యం లో ఎలాంటి చిత్త‌శుద్ధి లేదు.

కాంగ్రెస్ పార్టీ హ‌యాం లో ద‌ళితుల‌పై అత్యంత దారుణ‌మైన అకృత్యాలు జ‌రిగాయి.

డాక్ట‌ర్ బాబాసాహెబ్ ఆంబేడ్ కర్‌ ను ఒక‌టి కాదు , రెండు సార్లు ఓడించిన పార్టీ కాంగ్రెస్‌.

డాక్ట‌ర్ ఆంబేడ్ కర్‌ కు కాంగ్రెస్‌ పార్టీ న‌ల‌భై సంవ‌త్స‌రాల‌ పాటు భార‌త ర‌త్న‌ను ప్ర‌క‌టించ‌నే లేదు. అంతేకాదు, డాక్ట‌ర్ ఆంబేడ్ కర్‌ ప‌టాన్ని పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్‌ లో ఉంచ‌లేదు.

బిజెపి మ‌ద్ద‌తు క‌లిగిన నాన్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఈ రెండింటినీ చేసింది.

మిత్రులారా,

ప్ర‌స్తుత‌ ఎన్‌డిఎ ప్ర‌భుత్వం ఎస్‌ సి,ఎస్‌ టి చ‌ట్టాని కి ప‌టిష్ట‌మైన స‌వ‌ర‌ణ‌లు చేసింది.

ఆర్థిక‌, సామాజిక న్యాయం అనేవి మా గ‌ట్టి విశ్వాసం. అంతేగాని మాకు అవి వోట్ల కోసం చేసే నినాదాల లాంటివి కాదు.

మిత్రులారా,

2019 లోక్ స‌భ ఎన్నిక‌ల‌ కు రెండు విభిన్న పార్శ్వాలు ఉన్నాయి.
మా వైపు మేం బ‌లం, సుస్థిర‌త ఉన్నాయి.
ఆవ‌లి వైపు బ‌ల‌హీన‌త‌, హాని ఉన్నాయి.

మా నాయ‌క‌త్వం, ప‌ని సంస్కృతి దేశ‌వ్యాప్తం గా తెలుసు.
ఆవ‌లి వైపు అంతా గంద‌ర‌గోళం.

ఈ దేశాని కి త‌దుప‌రి నాయ‌కుడెవ‌రో చెప్ప‌డానికి వారికి పేరే దొర‌క‌లేదు.

భార‌త‌దేశ ప్ర‌గ‌తి, దార్శ‌నిక‌త‌కు సంబంధించిన ఒక‌ ల‌క్ష్య‌మంటూ వారికి లేదు.

ఎలాంటి బిడియమూ వారిని రికార్డు స్థాయి అవినీతి కి పాల్ప‌డ‌కుండా ఆప‌లేదు.

2009లో డిఎంకె, కాంగ్రెస్ పార్టీలు ఎన్నిక‌ల అనంత‌రం పోర్టుఫోలియో లు ఎలా కేటాయించుకున్నాయో దేశ ప్ర‌జ‌లు గుర్తుచేసుకుంటున్నారు.

మంత్రుల‌ ను ప్ర‌ధాన మంత్రి ఎంపిక చేయ‌డం కాక‌, ప్ర‌జాసేవ‌ తో ఎలాంటి సంబంధం లేని వారు ఎంపిక‌ చేశారు.

మంత్రి ప‌దవుల‌కు టెలిఫోన్ బేర‌ సారాలు.

నాడు మ‌హా మిలావ‌ట్ లేదా నానా క‌ల‌యిక‌ ల క‌ల్తీ ప్ర‌భుత్వం వ్య‌క్తుల అహం, రాచ‌రిక పోక‌డ‌ల‌ కు బందీగా మారింది.

నాకున్న ఒకే ఒక కుటుంబం 130 కోట్ల మంది భార‌తీయులు.

నేను వారి కోస‌మే జీవిస్తాను, వారి కోస‌మే మ‌ర‌ణిస్తాను.

వంశ‌పారంప‌ర్య‌ పాల‌న ను తీసుకువచ్చేందుకు నేను రాజ‌కీయాల‌లో లేను.

దేశ‌ ప్ర‌గ‌తి కోసం చేత‌నైనంత చేయ‌డానికి నేను ఇక్క‌డ ఉన్నాను.

దేశంలోని అత్యంత నిరుపేద‌ల క‌ల‌లు సాకారం అయ్యే న్యూ ఇండియా ను నిర్మించేందుకు నేను మీ మ‌ద్ద‌తు ను, ఆశీస్సుల ను కోరుతున్నాను.

ఇంత పెద్ద సంఖ్య‌ లో ప్ర‌జ‌లు ఇక్క‌డకు విచ్చేసి ఈ ర్యాలీ ని విజ‌య‌వంతం చేసినందుకు ధ‌న్య‌వాదాలు.

భార‌త్ మాతా కీ జయ్.

**