ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కంపెనీ సెక్రెటరీల ఆదానప్రదానానికి వీలుకల్పించడంతోపాటు రెండు దేశాల్లో వృత్తిగత కంపెనీ సెక్రెటరీల స్థాయి, ప్రతిష్ఠ పెంచడం లక్ష్యంగా భారత్-మలేషియాల మధ్య పరస్పర సహకారంపై అవగాహన ఒప్పందానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
అంశాలవారీగా వివరాలు:
‘‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా’’ (ICSI), ‘‘మలేషియన్ అసోసియేషన్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్’’ (MACS)ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రెండు దేశాల్లో వృత్తిగత కంపెనీ సెక్రెటరీల స్థాయి, ప్రతిష్ఠ పెంచడంతోపాటు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కంపెనీ సెక్రెటరీల ఆదానప్రదానానికి వీలు కల్పించడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.
నేపథ్యం:
‘‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా’’ (ICSI) భారత పార్లమెంటు శాసనం ‘‘ది కంపెనీ సెక్రెటరీస్ యాక్ట్-1980 (యాక్ట్ నం.56)’’ ద్వారా రూపొందిన చట్టబద్ధ సంస్థ. భారతదేశంలో కంపెనీ సెక్రెటరీల వృత్తి నియంత్రణ, అభివృద్ధి లక్ష్యంగా ఈ చట్టం అమలులోకి వచ్చింది. అలాగే ‘‘మలేషియన్ అసోసియేషన్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్’’ కూడా కంపెనీ సెక్రెటరీ వృత్తి సంబంధిత సంస్థలో భాగం. మలేషియాలో కంపెనీ సెక్రెటరీలుగా పనిచేస్తున్నవారి సామర్థ్యం మెరుగుపరచడం, వృత్తిగత ప్రతిష్ఠ పెంపు ఈ సంస్థ ప్రధాన ధ్యేయాల్లో ఒకటి.
***