ఔషధాలు, అలంకరణ సామగ్రి (సవరణ) బిల్లు, 2013 ను ఉపసంహరించుకోవాలని మంత్రిమండలి నిర్ణయించింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ బిల్లును 2013 ఆగస్టు 29న రాజ్య సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్ స్థాయీ సంఘం బిల్లును పరిశీలించి ఇందులోని నియమ నిబంధనలను మార్చడానికిగాను పలు సిఫారసులు చేసింది.
ప్రపంచంలో ఔషధ ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారు చేస్తున్న దేశాలలో భారతదేశం ఒకటి. ఏటా రూ. 2 లక్షల కోట్ల పైచిలుకు విలువైన ఆ తరహా ఉత్పత్తులు ఇక్కడ తయారవుతున్నాయి. ఇందులో 55 శాతానికి పైగా 200కు మించిన దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటిలో అభివృద్ధి చెందిన దేశాలు కూడా కలసి ఉన్నాయి. ఆ రకంగా చూస్తే, భారతదేశంలో ఔషధ రంగం అనేక దేశాలలో పెద్ద సంఖ్యలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్రను పోషిస్తోంది.
మందులు, ఇన్ విట్రో మెడికల్ డివైసెస్, మూల కణాలు, పునరుత్పత్తి సంబంధి మందులు, రోగచికిత్సా సంబంధి ప్రయోగాలు/ పరీక్షలు మొదలైన వాటి నాణ్యత, భద్రత, సమర్థత లను పరిరక్షించేందుకు ఉద్దేశించినదే ఔషధాలు, అలంకరణ సామగ్రి చట్టం, 1940.
ప్రజా ఆరోగ్యాన్ని కాపాడడంలో ఈ రంగం పోషించే పాత్రను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అమలులో ఉన్న చట్టంలో మరిన్ని సవరణలు చేయడం సరైన చర్య కాదని, ప్రత్యేకించి జీవశాస్త్ర సంబంధమైన, మూల కణాలు, పునరుత్పత్తి మందులు, వైద్య పరికరాలు, రోగచికిత్సా సంబంధి ప్రయోగాలు/ పరీక్షలు వంటి వాటిని కొత్త కొత్త అంశాలను ప్రస్తుత చట్టం ద్వారా సమర్థంగా నియంత్రించడం కుదిరేది కాదని మంత్రిమండలి నిర్ణయించింది.
ఇతర దేశాలతో పోలిస్తే మన దేశ ఔషధ తయారీ రంగం పలు విషయాల్లో సౌలభ్యాలను, వెసులుబాట్లను కలిగి ఉంది. ధరల విషయంలోను, జనాభా పరంగాను, సమాచార సాంకేతిక రంగంలో ఉన్న వెసులుబాట్లు, సౌలభ్యాల రీత్యాను భారతీయ ఔషధ రంగం సమీప భవిష్యత్తులో గణనీయమైన పురోగతిని సాధించడానికి సంసిద్ధంగా ఉంది. ఒక వైపు దేశీయంగా వున్న అవసరాలను తీరుస్తూనే అంతర్జాతీయ స్థాయి తయారీ నిలయంగా కూడా మారే సామర్థ్యం దేశీయ ఔషధ రంగానికి ఉంది. తద్వారా ఈ రంగం పెట్టుబడులను ఆకర్షించగలదు కూడా.
మేక్ ఇన్ ఇండియా ధ్యేయాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రస్తుత చట్టాన్ని సమగ్రంగా సమీక్షించాలని నిర్ణయించారు. ఈ రంగంలో వ్యాపారం ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా జరిగేలా చూడడం, ఉత్పత్తుల వాసిని, అవి పనిచేసే తీరును మెరుగుపరచడం అనే రెండు అంచెల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ సమీక్షను జరపాలని నిర్ణయించారు. దీని ప్రకారం కేంద్ర ఆరోగ్యం- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ రెండు స్థాయిలలో కసరత్తు ను మొదలుపెట్టింది. అవి ఏమిటంటే.. i) వైద్య పరికరాలను నియంత్రించడానికి ప్రత్యేకమైన నియమాలను రూపొందించాలి. ii) వైద్య పరికరాలు, మందులు, సౌందర్య సాధనాల నియంత్రణకోసం వేరు వేరుగా శాసనాలను తీసుకు రావడం. ఈ రంగంలోని భాగస్వాములందరితోను విస్తృతంగా చర్చలు జరిపిన తరువాత వైద్య పరికరాల నియంత్రణ నియమాల ముసాయిదాను తయారు చేయడమైంది. దీనిని తర్వలో నోటిఫై చేయనున్నారు.నూతన చట్ట రూపకల్పన కోసం కసరత్తు కూడా మొదలైంది.