ఐసిఎఐ & ఐసిఎఇడబ్ల్యు ల మధ్య అవగాహనా ఒప్పందం రెన్యువల్‌కు కూడా కేబినెట్ ఆమోదం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ , ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్ ఇంగ్లండ్, వేల్స్ (ఐసిఎఇడబ్ల్యు) ల మధ్య 2008లో కుదిరిన 2014లో రెన్యువల్ అయిన అవగాహనా ఒప్పందానికి వెనుకటి తేదీ నుంచి అమలులోకి వచ్చే విధంగా ఆమోదం తెలిపింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ),ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఇన్ ఇంగ్లండ్,వేల్స్ మధ్య అవగాహనా ఒప్పందం రెన్యువల్‌కు కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రయోజనాలు:
ఈ తక్షణ ఎం.ఒ.యు మరింత మంది యువ భారతీయ చార్టెడ్ అకౌంటెంట్లు ఐసిఎఇడబ్లు ప్రొఫెషనల్ హోదా పొందడానికి ప్రోత్సాహాన్నిస్తుంది. తద్వారా బ్రిటన్‌లో వారు వృత్తిపరమైన అవకాశాలు పొందడానికి ఇది వీలుకల్పిస్తుంది. బ్రిటన్‌లోని ఎన్నో కంపెనీలలో భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లు ఉన్నతస్థాయి హోదాలు పొందడం గొప్ప గౌరవం. ఐసిఎఇడబ్ల్యు నుంచి వచ్చే ఈ గుర్తింపుతో బ్రిటన్‌లోని కార్పొరేట్ సంస్థలు భారతీయ ప్రతిభను, వారి నైపుణ్యాలను మరింతగా గుర్తించి వారి సేవలను వినియోగించుకుంటున్నాయి. ఇందులో ప్రభుత్వానికి ఆర్థికపరమైన ఖర్చు ఏదీ లేదు.
ప్రధాన ప్రభావం:
ఈ అవగాహనా ఒప్పందం ప్రధాన ఉద్దేశం ఆయా సంస్థల సభ్యులు, విద్యార్థులు, సంస్థలకు పరస్పర ప్రయోజనకర సంబంధాలను పెంపొందించడం. ఈ ఎం.ఒ.యు ఈ రెండు అకౌంటెన్సీ సంస్థలు వృత్తిపరంగా నూతన సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా నాయకత్వ స్థానంలో నిలిపేందుకు దోహదపడుతుంది. ఐసిఎఐకి బ్రిటన్‌లో యుకె(లండన్) చాప్టర్ ఆఫ్ ఐసిఎఐ పేరుతో చాప్టర్ ఉంది. ఇది బ్రిటన్‌లో భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్ల సేవల విషయంలో కీలక పాత్ర పోషిస్తున్నది.
అమలు వ్యూహం, లక్ష్యాలు:
అనుభవం ,అర్హతగల ఐసిఎఇడబ్ల్యు, ఐసిఎఐ సభ్యులు, వారి దేశంలో సభ్యత్వానికి అనుసరించిన సిలబస్‌తో ఏమాత్రం సంబంధం లేకుండా ఈ అవగాహనా ఒప్పందం ఉపయోగపడుతుంది.
ఇది సభ్యులకు సిపిడి బాధ్యతలు, అర్హతల పరిణామక్రమాన్ని గుర్తించడంతోపాటు, సభ్యులు ఎప్పటికప్పుడు తమ విజ్ఞానాన్ని పెంచుకునేందుకు సిపిడి బాధ్యతను గుర్తిస్తుంది. అదనంగా సంస్థలో చేరగానే ప్రాక్టీసింగ్, ఆడిటింగ్ హక్కులు అందుబాటులో ఉంటాయా లేదా అనే విషయాన్నీ నిర్వచిస్తుంది. అంతేకాదు, అదనపు పరీక్షల ద్వారా పున: అర్హత సాధించడం, అనుభవం వంటివి ఇందుకు అవసరం కావచ్చన్న విషయాన్నీ తెలియజేస్తుంది.
ఈ అవగాహనా ఒప్పందం, చట్టబద్ధమైన అనుబంధాన్ని ఏర్పరచడానికి ఉద్దేశించినది కాదు. అలాగే ఇందులోని నిబంధనలు ఎలాంటి న్యాయపరమైన బాధ్యతలను, హక్కులను కల్పించజాలదు.
అంశం వారీగా వివరాలు:
ఈ ఎంఒయుకు కేబినెట్ వెనుకటి తేదీతో వర్తించే విధంగా అనుమతిచ్చింది.ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ), ఇన్స్టిట్యూట్ ఆఫ్ చర్టర్డ్ అకౌంటెంట్స్ ఇన్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ (ఐసిఎఇడబ్ల్యు) ల మధ్య ఎంఒయు పై 2008లో సంతకాలు జరగగా, 2014లో దీనిని కొనసాగింపు చేపట్టారు. అలాగే చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ)కి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకంఔంటెంట్స్ ఇన్ ఇంగ్లండ్, వేల్స్‌ల మధ్య ఖాతా లెక్కలకు సంబంధించిన విజ్ఞానాన్ని, వృత్తిపరమైన ,మేథోసంబంధమైన అభివృద్ధి, సభ్యుల ప్రయోజనాల పెంపు, ఇంగ్లండ్, వేల్స్ , ఇండియాలలో అకౌంటింగ్ వృత్తికి సంబంధించి సానుకూల ప్రగతికి దోహదపడడం ఇందులో ఉన్నాయి.
నేపథ్యం:
ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఎఐ) భారత పార్లమెంటు ద్వారా, చార్టర్డ్ అకౌంటెంట్స్ చట్టం 1949 కింద చట్టబద్ధంగా ఏర్పాటైన సంస్థ.ఇది భారతదేశంలో చార్టర్డ్ అకౌంటెన్సీ వృత్తిని నియంత్రిస్తుంది. ఐసిఎఇడబ్ల్యు ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన వృత్తిపరమైన సభ్యత్వం ఇచ్చే సంస్థ. ఇది అర్హతలను కల్పించడంతోపాటు, వృత్తిపరమైన అభివృద్ధి , సాంకేతిక నైపుణ్యం అందిస్తుంది. అలాగే అకౌంటెన్సీ, ఫైనాన్స్ రంగాలకు సంబంధించి సమగ్రతను కాపాడుతుంది.