Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐక్యరాజ్య స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ 76వ స‌మావేశంలో ప్ర‌ధాని ప్ర‌సంగం

ఐక్యరాజ్య స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీ 76వ స‌మావేశంలో ప్ర‌ధాని ప్ర‌సంగం


స్నేహితులంద‌రికీ న‌మ‌స్కారం
హిస్ ఎక్స్ లెన్సీ అబ్దుల్లా సాహిద్ జీ
అధ్య‌క్ష పీఠాన్ని అధిరోహించినందుకు మీకు నా హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. మీరు అధ్య‌క్షులు కావ‌డం అభివృద్ధి చెందుతున్న దేశాలకు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న చిన్న ద్వీప దేశాల‌కు ఎంతో గ‌ర్వ‌కార‌ణం. 
మిస్ట‌ర్ ప్రెసిడెంట్‌
వంద సంవ‌త్స‌రాల్లో ఎన్న‌డూ చూడ‌ని అతి పెద్ద మ‌హ‌మ్మారితో ఒక‌టి ఒక‌టిన్న‌ర సంవ‌త్స‌రాలుగా ప్ర‌పంచం యావ‌త్తూ పోరాటం చేస్తోంది. ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నా నివాళి ఘ‌టిస్తున్నాను. వారి కుటుంబాల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నాను.
మిస్ట‌ర్ ప్రెసిడెంట్‌
ప్ర‌జాస్వామ్యానికి మాతృమూర్తిలాంటిద‌ని పేరు గ‌డించిన దేశానికి నేను ప్రాతినిధ్యంవ‌హిస్తున్నాను. వేలాది సంవ‌త్స‌రాలుగా ప్ర‌జాస్వామ్య సంప్ర‌దాయాన్ని క‌లిగిన దేశం భార‌త‌దేశం. దేశానికి స్వాతంత్ర్యంవ‌చ్చి ఈ ఆగ‌స్టు 15నాటికి 75 సంవ‌త్స‌రాలు. మా దేశంలోని వైవిధ్య‌త‌నేది మా ప‌టిష్ట‌మైన ప్ర‌జాస్వామ్యానికి హాల్ మార్క్ గుర్తు లాంటిది. 
భార‌త‌దేశంలో అనేక భాష‌లు మాట్లాడ‌తారు. వంద‌లాది మాండ‌లికాలున్నాయి. వివిధ జీవ‌న విధానాల‌కు, ఆహార అల‌వాట్ల‌కు భార‌త‌దేశం నెల‌వు. ఉజ్వ‌ల‌మైన ప్ర‌జాస్వామ్యానికి ఉత్త‌మ‌మైన ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. ఒక‌ప్పుడు రైల్వే స్టేష‌న్ వ‌ద్ద తండ్రి నిర్వ‌హిస్తున్న టీ స్టాల్ లో స‌హాయం చేసిన చిన్న పిల్లాడు నేడు భార‌త‌దేశ ప్ర‌ధాని అయ్యాడు. ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీని ఉద్దేశించి నాలుగోసారి ప్ర‌సంగిస్తున్నాడంటే అది భార‌త‌దేశ ప్ర‌జస్వామ్య ఘ‌న‌త‌.
గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా సుదీర్ఘ‌కాలం సేవ‌లందించాను. దేశ ప్ర‌ధానిగా గ‌త ఏడు సంవత్స‌రాలుగా ప‌ని చేస్తున్నాను. గ‌త 20సంవ‌త్స‌రాలుగా ప్ర‌భుత్వాధినేత‌గా నా దేశ ప్ర‌జ‌ల‌కు నేను సేవ‌లందిస్తున్నాను. 
ఈ విష‌యాన్ని నా అనుభ‌వంకొద్దీ చెబుతున్నాను. 
అవును. ప్ర‌జాస్వామ్య‌మ‌నేది ఫ‌లితాల‌నిస్తుంది. మిస్ట‌ర్ ప్రెసిడెంట్ ప్ర‌జాస్వామ్యం ఫ‌లితాల‌నిచ్చింది. 
ఈ రోజు పండిట్ శ్రీ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయుల‌వారి జ‌యంతి రోజు. ఏకాత్మ మాన‌వ‌ద‌ర్శ‌న్ అనే ఉన్న‌త‌మైన ఆలోచ‌న‌కు ఆయ‌న తండ్రిలాంటివారు. ఏకాత్మ మాన‌వ‌ద‌ర్శ‌న్ అంటే మాన‌వ‌తావాద ఐక్య‌త‌. అంటే అభివృద్ధిలో స‌హ ప్ర‌యాణం, స్వార్థాన్నించి, అంద‌రికీ అనే భావ‌న‌వైపు విస్త‌ర‌ణ‌. 
ఇది ఆత్మ విస్త‌ర‌ణ‌, వ్య‌క్తిగ‌త ఆలోచ‌న‌ల‌నుంచి స‌మాజంవైపు, జాతి వైపు, మొత్తం మాన‌వాళివైపు ప్ర‌యాణం చేయ‌డం. ఈ ఆలోచ‌న అనేది అంత్యోద‌య‌కు అంకితం చేయ‌డం జ‌రిగింది. అంత్యోద‌య అంటే ప్ర‌జ‌ల్లో ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల‌కూడ‌దనేది వ‌ర్త‌మాన నిర్వ‌చ‌నం. 
ఈ స్ఫూర్తితోనే ప్ర‌స్తుతం భార‌త‌దేశం ఐక్య‌తామార్గంలో, స‌మాన‌మైన అభివృద్ధి మార్గంలో ప్ర‌యాణం చేస్తోంది. అభివృద్ధి అనేది అందిర‌నీ క‌లుపుకొని పోవాలి. అంద‌రి జీవితాల‌ను స్పృశించాలి. అంత‌టా విస్త‌రించాలి. ఇదే మా ప్రాధాన్య‌త‌. 
గ‌త ఏడు సంవ‌త్స‌రాల్లో 430 మిలియ‌న్ల భార‌తీయ‌ల‌కు బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ను ప‌రిచ‌యం చేయ‌డం జ‌రిగింది. వారు ఇంత‌కాలం బ్యాంకుల సేవ‌ల‌కు దూరంగా వున్నారు. ప్ర‌స్తుతం 360 మిలియ‌న్ల మంది ప్ర‌జ‌ల‌కు బీమా సౌక‌ర్యం అందిస్తున్నాం. గ‌తంలో వీరింద‌రిలో ఈ ఆలోచ‌న కూడా వుండేది కాదు. దేశంలో 50 కోట్ల మందికి నాణ్య‌మైన ఉచిత ఆరోగ్య సేవ‌లు అందుతున్నాయి. 30 మిలియ‌న్ల మందికి ప‌క్కా గృహ సౌక‌ర్యం క‌ల్పించ‌డం జ‌రిగింది. వారందిరికీ సొంతింటి క‌ల సాకార‌మైంది. 
మిస్ట‌ర్ ప్రెసెడెంట్ 
క‌లుషిత నీటి స‌మ‌స్య అనేది భార‌త‌దేశంలోనే కాదు మొత్తం ప్ర‌పంచ‌మంతా ఈ స‌మ‌స్య వుంది. ముఖ్యంగా పేద‌, అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ స‌మ‌స్య వుంది. ఈ స‌వాలును ఎదుర్కోవ‌డానికిగాను 170 మిలియ‌న్ మంది ప్ర‌జ‌ల‌కు సుర‌క్షిత‌మైన కుళాయి నీటిని అందించ‌డానికిగాను మేం ఒక భారీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నాం. 
ఏ దేశ‌మైనా అభివృద్ధి చెందాలంటే ఆ దేశ పౌరుల‌కు భూ ఆస్తి హ‌క్కులుండాల‌ని ప్ర‌సిద్ధి చెందిన సంస్థ‌లు గుర్తించాయి. దేశ పౌరుల‌కు ఇంటి హ‌క్కులు వుండాల‌ని గుర్తించ‌డం జ‌రిగింది. అంటే వారికి వారి ఆస్తుల‌కు సంబంధించిన యాజ‌మాన్య ప‌త్రాలుండాలి. ప్ర‌ప‌చంవ్యాప్తంగా చాలా దేశాల్లో ఎంతో మందికి భూముల‌పైనా, ఇళ్ల‌పైనా హ‌క్కులు లేవు. 
ఈ రోజున మేం కోట్లాది మంది ప్ర‌జ‌ల‌కు వారి ఆస్తులు, ఇళ్ల‌కు సంబంధించి డిజిట‌ల్ రికార్డులు అందిస్తున్నాం. దేశ‌వ్యాప్తంగా 6 ల‌క్ష‌ల గ్రామాల్లో డ్రోన్ల ద్వారా మ్యాపింగ్ ప్ర‌క్రియ నిర్వ‌హిస్తున్నాం. 
ఈ డిజిట‌ల్ రికార్డు కార‌ణంగా ప్ర‌జ‌ల‌కు బ్యాంకుల‌నుంచి రుణాలు వ‌స్తాయి. అంతే కాదు ఆస్తుల త‌గాదాలు త‌గ్గిపోతాయి. 
మిస్ట‌ర్ ప్రెసిడెంట్
ప్ర‌పంచంలో ప్ర‌తి ఆరుగురిలో ఒక‌రు భార‌తీయులే. భార‌త‌దేశం ప్ర‌గ‌తి సాధిస్తే అది ప్ర‌పంచ అభివృద్ధికి కూడా దోహ‌దం చేస్తుంది. 
భార‌త‌దేశం వృద్ధి చెందితే ప్ర‌పంచం వృద్ధి చెందుతుంది. భార‌త‌దేశంలో సంస్క‌ర‌ణ‌లు అమ‌లైతే ప్ర‌పంచం మారుతుంది. భార‌త‌దేశంలో శాస్త్ర సాంకేతిక‌త ఆధారిత ఆవిష్క‌ర‌ణ‌ల‌నేవి ప్ర‌పంచానికి గ‌ణ‌నీయంగా సాయం చేస్తాయి. మా దేశ సాంకేతిక ప‌రిష్కారాలు, అందులోను అవి త‌క్కువ ధ‌ర‌లోనే ల‌భించ‌డ‌మ‌నేది ఈ రెండింటి విష‌యంలోనూ మాకు పోటీ లేదు. 
భార‌త‌దేశంలో అమ‌ల‌వుతున్న యూనిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్ ఫేస్ ( యుపిఐ) ద్వారా ప్ర‌తి నెలా 3.5 మిలియ‌న్ లావాదేవీలు జ‌రుగుతున్నాయి. భార‌త‌దేశానికి చెందిన టీకా స‌ర‌ఫ‌రా వేదిక కో – విన్ అనేది ఒక రోజులోనే మిలియ‌న్ల మంది ప్ర‌జ‌ల‌కు డిజ‌ట‌ల్ సేవ‌లందిస్తోంది. 
మిస్ట‌ర్ ప్రెసిడెంట్‌
సేవా ప‌ర‌మో ధ‌ర్మ‌…ఈ ఉన్న‌త‌మైన తాత్విక‌త మీద ఆధార‌ప‌డి జీవిస్తున్న భార‌త‌దేశం.. త‌క్కువ వ‌నరులున్ప‌ప్ప‌టికీ టీకా అభివృద్ధిని చేప‌ట్టి, వాటిని త‌యారు చేస్తోంది. ఈ సంద‌ర్భంగా ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీకి ఒక విష‌యాన్ని తెలియ‌జేయాల‌నుకుంటున్నాను. ప్ర‌పంచ మొద‌టి డిఎన్ ఏ ఆధారిత టీకాను భార‌త‌దేశం అభివృద్ధి చేసింది. దీన్ని 12 సంవ‌త్స‌రాలు దాటిన‌వారంద‌రికీ ఇవ్వ‌వ‌చ్చు.  
మ‌రొక ఎం- ఆర్ ఎన్ ఏ టీకా అనేది త‌యారీకి సంబంధించిన చివ‌రిద‌శ‌లో వుంది.  ముక్కుద్వారా ఇచ్చే క‌రోనా టీకాను అభివృద్ధి చేయ‌డానికి మా శాస్త్ర‌వేత్త‌లు కృషి చేస్తున్నారు. మాన‌వాళిప‌ట్ల వున్న బాధ్య‌త‌ను గుర్తెరిగి మ‌రోసారి భార‌త‌దేశం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అవ‌స‌ర‌మున్న ప్ర‌జ‌ల‌కు టీకాల‌ను పంపిణీ చేస్తోంది. 
ప్ర‌పంచవ్యాప్తంగా వున్న‌ టీకా త‌యారీదారుల‌కు నేను ఆహ్వానం ప‌లుకుతున్నాను. 
భార‌త‌దేశానికి రండి, మా దేశంలో టీకాల ఉత్ప‌త్తి ప్రారంభించండి. 
మిస్ట‌ర్ ప్రెసిడెంట్ 
మ‌నంద‌రికీ తెలుసు మాన‌వ‌జీవితంలో సాంకేతిక‌త ఎలాంటి ప్రాధాన్య‌త వ‌హిస్తున్న‌దో. అయితే మారుతున్న ప్ర‌పంచంలో ప్ర‌జాస్వామిక విలువ‌ల‌తో కూడిన సాంకేతిక‌త అనేదాన్ని అందించ‌డం చాలా ముఖ్యం. 
భార‌త సంత‌తికి చెందిన వైద్యులు, ప‌రిశోధ‌కులు, ఇంజినీర్లు, మేనేజ‌ర్లు..వారు ఏ దేశంలో ప‌ని చేస్తున్నా స‌రే భార‌త‌దేశ ప్రజాస్వామిక విలువ‌లు వారికి స్ఫూర్తినిస్తూనే వున్నాయి. వారు మాన‌వ సేవ‌లో నిమ‌గ్న‌మ‌య్యేలా దోహ‌దం చేస్తున్నాయి. క‌రోనా స‌మ‌యంలో కూడా మ‌నం దీన్ని చూశాం. 
మిస్ట‌ర్ ప్రెసిడెంట్‌
క‌రోనా మ‌హ‌మ్మారి అనేది ఈ ప్ర‌పంచానికి గుణ‌పాఠం నేర్పింది. ప్ర‌పంచ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను మ‌రింత‌గా వైవిధ్యీక‌రించ‌డం చాలా ముఖ్యం. ఇందుకోసం ప్ర‌పంచ స‌ర‌ఫ‌రా వ్య‌వ‌స్థ‌ల‌ను విస్త‌రించ‌డమ‌నేది ముఖ్యం. 
ఈ స్ఫూర్తితోనే ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ( స్వ‌యం స‌మృద్ధి భార‌త‌దేశం) ఉద్యమం రూపొందింది. అంత‌ర్జాతీయ పారిశ్రామిక వైవిధ్యీక‌ర‌ణ సాధ‌న‌లో ప్రజాస్వామిక‌, విశ్వ‌స‌నీయ‌మైన భాగ‌స్వామిగా భార‌త‌దేశం అవ‌త‌రిస్తోంది. 
ఈ ఉద్య‌మంలో ఆర్ధికంగాను, ప‌ర్యావ‌ర‌ణ ప‌రంగానూ రెండింటి విష‌యంలో భార‌త‌దేశం మెరుగైన స‌మ‌న్వ‌యాన్ని సాధించింది. అభివృద్ధి చెందిన పెద్ద పెద్ద దేశాల‌తో పోల్చిన‌ప్పుడు వాతావ‌ర‌ణ సంక్షోభ నివార‌ణ చ‌ర్య‌ల విష‌యంలో భార‌త‌దేశం చేప‌ట్టిన‌చ‌ర్య‌ల‌ను చూస్తే మీరు త‌ప్ప‌కుండా గ‌ర్వప‌డ‌తారు. 450 గిగావాట్ల పున‌ర్ వినియోగ శ‌క్తి వ‌న‌రులు ఏర్పాటు చేసుకునేదిశ‌గా చాలా వేగంగా భార‌త‌దేశం ప్ర‌యాణం చేస్తోంది. భార‌త‌దేశాన్ని ప్ర‌పంచంలోనే అతి పెద్ద హ‌రిత హైడ్రోజ‌న్ హ‌బ్ గా రూపొందించే కార్య‌క్ర‌మాన్ని కూడా ప్రారంభించాం.
మిస్ట‌ర్ ప్రెసిడెంట్ 
నిర్ణ‌యాలు తీసుకున్నప్పుడు వాటి విష‌యంలో రాబోయే త‌రాల‌కు స‌మాధానం ఇచ్చేలాగా వుండాలి. అవి ప్ర‌పంచానికి మార్గ‌ద‌ర్శ‌నం చేయ‌డానికి కార‌ణ‌మైన‌ప్పుడు అవి ఆ ప‌నిని ఎలా చేశాయి? అనేది తెలియ‌జేయాలి. ఈ రోజున ప్ర‌పంచ‌వ్యాప్తంగా తిరోగ‌మ‌న ఆలోచ‌న‌లు, తీవ్ర‌వాదం ప్ర‌బ‌లుతున్నాయి. 
ఈ ప‌రిస్థితుల్లో మొత్తం ప్ర‌పంచ‌మంతా క‌లిసి శాస్త్రీయ ఆధారిత‌, స‌హేతుక‌మైన‌, పురోగ‌మ‌న ఆలోచ‌న‌ల్ని అభివృద్ధికి ఆధారం చేసుకోవాలి. శాస్త్రీయ ఆధారిత విధానాన్ని బ‌లోపేతం చేయ‌డానికిగాను అనుభ‌వ ఆధారిత బోధ‌న‌ను భార‌త‌దేశం ప్రోత్స‌హిస్తోంది. మేం దేశ‌వ్యాప్తంగా వేలాది పాఠ‌శాల‌ల్లో అట‌ల్ టింక‌రింగ్ ల్యాబుల‌ను ప్రారంభించాం, ఇంక్యుబేట‌ర్ల‌ను నిర్మించాం, అంతే కాదు బ‌ల‌మైన స్టార్ట‌ప్ వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేశాం. 
భార‌త‌దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 75 సంవ‌త్స‌రాలైన సంద‌ర్భంగా భార‌తీయ శాస్త్ర‌వేత్త‌లు త్వ‌ర‌లోనే 75 ఉప‌గ్ర‌హాల‌ను అంత‌రిక్షంలోకి పంపుతున్నారు. వాటిని భార‌తీయ విద్యార్థులు త‌మ పాఠ‌శాల‌ల్లో, క‌ళాశాల‌ల్లో అభివృద్ధి చేశారు. 
మిస్ట‌ర్ ప్రెసిడెంట్‌
పురోగ‌మ‌న ఆలోచ‌న‌లున్న దేశాలు, తీవ్ర‌వాదాన్ని రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు వాడుకునే దేశాలు ఆ తీవ్ర‌వాద‌మ‌నేది ఇత‌రుల‌కే కాదు త‌మ‌కు కూడా ప్ర‌మాద‌క‌ర‌మ‌నే విష‌యాన్ని తెలుసుకోవాలి. ఉగ్ర‌వాదాన్ని పెంచ‌డానికి, ఉగ్ర‌వాద దాడుల‌కోసం ఆప్ఘ‌నిస్తాన్ ను ఉప‌యోగించుకోకుండా చూడ‌డం చాలా ముఖ్యం. 
ఆ దేశంలో నెలకొన్న సున్నిత‌మైన ప‌రిస్థితుల‌ను ఏ దేశ‌మైనా త‌మ స్వార్థ ప్ర‌యోజ‌నాల‌కు ఉప‌యోగించుకోకుండా మ‌నం జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. 
ప్ర‌స్తుతం ఆప్ఘ‌నిస్తాన్ ప్ర‌జ‌లు అక్క‌డి చిన్నారులు, మ‌హిళ‌లు, మైనారిటీ ప్ర‌జ‌లు స‌హాయంకోసం ఎదురు చూస్తున్నారు. మ‌నం మ‌న బాధ్య‌త‌ను నిర్వ‌హించాలి. 
మిస్ట‌ర్ ప్రెసిడెంట్‌, 
మ‌న స‌ముద్రాలు మ‌న ఉమ్మ‌డి వార‌స‌త్వం. అందుకే మ‌నం ఒక విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాలి. స‌ముద్రాల వ‌న‌రుల‌ను జాగ్ర‌త్త‌గా వాడుకోవాలి త‌ప్ప వాటిని దుర్వినియోగం చేయ‌కూడ‌దు. మ‌న స‌ముద్రాలు అంత‌ర్జాతీయ వాణిజ్యానికి జీవ‌నాడుల్లాంటివి. వాటిని విస్త‌ర‌ణ పోటీనుంచి మిన‌హాయించి కాపాడుకోవాలి. 
నియ‌మ నిబంధ‌న‌ల‌తో కూడిన ప్ర‌పంచ శాంతిని బ‌లోపేతం చేయ‌డంకోసం అంత‌ర్జాతీయ స‌మాజం ఏక‌కంఠంతో మాట్లాడాలి. ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లికి భార‌త‌దేశం అధ్య‌క్ష‌త వ‌హించిన స‌మ‌యంలో విస్తృత‌మైన ఏకాభిప్రాయం సాధించ‌డం జ‌రిగింది. అది స‌ముద్ర‌ప్రాంతాల భ‌ద్ర‌త‌కు సంబంధించి ప్ర‌పంచానికి మార్గం చూపింది. 
మిస్ట‌ర్ ప్రెసిడెంట్ 
భార‌త‌దేశం గొప్ప తాత్విక‌త‌గ‌ల దేశం. ఆచార్య చాణ‌క్యులు వంద‌లాది సంవ‌త్స‌రాల క్రిత‌మే చెప్పారు. క‌లాటి క్రామ‌ట్ కాల్ అండ్ ఫ‌లం పిబ్బ‌టి అన్నారు. స‌రైన ప‌నిని స‌రైన స‌మయంలో చేప‌ట్టక‌పోతే ఆ ప‌ని ద్వారా సంక్ర‌మించే విజ‌యాన్ని కాల‌మే ధ్వంసం చేస్తుంద‌ని అన్నారు. 
ఐక్యరాజ్య‌స‌మితి ప్ర‌యోజ‌న‌క‌ర సంస్థ‌గా కొన‌సాగాలంటే అది త‌న స‌మ‌ర్థ‌త‌ను మెరుగుప‌ర‌చుకోవాలి. త‌న విశ్వ‌స‌నీయ‌త‌ను పెంచుకోవాలి. 
ఐక్య‌రాజ్య‌స‌మితికి సంబంధించి ఈ మ‌ధ్యకాలంలో అనేక సందేహాలు త‌లెత్తాయి. వాతావ‌ర‌ణ‌, కోవిడ్ సంక్షోభాల స‌మ‌యంలో ఈ సందేహాల‌ను చూశారు. బ‌డా దేశాలు వెన‌క వుండి ఇత‌ర దేశాల్లో కొన‌సాగిస్తున్న యుద్ధాలు, ఉగ్ర‌వాదం, ఆప్ఘ‌నిస్తాన్ లో సంక్షోభం త‌దిత‌ర విష‌యాలు ఈ సందేహాల‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తున్నాయి. కోవిడ్ మ‌హ‌మ్మారి మూలాల విష‌యంలోను, సుల‌భ‌త‌ర వాణిజ్య ర్యాంకుల విష‌యంలోను అంత‌ర్జాతీయ పాల‌నా సంస్థ‌లు సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న‌ త‌మ విశ్వ‌స‌నీయ‌త‌ను పాడు చేసుకున్నాయి. 
ప్ర‌పంచ శాంతికోసం, అంత‌ర్జాతీయ చ‌ట్టాలు, విలువ‌ల ప‌రిర‌క్ష‌ణ‌కోసం… ఐక్య‌రాజ్య‌స‌మితిని నిరంత‌రం బ‌లోపేతం చేస్తూనే వుండాలి. నోబుల్ బ‌హుమ‌తి గ్ర‌హీత గురుదేవ్ ర‌వీంద్ర‌నాధ్ ఠాగూర్ చెప్పిన మాట‌ల‌తో నా ప్ర‌సంగాన్ని ముగిస్తాను. 
शुभोकोर्मो-पोथे / धोरोनिर्भोयोगान, शोबदुर्बोलसोन्शोय /होकओबोसान। (Shubho Kormo-Pothe/ Dhoro nirbhayo gaan, shon durbol Saunshoy/hok auboshan)
మీరు చేప‌ట్టిన శుభ‌క‌ర‌మైన కార్య‌క్ర‌మ మార్గంలో ఎలాంటి భ‌యాలు లేకుండా ముంద‌డుగు వేయండి. అన్ని బ‌ల‌హీన‌త‌లు, సందేహాలు తొలగిపోతాయి అని ఆయ‌న మాటల సారాంశం. 
ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఐక్య‌రాజ్య‌స‌మితికి ఈ సందేశం స‌ముచిత‌మైన‌ది. ఎందుకంటే ఈ అంత‌ర్జాతీయ సంస్థ ప్ర‌పంచంలోని ప్ర‌తి దేశానికి బాధ్య‌త‌వ‌హించాల్సిన సంస్థ కాబ‌ట్టి. ప్ర‌పంచ శాంతి సౌభాగ్యాల‌కోసం మ‌నంద‌రమూ కృషి చేయాల‌ని నేను భావిస్తున్నాను. ప్ర‌పంచాన్ని ఆరోగ్య‌వంతంగా మార్చాలి. భ‌ద్ర‌మైన ప్ర‌పంచాన్ని సౌభాగ్య‌వంత‌మైన ప్ర‌పంచాన్ని త‌యారు చేయాలి. 
అంరికీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ
న‌మ‌స్కారాలు

గ‌మ‌నిక‌:  ప్ర‌ధాని అస‌లు ప్ర‌సంగం హిందీభాష‌లో చేశారు. ఇది ఉజ్జాయింపుగా చేసిన అనువాదం. 
 

***